సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లో పూర్తిగా సీల్డ్ కవర్‌లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది.
పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు.
పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు..
‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్‌పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు.
మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్‌రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్‌పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్‌పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు.
విచారణ పేరుతో వేధిస్తున్నారు..
‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్‌ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్‌కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్‌కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్‌ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్‌ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డితోపాటు భాస్కర్‌రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు.
వీడియో రికార్డింగ్‌తోనే విచారణ
వీడియో, ఆడియో రికార్డింగ్‌పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్‌లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు.
వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్‌రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు.
ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు.
వివేకా లేఖను తొక్కిపెట్టారు..
‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్‌పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment