
పాపాయపల్లె పుల్లరి భూముల్లో అనుమతులు లేకుండా జరుగుతున్న పనులు
పుల్లరి భూమిని చదును చేసినా చర్యలు శూన్యం
అడ్డుకున్న రైతులపై దొంగతనం కేసులు మోపి రిమాండ్‌కు తరలింపు
జమ్మలమడుగులో అధికార పార్టీ నేతల అండతో సోలార్ కంపెనీ దౌర్జన్యాలు
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ‘ఆది’ మార్క్ రాజ్యాంగం నడుస్తోంది! స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అండతో ఓ సోలార్ కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించి చదును చేస్తున్నా, పేదల డీకేటీ భూముల్లో పాగా వేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కొండపాపాయపల్లి 224 సర్వే నంబర్‌లో 501.34 ఎకరాల పుల్లరి భూమి (పశువుల మేత)ని అక్రమంగా చదును చేసినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన డీకేటీ పట్టా భూముల్లో సోలార్ ప్లాంటు పనులు చేపట్టి అడ్డుపడిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
యథేచ్ఛగా పుల్లరి భూముల్లో పనులు
224 సర్వే నంబర్‌లో ఉన్న 501 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నా సీల్ (ఎస్‌ఏఈఎల్) కంపెనీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు చేస్తోంది. అధికార పార్టీ నాయకుల అండతో సోలార్ కంపెనీ ప్రతినిధులు రెచి్చపోతున్నారు. దీనిపై తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొండ కల్వటాల గ్రామంలో 2023లో ప్రభుత్వం డీకేటీ భూములను మంజూరు చేసింది. అందులో సోలార్ ప్యానెళ్ల నిర్మాణం కోసం యంత్రాలతో గుంతలు తవ్వి స్తంభాలు పాతుతున్నారు.
గ్రామానికి చెందిన అక్కంరెడ్డి మధుసూదనరెడ్డి దీనిపై ప్రశి్నంచడంతో కంపెనీ ప్రతినిధులు బెదిరించి రూ.పది వేలు అపహరించినట్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుబ్బారావు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టకుండా మధుసూదన్‌రెడ్డిపై 308 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్‌లు మోపారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచి్చనా సోలార్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అక్రమ కేసు..
సోలార్ కంపెనీ ప్రతినిధులు మాకు సమాచారం ఇవ్వకుండా, పరిహారం గురించి మాట్లాడకుండా పొలాల్లో ప్యానెల్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. పట్టా భూముల్లో పనులను అక్కంరెడ్డి మధుసూదన్‌రెడ్డి అడ్డుకోవడంతో సోలార్ కంపెనీ ప్రతినిధులు దొంగతనం ఆరోపణలు మోపారు. పోలీసులు విచారణ చేపట్టకుండానే అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. – సుజాత, డి.కల్వటాల, పెద్దముడియం మండలం
‘ఆది’ రెడ్‌బుక్ రాజ్యాంగం..
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అధికారం ఉందని విచ్చలవిడిగా భూములను ఆక్రమించి సోలార్ కంపెనీతో పనులు చేయిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా పాపాయపల్లిలో 500 ఎకరాల భూమిని చదును చేశారు. దిగువ కల్వటాల గ్రామంలో పంట పొలాల్లో సోలార్ ప్యానెల్స్ పాతుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలిస్తున్నారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు, రైతులతో సఖ్యతగా వ్యవహరించకుంటే కంపెనీ సాగదన్న విషయాన్ని గ్రహించాలి. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, జమ్మలమడుగు