ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని: సీఎం జగన్‌ | CM YS Jagan Started Election Campaign At Visakhapatnam | Sakshi
Sakshi News home page

యుద్ధానికి సిద్ధం: సీఎం జగన్‌

Published Sun, Jan 28 2024 4:37 AM | Last Updated on Sun, Feb 11 2024 2:59 PM

CM YS Jagan Started Election Campaign At Visakhapatnam - Sakshi

సభలో శంఖం పూరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్‌ వద్ద సంగివలసలో శనివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది. ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, స్నేహితుడు, అవ్వ, తాతల్లో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు మోసపూరిత వాగ్దానాలు, ఎత్తులు, పొత్తులు, చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి మీ అందరి తోడు.. కృష్ణుడి రూపేణా అండదండలున్నాయి. అందుకే మీ బిడ్డ భయపడడు. దేనికీ తొణకడు.  

గత ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. తద్వారా చెప్పాడంటే చేస్తాడంతే.. అని నిరూపించాం. ఇది నా ఒక్కడి పార్టీ కాదు. ఇది అందరి పార్టీ. అందుకే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులు, నియామకాల్లో అగ్రభాగం కల్పించాం. రానున్న ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం. మన పిల్లలకు ఇంగ్లిష్‌ విద్య అందాలన్నా.. వారికి ట్యాబ్‌లు రావాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్‌బీ ప్యానల్స్‌తో విద్యను అందించాలన్నా.. పోటీ ప్రపంచంతో మన విద్యార్థులు ధైర్యంగా ఢీకొట్టాలన్నా.. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు­జామునే పింఛను చేతికి అందాలన్నా.. ఆర్‌బీకేల ద్వారా రైతుల అవసరాలు తీరాలన్నా.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్‌ విధానం కొనసాగాలన్నా.. మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతీ ఒక్కరు గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్‌ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్‌ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్‌ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు.

సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడు­తుందని తెలిపారు.  సచివాలయం, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్‌సీపీ మార్క్, జగన్‌ మార్క్‌ కనిపి­స్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్‌ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

పథకాలే ఎన్నికల బాణాలు, అస్త్రాలు 
► 2024 ఎన్నిల్లో మన పార్టీ జైత్ర యాత్రకు.. మరో పాతికేళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు.. ఈ భీమిలిలో సన్నాహక సమావేశం జరుగుతోంది. మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇక్కడ సమావేశమయ్యాం. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాటా అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధితో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ఈ పార్టీలో మీతో నా ఆలోచనలను పంచుకోడానికే ఈ సమావేశం. 

► పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో 56 నెలల కాలంలో అమలు చేస్తున్న పథకాలే మనకు రానున్న ఎన్నికలకు బాణాలు, అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌. గెలుపే మన లక్ష్యం. దేవుడి దయతో ప్రతి ఇంటికి, ప్రాంతానికి, ఊరికి చేసిన మేలుతో చంద్రబాబుతో సహా వారంతా ఓడాల్సిందే. 

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు 
► గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేశాయి. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకే ప్రజలకు మనం దగ్గరయ్యాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు. చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు. 
► ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. చంద్రబాబు తాను మంచి పని చేశానని, ఒక స్కీమ్‌ పెట్టామని చెప్పలేక.. కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నాడంటే ప్రజల్లో వారు లేరని అర్థం. చివరికి 2019లో వచ్చినన్ని 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని అర్థం. 

మన చరిత్ర ఇంటింటి విజయగాథ 
► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్తు.. సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు.  మనది వయస్సుతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మన పాలనలో అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రెండింటిలో సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ అని గర్వంగా చెబుతున్నా. నేను మోసాన్ని నమ్ముకోలేదు. ఇంటింటికి చేసిన సంక్షేమం, అభివృద్ధిని న­మ్ముకొని ప్రజల దగ్గరకు మళ్లీ వెళుతున్నాను. 

► పేదరికం, అసమానత సంకెళ్లను బద్దలు కొట్టి.. ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ.. 21 శతాబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత గల ప్రభుత్వం మనది. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 70 రోజుల్లో ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యతలు పెడుతున్నాం. అబద్ధానికి నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు. మన ప్రభుత్వం 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో సంతోషం చూసి సంబర పడుతున్నాం. 

నా గుండెల నిండా మీరే..
► పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్‌ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం. కేబినెట్‌లో ఏకంగా 68 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్‌ ఒక బీసీ, కౌన్సిల్‌ చైర్మన్‌గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఒక మైనార్టీ కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి వారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఆలయ కమిటీ చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఇది మనందరి ప్రభుత్వం. 

► ఈ 56 నెలల్లో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం మరో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. ఇందులో ఏకంగా 80 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకొనే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా.

► అక్కచెల్లెమ్మలపై ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ ఒక బటన్‌ నొక్కి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వేశాడు. ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వుతో సెల్యూట్‌ కొడుతున్నారు. పేద, సామాజిక వర్గాల మీద ప్రేమ చూపించడంలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడ?

► పేద వర్గాలు కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు సీఎం నోటి నుంచి అటువంటి మాటలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్‌.. అంటే గ్రామాల్లో వారిని పట్టించుకుంటారా? చంద్రబాబుకు పేద, సామాజిక వర్గాలపై, వారి అభ్యున్నతిపై ప్రేమ ఎక్కడుంది? ఎక్కడ చూసినా, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది వైఎస్సార్‌సీపీ, జగన్‌ మార్క్‌ మాత్రమే. 

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు..
► రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్లండి. మీ ఇష్టం. ఎక్కడకు వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. జగన్‌ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. 540 పౌర సేవలు. అందులో దాదాపు 10 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా అవినీతి, లంచాలు, వివక్ష ఉండదు. 

► ఇంటింటికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్‌ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా మన గడపకే తెచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వచ్చింది. అదే గ్రామంలో ఒక విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. 

► నాడు–నేడుతో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చాయి. ఇంగ్లీష్‌ మీడియంతో మొదలు ట్యాబ్‌లు, ఐఎఫ్‌బీ, బైలింగ్వల్‌ టెక్స్ట్‌ బుక్‌లు ఇలా అన్నీ మన ప్రభుత్వంలోనే అమలయ్యాయి. అదే గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్‌. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్‌లో దిశ యాప్‌.. వారికి ఎటువంటి అపాయం సంభవించినా కేవలం బటన్‌ నొక్కిన వెంటనే లేదా మొబైల్‌ అయిదు­సార్లు ఊపితే 10 నిమిషాల్లో పోలీస్‌ సోదరుడు వచ్చి చెల్లమ్మను ఏమైందని అడిగే వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. బ్రాడ్‌ బ్యాండ్, డిజిటల్‌ లైబ్రరీలు కట్టిందీ ఇప్పుడే.  

► ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ రాలేదు. ఎందుకంటే వీరు పెత్తందారులు కాబట్టి. పల్లె ప్రజలంటే బాబు దృష్టిలో పని మనుషులు. పెత్తందారుల పొలాల్లో, ఇళ్లలో పని చేసే పని మనుషులు. పొట్ట పోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని చంద్రబాబు నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్తు మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు. 

ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ, జగన్‌ మార్క్‌
► రైతు సంక్షేమాన్ని చూస్తే మనమక్కెడ.. చంద్రబాబు ఎక్కడ? అని ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచింది చంద్రబాబు. రైతులు 87,612 కోట్లు బ్యాంకులకు కట్టొద్దని పిలుపిచ్చాడు. మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి రైతులను మోసం చేశాడు.

► ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆర్బీకే అంటే జగన్‌. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. పగటి పూట ఉచిత్‌ విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అందుతున్నాయన్నా, ఆక్వా రైతులకు కరెంట్‌ సబ్సిడీ అందుతోందంటే గుర్తుకొచ్చేది జగన్‌. 

► ఏ పొలంలోకి వెళ్లినా చంద్రబాబు చెప్పుకోడానికి ఏముంది? చంద్రబాబు మార్క్‌ ఎక్కడుంది? ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ, జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది. ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. 108, 104 చూసినా, 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ విస్తరించినా.. ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్, ఇంటింటినీ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, వైద్య రంగంలో 53 వేల కొత్త నియామకాలు.. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు.. ఇలా ఏది తీసుకున్నా ఒక వైఎస్సార్‌సీపీ, జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది.  

► ఏ ప్రభుత్వ బడిని తీసుకున్నా.. మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా.. నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, తెలుగు, ఇంగ్లిష్‌ భాషలు ఉన్న పాఠ్యపుస్తకాలు, బైజూస్‌ కంటెంట్, మన ప్రభుత్వ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లలో ఐఎఫ్‌పీలు, గోరుముద్ద, బడి తెరిచే సరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు అవ్వకూడదని ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, విదేశాల్లోని టాప్‌ యూనివర్శిటీల్లో ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ద్వారా డిగ్రీల అనుసంధానం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జాబ్‌ ఓరియంటెడ్‌ కరిక్యులం ద్వారా ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలో చేర్చడం, ఇలా విద్యా రంగంలో ఏది తీసుకున్నా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఈ పెత్తందారులను ఓడిద్దాం
► వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్‌ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోడానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీకి ఒక సైన్యంలా పని చేయాలి.    

► ప్రతిపక్షాలు పది వైపుల నుంచి చేసే దాడులను వారి ఎల్లో మీడియాను, వారి సోషల్‌ మీడియాను, అందులో చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌పోన్‌లు ఉన్నాయి. అవే మీకు అస్త్రాలు. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి పేద వాడు కూడా సోషల్‌ మీడియాను శాసించవచ్చు. బూత్‌ కమిటీల సభ్యులు, గృహ సారథులు, వలంటీర్లు, సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలకమైన పాత్ర పోషించాలి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు. 25కి 25 ఎంపీలు మన లక్ష్యం. 

► ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగింది. అందులో 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే అన్ని సీట్లు మనవే.  మంచి చేసిన, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన, చేస్తున్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరందరూ తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతున్నా. (సిద్ధం.. అని జనం నుంచి కేకలు) జనంలో లేని, పేదవారి గుండెల్లో లేని వారు, దిగజారుడు పార్టీలన్నింటికీ మీ జగనన్నే టార్గెట్‌. పేదవాడి భవిష్యత్తు, వైఎస్సార్‌సీపీయే లక్ష్యంగా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను, ఓడించేందుకు మీరు సిద్ధమా.. (సిద్ధమేనని నినాదాలు) వారందరిపై ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికీ భయపడడు. సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ మేం యుద్ధానికి సిద్ధమని వైఎస్సార్‌సీపీ ఇక్కడి నుంచి పిలుపునిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement