approver
-
దస్తగిరి కొత్త డ్రామా.. అసలు వాస్తవం ఏంటంటే?
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పులివెందుల-కదిరి మార్గమధ్యంలో ఉన్న నామాల గుండు వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లికి చెందిన కూలి పని చేసుకునే దళిత చిన్న కదిరప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నకదిరప్ప తన తండ్రి షేక్ హాజీవలీని చంపడానికి వచ్చాడంటూ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కట్టుకథ అల్లాడు. దీన్ని ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండానే దస్తగిరి చెప్పిందే వేదం అన్నట్లుగా తెగ ప్రసారం చేసింది. వాస్తవమేంటో బాధితుడు చిన్న కదిరప్ప మాటల్లోనే.. ‘నాకు ఏడుగురు కూతుర్లు. పెద్దకూతురు నాగేశ్వరిని పులివెందులలోని బాకరాపేటకు చెందిన ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. శుక్రవారం (8వ తేదీన) కూతురింటికి పోయి శనివారం మళ్లీ కదిరికి బయలుదేరాను. బస్సు కోసం పులివెందులలో రోడ్డు పక్కన నిలబడుకోంటే..మాకు బంధువైన తలుపుల మండలం శిద్దుగూరిపల్లికి చెందిన మల్లికార్జున బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఆపి బండిలో ఎక్కించుకున్నాడు. చార్జీ డబ్బులు మిగిలిపాయ.. అనుకొని ఎక్కాను. బండి స్పీడ్‌గా పోతూ నామాలగుండు దగ్గరకు రాగానే బ్రిడ్జి దగ్గర పొరపాటున ఫుట్‌పాత్‌కు తగిలింది. నేను కిందపడిపోయినా. అదే సమయంలో ఎదురుగా ఒకాయన వస్తుంటే ఆయనకు కూడా పొరపాటున బండి తగిలి కన్ను దగ్గర చిన్న గాయమైంది. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. కావాలనే బండి తగిలించారంటూ ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు. అక్కడ పడిపోయిన నా సెల్‌ఫోన్ తీసుకుంటుంటే దాన్ని కూడా లాక్కున్నాడు. నాకు తల నుంచి రక్తం కారిపోతుంటే అక్కడున్న స్థానికులు చూసి ఆయన దగ్గర నుంచి నా సెల్ ఇప్పించారు. అక్కడున్న వారిలో ఎవరో 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పిలిపించి నన్ను తలుపుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కదిరి ప్రభుత్వాసుపత్రికి తెచ్చారు’ అని చిన్న కదిరప్ప వివరించాడు. ‘మీరే ఆయన్ను చంపాలని ప్రయత్నించారంట..నిజమేనా?’ అని కదిరప్పను పాత్రికేయులు ఆసుపత్రిలో ప్రశ్నించగా.. ‘నాకు దెబ్బలు తగిలి ప్రాణం పోతుంటే వాడెవడో ఎందుకు అట్ల జెప్పినాడు?! దీంట్లో ఏందో రాజకీయం ఉంది. మేము కూలీనాలీ చేసుకునేటోళ్లం. మాకెందుకు నాయనా అట్లాంటివి’ అని అన్నాడు. బైక్ ప్రమాదంలో గాయపడిన కదిరప్ప ఫిర్యాదు మేరకు పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: దస్తగిరిది ఎంత క్రిమినల్ మైండ్ అంటే.. -
స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి5కి వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామంద్ర పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయమూర్తి ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై.. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం వచ్చారు. అయితే.. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన పిళ్లై.. మాట మార్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారి స్టేట్మెంట్ ఇవ్వడంతో.. ఈ కేసు దర్యాప్తుపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పిళ్లై అప్రూవర్‌గా మారడం, జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారన్న ప్రచారాన్ని ఆయన లీగల్ టీం తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈ ఏడాది మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ కేసులో మరో నిందితుడు సమీర్ మహేందు(ఇండో స్పిరిట్ ఎండీ) నుంచి లంచాలు తీసుకుని.. మరో నిందితుడికి ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అప్పటికే పిళ్లై కోకాపేట నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ.. వట్టినాగులపల్లి(రంగారెడ్డి) వద్ద ఆయనకు చెందిన రూ.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసింది కూడా. అరెస్ట్ చేశాక.. పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని పేర్కొంది. మరోవైపు ఆగష్టులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. -
తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఆదేశించినట్లుగా ఏ–4 దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని, దాని ఆధారంగా కేసుతో ఎలాంటి సంబంధంలేని వారిని ఇరికించాలని దర్యాప్తు సంస్థ ప్రయతి్నస్తోందని వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడం చట్టవిరుద్ధమని, అతడికి బెయిల్ ఇచ్చే సమయంలో కిందికోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దస్తగిరి చెప్పిన వివరాల అధారంగా తనతోపాటు మరి కొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందన్నారు. ‘దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని, బెయిల్ ఇస్తూ కిందికోర్టు ఇచి్చన ఉత్తర్వులను కొట్టివేయాలి. నన్ను, మరికొందరిని నిందితులుగా చేర్చవద్దని ఆదేశాలు ఇవ్వాలి’అని అభ్యరి్థస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్లోనూ వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. ‘దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. హత్యకు ఆయుధాన్ని కొనుగోలు చేసింది అతడే. దస్తగిరికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ పూర్తిగా సహకరించింది. దస్తగిరిపై వాచ్‌మన్ రంగన్న చెప్పిన అంశాలను కిందికోర్టు పట్టించుకోలేదు’అని వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి పిటిషన్లో మరికొన్ని అంశాలివీ.. అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చా.. నా వయసు సుమారు 73 ఏళ్లు. దీర్ఘకాలిక వెన్నునొప్పి, ఛాతీలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నా. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరయ్యా. దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద వివేకా వాచ్‌మన్ రంగన్న స్టేట్మెంట్ను దర్యాప్తు సంస్థ రికార్డ్ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం వంటి శబ్దాలు వినపడటంతో లేచి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. లోపలి నుంచి ఏడుపు లాంటి శబ్దం వినిపించడంతో పార్క్ వైపు ఉన్న ద్వారం వద్దకు వెళ్లి పక్కనే ఉన్న కిటికీ లోంచి లోపలికి చూశాడు. ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వాళ్లు హాల్లో ఏదో వెతుకుతూ కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌గా గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్ వైపు ద్వారం తెరిచి సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్ హడావుడిగా వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. అక్కడ దొరికిన ఆధారాల మేరకే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మమ్మల్ని ఇరికించే ప్రయత్నం.. ఆ నలుగురే ఈ హత్య చేసినట్లు రంగన్న స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెబుతున్నా ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేని నాతోపాటు మరికొందరిపై ఆరోపణలు చేస్తూ ఇరికించేందుకు దర్యాప్తు సంస్థ అక్రమ పద్ధతులను అనుసరిస్తోంది. వివేకా కుమార్తె సునీత, దర్యాప్తు అధికారులు వారికి తోచిన చట్టవిరుద్ధ ప్రక్రియలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే దస్తగిరికి కొన్ని సూచనలు చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో దస్తగిరి.. ఏ–5(శివశంకర్‌రెడ్డి)తో పాటు నాపై, మరో ఇద్దరిపై నిరాధార ఆరోపణలు చేశాడు. సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోకుండా.. మరో ఇద్దరికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. దస్తగిరి గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చేసుకుని సీబీఐ నాపై ఆరోపణలు మోపుతోంది. నాకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అనుసరించిన విధానం పూర్తిగా చట్టవిరుద్ధం. హత్య కేసులో నిందితుడైన కిరాయి హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. దస్తగిరి చెప్పిన దానికి ఎలాంటి సాక్ష్యం లేదు. నేరంలో నలుగురు పాలుపంచుకున్నారు. వీ రిలో తక్కువ నేరం చేసిన వారు జైలులో ఉండగా కీలక పాత్ర పోషించిన దస్తగిరికి మాత్రం బెయిల్ ఇవ్వడం సరికాదు. గంగిరెడ్డి ఆదేశాల మేరకు హత్యలో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. దీని కోసం భారీ మొత్తంలో నగదు కూడా తీసుకున్నాడు. ఆయుధాన్ని తెచ్చానని, హత్యలో ప్రధాన పాత్ర పోషించానని కూడా ఒప్పుకున్నాడు. ఈ అంశాన్ని కిందికోర్టు మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదు. బెయిల్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. అప్రూవర్‌గా మారడం, బెయిల్ ఇవ్వ డం అంతా చట్టవిరుద్ధంగానే జరిగింది. బెయిల్ మంజూరు చేస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా నన్ను నిందితుడిగా చేర్చవద్దని సీబీఐని ఆదేశించాలి. చదవండి: ‘స్కిల్’ సూత్రధారి బాబే -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ క్రమంలో దినేష్ అరోరా వాంగ్మూలం నమోదు చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేష్ అరోరాను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్ అరోరాకు గత వారమే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో సీబీఐ అభ్యంతరం చెప్పకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దినేష్‌ను సాక్షిగా చూడాలని కోరుతూ సోమవారం సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులకు దినేష్ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందించారని కోర్టుకు తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్ర.. రాధా ఇండస్ట్రీస్ ఖాతా నుంచి రూ.కోటి బదిలీ చేసినట్లు సీబీఐ తేల్చింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి చెందినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7కింత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారినట్లు సీబీఐ ప్రకటించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి -
పీఎన్బీ స్కాం సంచలనం : నీరవ్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: బ్యాంకింగ్ రంగాన్ని పట్టికుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ నీరవ్ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. పీఎన్బీ స్కాం, నీరవ్ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ పూర్వి మోదీ, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు. అతని నేరపూరిత కార్యకలాపాలు మూలంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు స్థంభించి పోయాయని వాపోయారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీరిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు అనుమతించింది. క్షమాపణ తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోడీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వంతో ఆదేశంలో ఉన్న పూర్వి మోదీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా పీఎన్బీ స్కాంలో నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం విచారణలో ఉంది. -
అప్రూవర్‌గా మారనున్న సక్సేనా!
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఈడీ, సక్సేనాల తరఫు న్యాయవాదులు ఓ అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించాయి. సక్సేనా దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ అనంతరం ఇరువర్గాలు సక్సేనా అప్రూవర్‌గా మారే విషయమై ఉమ్మడి పిటిషన్ దాఖలు చేస్తాయన్నాయి. సక్సేనా న్యాయవాది గీతా లూథ్రా స్పందిస్తూ.. ఈడీ అధికారుల విచారణకు సక్సేనా అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉందనీ, 4 స్టెంట్లు వేశారని వెల్లడించారు. అంతేకాకుండా సక్సేనాకు లుకేమియా(రక్త కేన్సర్) ప్రాథమిక దశలో ఉందన్నారు. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో అగస్టా హెలికాపర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరింది. అయితే ఈ సందర్భంగా భారీగా ముడుపులు చేతులు మారినట్లు వార ్తలు రావడంతో కేంద్రం ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. సక్సేనా బెయిల్ పిటిషన్‌ను గురువా రం విచారిస్తామని ఢిల్లీలోని ఓ కోర్టు తెలిపింది. -
షీనా కేసులో అప్రూవర్‌గా కారు డ్రైవర్
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్‌గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జైలులో వేసి విచారిస్తుండగా ఇంద్రాణి కారు డ్రైవర్ అయిన శ్యామ్వర్ రాయ్ మొత్తం నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు తనకు తెలుసని, అప్రూవర్ గా మారిపోతానని అందుకు అవకాశం ఇవ్వాలని గత నెలలో కోర్టుకు అభ్యర్థించుకున్నాడు. దీంతో సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసు: అప్రూవర్ గా మారనున్న డ్రైవర్
ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారనున్నాడు. ఈ విషయాన్ని కోర్టుకు సీబీఐ తెలిపింది. తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ కోర్టుకు రాసిన రెండు పేజీల లేఖను అధికారులు కోర్టుకు అందజేశారు. అప్రూవర్ గా మారే నిర్ణయం తనదేనని, ఎవరూ తనపై ఒత్తిళ్లు తేవడం లేదని, జరిగిన విషయం మొత్తాన్ని కోర్టుకు తెలుపుతానని తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ లేఖలో కోరారు. గత నెల మే11న తాను అప్రూవర్ గా మారతానని రాయ్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగష్టులో రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. -
నోరు విప్పితే నాశనం చేస్తా
తెరమరుగైపోయిన కంచి శంకర్రామన్ హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బెదిరింపులకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పానని, నేడు కోర్టులో నిజాలు చెప్పి అసలు దోషులను పట్టిస్తానని ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన రవి సుబ్రహ్యణ్యం ముఖ్యమంత్రి జయలలిత, పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించాడు. అసలు దోషులను పట్టించే ప్రయత్నంలో స్వామి ఇటీవల మళ్లీ బెదిరించారని పేర్కొన్నాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి:కంచి మఠం గతంలో అనేక ఆరోపణలకు గురైంది. మఠం అనుబంధ వరదరాజ పెరుమాళ్ ఆల య మేనేజర్ శంకరరామన్ 2004లో హత్యకు గుైరె య్యాడు. ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో స్వామి జయేంద్రసరస్వతి, అప్పు, కదిరవన్, సుందరేశన్ తదితరులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. అదే కేసులో మరో నిం దితుడైన రవిసుబ్రహ్మణ్యం అప్రూవర్‌గా మారి పోయాడు. స్వామి సహా ఇతర నిందితులు బెయిల్‌పై బైటకు వచ్చారు. ఆ తరువాత కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అందరూ నిర్దోషులైనపుడు శంకర్రామన్ను హత్య చేసిందెవరనే విమర్శలు వెల్లువెత్తాయి. కలకలం రేపిన అప్రూవర్ శంకర్రామన్ హత్యకేసులో తన అబ ద్ధపు సాక్ష్యం వల్ల నిందితులు నిర్దోషులుగా బైటకు వచ్చారు, కోర్టులో మళ్లీ నిజాలు చెబుతానంటూ అప్రూవర్ రవి సుబ్రహ్మణ్యం బహిరంగంగా ముందు కు రావడం కలకలం రేపింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌సెల్, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో శుక్రవారం సమర్పించిన వినతిపత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. అం దులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నా యి. అబద్ధపు సాక్ష్యం చెప్పి అసలైన దోషులను రక్షించాను, నేడు నిజం చెప్పే ప్రయత్నంలో స్వామి జయేంద్ర సరస్వతి ఇటీవల మళ్లీ బెదిరింపులకు దిగారు. శంకర్రామన్ హత్యకేసు, ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం కేసుల్లో నిందితులను 20014 డిసెంబర్ 26న అరెస్ట్ చేశారు. నేను రెండు కేసుల్లోనూ అప్రూవర్‌గా మారిపోయాను. దీని వల్ల జయేంద్ర సరస్వతి తదితరులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నన్ను, నా కుటుంబాన్ని హతమారుస్తారనే భయంతోనే జైలు జీవితం గడిపాను. అప్పట్లో జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రామచంద్రన్ అండదండలతో ఇదే హత్యకేసులో జైలులో ఉన్న అప్పు, కదిరవన్ నన్ను బెదిరించడంతో నిజాలు దాచిపెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పాను. అంతేగాక అనేక కుట్రలు, ధనబలంతో వారంతా నిర్దోషులుగా విడుదలైనారు. గత 9 ఏళ్లుగా జైలు జీవితం గడిపి 2013 డిసెంబర్ బాహ్యప్రపంచంలోకి వచ్చాను. ఆ తరువాత కూడా నిందితులు బెదిరించారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అసలు దోషులను పట్టించాలన్న భావనతో విరమించుకున్నాను. బెదిరింపులకు పాల్పడిన అప్పు, కదిరవన్ చనిపోయినందున ప్రస్తుతం నేను స్వతంత్రుడిని. హత్య కేసు సాక్ష్యంలో అంతరాత్మను చంపుకోలేక ఈనెల 8వ తేదీన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కలిసి వాస్తవాలు విన్నవించి వినతిపత్రం సమర్పించాను. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన నిందితుడు సుందరేశయ్యర్ ‘పెద్దాయన నిన్ను కలవాలని చెప్పారు. సాయంత్రంలోగా రా’ అంటూ చెప్పారు. అతని సూచనమేరకు జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసాను. ‘మళ్లీ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, శంకర్రామన్కు పట్టిన గతే నీకు పడుతుంది’ అని స్వామి బెదిరించారు. ‘పెద్దాయనతో విబేధిస్తే దేశంలో ఏమూలా ప్రాణాలతో ఉండలేవు, స్వామివారు కేంద్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న సంగతి తెలియదా. డీఐజీ రామచంద్రన్‌కు రాష్ట్రంలోని రౌడీలందరూ తెలుసు, కనిపించకుండా పోతావ్’ అంటూ సుందరేశయ్యర్ కూడా బెదిరించాడు. వీరందరి వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకేమైనా అయితే స్వామి జయేంద్ర సరస్వతి, సుందరేశయ్యర్ తదితరులే బాధ్యులు అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడు.