
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు.
ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment