హంతకుడి దర్జాగిరి.. విస్తుగొలుపుతున్న షేక్‌ దస్తగిరి తీరు  | Dastagiri interviews with yellow media | Sakshi
Sakshi News home page

హంతకుడి దర్జాగిరి.. విస్తుగొలుపుతున్న షేక్‌ దస్తగిరి తీరు 

Published Sun, Apr 23 2023 5:19 AM | Last Updated on Sun, Apr 23 2023 10:48 AM

Dastagiri interviews with yellow media - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : ‘హలో.. నేను దస్తగిరిని మాట్లాడుతున్నా.. యా దస్తగిరి అంటావేందీ.. వివేకాను చంపిన దస్తగిరిని.. మీ దగ్గరకు వచ్చినోళ్లు మా వాళ్లు. చూసుకుని పోండి.. లేదంటే ఇబ్బంది పడతారు’ అంటూ ఇటీవల ఓ వాయిస్‌ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో తిరిగింది. ఎవరైనా క్షణికావేశంలోనో, ఉద్దేశ పూర్వకంగానో ఎవరినైనా హత్య చేస్తే మూడో కంటికి తెలియకూడదనుకుంటారు. తెలిసినా గుట్టు చప్పుడు కాకుండా తల వంచుకుని వెళ్లి పోతుంటారు. అయితే మాజీ మంత్రి వివేకానందరెడ్డిని తానే గొడ్డలితో నరికి చంపానని పదే పదే చెప్పిన, విచారణలో సీబీఐ ఎదుట ఒప్పుకున్న పులివెందులకు చెందిన షేక్‌ దస్తగిరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

చదువు ఒంటబట్టక పోవడంతో డ్రైవింగ్‌ నేర్చుకున్న ఇతగాడి ప్రస్తుత వయసు 25 ఏళ్లు. అప్పట్లో యాదాటి సునీల్‌ యాదవ్‌ ద్వారా వివేకానందరెడ్డి వద్ద చేరాడు. ఆర్థిక కారణాల రీత్యా సునీల్‌ యాదవ్‌ ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడ్డాడు. వివేకానందరెడ్డిని హత్య చేస్తే పెద్దఎత్తున డబ్బు వస్తుందని సునీల్‌యాదవ్‌ చెప్పడంతో అందుకు దస్తగిరి అంగీకరించాడు. ఇందులో భాగంగా 2019 మార్చి 14న కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేశాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత గజ్జెల ఉమాశంకరరెడ్డి, సునీల్‌ యాదవ్, దస్తగిరి కలిసి ఎర్ర గంగిరెడ్డి సహకారంతో వివేకాను హత్య చేశారు.

డ్రైవర్‌ స్థానంలోకి వచ్చిన నీరుగట్టు ప్రసాద్‌ తనను చంపుతున్నట్లు వివేకాతో డెత్‌నోట్‌ రాయించారు. ఇదంతా గొప్ప ఘన కార్యం అన్నట్లు చెబుతున్న దస్తగిరికి స్థానిక టీడీపీ నేత బీటెక్‌ రవి తోడయ్యారు. పులివెందులకు చెందిన బీటెక్‌ రవి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుట్ర పన్ని, వివేకానందరెడ్డిని ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీటెక్‌ రవి నుంచి దస్తగిరికి ఆర్థికంగా మంచి తోడ్పాటు లభిస్తోంది. వీరిద్దరికీ వివేకా కూతురు, అల్లుడు తెరవెనుక నుంచి మద్దతు ఇస్తున్నారు. దీంతో దస్తగిరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది.  

బెయిల్‌ రాగానే విలాసవంతమైన జీవనం  
వివేకా హత్యకు ముందు ఎప్పటికప్పుడు కష్టపడితేనే పూట గడిచే స్థితి దస్తగిరిది. వంద రూపాయల కోసం ఐదారుగురికి మెసేజ్‌లు పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు కాలు కదిపితే స్కార్పియో కారు. చుక్కా, ముక్కా లేనిదే భోజనం లేదు. ఖరీదైన స్కాచ్‌ వెంటే ఉంటుంది. ఖరీదైన దుస్తులు.. ఆహార్యం మారిపోయింది.. వెరసి దౌర్జన్యాలు, దందాలు. వివేకా హత్య తర్వాత డ్రైవర్‌ దస్తగిరి విలాసవంతమైన జీవనం ఆరంభించాడు. అప్పులు తీర్చేశాడు. ఖరీదైన స్కార్పియో వాహనానికి యజమాని అయ్యాడు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాడు. ఫోన్లలోనే ప్రైవేట్‌ పంచాయితీలు చేస్తున్నాడు.

ప్రాణరక్షణ నిమిత్తం ఎస్కార్టు కూడా వచ్చి చేరింది. ఇంటివద్ద బందోబస్తుగా పోలీసు పికెట్‌ సైతం ఏర్పాటైంది. వీటన్నింటితో రెచ్చిపోతున్నాడు. వైఎస్‌ వివేకా కేçసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌ కోసం కోర్టు మెట్లెక్కితే చాలు ఓ వైపు దస్తగిరి మీడియా సమావేశం.. మరోవైపు కోర్టులో డాక్టర్‌ సునీత ఇంప్లీడ్‌ పిటిషన్లు సమాంతరంగా తెరపైకి వస్తున్నాయి. తెరవెనుక మంత్రాంగం మేరకే గల్లీలో దస్తగిరి మీడియాతో మాట్లాడితే, సునీత కోర్టులో ఇంప్లీడ్‌ అవుతున్నారు.

దస్తగిరిలో చేసిన తప్పుకు ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు. హీరోయిజం ప్రదర్శించేలా మీడియా సమావేశాల్లో గంటల తరబడి వివేకా హత్య గురించి కథ చెప్పినట్లు చెబుతున్నాడు. ఏకంగా సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని పదే పదే ప్రకటిస్తూ తనో సెలబ్రిటీ అన్నట్లు చెలరేగిపోతున్నాడు. పై నుంచి ‘40 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ సూచనల మేరకు స్థానికంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డైరెక్షన్‌లో నడుస్తున్నాడు.   

దాదాగిరి మామూలుగా లేదు.. 
తొండూరు పోలీసుస్టేషన్‌లో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్‌ అనే యువకుడిపై స్వయంగా దౌర్జన్యం చేశాడు. ఏఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుళ్లు ఉండగా వారి సమక్షంలోనే చెలరేగిపోయాడు. ఓ చోరీ కేసులో ఇదే తొండూరు మండల ఎలక్ట్రికల్‌ అధికారులను బెదిరించాడు. శ్రీకాళహస్తిలో ఓ స్థల వివాదం సెటిల్‌మెంట్‌కు వెళ్లి ఓ వర్గం వారిని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ మేరకు అక్కడ కేసు కూడా నమోదైంది.

యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్‌ వాహనాల సీజ్‌ తదితర వ్యవహారాల్లో తల దూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. టీడీపీ నేతలు దస్తగిరి భార్య షబానాకు బ్రీఫింగ్‌ ఇస్తే.. దస్తగిరి ఎల్లో మీడియాకు పాఠం అప్పజెప్పే పనిలో నిమగ్నమయ్యాడు. ఇందుకు ఫలితంగా బీటెక్‌ రవి నుంచి ఎప్పటికప్పుడు భారీగా డబ్బు అందుతోంది. లింగాల మండలానికి చెందిన నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, సింహాద్రిపురం మండల వాసి బీటెక్‌ రవి తెర వెనుక మంత్రాంగం ద్వారానే దస్తగిరి అప్రూవర్‌గా మారడం కొసమెరుపు.  

దస్తగిరికి టీడీపీ నుంచే ముప్పు  
తెర వెనుక నుంచి చిలక పలుకులు పలికిస్తున్న వారి నుంచే తనకు హాని కలిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి ప్రాణహాని తలపెడితే ప్రధానంగా లాభ పడేది టీడీపీనే. ఎందుకంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజల్లో చులకన చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వివేకా హత్యను కేస్‌ స్టడీగా తీసుకుని ప్రచారం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటువంటి వాటిలో ఆరితేరిన నేతలు టీడీపీలోనే ఉన్నారు. అందుకే పథకం ప్రకారం కిరాయి హంతకుడు దస్తగిరిని రెచ్చగొట్టి.. వైఎస్సార్‌సీపీ నేతలపైన, సీఎంపైన తీవ్ర ఆరోపణలు చేయిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. టీడీపీ వారే అతడిని అంతమొందించి ఆ నేరాన్ని వైఎస్సార్‌సీపీ నేతలపై వేసే కుట్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement