మోహన్‌ను కరీంనగర్‌కు తరలిస్తున్న దృశ్యం
గోదావరిఖని/రామగిరి: సమస్య పరిశీలించేందుకు బొగ్గు గనిలోకి వెళ్లి ఆరుగురు రెస్క్యూ బ్రిగేడియర్లు ఆపదలో చిక్కుకున్నారు. సింగరే ణి సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని ఏఎల్‌పీ గనిలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు గనిలోని మూసివేసిన సీమ్‌లను పరిశీలించేందుకు ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌కు చెందిన రెస్క్యూ సూపరింటెండెంట్ సలీం ఆధ్వర్యంలో 22 మంది గనిపైకి చేరుకున్నారు. మూడు బృందాలుగా వెళ్లి గనిలోని మూసివేసిన ప్యానళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు గనిలోని 80వ ప్యానల్‌కు ఆరుగురు బృందం గల ఒక టీం, మరో ఇద్దరు స్టాండ్‌బైగా వెళ్లారు. 80వ ప్యానల్‌లోని ఎల్‌సీ–6 వద్ద పరిస్థితి సమీక్షించేందుకు టీం కెప్టెన్ మోహన్ ఆధ్వర్యంలో ఆరుగురు బ్రిగేడియర్లు వెళ్లారు. పరిశీలించిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద టీం కెప్టెన్ మోమన్ అదుపు తప్పి మూడు మీటర్ల లోతులో పడిపోయాడు. గమనించిన మిగతా బ్రిగేడియర్లు ఆయనను కాపాడే ప్రయత్నం ఫలించ లేదు. పైకి రావాలని పలుమార్లు ప్రయత్నించి మోహన్ అస్వస్థతకు గురయ్యాడు.
ఇద్దరి పరిస్థితి విషమం..
రెస్క్యూ టీం మేనేజర్ మోహన్ ఆధ్వర్యంలో బ్రిగేడియర్లు దిలీప్, నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్‌రావులు టీం సభ్యులుగా మూసివేసిన పని స్థలాల్లోని గోడలను పరిశీలించడానికి వెళ్లారు. అయితే వీరిలో మూడు మీటర్ల లోతులో పడిపోయిన మోహన్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, అతడిని కాపాడే ప్రయత్నంలో కొద్ది దూరం భుజాలపై మోసిన దిలీప్ (రెస్క్యూ బెస్ట్ కెప్టన్) పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. సింగరేణి ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం టీం కెప్టెన్ మోహన్‌ను కరీంనగర్ ఆస్పత్రికి, దిలీప్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్‌రావుకు స్థానికంగా చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్జీ–1, 2, 3 జీఎంలు కె.నారాయణ, ఎం.సురేశ్, సూర్యనారాయణలు హుటాహుటిన సింగరేణి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి బాధితులను పరామర్శించి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment