Rescue team
-
ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. నవంబర్ 12న టన్నెల్ కూలిపోయి లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరకు ర్యాట్-హోల్ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల కార్మికులు చిక్కుకున్న చోటకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఇందులో కీలకంగా పాత్ర వహించిన నలుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శ్రీనగర్‌లోని భారత సైన్యం జీవోసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. 2018 జూలై 13న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా లెఫ్టినెంట్ జనరల్ హస్నైన్ను నియమించారు. మైక్రో టన్నెలింగ్ నిపుణుడు క్రిస్ కూపర్ నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టులలో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్‌ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. గత పది రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఆయన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. ఆయన వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం.. ఆర్నాల్డ్ బారిస్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భూగర్భ, రవాణా మౌలిక రంగంలో నిపుణుడు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. -
‘కూలిన’ బతుకులు
మొయినాబాద్: నాణ్యత లోపం.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇద్దరు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న షెడ్ కుప్పకూలడంతో శిథిలాలకింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఫైర్ఫాక్స్ క్లబ్లో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైర్ఫాక్స్ క్లబ్లో షెడ్ మాదిరి నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 100 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తుతో ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసి నాలుగు వైపులా 40 అడుగుల ఎత్తు గోడలు నిర్మించారు. వాటిపై ఇనుప బీమ్‌లు పెట్టి వాటిపై ఐరన్ షీట్లు బిగించారు. షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేశారు. బీహార్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికులు కొంత కాలం క్రితం ఇక్కడికి వచ్చి కూలీ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం 14 మంది కార్మికులు నిర్మాణంలో ఉన్న షెడ్లో పని చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పశ్చిబెంగాల్‌కు చెందిన బబ్లూ(35), బిహార్‌కు చెందిన సునీల్ (26), రాకేష్, సంజయ్, విజయ్, సంతోష్, ప్రకాష్, వికాస్కుమార్, రాజన్‌లు శిథిలాల కింద ఇరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీంను రప్పించారు. శిథిలాలను తొలగిస్తూ అందులో ఇరుకున్నవారిని బయటకు తీశారు. బబ్లూ, సునీల్ మృతి చెందగా.. మిగిలిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మరో ఐదు మంది ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. దీనిపై మృతుల కుటుంబాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ ఏవీ రంగా తెలిపారు. నాణ్యతా లోపంతోనే... ఫైర్ఫాక్స్ క్లబ్లో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే కుప్పకూలిందని స్థా నికులు ఆరోపిస్తున్నారు. షెడ్ నిర్మాణం చేపట్టి ఇనుప షీట్లపై ఆర్సీసీ స్లాబ్ వేయడం వల్లే కూలిందని, షెడ్ డిజైనింగ్‌లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కాగా బాధితులను ఆదుకుంటామని నిర్మాణదారులు చెప్పారు. -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
భల్లూకాన్ని చూసి..బెంబేలెత్తిపోయారు..
కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ శివారు రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్ ప్రాంతాల్లో భల్లూకం హడలెత్తించింది. సుమారు 14 గంటల పాటు స్థానికులను బెంబేలెత్తించిన గుడ్డెలుగు.. ఎట్టకేలకు వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంకు పట్టుబడింది. సుమారు రెండు గంటల పాటు రెస్క్యూ టీంను ముప్పుతిప్పలు పెట్టింది. శనివారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో కుక్కతో బయటకు వెళ్లిన సూర్యనగర్ వాసికి ఎలుగు కనిపించింది. కుక్క మొరగడంతో వెనక్కి తగ్గిన ఎలుగుబంటి.. అక్కడి నుంచి రేకుర్తి వైపు వెళ్లింది. ఎస్సారెస్పీ కెనాల్ మార్గం గుండా ప్రధాన రహదారిపై సంచరిస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రెస్క్యూ టీం రేకుర్తి సబ్‌స్టేషన్ ప్రాంతంలోని సమ్మక్క గుట్ట పొదల్లో దాగిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసింది. ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో టీం సభ్యుడిపైకి దూసుకొచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వలకు చిక్కిన ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మరో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..
భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎలా పట్టుకున్నారంటే! జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! -
సంగారెడ్డి : చిరుత చిక్కింది
-
కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
-
రాజుకు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ
కామారెడ్డి టౌన్: గుట్టపైకెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల కింద ఇరుక్కుపోయి సురక్షితంగా బయటపడిన రాజు పూర్తిగా కోలుకున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు మానసిక ఆరోగ్యం మెరుగుపరచడానికి శుక్రవారం కౌన్సెలింగ్‌తోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీని మానసిక వైద్య నిపుణులు, జిల్లా మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి.రమణ అందించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు వన్యప్రాణుల వేటకు వెళ్లి మాచారెడ్డి మండలం సింగరాయిపల్లి అడవిలోని ఓ గుట్టపైనున్న బండరాళ్ల కింద మంగళవారం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. రెండ్రోజులు నరకయాతన అనుభవించాడు. సహాయక బృందం బండరాళ్లను పగులగొట్టి రాజును సురక్షితంగా బయటకు తీసి గురువారం కామారెడ్డి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించింది. ఈ సందర్భంగా రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ కొన్నిగంటలపాటు తలకిందులుగా ఉండటం, రాళ్లు బరుసుగా ఉండటంతో కాళ్లు, చేతులు రాపిడికి గురై గాయాలయ్యాయని చెప్పాడు. తొడభాగంలో కాస్త పెద్ద గాయమైందని, ఒళ్లునొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. రాజును శనివారం డిస్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన ఘటనలు, ప్రతికూల పరిస్థితుల(రేప్, పెద్ద ప్రమాదం, అగ్నిప్రమాదం)ను ఎదుర్కొన్నవారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని, ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి బయటకురాలేక చాలామంది మానసికంగా కుంగిపోతుంటారని వైద్యులు తెలిపారు. సాధారణ వైద్యంతోపాటు కాగ్నాటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఇలాంటివారిని సాధారణస్థితికి తీసుకురావచ్చన్నారు. రాజుతోపాటు కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం సామాజిక కార్యకర్త డాక్టర్ విరాహుల్ కుమార్, డ్యూటీ డాక్టర్ కాళిదాసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు
-
‘కృష్ణా’లో గల్లంతైన ఐదుగురూ మృత్యువాత
పెనమలూరు/పటమట (విజయవాడ తూర్పు): కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురూ మృత్యువాత పడ్డారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం) మరో మూడు మృతదేహాలు దొరికాయి. విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన షేక్ బాజీ (15), షేక్ హుస్సేన్ (15), తోట కామేష్ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్ (14), పిన్నింటి శ్రీను, షేక్ ఖాశిం అలీ స్నేహితులు. బాజీ, కామేష్ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్ చదువుతున్నారు. వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్ ఆడి, యనమలకుదురు పాయ నుంచి మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డుకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు నదిలో స్నానానికి దిగారు. కొద్దిసేపటికే వారంతా మునిగిపోవటం గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్న పశువుల కాపర్లు, జాలర్లకు చెప్పటంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దర్శిపేటలో విషాదఛాయలు ఇనకొల్లు గుణశేఖర్, తోట కామేష్ మృతిచెందడం, షేక్ హుస్సేన్, షేక్ బాజీ, మద్దాల బాలు గల్లంతవడంతో దర్శిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఇంకొల్లు గుణశేఖర్, దూదేకుల హుస్సేన్, మద్దాల బాలుకు తండ్రి లేకపోవటంతో వారి తల్లులే పండ్లు, పూలవ్యాపారం చేస్తూ తమ రెక్కల కష్టంపై పిల్లల్ని సాకుతున్నారు. మృతిచెందిన పిల్లల కుటుంబాలన్నీ నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే. -
కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..
సాక్షి, కామారెడ్డి: అడవిలో షికారుకెళ్లి గుట్టల మధ్య ఇరుక్కుపోయిన రెడ్డిపేటకు చెందిన చాడ రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 43 గంటలుగా గుహలోనే తలకిందులుగా ఉన్న రాజును.. పోలీసులు, గ్రామస్తులు 18 గంటల పాటు శ్రమించి గుహ నుంచి బయటకు తెచ్చి, ప్రాణాలు కాపాడారు. డ్రిల్లింగ్ మిషన్స్, జిలిటెన్ స్టిక్స్‌తో బండలను పేల్చుతూ, నాలుగు జేసీబీలతో మట్టిని బండరాళ్లను తొలగించుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా, రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారు కెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు.. రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులతో కలిసి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చదవండి: (షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..) -
గర్భిణిని రక్షించేందుకు వరదలోకి దిగి.. ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి
దహెగాం(సిర్పూర్)/శ్రీరాంపూర్: పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పెద్దవాగులో బుధవారం గ్రామస్తులను వాగు దాటించేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా.. గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్ దహెగాంకు చేరుకున్నారు. గణేశ్ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని విషయం అధికారులకు తెలిపారు. అక్కడే ఉన్న ఆర్డీవో దత్తు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు. అదనపు కలెక్టర్ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బృందాలతో గాలింపు.. విషయం తెలియగానే శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు గర్భిణి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం.. బీబ్రా గ్రామంలో ఉన్న గర్భిణి నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలించేందుకు వరంగల్ నుంచి 22 సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దహెగాంకు చేరుకుంది. నాలుగు బోట్ల సాయంతో మెడికల్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. గనులపై ఆందోళన.. రామకృష్ణాపూర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అంబాల రాము ఆర్కే 5 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్పందన, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంక్షేమ అధికారి రణధీర్, టీబీజీకేఎస్ నేతలు మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య కార్మికుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నస్పూర్ షిర్కేలో నివాసం ఉంటున్న చిలుక సతీశ్ శ్రీరాంపూర్ ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్‌లో పాల్గొన్న రెస్క్యూ సభ్యులెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెస్క్యూ స్టేషన్ నుంచి వీరిని పంపిన అధికారులు జాకెట్లు ఇచ్చి పంపారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. -
భూకంప బాధితుల రక్షణకు రెస్క్యూ ఆపరేషన్
గన్నవరం రూరల్/సాక్షి, అమరావతి: ‘అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. భూకంపంతో భవనం కుప్పకూలింది.. జనం హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.. మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్)కు సమాచారం అందించడంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది’.. ఏంటి ఇదంతా వాస్తవం అనుకుంటున్నారా? కాదు.. కేవలం మాక్ డ్రిల్ మాత్రమే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్‌ను మంగళవారం ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ సందర్శించారు. అనంతరం భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ స్పందించే విధానం, హైరిస్క్ భవనాల్లో చిక్కుకున్న బాధితులను రెస్క్యూ రోప్ టీమ్ రక్షించే విధానాలపై ప్రదర్శన ఏర్పాటు చేయగా ఆయన వీక్షించారు. మాక్ డ్రిల్ ఇలా: మాక్ డ్రిల్‌లో భాగంగా.. భవనం కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వచ్చిన రెస్క్యూ టీమ్ భవనం స్ట్రక్చరల్ ఇంజనీర్ సాయంతో గ్యాస్, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం డాగ్ స్క్వాడ్ శిథిలాల కింద ఉన్న బాధితులను గుర్తించగా యంత్రాలతో గోడలు బద్దలుకొట్టి వారిని రక్షించింది. అనంతరం బహుళ అంతస్తుల భవనంలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రోప్ టీమ్ రంగంలోకి దిగింది. పై అంతస్తుల్లో ఉన్నవారి నడుముకు బెల్టులు అమర్చి రోప్ సహాయంతో వారిని సురక్షితంగా కిందకు చేర్చింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, డిప్యూటీ కమాండెంట్లు జఫరిల్ ఇస్లాం, దిల్భాగ్ సింగ్, సుఖేందు దత్త, అఖిలేష్ చౌబే ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు నిర్వహించారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం.. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరం సహాయ చర్యలు చేపట్టేందుకు దేశంలో 26 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు 12 ఉండగా వాటిని 16కు పెంచాం. విపత్తుల సమయంలో ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణను బెటాలియన్లలో అందిస్తున్నాం. భవిష్యత్ సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం. – అతుల్ కర్వాల్, డీజీ, ఎన్డీఆర్ఎఫ్ -
64 మందిని కాపాడిన సహాయక బృందాలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు. వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రోప్‌ల సాయంతో కాపాడారు. హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు. పాపాగ్ని నదికి గండి పడడంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులు, 15 పశువులను ఫైర్ సిబ్బంది కాపాడారు. కడప నగరంలో బుగ్గవంక వరద నీటితో నిండిపోయిన ఒక ఇంటి నుంచి గర్భిణిని రక్షించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతిలో చిక్కుకుపోయిన పది మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు. వైఎస్సార్ జిల్లా చెయ్యూరులో వరద నీటిలో ప్రమాదకరంగా చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని రక్షించారు. 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్ ఫోర్స్, ఫైర్ సర్వీస్ బృందాలు సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాయి. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో జల దిగ్భంధమైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20,923 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారంతోపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. వరద సహాయక చర్యల్లో తూర్పు నౌకాదళం వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల్లో తూర్పు నౌకాదళానికి చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి. ఐఎన్ఎస్ డేగా నుంచి ఒక సీకింగ్ హెలికాఫ్టర్‌లో నౌకాదళ బృందం బయలుదేరి కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతం, నందలూరు ప్రాంత ప్రజలకు 6,600 ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, 3,600 కిలోల రిలీఫ్ మెటీరియల్‌ను అందించారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. కాగా వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కోస్టుగార్డు బృందాలు చురుగ్గా పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లాలో 16 సెం.మీ సగటు వర్షం నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సగటున 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లాలో 14.4 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 12.6, అనంతపురం జిల్లాలో 11.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా 24 మంది మృత్యువాతపడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. 1,532 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 121 చోట్ల రోడ్లకు గండ్లు పడగా, 525 చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 541 చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. 380 చోట్ల చిన్న నీటి వనరులు దెబ్బతిన్నాయి. 33 కేవీ ఫీడర్లు 85, 33 కేవీ స్తంభాలు 137, 11 కేవీ స్తంభాలు 1307, ఎల్టీ స్తంభాలు 1753, 11 కేవీ ఫీడర్లు 592, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 82 దెబ్బతిన్నాయి. 33 పంచాయతీ రోడ్లు 121 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. తక్షణ అవసరాల కోసం నాలుగు జిల్లాలకు రూ.7 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సహాయక శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్‌లో 15 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్‌నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటికి బిల్డింగ్‌లో చిక్కుకున్న కొందరు బాధితులతో.. ఫోన్లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డా . సిద్ధారెడ్డి స్వయంగా వైద్యం అందించారు. -
రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!
బ్రిటన్: మనం ఎక్కడైన అడవిలోనో లేక ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో చిక్కుకుపోయి, ఆఖరికి మొబైల్ ఫోన్లు పనిచేయనపప్పుడూ అది అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. జనసంచారం లేని ఒక గుహలో రెండు రోజులుగా అది కూడా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో అలా పడి ఉంటే ఎవ్వరికైన పై ప్రాణాలు పైకి పోతాయి. కానీ అతని కోసం 240 మంది సహాయ సిబ్బంది వచ్చి తక్షణ సహాయ చర్యలు చేపట్టి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. అసలు ఎక్కడ ఏం జరిగిందే చూద్దాం రండి. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో ఒక వ్యక్తి బ్రెకాన్ బీకాన్స్లోని గుహ వ్యవస్థల గురించి అధ్యయనం చేసే పరిశోధకుడు. అనుకోకుండా 50 అడుగుల లోతులో పడిపోతాడు. దీంతో అతని ఎముకలు చాలా వరకు విరిగిపోతాయి. దీంతో అతన్ని రక్షించడం కోసం దాదాపు 240 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందులో యూకేకి చెందిన ఎనిమిది కేవ్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. సుమారు 54 గంటల తర్వాత అతను గుహ నుండి విజయవంతంగా బయటపడ్డాడు. ఇది వెల్ష్ కేవింగ్ చరిత్రలో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిలిచింది. ఆ తర్వాత సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం) -
Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత
సాక్షి, నవీపేట(నిజామాబాద్): మండలంలోని నాళేశ్వర్ గ్రామ శివారులో గత రెండు రోజులుగా రైతులను భయపెడుతున్న ఐదు అడుగుల నాగుపాము ఆదివారం దొరికింది. గ్రామానికి చెందిన పోశెట్టి అనే రైతు పొలంలో రెండు రోజుల కిందట కనిపించిన నాగుపాము పలువురిని భయాందోళనకు గురి చేసింది. రైతులు అటువైపుగా వెళ్లేందుకు భయపడ్డారు. ఆదివారం మళ్లీ ఆ పాము కనిపించడంతో నందిపేటకు చెందిన సర్వార్‌ఖాన్ పాములు పట్టడంలో దిట్ట అతనికి సమాచారమిచ్చారు. ఆయన తన చాతుర్యంతో పామును పట్టేశాడు. పట్టుకున్న పామును అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: మిస్టర్ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ -
ఐదు గంటలు.. హైరిస్క్ ఆపరేషన్: 16 మంది సురక్షితం
మంథని: ఓ వైపు గోదావరి ఉగ్ర రూపం.. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆలయ నిద్ర కోసం వచ్చిన కొందరు.. పడవలు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన జాలర్లు మరికొందరు.. కాసేపటికే ఒక్కసారిగా పెరిగిన వరద.. ఎటు చూసినా నీళ్లే.. ప్రాణాలు అరచేత పట్టుకుని రాత్రంతా గడిపారు.. పొద్దున్నే వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఏమవుతుందోననే ఆందోళన పెరిగి పోయింది. ఐదు గంటలు కష్టపడ్డ అధికారులు చివరికి వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటన ఇది. ప్రమాదకర పరిస్థితుల్లో.. మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బొపెల్లి శంకరమ్మ భర్త ఈ నెల 12న చనిపోయాడు. పెద్దకర్మ అనంతరం ఆలయం వద్ద నిద్ర చేసేందుకని.. ఆమె తన ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురితో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు గౌతమేశ్వర ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమ యానికి వరద పెరిగిపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన విలోచవరం గ్రామ జాలర్లు 9 మంది.. ఆలయం సమీపంలో నివాసం ఉండే రెండు కుటుంబాలకు చెందిన 15 మంది కూడా వరదలో ఉండిపోయారు. మంథని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లతో బాధితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా సఫలం కాలేదు. సింగరేణి రెస్క్యూ టీం 9:30కు అక్కడికి చేరుకుని ట్యూబ్‌ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రవాహం వేగంగా ఉండటంతో 50 మీటర్లు ముందుకెళ్లగానే.. ట్యూబ్‌లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వెనక్కి వచ్చేశారు. చివరకు బోట్ తెప్పించి కాకర్లపల్లికి చెందిన ఏడుగురిని, తర్వాత 9 మంది జాలర్లను ఒడ్డుకు చేర్చారు. ఆలయం సమీపంలో ఉండే 15 మంది బయటికి రావడానికి నిరాకరించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి వచ్చిన సింగరేణి రెస్క్యూ టీం పుస్తకాల కోసం వచ్చి.. వాంకిడి (ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం, భీంపూర్ గ్రామాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 17 మంది పాఠ్యపుస్తకాలు తీసుకొనేందుకు గురువారం వాంకిడిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వచ్చా రు. పుస్తకాలు తీసుకుని మూడు ఆటోల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే దుబ్బగూడ గ్రామశివార్లలో రెండు వాగుల్లో ప్రవాహం పెరి గింది. కష్టం మీద ఒక వాగును దాటారు. మరో వాగు వద్దకు వెళ్లేసరికే వరద ఉధృతి ఎక్కువై.. అక్కడే ఆగిపోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందని పరిస్థితి. రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్‌కు సెల్‌ఫోన్ సిగ్నల్ అందడంతో.. కమానా గ్రామ ఎంపీటీసీకి ఫోన్ చేసి చెప్పాడు. చివరకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. -
భైంసాలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, భైంసాటౌన్(నిర్మల్): గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ఎగువప్రాంతాల్లో నుంచి భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లి పాక్షిక భాగం, వినాయక్‌నగర్, రాహుల్‌నగర్ వెనుకభాగం, గోకుల్‌నగర్ ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. ఆటోనగర్ ప్రాంతంలోని సామిల్లో బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూబృందాలతో సహాయక చర్యలు చేపట్టి వరదనీటిలో చిక్కుకున్న దాదాపు 150 మంది ప్రజలు, ఎన్ఆర్ గార్డెన్లో బస చేస్తున్న మరో 14 మందిని పోలీసులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌నగర్ ప్రాంతంలో సైతం వాననీటికి ప్రధానకాల్వ పొంగి ప్రవహించింది. బస్‌డిపో ప్రాంతంలోని వైకుంఠధామం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లిలోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నీరు చేరింది. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్‌బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్‌ఖారె, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తాజ్‌మహల్ వద్ద పైథాన్ హల్చల్
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్‌మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్‌మహల్ సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి సమీపంలోని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్‌ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్‌ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్ఓఎస్ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ( చదవండి: రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి ) -
క్రాష్ టెస్ట్: వోల్వో సంచలన నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి పడవేసి మరీ క్రాష్ టెస్ట్ నిర్వహించింది. అత్యున్నత ప్రమాణాలను సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా తొలిసారి పలు మోడళ్ల కొత్త కార్లను క్రేన్ల సాయంతో 30 మీటర్ల ఎత్తునుంచి కిందికి తోసివేసింది. తద్వారా ప్రమాదాల్లో కారులోపల ఉన్నవారి పరిస్థితిని అంచనా వేయడం, రక్షణ చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వనుంది. సాధారణంగా 20ఏళ్ల నాటి కార్లపై చేసే ప్రయోగాలను కొత్త కార్లతో చేయడం విశేషం. ఘోర ప్రమాదాల్లో లోపల ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి వారిని వెలికి తీసి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడంలాంటి అంశాలను పరిశీలించింది. తద్వారా వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. రక్షణ సిబ్బంది నిరంతరం అప్డేట్ కావడం, కొత్త ఎక్స్ట్రికేషన్ టెక్నిక్లను అభివృద్ధి, సమీక్ష కీలకమని సంస్థ భావిస్తోంది. తీవ్రమైన ప్రమాదాల తర్వాత ప్రజలను వెలికితీసే కొత్త పద్ధతులను అవలంబించేలా అత్యవసర రక్షణ సిబ్బంది సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకు సాధారణ క్రాష్ పరీక్షలు సరిపోవు. అందుకే కొంచెం విపరీతంగా ఆలోచించాల్సి వచ్చిందని వోల్వో తెలిపింది. అతివేగంతో కార్లు ప్రమాదానికి గురి కావడం, ఈ ఘోర ప్రమాదాల్లో కార్లు దెబ్బతినడం, కార్లలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం తదితర కీలక అంశాలపై నివేదికను రూపొందించడంతో పాటు, ఈ ఇంటెన్సివ్ అనాలిసిస్ రిపోర్టును సహాయక బృందాలకు ఉచితంగా అందిస్తుంది. రెస్క్యూ ప్రొవైడర్ల అభ్యర్థన మేరకు ఈ క్రాష్ టెస్ట్ చేసినట్టు వోల్వో వెల్లడించింది. ఫలితాల నుండి నేర్చుకోవడానికి, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను అదనంగా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. We wanted to help our Emergency Services develop new methods of extracting people after severe accidents, but our regular crash tests weren't enough. So, we had to think of something a little more extreme.... #ForEveryonesSafety pic.twitter.com/fMGF1A4HtU — Volvo Car UK (@VolvoCarUK) November 13, 2020 -
12 గంటలు ప్రాణాలు అరచేతిలో..
బషీరాబాద్(వికారాబాద్): భారీ వర్షాలకు కాగ్నా నది ఉప్పొంగడంతో చిక్కుకుపోయిన 15 మంది ఏపీ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంఘటన బుధవారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని జెట్టూరు వద్ద చోటుచేసుకుంది. స్థాని క పోలీసులు, కర్ణాటక అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, ఆత్మకూరుకు చెం దిన మూడు కుటుంబాలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్–కర్ణాటకలోని జెట్టూరు మం డలం క్యాద్గిర సమీపంలోని కాగ్నా నది ఒడ్డున ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులకు వచ్చారు. వీరు ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో వీరు నివసిస్తున్న గుడిసెల్లోకి వరద నీరు చేరింది. దీంతో అల్కయ్య, పద్మ, సురేశ్, కుమారి, వెంగమ్మ, మేరీ, అభిరామ్, రమణయ్య, తేజ, వెంకటరమణమ్మ, ఏడుకొండలు, కల్పన, సువర్ణ, అభి.. పక్కనే నిర్మాణంలో ఉన్న కాగ్నా బ్రిడ్జిపైకి ఎక్కారు. అయితే నది ఉద్ధృత రూపం దాల్చడంతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే మళ్లమర్రి నదుల సంగమం వద్ద ప్రవాహం పోటెత్తడంతో వీరు నిలబడిన వంతెన చుట్టూ కిలోమీటర్ మేర వరద చుట్టేసింది. విషయాన్ని కూలీలు తమను పనులకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా చేరవేశారు. ఉదయం నుంచి రాత్రి 7వరకు సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో బషీరాబాద్, సులైపేట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారు రెండు బోట్లలో నదిలోకి వెళ్లి వంతెనపై ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితులకు గ్రామంలోని పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. -
విషాదం: పిల్లల కోసం తండ్రి జలసమాధి
లండన్: సహజంగా పిల్లలంటే తల్లికే ఎక్కువ ప్రేమంటారు. కానీ ఆ తండ్రికి మాత్రం పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఇంగ్లండ్‌లోని బ్రాడ్మౌత్లో ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్న 36 ఏళ్ల జొనాథన్ జాఫ్ స్టీవెన్స్ సోమవారం పిల్లలను తీసుకొని బయటకు వెళ్లాలనుకున్నారు. 12 ఏళ్ల లాసీ, 11 ఏళ్ల లారెన్, 10 ఏళ్ల జాక్‌ను తీసుకొని సమీపంలోని బార్మౌత్ సముద్ర తీరానికి వెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు సముద్ర కెరటాలకు సరదాగా గంతులేస్తుండగా ఓ చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉండి పిల్లలను సముద్రంలోకి లాగేసింది. వెంటనే అప్రమత్తమైన స్టీవెన్స్ ప్రాణాలకు తెగించి ఒక్కొక్కరి చొప్పున ముగ్గురు పిల్లలను కాపాడి ఒడ్డుకు చేర్చగలిగారు. అప్పటికే నీటికి ఎదురీదలేగ అలసిపోయి ఆయాస పడుతున్న స్టీవెన్స్ కడసారి వీడ్కోలు అన్నట్లుగా ముగ్గురు పిల్లలవైపు చూస్తూ ఓ చిరునవ్వుతో నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని ఊహించిన 11 ఏళ్ల లారెన్ ‘లైవ్ గార్డ్స్’ వద్దకు పరుగెత్తికెళ్లి తన తండ్రిని రక్షించాలంటూ వేడుకుంది. వారు పరుగెత్తుకొచ్చి సముద్రంలోకి దూకారు. మరోవైపు నుంచి రిస్క్యూ బోటు కూడా వచ్చింది. కొన ఊపిరితో ఉన్న స్టీవెన్స్‌ను పట్టుకొని రెస్క్యూ బోటులో ఒడ్డుకు తరలించారు. అప్పటికి స్పహతప్పిన స్టీవెన్స్‌కు గుండెపై ఒత్తిడి తీసుకరావడం (సీపీఆర్) ద్వారా రక్షించేందుకు ప్రయత్నించారు. దాంతో లాభం లేకపోవడంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ హెలికాప్టర్లో స్టీవెన్స్‌ను బ్యాంగర్లోని గ్యానెడ్ హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తమ తండ్రి నిజంగా హీరోనని, తమ ముగ్గురు ప్రాణాలను రక్షించారని ఆయన చనిపోవడం తట్టుకోలేక పోతున్నామని 12 ఏళ్ల కూతురు లాసీ మీడియాతో వ్యాఖ్యానించగా, ‘తాను మునిగిపోతూ మమ్మల్ని కాపాడగలిగానన్న తప్తితో చివరిసారిగా చిద్విలాసంగా మావైపు చూస్తూ మా నాన్న నవ్వడాన్ని నేనెప్పటికీ మరచిపోలేను’ అని లారెన్ వ్యాఖ్యానించింది. నెల రోజుల క్రితమే స్టీవెన్స్‌తో విడిపోయిన ఆయన భార్య లారా బర్ఫోర్డ్, అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని ష్రాప్‌షైర్‌లో తన చిన్న కుమారుడితో ఉంటున్నారు. పిల్లలు, స్టీవెన్స్ ప్రమాదానికి గురైన చోట నీటి ఒరవడి ఎక్కువగా ఉందని తెల్సిందని, అక్కడ ప్రమాద హెచ్చరికలు ఎందుకు ఏర్పాటు చేయలేదని లారా బీచ్ అధికారులను ప్రశ్నించారు. -
అధికారులకు చుక్కలు చూపించిన చిరుత
సూరత్ : లాక్డౌన్ నేపథ్యంలో అడవిలో ఉండాల్సిన జంతువులు ఆహార అన్వేషణలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ ప్రాంతంలో శనివారం ఒక చిరుతపులి హల్చల్ చేసింది. మొదట ఒక ఇంట్లోకి దూరిన చిరుత కారు పక్కన నక్కి కూర్చుంది. కొద్దిసేపటికి ఇంటి యజమాని కారును తీద్దామని దగ్గరకు వచ్చి చూస్తే చిరుతపులి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే యానిమల్ రెస్య్కూ ఆపరేషన్ టీమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఆపరేషన్ రెస్క్యూ టీమ్ అక్కడిని చేరుకొని చిరుతను బంధించడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే చిరుత అధికారులకు చిక్కకుండా ఇళ్లలోని గోడలు దూకుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే పులిని పట్టుకునేందుకు పన్నిన వలను కూడా చేధించి అక్కడి నుంచి పరుగులు తీసింది. చివరకు ఎలాగోలా పోలీసుల సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చిన అధికారులు దానిని బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఐదుగురు అధికారులకు తీవ్ర గాయాలయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆవు చనిపోయిందని రోడ్ల పైకి జనం క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని.. -
ఐస్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్ భారీగా లీకయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో కొద్ది సేపట్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఫ్యాక్టరీ లోంచి గ్యాస్ లీక్ కాగానే ఫ్యాక్టరీలోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్యాస్ కమ్ముకోవడంతో జనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తహసీల్దారు నరసింహరావు, ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లకు దూరంగా పంపించారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పెనుముప్పును నివారించారు. రాత్రి 9.30 గంటలకు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు.