సాక్షి ప్రతినిధి, కడప/రైల్వేకోడూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి దర్జాగా సెటిల్‌మెంట్లకు తెగబడుతున్నాడు. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్‌మెన్లను సమకూర్చుకుని పోలీస్ స్టేషన్ వద్దే దర్జాగా బహిరంగంగా బెదిరింపులకు దిగడం నివ్వెరపరుస్తోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్‌వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు. పోలీస్‌స్టేషన్ పక్కనే గన్‌మెన్లతో హల్‌చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
30 ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నా..
రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్‌కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్‌స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే ఆ మూడు షాపులు ఖాదర్‌వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి రంగప్రవేశం చేశాడు.
డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలంటూ వీరంగం వేశాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి కార్యాలయంలో ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురు గన్‌మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు.
అనంతరం పెద్ద మనుషుల సూచన మేరకు జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు. రైల్వేకోడూరుకు చెందిన ఖాదర్‌వలీ ఆ షాపులు తనవేనని ఏనాడూ ముందుకొచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది.
మందు, ముక్క.. విలాస జీవితం
వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి విలాస జీవితం గడుపుతూ తరచూ దందాలు, దౌర్జన్యకాండకు దిగుతున్నాడు. కష్టపడితేనే పూట గడిచే స్థితి నుంచి ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అతడిప్పుడు చుక్క, ముక్క లేకుండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఖరీదైన స్కాచ్ ఎప్పుడూ వెంట ఉండాల్సిందే. ప్రైవేట్ పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయి. సెటిల్‌మెంట్లపై దృష్టి పెట్టాడు. ప్రాణరక్షణ పేరిట ఐదుగురు గన్‌మెన్లను సమకూర్చుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు.
పోలీస్ స్టేషన్లలోనే దాడులు..
అప్రూవర్‌గా మారిన దస్తగిరి పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఏకంగా పోలీసు స్టేషన్లలోనే దౌర్జన్యాలు, దాడికి తెగబడుతున్నాడు. వైఎస్సార్ జిల్లా తొండూరులో మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై పోలీసు స్టేషన్‌లోనే దస్తగిరి దాడి చేశాడు. ఈ మేరకు క్రైమ్ నంబర్ 41/2022 కింద 2022 మే 29న కేసు నమోదైంది. అదే మండలంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల చౌర్యం కేసు కూడా 2022 ఆగస్టు 2న దస్తగిరిపై నమోదైంది.
♦ శ్రీకాళహస్తిలో దర్గా స్థలంపై 20 ఏళ్లుగా ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న వివాదంలో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఖాదర్‌బాషా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై క్రైమ్ నెంబర్ 121/2022 కేసు నమోదైంది.
♦ వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల కేంద్రంగా ఫైనాన్స్ వాహనాల సీజ్, వ్యక్తుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూరుస్తూ దస్తగిరి సెటిల్‌మెంట్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఏ దస్తగిరి అంటావేందీ..?
బెయిల్‌పై ఉన్న నిందితుడు దస్తగిరి షరతులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. ‘‘హలో... నేను దస్తగిరిని మాట్లాడుతున్నా! ఏ దస్తగిరి అంటావేందీ..? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన దస్తగిరిని’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బెయిల్ షరతులేవీ తనకు వర్తించవన్న రీతిలో యథేచ్ఛగా దౌర్జన్యాలకు దిగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment