సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా సీబీఐ విచారణ చేస్తోందని.. ఆయనను ఇందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇప్పటికే పలుమార్లు అవినాశ్ విచారణకు హాజరైనా మళ్లీ రావాలంటూ తీవ్రంగా వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హత్య చేసిన నలుగురికి వివేకాతో విభేదాలున్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేయలేదని తెలిపారు.
ప్రధాన నిందితుడు దస్తగిరి విషయంలోనూ సీబీఐ తీరు ఇలాగే ఉందన్నారు. దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా వివేకా కుమార్తె సునీత పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్లారని గుర్తు చేశారు. కిరాయి హంతకుడు దస్తగిరికి పూర్తి సహకారం అందిస్తున్న సీబీఐ.. అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు జరుపుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినాశ్ తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో ఉన్నారని.. అయినా విచారణకు రావాలంటూ వేధిస్తోందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆధారాలు లేకుండా అవినాశ్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ అవినాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం హైకోర్టు విచారించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ధర్మాసనం ముందు.. అవినాశ్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం సునీత తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ తన వాదనలు వినిపించారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటడంతో విచారణను ధర్మాసనం శనివారం (నేడు) ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. నేడు సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు ఇలా సాగాయి..
నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు..
‘2019, మార్చి 14న వివేకా హత్య జరిగింది. తొలుత నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో 2020లో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. కేసు విచారణ చేపట్టిన సీబీఐ దాదాపు నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదు. 2021, అక్టోబర్ 26న ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్ (ఏ–2), ఉమాశంకర్‌రెడ్డి (ఏ–3), దస్తగిరి (ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. గంగిరెడ్డిని 2019, మార్చి 28న సిట్ అరెస్టు చేసింది.
గంగిరెడ్డి వివేకాకు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య భూవివాదాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ భూవివాదంలో రావాల్సిన కమిషన్ గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక రెండో నిందితుడు సునీల్‌ను 2021, ఆగస్టు 28న అరెస్టు చేశారు. వివేకా అతడితో వజ్రాల వ్యాపారం చేసేవారు. అంతేకాదు.. సునీల్ తల్లిని వివేకా లైంగికంగా వేధించినట్లు అతడే తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మూడో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని 2021, సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. ఇతడితోనూ వివేకా వజ్రాల వ్యాపారం చేశారు.
అంతేకాకుండా ఉమాశంకర్‌రెడ్డి భార్యను కూడా వివేకా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నాలుగో నిందితుడు దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేయలేదు. వివేకా వద్ద దస్తగిరి డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018 డిసెంబర్‌లో అతడిని తొలగించిన వివేకా.. ప్రసాద్ (ఎల్‌డబ్ల్యూ–16)ను డ్రైవర్‌గా పెట్టుకున్నారు. దస్తగిరి సూచన మేరకే.. హత్యకు ముందు వివేకాతో నిందితులు ప్రసాదే ఈ హత్యకు కారణం అన్నట్లు లేఖ రాయించారు.
తానే ఆయుధం తెచ్చానని, హత్య చేశానని చెప్పిన ఓ కిరాయి హంతకుడు (దస్తగిరి) యథేచ్ఛగా బయట తిరగడం, అతడిని సీబీఐ అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి కావొచ్చు. 2021, నవంబర్ 17న సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే చార్జిషీట్ వేయాల్సి ఉండగా, సీబీఐ చట్టాన్ని పాటించలేదు’ అని అవినాశ్ న్యాయవాది తన వాదనలు వినిపించారు.
టీడీపీ కుట్రలో భాగంగానే వివేకా ఓటమి
‘2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. దీనికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కారణమని.. వారి అంతుచూస్తానని బెదిరించారని సీబీఐ పేర్కొంటున్నా.. అందులో వాస్తవం లేదు.
స్థానిక సంస్థల కోటాలో ఆ ఎన్నికలు జరగడం, నాటి అధికార టీడీపీ ఓటర్లను కొనుగోలు చేయడం కారణంగానే వివేకా ఎన్నికల్లో ఓడిపోయినట్టు కొందరు సాక్షులు వెల్లడించారు. వివేకా ఓటమితో భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు సంబంధం లేదు. వివేకా.. విజయమ్మ, షర్మిలల్లో ఒకరికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినట్లు కూడా ఎవరూ చెప్పలేదు. సీబీఐ మాత్రం ఓ కథ అల్లుకుని.. ఆ మేరకు దర్యాప్తు చేస్తోంది’ అని అవినాశ్ న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
డబ్బు, ఆయుధం రికవరీ ఏదీ?
‘గంగిరెడ్డి ఇచ్చాడని చెప్పి తనకు సునీల్ రూ.కోటి ఇచ్చినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అందులో రూ.25 లక్షలను మళ్లీ సునీల్ తీసుకున్నాడని చెప్పాడు. కేసు నమోదు చేసిన సీబీఐ మిగిలిన రూ.75 లక్షల్లో రూ.46 లక్షలు మాత్రమే రికవరీ చేసింది. మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయింది. దస్తగిరి ఆయుధాన్ని నాలాలో వేశానని చెప్పాడు. నాలాలో వేసిన ఆయుధాన్ని కూడా సీబీఐ రికవరీ చేయలేకపోయింది.
ఈ డబ్బు, ఆయుధం ఎక్కడికి పోయాయి. దీనికి సీబీఐ వద్ద సమాధానం లేదు. దస్తగిరి.. సీబీఐ పెంపుడు చిలుక(పెట్)లా మారాడు. వారు ఏం చెబితే అదే చెబుతున్నాడు. అందుకే గిఫ్ట్ కింద మిగిలిన డబ్బు రికవరీ చేయలేదేమో. సీబీఐ కేసు స్వీకరించిన తర్వాత దర్యాప్తు అధికారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన దస్తగిరి అక్కడే నెలన్నర ఉన్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఒప్పందం కుదిరింది. విచారణ అనుమానాస్పదంగా ఉండటంతో దర్యాప్తు అధికారిపై ఓ ప్రైవేట్ కేసు నమోదు కావడమే కాకుండా ఏకంగా అత్యున్నత న్యాయస్థానం అతడిని పక్కకు పెట్టింది.
నిందితుడి నుంచి ఒకసారి వాంగ్మూలం తీసుకుంటారు. కానీ, ఆగస్టు 25, 2021 నుంచి 30 వరకు దస్తగిరి నుంచి మూడుసార్లు వాంగ్మూలం తీసుకున్నారు.. అతడిని అరెస్టు కూడా చేయలేదు. అదే ఏడాది అక్టోబర్ 7న దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్‌కు అభ్యంతరం లేదని, ఇవ్వొచ్చంటూ సీబీఐ పేర్కొంది. దీంతో దస్తగిరికి అక్టోబర్ 22న ముందస్తు బెయిల్ వచ్చింది. అనంతరం దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా పేర్కొంది’ అని అవినాశ్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
సెక్షన్ 201 మిస్సింగ్..
‘పోలీసు దర్యాప్తుపై సీబీఐ ఆరోపణలు చేసింది. పాత ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలతోనే కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముందు గుండెపోటు అనుకున్నా.. తర్వాత అదే రోజు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అందులో ఐపీసీ 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం) కేసు నమోదు చేశారు. అయితే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం 201 సెక్షనే లేదు. ఏప్రిల్ చివరి నాటికి దర్యాప్తు ముగించాలని కోర్టు చెప్పినా ఆ పని చేయలేదు’ అని తెలిపారు.
ముందస్తు బెయిల్ ఇవ్వండి
‘ఇప్పటికే పలుమార్లు విచారణకు అవినాశ్ హాజరయ్యారు. ఈ నెల 16న మరోసారి రావాలంటూ సీబీఐ 15వ తేదీ సాయంత్రం నోటీసులు ఇచ్చింది. తాను 19న వస్తానని అవినాశ్ లేఖ రాశారు. ఈ క్రమంలో 19న హైదరాబాద్ బయలుదేరిన ఎంపీ.. తల్లి అనారోగ్యం విషయం తెలియడంతో మళ్లీ పులివెందుల వెళ్లారు. అక్కడి నుంచి ఆయన తల్లిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని న్యాయవాది వెల్లడించారు. కాగా, సుదీర్ఘ వాదనలు జరుగుతున్న సమయంలో సునీత జోక్యం చేసుకొని వైఎస్ అవినాశ్‌రెడ్డి న్యాయవాదికిచ్చినంత సమయం తమ న్యాయవాదులకు వాదనలు వినిపించేందుకు ఇవ్వాలని పేర్కొనడంతో హైకోర్టు మందలించింది. కోర్టు హాల్లో పరిధి దాటి వ్యవహరించవద్దని హెచ్చరించింది.
అవినాశ్‌ను ఇరికించే యత్న
‘నిందితుల్లో కొందరు అవినాశ్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ మాట్లాడుకోవడం సాధారణం. దాని ఆధారంగా అవినాశ్‌ను ఇరికించాలని చూస్తున్నారు. హత్య జరిగిన రోజు ప్రచారం కోసం జమ్మలమడుగు వెళ్తున్న అవినాశ్.. హత్య విషయం తెలిసి నేరుగా వివేకా ఇంటికే చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న చాలామంది రక్తపు వాంతులతో, గుండెపోటు వచ్చి వివేకా మృతి చెందినట్లు చెప్పడంతో అవినాశ్ కూడా అలాగే భావించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. వివేకా ఇంట్లో ఆయన లాన్‌లోనే పలువురికి ఫోన్ చేసి విషయం చెబుతూ ఉండిపోయారు.
ఇన్నాళ్లయినా సీబీఐ అవినాశ్ ప్రమేయం ఉంది అని చెప్పేందుకు ఒక్క ప్రాథమిక ఆధారాన్ని కూడా చూపలేదు. ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోని సీబీఐ హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌లు ఉన్నారని తనకు గంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి చెప్పిన వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించడం.. విచారణ ఏ లక్ష్యంగా సాగుతోందో తెలియజేస్తోంది. హంతకుడిని బయట తిరగమని చెప్పి.. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలని సీబీఐ చూస్తోంది. కోర్టులో పిటిషన్ వేస్తేగానీ వీడియో, ఆడియో రికార్డింగ్ గురించి వివరాలు చెప్పలేదు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.
సునీత తీరు అనుమానాస్పదం..
‘కేసు ట్రయల్‌ను మరో రాష్ట్రానికి మార్చమని వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ప్రతి పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతున్న సునీత.. కిరాయి హంతకుడు (దస్తగిరి) బయట తిరగడంపై మాత్రం ఎలాంటి పిటిషన్ వేయలేదు.
దస్తగిరికి బెయిల్ ఇవ్వొద్దని గానీ, ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని గానీ కోరలేదు. వివేకా హత్య తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన తండ్రి.. వైఎస్ అవినాశ్ గెలుపు కోసం చనిపోయే ముందు వరకు తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. జగనన్నను సీఎంగా చూడటమే తన లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. ఎప్పుడైతే ఆమె టీడీపీ నేతలను కలిశారో.. నాటి నుంచి సునీత తీరులో మార్పు వచ్చింది. టీడీపీ నేతలు సూచించినట్లు ఆమె వ్యవహరిస్తున్నారు’ అని అవినాశ్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment