![Hearing in Telangana High Court on Viveka murder case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/STAFF_LOGINPAGE.jpg.webp?itok=xOWSDFtw)
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు ఆదేశం
దర్యాప్తు సంస్థతో పాటు దస్తగిరికి కూడా నోటీసులు
తదుపరి విచారణ 27కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్‌గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.
సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు.
పిటిషనర్ల వాదన ఇదీ...
‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్‌షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్‌షిట్‌లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.
క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment