సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పులివెందుల-కదిరి మార్గమధ్యంలో ఉన్న నామాల గుండు వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన కూలి పని చేసుకునే దళిత చిన్న కదిరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకదిరప్ప తన తండ్రి షేక్ హాజీవలీని చంపడానికి వచ్చాడంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కట్టుకథ అల్లాడు. దీన్ని ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండానే దస్తగిరి చెప్పిందే వేదం అన్నట్లుగా తెగ ప్రసారం చేసింది. వాస్తవమేంటో బాధితుడు చిన్న కదిరప్ప మాటల్లోనే..
‘నాకు ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు నాగేశ్వరిని పులివెందులలోని బాకరాపేటకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. శుక్రవారం (8వ తేదీన) కూతురింటికి పోయి శనివారం మళ్లీ కదిరికి బయలుదేరాను. బస్సు కోసం పులివెందులలో రోడ్డు పక్కన నిలబడుకోంటే..మాకు బంధువైన తలుపుల మండలం శిద్దుగూరిపల్లికి చెందిన మల్లికార్జున బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఆపి బండిలో ఎక్కించుకున్నాడు. చార్జీ డబ్బులు మిగిలిపాయ.. అనుకొని ఎక్కాను. బండి స్పీడ్‌గా పోతూ నామాలగుండు దగ్గరకు రాగానే బ్రిడ్జి దగ్గర పొరపాటున ఫుట్‌పాత్‌కు తగిలింది.
నేను కిందపడిపోయినా. అదే సమయంలో ఎదురుగా ఒకాయన వస్తుంటే ఆయనకు కూడా పొరపాటున బండి తగిలి కన్ను దగ్గర చిన్న గాయమైంది. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. కావాలనే బండి తగిలించారంటూ ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు. అక్కడ పడిపోయిన నా సెల్‌ఫోన్ తీసుకుంటుంటే దాన్ని కూడా లాక్కున్నాడు. నాకు తల నుంచి రక్తం కారిపోతుంటే అక్కడున్న స్థానికులు చూసి ఆయన దగ్గర నుంచి నా సెల్ ఇప్పించారు. అక్కడున్న వారిలో ఎవరో 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించి నన్ను తలుపుల ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి నుంచి కదిరి ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు’ అని చిన్న కదిరప్ప వివరించాడు. ‘మీరే ఆయన్ను చంపాలని ప్రయత్నించారంట..నిజమేనా?’ అని కదిరప్పను పాత్రికేయులు ఆసుపత్రిలో ప్రశ్నించగా.. ‘నాకు దెబ్బలు తగిలి ప్రాణం పోతుంటే వాడెవడో ఎందుకు అట్ల జెప్పినాడు?! దీంట్లో ఏందో రాజకీయం ఉంది. మేము కూలీనాలీ చేసుకునేటోళ్లం. మాకెందుకు నాయనా అట్లాంటివి’ అని అన్నాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన కదిరప్ప ఫిర్యాదు మేరకు పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే..
Comments
Please login to add a commentAdd a comment