సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖ జిల్లా) : రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు.
ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.
సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక మ.3.30 గంటల నుంచి సా.5 వరకూ ఈ బహిరంగ సభ జరుగుతుంది.
కదనరంగంలో ముందడుగు..
ఎన్నికల పరుగు పందెంలో ఎవరి అడుగు ముందుపడితే విజయం వారినే వరిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఓ వైపు పొత్తులో ఎవరు ఏ స్థానాల్లో పోటీచేయాలన్నది తేల్చుకోలేక.. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క, మరోవైపు బీజేపీని జతచేసుకునేందుకు పాకులాడుతూ టీడీపీ–జనసేన సతమతవుతున్నాయి. మరోవైపు.. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు.
ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. ఎన్నికల శంఖారావాన్ని పూరించడం ద్వారా సీఎం జగన్ కదనరంగంలో దూసుకుపోతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రతి ఇంటా విప్లవాత్మక మార్పు..
ఇక ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను గుర్తించి, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను రెండు పేజీలతో మేనిఫెస్టోగా వైఎస్ జగన్ రూపొందించి 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలుచేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలుచేశారు. గత 56 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. పారదర్శకంగా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 కోట్లు వెరసి రూ.4.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు.
ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వంవల్ల మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలబడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. ఇదే అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి.. ప్రతి ఇంటికీ చేసిన మంచిని చాటిచెప్పి.. మరింత మంచి చేసేందుకు ఆశీర్వదించాలని కోరాలని దిశానిర్దేశం చేయనున్నారు.
2022, మే 11 నుంచే గడప గడపకూ..
నిజానికి.. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట్లో వచ్చిన మార్పును గుర్తుచేసి.. మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని కోరేందుకు 2022, మే 11న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేసిన మంచి కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే, ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80 శాతం ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి..
మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు.
హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సుమారు 3 వేలకు పైగా పోలీసులు శుక్రవారం సాయంత్రానికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు.
జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు ‘సిద్ధం’
వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ తదితర ప్రతిపక్ష నేతలు చేస్తున్న దు్రష్పచారాలను తిప్పికొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంగివలస జాతీయ రహదారి వద్ద జరగనున్న సభకు సంబంధించి ఏర్పాట్లను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల దు్రష్పచారాలను తిప్పికొట్టేందుకు సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్నారు.
పక్క రాష్ట్రాల్లో ఆదరణ కోల్పోయిన నాయకులు ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలుచేశారని.. ఆ నమ్మకంతోనే మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారే వైఎస్సార్‌సీపీ క్యాంపెయినర్లన్నారు. ఈ సభకు రెండున్నర లక్షల మంది తరలిరానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment