సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరిని సీబీఐ అప్రూవ ర్‌గా ప్రకటించడం, అతడికి కడప కోర్టు బెయిల్ ఇవ్వడం చట్టవ్యతిరేకమని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా కడప కోర్టు దస్తగిరికి అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొంటూ.. అతడికి బెయిల్ ఇస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్‌లపై న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ సోమవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న ఆయన తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా వైఎస్ భాస్కర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగేందర్ కోర్టుకు హాజరయ్యారు.
చంపడానికి గొడ్డలి కొనుగోలు చేశానని
దస్తగిరి ఒప్పుకున్నాడు..: ఈ సందర్భంగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది దేశాయి ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హత్యకు సంబంధించి వివేకా వాచ్‌మెన్ రంగన్న స్టేట్‌మెంట్‌ను, సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని, పోలీసులు సేకరించిన మెటీరియల్‌ను సీబీఐ పరిశీలించలేదన్నారు. ‘‘వివేకాను హత్య చేయడానికి నగదు తీసుకున్నానని, చంపడం కోసం గొడ్డలి కూడా కొనుగోలు చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడు. అలాంటి హంతకుడిని కనీసం కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే క్షమించడం చట్టవిరుద్ధం.
వివేకాతో దస్తగిరే బలవంతంగా లేఖ రాయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. విచారణలో సీబీఐ చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో సీబీఐ కూడా అతడికి ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు, అప్రూవర్‌గా ప్రకటించేందుకు పూర్తిగా సహకరించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. తొలుత నలుగురు ఉన్న నిందితుల జాబితాకు మరికొందరిని చేర్చింది. హత్య కేసులో వారిని బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తోంది.
ప్రధాన నిందితుడు దస్తగిరికి బెయిల్ ఇప్పించడం, అప్రూవర్‌గా ప్రకటించడంపై సరికాదని సీబీఐ అధికారులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీబీఐ తప్పుడు పద్ధతుల్లో దర్యాప్తు చేస్తుండటంతో కృష్ణారెడ్డి పులివెందుల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు’’ అని ప్రకాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు.
రంగన్న స్టేట్‌మెంట్‌ను తొక్కిపెట్టి..
‘సీఆర్‌పీసీ సెక్షన్‌లు 161, 164 కింద వివేకా వాచ్‌మెన్ రంగన్న స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది. దాని ప్రకారం.. హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం వంటి శబ్దాలు అతడికి వినిపించాయి. దీంతో పార్క్ వైపు ఉన్న తలుపు వద్దకు వెళ్లి.. పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి చూశాడు. ఇంట్లో నలుగురు వ్యక్తులు కనిపించారు. వారిలో ముగ్గురిని ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌గా గుర్తించాడు.
నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నాడు. దీంతో భయపడ్డ రంగన్న చీకటిగా ఉన్న తోటలోని చెట్టు దగ్గర దాక్కున్నాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత పార్క్ దగ్గర తలుపు తీసుకుని సన్నగా, పొడవుగా ఉన్న వ్యక్తితోపాటు దస్తగిరి, సునీల్, గంగిరెడ్డి హడావుడిగా బయటికి వచ్చి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. వారిని రంగన్న స్పష్టంగా చూశాడు. రంగన్న చీకట్లో ఉండటంతో వారు అతడిని గుర్తించలేదు. వారందరూ వెళ్లిపోయాక రంగన్న లోపలికి వెళ్లాడు. ఇల్లంతా చూసినా వివేకా కనిపించకపోవడంతో బాత్రూమ్‌కి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నారు.
ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కూడా రంగన్న చెప్పిన వివరాలకు సరిపోయాయి. ఈ ఆధారాలతోనే పోలీసులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. నిందితులు హత్య సమయంలో వివేకా ఇంటి వద్దే ఉన్నట్లు గూగుల్ లొకేషన్ ద్వారా కూడా తెలిసింది. ఇన్ని ఆధారాలు ఉన్నా వాటిని తొక్కిపెట్టి సీబీఐ విచారణ సాగిస్తోంది. ఇంతవరకు దస్తగిరిని అరెస్టు చేయలేదు.. కస్టడీలోకి తీసుకోలేదు. కాబట్టి కడప కోర్టు దస్తగిరికి బెయిల్ ఇస్తూ, అప్రూవర్‌గా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని ప్రకాష్ రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment