ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాస్ లీడరే కాదు.. ఆయన ప్రసంగం కూడా మాసే. పురాణాలను, ఆ పురాణాల్లోని ఇతివృత్తాలను, పాత్రలను గుర్తు చేస్తూ.. ఆ పాత్రలను నేటి రాజకీయాలతో పోల్చుతూ ఆయన చేసే ప్రసంగాలను అభిమానులనే కాదు.. ప్రతీ ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. "ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే శ్రీకృష్ణ పరమాత్ములు..నేను అర్జునుడిని" అన్న డైలాగ్.. వీపరీతంగా జనంలోకి వెళ్లింది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలు కౌరవ సేనను చీల్చిచెండాడినట్లు.. జగన్ మాటలు ఎల్లో మందను చీల్చి చెండాడుతున్నాయి.
ప్రజలను శ్రీకృష్ణుడి స్థానంలో కూర్చోపెడుతున్న తీరు.. ఓ స్పష్టమైన సంకేతాన్నిస్తోంది. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆయుధం పట్టకుండా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించినట్లు.. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే తనను గెలిపించాలని చెబుతున్నారు. "జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని బయటకు తీయండి" అన్నారు. మహాభారతంలో పాండవులు వనవాసం, అజ్ఞాత వాసానికి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్తారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాక తిరిగి జమ్మ చెట్టు దగ్గరకు వచ్చి ఆయుధాలు తీసుకుంటారు. ప్రజల ఓట్లను ఆయుధాలతో పోల్చడమంటే.. కౌరవ సేన లాంటి ఎల్లో మందను ఓటు అనే ఆయుధంతో చీల్చి చెండాడాలని పిలుపునిస్తున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం.. ఉత్తర కోస్తా సిద్ధం..రాయలసీమ సిద్ధం..ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధమని సభకు వచ్చిన లక్షలాది జనంలో ఉత్తేజం నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సభ ముగిసిన తర్వాత కూడా ప్రజలు, మీడియానే కాదు తెలుగుదేశం, ఎల్లో మీడియా కూడా సీఎం జగన్ ప్రసంగం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు.
"బిందువు బిందువు కలిసి సింధువైనట్లు" అనగానే జనం స్పందించిన తీరు.. సమర నినాదాన్ని గుర్తు చేసింది. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాడీ లాంగ్వేజీలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చిన తరువాత ఈ సభ జరిగింది. సహజంగానే ఈ సభ ఎలా ఉంటుంది..? సీఎం జగన్ స్పీచ్ ఎలా ఉంటుంది..? అని వైఎస్ఆర్ సీపీ నేతలే కాదు కూటమిలోని నేతలు కూడా ఎదురు చూశారు. 2014లో కూడా ఇలానే ముగ్గురు కలిసి వచ్చారని.. తరువాత ప్రజలను మోసం చేసి ఎవరిదారిన వారు వెళ్లారని సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేశారు. 2014 టీడీపీ మేనిఫెస్టో సిద్ధం వేదిక నుంచి చూపిస్తూ.. ఇలా రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి వస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న తనకు ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో.. ప్రతి ఇంట స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. ఈ మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమా..? అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి జగన్ అన్నప్పుడు.. సిద్ధం.. సిద్ధం..సిద్ధమంటూ లక్షలాది గొంతుకలు ఒక్కసారిగా నినదించాయి. చంద్రబాబుది తుప్పుపట్టిన సైకిల్ అని.. ఆ సైకిల్‌కు టైర్లు, ట్యూబ్‌లు కూడా లేవని.. ఆ తుప్పు పట్టిన సైకిల్‌ను తోయడానికి పొత్తులతో వస్తున్నాడని జగన్ అన్నప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లి పోయింది. కిల్ సైకిల్.. కిల్ సైకిల్ అని యవత అరవడం వినిపించింది. గంటా 21 నిమిషాలు పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా 15 లక్షల మంది, టీవీల్లో అంతే స్థాయిలో, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాదాపు కోటి మంది చూసి ఉంటారని గూగుల్ లెక్కలు చెబుతున్నాయి.
పొత్తుల తరువాత జరిగిన సభ కావడంతో జాతీయ ఛానల్స్ కూడా విస్తృత ప్రచారాన్ని ఈ సిద్ధం సభకు ఇచ్చాయి. దురదృష్టమేమంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్‌కు లక్షలాది జనం గ్రాఫిక్స్‌లా కనిపించడం... ఓ రకంగా ఇది ప్రజలను అనుమానించడం, అవమానించడమే. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించడమంటే ఇదేనేమో. ఐటీడీపీ గ్రాఫిక్స్‌ను ఫ్రంట్ పేజీలో వేసుకునే స్థాయికి దిగజారడం శోచనీయం.
-వైవీ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment