సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామంద్ర పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయమూర్తి ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై.. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం వచ్చారు. అయితే.. అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు.
గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై.. మాట మార్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు.
అయితే.. తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారి స్టేట్‌మెంట్ ఇవ్వడంతో.. ఈ కేసు దర్యాప్తుపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పిళ్లై అప్రూవర్‌గా మారడం, జడ్జి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చారన్న ప్రచారాన్ని ఆయన లీగల్ టీం తోసిపుచ్చింది.
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై అరుణ్‌రామచంద్ర పిళ్లైను ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ కేసులో మరో నిందితుడు సమీర్ మహేందు(ఇండో స్పిరిట్ ఎండీ) నుంచి లంచాలు తీసుకుని.. మరో నిందితుడికి ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అప్పటికే పిళ్లై కోకాపేట నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ.. వట్టినాగులపల్లి(రంగారెడ్డి) వద్ద ఆయనకు చెందిన రూ.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసింది కూడా.
అరెస్ట్ చేశాక.. పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని పేర్కొంది. మరోవైపు ఆగష్టులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment