
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాప్తాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా తోపుదుర్తిపై రామగిరి పోలీసులు కేసు పెట్టారు. వైఎస్ జగన్ వచ్చిన సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.. హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. దీంతో, పోలీసులు భద్రతా వైఫల్యం కనిపించింది. ఈ క్రమంలోనే తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని తాజాగా తోపుదుర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇక, ఇటీవల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై పెనుగొండ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
