సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్‌కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు.
నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది.
పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్‌సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఒకవైపు సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత..
సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైంది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు.
కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది.
విశ్వసనీయతకు పట్టం..
టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు.
► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించింది.
► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్‌సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు.
► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.
► తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment