
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో ఒక ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల ముందు సంపద సృష్టి అని బిల్డప్ ఇచ్చారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని మండిపడ్డారు.
కడపలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పేదల నడ్డి విరుస్తూ కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరిచారు. సంపద సృష్టి అన్నారు. కానీ, సృష్టి పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అన్నారు.. ఒక్కటీ అమలు కాలేదు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు.
జన్మభూమి పేరును మారుస్తూ P-4 అంటూ కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులకోసం ఈ కార్యక్రమం.. వారికి దోచి పెట్టేందుకే పీ-4 పథకం తెచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలి. అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మరోవైపు.. అనంతపురంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధి రేటులో ఏపీ నెంబర్-2 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయరు?. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైంది?. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసును నిర్వీర్యం చేస్తున్నారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ పోలీసు క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి సుధాకర్‌కు లేదు.
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కాంట్రాక్టు పనుల ద్వారా వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయి. రాజకీయ యుద్ధం చేస్తానని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలపై విప్ కాలువ శ్రీనివాస్ ఎందుకు మాట్లాడరు?. వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు అంటూ ప్రశ్నించారు.