
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.
అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.
కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.
