సొరంగంలో ఆశలు గల్లంతు! | SLBC Tunnel Accident: no trace of missing workers 40 hours after | Sakshi
Sakshi News home page

సొరంగంలో ఆశలు గల్లంతు!

Published Mon, Feb 24 2025 4:16 AM | Last Updated on Mon, Feb 24 2025 4:16 AM

SLBC Tunnel Accident: no trace of missing workers 40 hours after

సొరంగంలో సహాయక సిబ్బంది, సహాయక సామగ్రి తీసుకుని లోకో ట్రైన్‌లో సొరంగం లోపలికి వెళుతున్న రెస్క్యూ బృందాలు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మీకుల జాడ

సొరంగం లోపలికి మూడు బృందాలుగా వెళ్లిన సహాయక సిబ్బంది

అక్కడి భీతావహ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న యంత్రాంగం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు ఆదివారం రోజంతా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రమాదం జరిగి 40 గంటలైనా కార్మీకుల జాడగానీ, వారి యోగక్షేమాలుగానీ తెలియకపోవడంతో... వారు సురక్షితంగా బయటపడే అవకాశం తక్కువనే చర్చ జరుగుతోంది. 

ఆదివారం ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలతో కలసి లోకో ట్రైన్‌ ద్వారా సొరంగం లోపలికి వెళ్లి.. సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచి్చన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా.. పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. సొరంగం లోపలి వరకు వెళ్లి బయటికి వచి్చనవారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌లెట్‌ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలి లోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తేగానీ గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ ప్రారంభం కాలేదు. 

ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. 
సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళనల నేపథ్యంలో రెస్క్యూ కష్టసాధ్యంగా మారింది. దోమలపెంట వద్దనున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఇన్‌లెట్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ఒక్క లోకో ట్రైన్‌ మాత్రమే ఆధారం. దాని ద్వారా 12.6 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది. అక్కడి నుంచి కన్వేయర్‌ బెల్టు మీద లోపలికి చేరుకోవాల్సి వస్తోంది. 

సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకే సహాయక బృందాలు వెళ్లగలిగాయి. శిథిలాలు కొట్టుకురావడంతో వాటిని తొలగించకుండా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి ఊటను మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నిమిషానికి 10 వేల లీటర్ల నీటిని ఎత్తిపోసే మోటార్లను వినియోగిస్తున్నారు. లోపలికి వెళ్లి బయటికి వచి్చన రెస్క్యూ బృందాలతో ‘సాక్షి’ మాట్లాడింది. 

గల్లంతైన కార్మీకుల మీద కాంక్రీట్‌ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు. లేదా వారు సొరంగం కూలిన ప్రాంతానికి ఆవలివైపు చిక్కుకుని ఉన్నా.. రెండు వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్‌ లభించడం కష్టమేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది.. కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని అంటున్నారు.  

తీవ్ర ఉత్కంఠ మధ్య.. 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం–1 ఇన్‌లెట్‌ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల శనివారం ఉదయం 8.30 గంటలకు పైకప్పు కూలిపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయానికి 40 గంటల కీలక సమయం గడిచిపోయింది. దీనితో కార్మీకుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక శాఖ, ఆర్మీకి చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సొరంగం లోపలికి లోకో ట్రైన్‌ ద్వారా వెళ్లారు. వారు తిరిగి వచ్చి గల్లంతైన కార్మీకుల యోగక్షేమాల గురించి చెబుతారేమోనని.. సొరంగం బయట అధికారులు, నేతలు, మీడియా ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మంత్రితోపాటు రెస్క్యూ సిబ్బంది నిరాశ వ్యక్తం చేశారు. 

సహాయక చర్యల్లో ఆర్మీ 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. సికింద్రాబాద్‌ నుంచి ఆర్మీ బైసన్‌ డివిజన్‌కు చెందిన ఇంజనీర్‌ టాస్‌్కఫోర్స్‌ (ఈటీఎఫ్‌) ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్‌ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు.

శిథిలాలు, బురద తొలగించేదెలా?
సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించనిదే కార్మీకుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితి. కానీ నీటి ఊటల కారణంగా.. మట్టిని తొలగించిన కొద్దీ పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సొరంగం భూఉపరితలం నుంచి సుమారు 400 మీటర్ల దిగువన ఉందని, కూలిన చోట మట్టిని తీసినకొద్దీ.. పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. 

అయితే సొరంగంపైన భూమి ఉపరితలం నుంచి డ్రిల్లింగ్‌ చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపినా.. 400 మీటర్ల లోతున రంధ్రం చేయడానికి చాలా రోజుల సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సొరంగంలో పేరుకున్న మట్టి, నీళ్లు, ఇతర శిథిలాలను తొలగించేందుకూ కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

పైకప్పు కూలిన చోట.. కాంక్రీట్‌ సెగ్మెంట్‌ లేదు! 
సొరంగంలో ప్రమాదం జరిగిన చోట పైకప్పుకు రక్షణగా కాంక్రీట్‌ సెగ్మెంట్లు లేవని తెలిసింది. టన్నెల్‌ చివరన పనులు జరిగిన చోట సుమారు 100 మీటర్ల మేర కాంక్రీట్‌ సెగ్మెంట్లను ఏర్పాటు చేయలేదని సమాచారం. అంతేగాకుండా సొరంగంలో నాలుగేళ్లుగా నీటి ఊటలు (సీపేజీ) కొనసాగుతుండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటేనే.. 
సొరంగం లోపల చిక్కుకున్న కార్మీకులను బయటికి తెచ్చేందుకు ఏదైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఆచరణలో పెడితేనే ఫలితమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహం లేకుండా రెస్క్యూ బృందాలు లోపలి వరకు వెళ్లి వచి్చనట్టు తెలిసింది. సొరంగంలో పేరుకున్న మట్టిని తొలగించి కన్వేయర్‌ బెల్టుల ద్వారా, లేదా లోకో ట్రైన్‌ ద్వారా బయటికి పంపితే గానీ చిక్కుకున్న కార్మీకుల జాడ కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. అడ్డంకులన్నీ అధిగమించి కార్మీకులను చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.  

టీబీఎం మెషీన్‌ దగ్గరికి చేరుకోవడమే కష్టంగా ఉంది 
సొరంగంలో పైకప్పు కూలిన చోట ఉన్న టీబీఎం మెషీన్‌ వద్దకు చేరుకోవడమే కష్టంగా ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు లోపలికి వెళ్లి వచ్చాం. మెషీన్‌ వద్ద 200 మీటర్ల దాకా భారీగా బురద పేరుకుని ఉంది. దాన్ని దాటడం వీలుపడటం లేదు. టన్నెల్‌ పైకప్పు మళ్లీ కుంగకుండా సేఫ్టీ కోసం రాక్‌ బోల్టింగ్‌ చేస్తున్నాం. నీటి తొలగింపు కొనసాగుతోంది. 
– కలేందర్, సింగరేణి మైనింగ్‌ సేఫ్టీ సూపర్‌వైజర్‌ 

వారి జాడ కనిపించలేదు.. 
టన్నెల్‌లో భారీగా మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో మెషీన్‌ దగ్గరికి వెళ్లేందుకు కుదరడం లేదు. చిక్కుకున్న వారి జాడ ఏదీ కనిపించలేదు. ఎలాంటి అరుపులు సైతం వినిపించలేదు. 
– రాందేవ్, సుబేదార్, ఆర్మీ 

రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది 
టన్నెల్‌ రాళ్లు, నీరు, బురదతో నిండిపోయింది. 200 నుంచి 500 మీటర్ల మధ్య టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ బురదలో కూరుకుపోయింది. 35 మందిమి సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి తీసుకొని వెళ్లాం. రాత్రంతా కష్టపడి దగ్గరకు చేరుకోగలిగాం. 
– రవినాయక్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీం, విజయవాడ 

పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి.. 
మేం పనుల కోసం టన్నెల్‌ చివరికి చేరుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు వచ్చాయి. సిమెంట్‌ దిమ్మెలు కూలి, పెద్ద ఎత్తున మట్టి కుంగింది. మేమంతా భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాం. చేతులు, కాళ్లు, ముఖానికి చిన్న గాయాలయ్యాయి. 
– చమేల్‌ సింగ్, ప్రమాదం నుంచి బయటపడిన ఫోర్‌మెన్‌ 

ఏం జరుగుతోందో అర్థం కాలేదు 
శనివారం ఉదయం టన్నెల్‌లో ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు కొందరు మెషీన్‌ వైపు ఉన్నా, ఏమీ చేయలేక భయంతో వెనక్కి వచ్చాం. వాళ్లు మట్టి, బురదలో మునిగారు. ప్రాణాలతో బయటికి వస్తారో, లేదో తెలియదు. 
– ఎడుమలై, ప్రమాదం నుంచి బయటపడ్డ కన్వేయర్‌ బెల్ట్‌ ఫోర్‌మెన్‌ 

మా వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు.. 
టీబీఎం ముందు భాగంలో 8 మంది ఉన్నారు. మేం వెనక భాగంలో ఉన్నాం. ఒక్కసారిగా పైకప్పు కూలడంతో భయాందోళన నెలకొంది. మాతో కలసి పనిచేసే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలియదు. చాలా బాధగా ఉంది. 
– జగదీశ్‌ పాండా, ప్రమాదం నుంచి బయటపడ్డ మెకానికల్‌ ఫోర్‌మెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement