Investigation In YS Viveka's Murder Case Is According To The Yellow Script - Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత.. సీబీఐ చిలుక ‘కొత్త పలుకు’

Published Sat, May 27 2023 5:00 AM | Last Updated on Sat, May 27 2023 1:57 PM

Investigation in Vivekas murder case is according to the yellow script - Sakshi

సాక్షి, అమరావతి:  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. లోపల ఉన్నదంతా పచ్చ కుట్రేనని వెల్లడైంది. టీడీపీ పాడుతున్న పాత పాటనే సీబీఐ న్యాయస్థానంలో తన అఫిడవిట్‌లో శుక్రవారం వినిపించింది. సీబీఐలో కొందరు అధికారులు పదవీ విరమణ, స్థాన చలనానికి ముందు టీడీపీ ముఖ్య నేతల ప్రలోభాలకు గురై వారు చెప్పినట్టుగా అఫిడవిట్‌ పేరుతో కుట్రకు తెరతీసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి అందరికంటే ముందు గుర్తించారన్నది నాలుగేళ్లుగా ముక్తకంఠంతో చెబుతున్న మాట.

అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ కూడా అదే విషయం చెప్పింది. కానీ టీడీపీ ఆరు నెలలుగా కుట్రపూరితంగా ఓ వాదనను తెరపైకి తెచ్చింది. వివేకా మృతి చెందిన విషయం ఆయన పీఏ కంటే ముందే ఎంపీ అవినాశ్‌ రెడ్డి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పారని దు్రష్పచారం చేస్తోంది. సరిగ్గా అదే అసంబద్ధ ఆరోపణను సీబీఐ శుక్రవారం తన అఫిడవిట్‌లో పేర్కొనడం విస్మయ పరుస్తోంది. పైగా ఏమాత్రం సాంకేతికంగా చెల్లుబాటుగాని ఐపీడీఆర్‌ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ డీటైల్‌ రికార్డ్‌) నివేదిక అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు యత్నించింది. ఐపీడీఆర్‌ నివేదిక అంటూ సీబీఐ చెప్పడమే ఆ అఫిడవిట్‌ పూర్తిగా కట్టు కథ అని... అభూతకల్పనలు, నిరాధార అభియోగాలేనని నిపుణులే స్పష్టం చేస్తున్నారు.  

2019 మార్చి 14 రాత్రే కాదు... అంతకు 20 రోజుల ముందు 20 రోజుల తర్వాత కూడా ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ ఐపీడీఆర్‌ డేటా అదేరీతిలో చూపిస్తోంది. అర్ధరాత్రి వేళల్లో కూడా ఆయన ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్‌ డేటా పనిచేస్తునే ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్‌ మాట్లాడేవారి ఐపీడీఆర్‌ డేటా అలానే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోన్‌కు సంబంధించి బైట్స్‌ అప్‌లోడ్, డౌన్‌లోడ్‌లకు ఆ సమయం తీసుకుంటూ ఉంటుంది. మరి సీబీఐ ఆ ముందు 20 రోజులు, తర్వాత 20 రోజులు ఐపీడీఆర్‌ డేటాను ఎందుకు ప్రస్తావించ లేదు? ఎందుకంటే అది చాలా సాధారణమైన విషయం కాబట్టి ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది.
 
సునీత, నర్రెడ్డి, బీటెక్‌ రవిల ఐపీడీఆర్‌ డేటా కూడా అంతే.. 
ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ ఐపీడీఆర్‌ డేటానే కాదు.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, టీడీపీ నేత బీటెక్‌ రవి, ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ల ఐపీడీఆర్‌ డేటా కూడా అలానే చూపించింది. 2019 మార్చి 14న రాత్రి కూడా వారి ఫోన్లు పని చేస్తున్నట్టుగానే ఐపీడీఆర్‌ వెల్లడిస్తోంది. అంటే వివేకా హత్యకు వారు కుట్ర పన్నినట్టు భావించ వచ్చు కదా. అందులోనూ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

బీటెక్‌ రవితో రాజకీయ విభేదాలు, ఎర్ర గంగిరెడ్డితో భూవివాదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. వారంతా సన్నిహితులు కూడా. మరి సీబీఐ అధికారులు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, బీటెక్‌ రవి, ఎర్ర గంగిరెడ్డిల ఫోన్ల ఐపీడీఆర్‌ డేటా గురించి ఎందుకు ప్రస్తావించ లేదు? ఆ డేటా ఆధారంగా వారే వివేకా హత్య చేయించి ఉంటారని ఎందుకు భావించడం లేదు? అంటే సీబీఐ అధికారులు ఏవో అదృశ్య శక్తుల ప్రభావానికి లోనై కేసు విచారణ కంటే ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగానే ఎంపీ అవినాశ్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది.   

ఫోన్‌ చేశారా.. మెసేజ్‌ చేశారా  అన్నది కూడా నిర్ధారించలేం.. 
ఫోన్‌లో వాడిన మొబైల్‌ డేటాను బట్టి ఒక ఫోన్‌ నుంచి మరొకరికి ఫోన్‌ చేశారా? మెసేజ్‌ చేశారా అన్నది కూడా నిర్ధారించడం సాధ్యం కాదు. మొబైల్‌ డేటా ఆధారంగా ఫోన్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌ డేటాను విభజించి, విశ్లేషిం చే పరిజ్ఞానం 2020 వరకు లేనే లేదు. ఇప్పటికీ సాధికారికంగా లేదు. మరి సీబీఐ ఫోన్‌ మొబైల్‌ డేటాను బట్టి ఎంపీ అవినాశ్‌ రెడ్డి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేసినట్టు ఎలా నిర్ధారణకు వచ్చింది? 

సీబీఐ ఫోన్‌ నంబర్లు ఎందుకు చెప్పలేకపోయింది? 
2019 మార్చి 15 తెల్లవారు జామున ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఏ మొబైల్‌ నంబర్‌ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఏ మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేశారో సీబీఐ ఎందుకు వెల్లడించ లేకపోయింది? ఫోన్‌ చేసి ఉంటే ఆ రెండు నంబర్లు చెప్పాలి కదా? ఆ నంబర్లు చెబితే వాటి కాల్‌ రికార్డ్‌ డేటా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అందులో పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. దీన్నిబట్టి ఆ రోజు  తెల్లవారుజామున ఎంపీ అవినాశ్‌.. వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేయలేదన్న వాస్త­వం వెల్లడవుతుంది. అందుకే సీబీఐ ఆ ఫోన్‌ నంబర్లను తన అఫిడవిట్‌లో ప్రస్తావించలేకపోయింది.   

ఆధారాలు ధ్వంసం చేయాలంటే అర్ధరాత్రే చేసేవారు కదా.. 
వైఎస్‌ వివేకా హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను ఉదయ్‌కుమార్‌ రెడ్డి ద్వారా ఎంపీ అవినాశ్‌ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 7.30 గంటల సమయంలో ధ్వంసం చేయించారంటూ సీబీఐ మరో నిరాధార అభియోగాలు మోపింది. వివేకా హత్య తర్వాత తెల్లవారు జామున 4గంటలకు ఉదయ్‌కుమార్‌ రెడ్డి.. ఎంపీ అవినాశ్‌రెడ్డిని కలిశారని సీబీఐ పేర్కొంది.

ఐపీడీఆర్‌ డేటా ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించామని చెప్పింది. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ రెండు అంశాలను పరిశీలిస్తే సీబీఐ అభియోగాలు పూర్తి అవాస్తవం అన్నది తేటతెల్లమవుతోంది. సీబీఐ చెప్పేదే నిజమైతే అప్పుడే ఆధారాలు ధ్వంసం చేయమని అవినాశ్‌ చెప్పేవారు కదా.. అసలు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆరోజు తెల్లవారుజామున అవినాశ్‌ని కలవనే లేదు.   

తీవ్రంగా పరిగణిస్తున్న వైఎస్సార్‌సీపీ  
టీడీపీ కుట్రలో భాగస్వాములై కొందరు సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా స్పందించింది. ఏమాత్రం హేతుబద్ధంగాని ఐపీడీఆర్‌ నివేదిక పేరిట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మేందుకు బరితెగించిన అధికారులపై.. సాంకేతికంగా ఐపీడీఆర్‌ హేతుబద్ధత, టెలికాం మార్గదర్శకాలు వెల్లడిస్తున్న అంశాల ఆధారంగా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.  

ఐపీడీఆర్‌ ఎలా పనిచేస్తుందో తెలియదా? 
వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయంటూ సీబీఐ చేసిన అభియోగాలు పూర్తి అహేతుకం. ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయంటూ ఐపీడీఆర్‌ డేటా పేరిట సీబీఐ ఏకంగా న్యాయస్థానాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. అసలు ఐపీడీఆర్‌ ఎలా  పని చేస్తుందనే కనీస సాంకేతిక అవగాహన కూడా సీబీఐకి లేదా అనే సందేహం కలుగుతోంది. ఐపీడీఆర్‌ ఫోన్‌ బైట్స్‌ను నిరంతరం అప్‌లోడ్, డౌన్‌లోడ్‌ చేస్తూనే ఉంటుంది. ఫోన్‌ ఆన్‌లో ఉన్నంతసేపు మనం ఫోన్‌ మాట్లాడుతున్నా లేకపోయినా సరే అది బైట్స్‌ను అప్‌లోడ్, డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటుంది.

అంటే మనం మొబైల్‌ యాప్‌లు వాడకపోయినాసరే అవి నిరంతరం పని చేస్తునే ఉంటాయి. సర్వర్‌ ఆ డాటాను తీసుకుంటూనే ఉంటుంది. సాధారణంగా రాత్రి వేళల్లో సర్వర్‌ డాటాను తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఫోన్లు వాడరు కాబట్టి, ఆ ఫోన్లకు సంబంధించిన బ్యాకప్‌ తీసుకుంటూ ఉంటుంది. రోజూ ఎక్కువ సేపు ఫోన్లు మాట్లాడేవారు, వాట్సాప్, ఫేస్‌బుక్‌ ఎక్కువుగా వాడేవారి ఫోన్‌ డాటాను అర్ధరాత్రి వేళల్లో మరింత ఎక్కువసేపు ఐపీడీఆర్‌ అప్‌లోడ్, డౌన్లోడ్‌ చేస్తూ ఉంటుంది.

అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి డాటా బర్న్‌ అవుతునే ఉంటుంది. ఆ సమయంలో ఐపీడీఆర్‌ నివేదిక తీసుకుంటే ఫోన్‌లో మొబైల్‌ డాటా బర్న్‌ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. అంత మాత్రాన ఫోన్‌ మాట్లాడినట్టు కాదు. కాబట్టి ఐపీడీఆర్‌ డాటాను బట్టి ఒక ఫోన్‌ను ఓ నిర్ణీత సమయంలో ఉపయోగించినట్టుగాని, ఆ సమయంలో వారు ఫోన్‌ మాట్లాడారని చెప్పడంగానీ సాధ్యం కాదు. ఇది టెలీకమ్యూనికేషన్ల ప్రొటోకాల్‌ వెల్లడిస్తున్న వాస్తవం.

అటువంటిది ఎంపీ అవినాశ్‌ రెడ్డి 2019 మార్చి 14 రాత్రి వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడారని ఐపీడీఆర్‌ డేటా ఆధారంగా సీబీఐ చెప్పడం విడ్డూరం. 2019 మార్చి 15 తెల్లవారుజామునే వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారని ఐపీడీఆర్‌ నివేదిక ద్వారా తెలుసుకున్నామని చెప్పడం అహేతుకం. ఇది అసంబద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐపీడీఆర్‌ డేటాను బట్టి ఒకరు ఆ సమయంలో ఫోన్‌ మాట్లాడారని చెప్పడం సాధ్యం కాదని, కేవలం సీబీఐ దురుద్దేశ పూరితంగానే ఈ విషయంలో వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించిందన్నది స్పష్టమవుతోంది. 

కమిట్మెంట్‌కు కట్టుబడి కట్టు కథ!  
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభావితం చేసేందుకు టీడీపీ మొదటి నుంచీ పన్నాగం పన్నుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే బీజేపీలోని టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే పచ్చ మీడియా అందులో ప్రధాన పాత్రధారులుగా మారారన్నది సుస్పష్టం. రిటైర్‌ అవ్వబోతున్న కొందరు సీబీఐ అధికారులను ప్రలోభాలకు గురి చేశారన్నది సర్వత్రా బహిరంగ రహస్యంగా మారింది. ఆ ప్రకారం ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయించాలన్నది ఒప్పందం. అందుకోసం టీడీపీ భారీగా నిధులు వెదజల్లినట్టు సమాచారం.

అందుకే సీబీఐ ఇటీవల హఠాత్తుగా దూకుడు పెంచింది. ఎంపీ అవినాశ్‌ రెడ్డి దర్యాప్తునకు ఎంతగా సహకరిస్తున్నాసరే ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి ఆయన ఏడుసార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయినా సరే ఆయన విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ అధికారులు అసంబద్ధ అభియోగాలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యతి్నస్తున్నారు. గత మూడు రోజుల్లో ఎలాగైనా సరే ఎంపీ అవినాశ్‌ను అరెస్టు చేయాలని కొందరు సీబీఐ ఉన్నతాధికారులు ప్రయతి్నంచారు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అనుకూల పచ్చ మీడియా చానళ్లు రోజుల తరబడి టీవీలలో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నాయి.

కానీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయలేమని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. కానీ టీడీపీతో కుదుర్చుకున్న కమిట్మెంట్‌కు న్యాయం చేసేందుకు ఆయన కొత్తకుట్రకు తెరతీశారు. ‘మీరు ఉండగా ఎంపీ అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయలేకపోతే... కమిట్మెంట్‌కు లోబడి మరొకటి చేయండి’ అని టీడీపీ పెద్దల నుంచి ఆయనకు సందేశం అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివేకా మృతి గురించి ఎంపీ అవినాశ్‌ రెడ్డికి.. ఆయన ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిసి ఉంటుందని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఒప్పందంలో భాగంగా రాజధానిలో పేదలకు ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, టీడీపీ మహానాడులో ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు ఓ అంశాన్ని అందించేందుకే సీబీఐ అధికారి ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్టు స్పష్టమవుతోంది. దీనిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పరిగణిస్తూ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది.   

అది హత్య అని డాక్టరైన సునీతకు తొలుత తెలీదా? 
స్వయంగా డాక్టర్‌ అయిన సునీత వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించడం విస్మయ పరుస్తోంది. ఆమె తరఫు న్యాయవాదులు వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను న్యాయస్థానానికి చూపిస్తూ వాటిని చూస్తే ఎవరికైనా అది హత్య అని తెలుస్తుంది కదా.. అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆయన టైపిస్ట్‌ ఇనయతుల్లా ఫొటోలు తీశారు.

ఆ ఫొటోలను పీఏ కృష్ణారెడ్డి.. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలకు పంపారు. ఆ ఫొటోలు చూసిన తర్వాత కూడా వారు అది హత్య అని చెప్పనే లేదు. పైగా తాము వచ్చే వరకు వివేకా రాసిన లేఖ, ఆయన సెల్‌ఫోన్‌ దాచిపెట్టమని చెప్పారు. మరి డాక్టర్‌ అయిన సునీత తన తండ్రి మృతదేహం ఫొటోలను చూసి అది హత్యేనని వెంటనే ఎందుకు చెప్పలేదు? సునీత తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి శుక్రవారం చూపిన ఫొటోలు మృతదేహం పోస్టుమార్టం టేబుల్‌పై ఉన్నప్పటి ఫొటోలు.

ఆ ఫొటోలను టీడీపీ బాగా రిజల్యూషన్‌ పెంచి ఒక బుక్‌లెట్‌లో ప్రచురించింది. ఈ ఫొటోలు చూపుతూ.. ఎవరికైనా అది హత్య అని తెలీదా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అవినాశ్‌ రెడ్డి వెళ్లేసరికి వివేకా మృతదేహం బాత్రూమ్‌లో కమోడ్‌ వద్ద గోడకు చేరబడి ఉంది. ఆ కోణంలో గాయాలు ఏవీ కనిపించనే లేదు. ఆయన వెంటనే బయటకు వచ్చేశారు. వివేకా మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఫోన్లు చేశారు.

అవినాశ్‌ ఫోన్‌ చేసింది 2019 మార్చి 15 ఉదయం 6.30కే..  
వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పేందుకు ఎంపీ అవినాశ్‌ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.30 గంటలకే తొలిసారిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహాయకుడి నంబరుకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ కాల్‌ రికార్డులు ఉన్నాయి కూడా. ఆ రోజు ఉదయం 6.10 గంటలకి పీఏ కృష్ణారెడ్డి తొలిసారిగా వివేకానందరెడ్డి మరణించారన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే ఆయన భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డిలకు ఫోన్‌ చేసి సమాచారం తెలిపారు.

అనంతరం నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డి ఉదయం 6.20 గంటల సమయంలో ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి మృతి చెందారనే విషయాన్ని చెప్పారు. వెంటనే వివేకా నివాసానికి వెళ్లిన అవినాశ్‌ రెడ్డి ఆయన మృతదేహాన్ని చూసి వెంటనే బయటకు వచ్చారు. ఆ తర్వాత 6.30 గంటల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహాయకుడి ఫోన్‌కు కాల్‌ చేసి వివేకా మృతి చెందిన విషయాన్ని తెలిపారు.

అంటే వివేకా మృతి చెందారనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాతే ఎంపీ అవినాశ్‌ రెడ్డికి.. ఆ తర్వాతే ఎంపీ ద్వారా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసింది. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి, అవినాశ్‌ రెడ్డి కాల్‌ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాస్తవం ఇలా ఉంటే.. వివేకా మృతి చెందిన విషయం పీఏ కృష్ణారెడ్డి కంటే ముందే వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలకు తెలుసంటూ సీబీఐ అభూతకల్పనలు సృష్టించి దు్రష్పచారానికి పాల్పడటం వెనుక టీడీపీ ప్రలోభాలు, కుట్ర ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement