
సాక్షి, అనంతపురం: ఏపీలో అధికార కూటమి పార్టీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ నేతల తీరుపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి బీజేపీనే కీలక పాత్ర పోషించింది. అలాంటి బీజేపీ నాయకులపై ఎందుకంత చిన్న చూపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో బీజేపీ నేతలకు కనీస గౌరవం లేదని అసహనం ప్రదర్శించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..‘టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ పాత్ర కీలకం. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలతో సమానంగా టీడీపీ, జనసేన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి మీరెందుకు బీజేపీ నాయకులపై చిన్నచూపు చూస్తున్నారు?. తాడిపత్రి బీజేపీ నేతల సమస్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒకలా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే ఉంది. కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని అన్నారు.