నోరు విప్పితే నాశనం చేస్తా
తెరమరుగైపోయిన కంచి శంకర్‌రామన్ హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బెదిరింపులకు భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్పానని, నేడు కోర్టులో నిజాలు చెప్పి అసలు దోషులను పట్టిస్తానని ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన రవి సుబ్రహ్యణ్యం ముఖ్యమంత్రి జయలలిత, పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించాడు. అసలు దోషులను పట్టించే ప్రయత్నంలో స్వామి ఇటీవల మళ్లీ బెదిరించారని పేర్కొన్నాడు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:కంచి మఠం గతంలో అనేక ఆరోపణలకు గురైంది. మఠం అనుబంధ వరదరాజ పెరుమాళ్ ఆల య మేనేజర్ శంకరరామన్ 2004లో హత్యకు గుైరె య్యాడు. ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో స్వామి జయేంద్రసరస్వతి, అప్పు, కదిరవన్, సుందరేశన్ తదితరులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు. అదే కేసులో మరో నిం దితుడైన రవిసుబ్రహ్మణ్యం అప్రూవర్‌గా మారి పోయాడు. స్వామి సహా ఇతర నిందితులు బెయిల్‌పై బైటకు వచ్చారు. ఆ తరువాత కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అందరూ నిర్దోషులైనపుడు శంకర్‌రామన్‌ను హత్య చేసిందెవరనే విమర్శలు వెల్లువెత్తాయి.
కలకలం రేపిన అప్రూవర్
శంకర్‌రామన్ హత్యకేసులో తన అబ ద్ధపు సాక్ష్యం వల్ల నిందితులు నిర్దోషులుగా బైటకు వచ్చారు, కోర్టులో మళ్లీ నిజాలు చెబుతానంటూ అప్రూవర్ రవి సుబ్రహ్మణ్యం బహిరంగంగా ముందు కు రావడం కలకలం రేపింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌సెల్, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో శుక్రవారం సమర్పించిన వినతిపత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. అం దులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నా యి. అబద్ధపు సాక్ష్యం చెప్పి అసలైన దోషులను రక్షించాను, నేడు నిజం చెప్పే ప్రయత్నంలో స్వామి జయేంద్ర సరస్వతి ఇటీవల మళ్లీ బెదిరింపులకు దిగారు. శంకర్‌రామన్ హత్యకేసు, ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం కేసుల్లో నిందితులను 20014 డిసెంబర్ 26న అరెస్ట్ చేశారు. నేను రెండు కేసుల్లోనూ అప్రూవర్‌గా మారిపోయాను. దీని వల్ల జయేంద్ర సరస్వతి తదితరులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
నన్ను, నా కుటుంబాన్ని హతమారుస్తారనే భయంతోనే జైలు జీవితం గడిపాను. అప్పట్లో జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రామచంద్రన్ అండదండలతో ఇదే హత్యకేసులో జైలులో ఉన్న అప్పు, కదిరవన్ నన్ను బెదిరించడంతో నిజాలు దాచిపెట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పాను. అంతేగాక అనేక కుట్రలు, ధనబలంతో వారంతా నిర్దోషులుగా విడుదలైనారు. గత 9 ఏళ్లుగా జైలు జీవితం గడిపి 2013 డిసెంబర్ బాహ్యప్రపంచంలోకి వచ్చాను. ఆ తరువాత కూడా నిందితులు బెదిరించారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అసలు దోషులను పట్టించాలన్న భావనతో విరమించుకున్నాను. బెదిరింపులకు పాల్పడిన అప్పు, కదిరవన్ చనిపోయినందున ప్రస్తుతం నేను స్వతంత్రుడిని. హత్య కేసు సాక్ష్యంలో అంతరాత్మను చంపుకోలేక ఈనెల 8వ తేదీన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని కలిసి వాస్తవాలు విన్నవించి వినతిపత్రం సమర్పించాను. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన నిందితుడు సుందరేశయ్యర్ ‘పెద్దాయన నిన్ను కలవాలని చెప్పారు.
సాయంత్రంలోగా రా’ అంటూ చెప్పారు. అతని సూచనమేరకు జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసాను. ‘మళ్లీ నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, శంకర్‌రామన్‌కు పట్టిన గతే నీకు పడుతుంది’ అని స్వామి బెదిరించారు. ‘పెద్దాయనతో విబేధిస్తే దేశంలో ఏమూలా ప్రాణాలతో ఉండలేవు, స్వామివారు కేంద్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న సంగతి తెలియదా. డీఐజీ రామచంద్రన్‌కు రాష్ట్రంలోని రౌడీలందరూ తెలుసు, కనిపించకుండా పోతావ్’ అంటూ సుందరేశయ్యర్ కూడా బెదిరించాడు. వీరందరి వల్ల నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకేమైనా అయితే స్వామి జయేంద్ర సరస్వతి, సుందరేశయ్యర్ తదితరులే బాధ్యులు అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొన్నాడు.