సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఎన్నికల శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావని.. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరన్నారు.
చేసిన మంచిని నమ్ముకునే .. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడు. మరో 75 రోజుల్లోనే ఎన్నికలు. అబద్దానికి, నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయాలనే ఆలోచన లేదని.. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో పెత్తందార్లు కాబట్టి.. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏ గ్రామం బాగుపడదని సీఎం ధ్వజమెత్తారు.
‘‘ప్రజలే .. నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి. రైతు భరోసా, ఇన్ ఫుట్ సబ్సిడీ అందాలంటే .. మీ జగన్ సీఎం కావాలని చెప్పాలన్నారు
‘‘మీరు వేసే ఓటు.. పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇస్తాయి. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే.. చేస్తాడంతే. ఈ యుద్దానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా.? వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ , 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే’’ అని సీఎం స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment