
వైఎస్సార్,సాక్షి : అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.
సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్ సిమెంట్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్‌లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు.
మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..
చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్‌లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.
అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.
చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఇవి అరాచకాలు
👉గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.
👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్‌లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.
👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్‌లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది.