టీడీపీ కకావికలం.. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం | Many Leaders saying goodbye to TDP in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ కకావికలం.. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం

Published Thu, Jan 11 2024 3:42 AM | Last Updated on Thu, Jan 11 2024 9:55 AM

Many Leaders saying goodbye to TDP in Andhra Pradesh - Sakshi

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి రాజకీయం అంతా నాటి నుంచి నేటి వరకు డబ్బుతోనే ముడిపడి సాగుతోంది. అభ్యర్థులను డబ్బు మూటలతో తూకం వేస్తుండటం ఆ పార్టీ సీనియర్‌ నేతలను నివ్వెర పరుస్తోంది. ఒక్కచోట కూడా గెలవని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుండటం పట్ల అత్యధిక నియోజకవర్గాల్లో నేతల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. దీనికి తోడు మాలోకం లోకేశ్‌ తీరు కలవర పెడుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడటం.. త్వరలో గుడ్‌బై చెప్పేందుకు పెద్ద సంఖ్యలో నేతలు సిద్ధపడుతుండటం బాబును ఆందోళనకు గురిచేస్తోంది. నష్ట నివారణ కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినా ఫలితం కనిపించక తండ్రీ కొడుకులు తలలు పట్టుకున్నారు.

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ఎంపికకు డబ్బు మూటలనే ప్రధాన అర్హతగా నిర్ణయించడం ఆ పార్టీలో సీనియర్‌ నేతలను కలవరపరుస్తోంది. ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న వారిని కాదని.. డబ్బు మూటలను చూపుతున్న వారినే సమన్వయకర్తలుగా నియమిస్తుండటంతో సీనియర్‌ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ఆ పార్టీని వీడారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించారు.



ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రూ.20 కోట్లు డిపాజిట్‌ చేసిన వారికే టికెట్‌ ఇస్తానంటూ చంద్రబాబు తెగేసి చెప్పడంతో మాజీ మంత్రి పీతల సుజాత ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో తనను కాదని పక్కన పెట్టి.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తుండటంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మవరం సుబ్బారెడ్డి గందరగోళంలో పడ్డారు. డబ్బు మూటలే ప్రాతిపదికగా సమన్వయకర్తలను చంద్రబాబు మార్చేస్తుండటం.. కేశినేని నాని బాటలోనే సీనియర్‌ నేతలు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుండటంతో ‘దేశం’ కకావికలమవుతోంది.

ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే పార్టీ బలహీనంగా మారడంతో తెలుగు తమ్ముళ్లలో హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దాంతో ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం కోసం జనసేనతో పొత్తుకు చంద్రబాబు పాకులాడారు. కానీ.. క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు కుంపట్లను రాజేస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్‌.. తెనాలిలో జనసేన నేత నాదేండ్ల మనోహర్, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. టీడీపీ బలహీనంగా మారడం.. టీడీపీ–జనసేన పొత్తు కుంపట్లను రాజేస్తుండటంతో 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమికి ఘోర పరాజయం తప్పదనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. 

అన్నమయ్య టీడీపీలో ఆధిపత్య పోరు 
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్క­డ నేనే ఉండాలి.. నేనే పోటీ చేయాలి.. అంటూ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తరుణంలో ఉన్నవాళ్లు కూడా జారిపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అధిష్టానం కూడా చోద్యం చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక క్యాడర్‌ అయోమయంలో ఉంది.  

అన్నిచోట్ల ఇదే తంతు 
► రాయచోటిలో ఆర్‌.రమేష్ కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో నాలుగో వర్గం ముందుకు వచ్చింది.  
► రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు, గంటా నరహరి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుం­డగా.. జనసేన కలయికతో క్యాడర్‌ అయోమయంలో పడింది. 
► రైల్వేకోడూరులో టీడీపీ నేత కస్తూరి విశ్వనాథనాయుడు, గతంలో పోటీ చేసిన అభ్యర్థి నరసింహప్రసాద్‌ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. గతంలో చిట్వేలిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.  
n మదనపల్లెలో దొమ్మలపాటి రమేష్,  శ్రీరామ్‌ చినబాబు వర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతుండగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే 
షాజహాన్‌బాషా చేరికతో మూడు వర్గాలు అయ్యాయి.  
► తంబళ్లపల్లెలో టీడీపీ నేత శంకర్‌యాదవ్‌తో పా­టు మరో ఇద్దరు చక్రం తిప్పుతుండటంతో అక్కడ కూడా అయోమయ పరిస్థితి నెలకొంది.  

విశాఖ నుంచి ‘గంటా’ జంప్‌! 
ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు
ఇప్పుడు ఏకంగా విశాఖ జిల్లా నుంచే మకాం ఎత్తివేత
విజయనగరం జిల్లా నెల్లిమర్లపై కన్ను

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక నియోజకవర్గం తరిమేస్తే.. మరో నియోజకవర్గం.. ఆ నియోజక­వర్గం నుంచి ఇంకో నియోజకవర్గం.. ఇలా ఎన్నిక­లు జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాలను మా­రు­­స్తూ.. ప్రజలను ఏమారుస్తూ వస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని విశాఖ జిల్లా నుంచే మకాం మార్చేస్తు­న్నారు. ఇప్పటికే పోటీచేసిన నియోజకవర్గాల్లో  ఎక్కడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.. ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో.. జిల్లా నుంచే జంప్‌ అవ్వాలని  నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈసారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టు సమాచారం. నెల్లిమర్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై సర్వే కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

ప్రజలు నిలదీస్తారనే భయంతో..! 
ఒకసారి పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ తిరిగి పోటీ చేయకపోవడానికి గంటా వైఖరే కారణ­మన్న విమర్శలున్నా­యి. గెలవకముందు అనే­క హామీలిచ్చి ఆ తర్వాత మిన్నకుండిపోవడం ఆయనకు అలవాటు. పోటీ చేసిన స్థానంలో మరోసారి పోటీ చేస్తే ఎక్కడ తనను ప్రజలు నిలదీస్తారోననే భయం గంటాను వెంటాడుతోంది. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనిపించకుండాపోయారు. కనీసం ఏ ఒక్కరినీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ గొంతు విప్పారు. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే ఇటువంటి నాయకులను పెట్టుకున్న తెలుగుదేశం పారీ్ట.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మీద విమర్శలు చేయడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

భీమిలిలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో.. 
టీడీపీ నుంచి 1999లో రాజకీయరంగ ప్రవే­శం చేసిన గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో అనకాపల్లికి మకాం మార్చి ఎమ్మె­ల్యేగా బరిలో నిలిచారు. 2014లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో విశాఖ ఉత్తరం నుంచి బరి­లో నిలిచి గెలిచారు. తాజాగా భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించినా.. గతంలో అక్కడి ప్రజలను పట్టించుకోకపోవడంతో పాటు ఏ రంగంలోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో భీమిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో తాను భీమిలిలో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన గంటా విజయనగరం జిల్లాపై కన్నేశారు.  

టికెట్‌ మాదంటే మాది
అనంతపురం టీడీపీలో కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక 
కళ్యాణదుర్గంలో పయ్యావుల అనుచరుడికి టికెటిస్తే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు 
ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు 
టికెట్ల కేటాయించకముందే కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు 

అనంతపురం టీడీపీలో అభ్యర్థుల్ని ప్రకటించకముందే నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి వైరి వర్గాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టికెట్‌ మాదంటే మాది అని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధినాయకత్వం చోద్యం చూస్తుండడంపై పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో టీడీపీలో రెండు మూడు గ్రూపులు తమదే టికెట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించేసుకుంటుండగా.. చివరికి ఎవరికి టికెట్‌ దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాకు కాదని టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  సార్వత్రిక ఎన్నికల వేళ ఉమ్మడి అనంతపురం టీడీపీలో టికెట్ల ఎంపిక అభ్య­ర్థుల మధ్య చిచ్చు పెడుతోంది. రేసులో ఉన్న నాయకులు గ్రూపులుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఫలానా వారికే టికెట్‌ అని కొన్ని గ్రూపులు ట్రోల్‌ చేస్తున్నాయి. కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడికి ఎమ్మె­ల్యే టికెట్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయ­న పయ్యావుల కేశవ్‌కు అనుచరుడు. దీంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం కత్తులు నూరుతోంది.

మేం 2014లో గెలిచాం.. 2019లో ఓడిన ఉమాకు టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశి్నస్తోంది. వీళ్లెవరూ కాకుండా బడా కాంట్రాక్టర్‌ అమిలి­నేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్న­ట్లు తెలిసింది. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అతనికి టికెట్‌ ఇస్తే ఉమా, ఉన్నం వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ప్రతి నియోజవర్గంలోనూ గ్రూపులు పోషించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

సూరి వర్సెస్‌ శ్రీరాం 
2019లో ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల నుంచి తప్పిం­చుకునేందుకు బీజేపీలోకి వెళ్లిన వరదాపు­రం సూరి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. దీంతో పరిటా­ల శ్రీరాం–సూరి వర్గాల మధ్య ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి.  

‘పల్లె’త్తు మాట అనను.. పోరు బాటే 
ఇన్నాళ్లూ తనకే టికెట్‌ అంటూ ధీమాగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇప్పుడు మండిపడుతున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు టికెట్‌ అంటూ ప్రచారం జరగడంతో ‘పల్లె’ వర్గం కత్తులు దూస్తోంది. ఇన్నాళ్లూ కనిపించని కిష్టప్పకు ఇప్పుడే ప్రజలు గుర్తుకొచ్చారా? అంటూ మండిపడుతున్నారు. కదిరిలో కందికుంటకు టికెట్‌ ఇస్తే ఆయనకు మద్దతు ఇచ్చేదే లేదంటూ అత్తర్‌ చాంద్‌బాషా బహిరంగంగా చెబుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోవడమెందుకని చాలామంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.  

అలకబూనిన పార్ధసారథి  
పెనుకొండలోనూ తాజాగా సవితమ్మకు టికెట్‌ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీకే పార్ధసారథి అలకబూనారు. ‘నేను ఎంపీగా వెళ్లను.. నేనూ ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’ అంటున్నారు. మడకశిరలో రెండువర్గాల మధ్య చిచ్చురేపి తిప్పేస్వామి చలికాచుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు భావిస్తున్నారు.  

తాడిపత్రిలో జేసీకి సహకరించం 
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డికి టికెట్‌ దాదాపు ఖరారైంది. జిల్లాలో ఏ ఒక్క నేత కూడా జేసీకి మద్దతు ఇవ్వడం లేదు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జేసీ సోదరుల పేరు చెప్పడానికి కూడా ఏ నాయకుడూ ముందుకు రాలే­దు. శింగనమలలో పోటీచేసి ఓడిపోయిన బండారు శ్రావణికి ‘యువగళం’ పాదయాత్ర సమ­యంలో తీవ్ర అవమానం జరిగింది. శ్రావ­ణి తండ్రిపై దాడి చేసినా లోకేశ్‌ పట్టించుకోలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. దళితులపై దాడి చేసినా టీడీపీ అధినాయకులు పట్టించుకోలేదని, మళ్లీ టికెట్‌ కోసం పాకులాడటం అవమానంగా ఆ వర్గాలు భావిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement