ysr district
-
YSR జిల్లా సీకే దిన్నె పీఎస్ లో వర్రా రవీంద్రారెడ్డి
-
పక్కా ప్లానేనా?.. అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది...91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్ చేశారు...ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్లా..?. సోషల్ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్ అంటూ ఏబీఎన్ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు...కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది...ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. -
'నా భర్తకు ఏదైనా జరిగితే అనితదే బాధ్యత: కల్యాణి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీకే దిన్నె పోలీసు స్టేషన్‌కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పరామర్శించారు.అక్రమంగా తమను నిర్బంధించారని రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఆరోపించారు. తన భర్త ఆచూకీ తెలుపమంటే పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారన్న కల్యాణి.. తన ఆరోగ్యం బాగా లేక పడిపోతే కనీసం డాక్టర్‌ను కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే హోం మంత్రి అనితదే బాధ్యత అని కల్యాణి అన్నారు.వైఎస్సార్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(బుధవారం) ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన పోలీసులు.. వారిని తొలుత వేముల పోలీస్ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు తెలిపారు. చివరికి స్టేషన్‌కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వారిని వదిలేశారు. -
ఏపీలో రాత్రిళ్లు అక్రమ అరెస్ట్.. సర్పంచ్, రవీంద్రారెడ్డి ఎక్కడ?
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. కూటమి పాలనలో కక్షసాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంలో వర్రా రవీంద్రారెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈరోజు తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించడంతో ఆయన కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు.వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే నెపంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పోలీసు వాహనంలో అతడి వేరే చోటకు తరలించారు. అయితే, నిన్న రాత్రి రవీంద్రారెడ్డిని ఎక్కడ ఉంచారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక, రవీంద్రారెడ్డిని పోలీసులు తీసుకెళ్లిన వెంటనే గుర్తు తెలియని ఓ ముఠా రంగంలోకి దిగింది. రవీంద్రారెడ్డి గురించి ప్రశ్నిస్తున్న వారిపై సదరు ముఠా దాడులు చేస్తోంది.పోలీసులు అక్రమంగా రవీంద్రారెడ్డి తీసుకెళ్లడంతో అతడికి జామీను ఇచ్చేందుకు వేముల మండలం పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి పోలీసులు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద గుర్తు తెలియని ముఠా.. మహేశ్వర్ రెడ్డిపై దాడి చేసింది. ఆయనపై చేయి చేసుకున్నారు. రాత్రి నుంచి మహేశ్వర్ రెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. అయితే, వారు పోలీసులా? లేక ప్రైవేటు వ్యక్తులా? అనేది అర్థం కాకుండా ఉంది.ఇక, మంగళవారం రాత్రి నుంచి రవీంద్రారెడ్డిని ఏ పోలీసు స్టేషన్‌కు తరలించారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయి. కాగా, సోషల్ మీడియా పోస్టుల్లో 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయాలని నిబంధన ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరోవైపు.. బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించారు. దీంతో, రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. రవీంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైఎస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.బాబు కుటిల రాజకీయాలు.. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైఎస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కథనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు.చంద్రబాబుకు వార్నింగ్..ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్న అసత్య కథనాలపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.. వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని ఆయనకు సూచించారు. అందుకే వ్యక్తిగత, కుటుంబ వివాదాల విషయాలను రాజకీయాల్లోకి లాగకుండా సంయమనం పాటించాలని హితవు చెప్పారు. వైఎస్ కుటుంబ ఆస్తులకు సంబంధించి వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ.. తన బిడ్డలిద్దరూ పరిష్కరించుకుంటారని, కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవద్దని విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో తాము కూడా పార్టీ ఆదేశాలతో మౌనంగా ఉన్నామని రాచమల్లు వివరించారు. షర్మిలకు మీ రక్షణ అవసరమా?షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్‌కళ్యాణ్ హామీ ఇవ్వడంపై రాచమల్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? అన్న ఆయన, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా? అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. అత్యంత కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని ఆరోపించారు. పిఠాపురంలో 16 ఏళ్ల యువతికి మత్తుమందిచి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే ఎందుకు కాపాడలేదని ప్రశ్నించిన రాచమల్లు, తిరుపతి సమీపంలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?:వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్‌లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రాష్ట్రావతరణ వేడుకలకు బాబు మంగళం -
పులివెందులలో రెండో రోజు.. బిజీబిజీగా వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఉల్లి రైతులు.. అన్నదాతల ఆవేదన
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. పులివెందులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉల్లి రైతులు.. వైఎస్ జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఉల్లి రైతులు.. వైఎస జగన్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారి కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.రైతులు మాట్లాడుతూ..‘ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదన్నారు. తినడానికి తిండి కూడా లేక మార్కెట్ నుంచి వెనక్కి వచ్చేశామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, మద్దతు ధర లేదా అని వైఎస్ జగన్ వాకబు చేశారు. ఇంతవరకూ రైతుకు ఒక్క మేలు కూడా చేయలేదని చెప్పిన రైతులు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని వైఎస్ జగన్ వారి హామీ ఇచ్చారు. -
పులివెందులలో వైఎస్ జగన్.. కష్టాలు వింటూ.. నేనున్నానంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర వైఎస్ జగన్ సెల్ఫీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. మెడికల్ కాలేజీకి వచ్చిన సీట్లను కూటమి సర్కార్ వెనక్కి పంపగా, కాలేజీని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన సెల్ఫీ తీసుకున్నారు.రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కలలను చిదిమేసే విధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెనుశాపంగా మారింది. పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడమేమిటి?. పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి? తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి’’ అంటూ సీఎం చంద్రబాబును గతంలో వైఎస్ జగన్ హెచ్చరించారు కూడా.కాగా, వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. -
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు.వైఎస్ జగన్ రేపు వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
వాళ్ళను చూసి సంస్కారం నేర్చుకో: షర్మిలకు కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్‌గా ఉన్నారా అని నిలదీశారు.అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్‌గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.జగన్ చేసిన MOUలో క్లియర్‌గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు.. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు. -
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు. ‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్‌కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి వెళ్లారు.నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్‌ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్‌ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో భూములపైనే ఎటాచ్మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.2019లో సరస్వతి ఇండస్ట్రీస్‌లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్లో ఆ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్‌ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్‌తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్మోహన్రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్‌ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా, బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘బద్వేలు ఘటన శనివారం జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది.ఇదీ చదవండి: లోకేష్‌ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్లో టాపర్‌గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్‌కు జగన్ చేరుకుంటారు. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. -
తలకాయలు తీస్తాం..!
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘అధికారం మాదే. మా ఇష్టమొచ్చినట్లు మైనింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు బిగిస్తే ఊరుకోం.. చెప్పినట్లు వినకుంటే తలకాయలు తీస్తాం. ప్రభుత్వం మాదే, మాకేమీ కాదు’.. అంటూ ఓ గ్యాంగ్ సోమవారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో హల్చల్ చేసింది. అక్రమ మైనింగ్ నుంచి స్వీయ రక్షణ కోసం సంస్థ సూపర్వైజర్లు సీసీ కెమెరాలు బిగిస్తుంటే వారొచ్చి రెచి్చపోయారు. ‘చరిత్ర తెలుసుకుని మసలుకోండి. మీరేమన్నా పెద్ద మొనగాళ్లా’.. అంటూ మండల తెలుగు తమ్ముళ్లు పేర్ల శేషారెడ్డి, రామిరెడ్డి, ధనుంజయ, శివ అండ్ గ్యాంగ్ చెలరేగిపోయారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో టిఫెన్ బెరైటీస్ కంపెనీ లీజుకింద మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ పార్టీ నేతలు ఆ కంపెనీ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.దీంతో.. లీజు ప్రాంతంలో నిరంతరం కాపాలా ఉండేలా టిఫెన్ బెరైటీస్ కంపెనీ ఐదుగురు సూపర్వైజర్లను నియమించుకుంది. అక్రమ కార్యకలాపాల నుంచి స్వీయ రక్షణ కోసం సోమవారం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి సోదరుడు శేషారెడ్డి రెండు వాహనాల్లో తన అనుచరులతో వెళ్లి నానాయాగీ చేశారు. సీసీ కెమెరాలు బిగించవద్దని హెచ్చరించారు. మా ప్రాంగణంలో బిగించుకుంటున్నామని సూపర్వైజర్లు వివరిస్తుండగా.. ‘తలకాయలు తీసుకెళ్తాం, మాకేమి కాదు, ప్రభుత్వం మాదే, అటు వెళ్తాం, ఇటు వస్తాం’.. అంటూ కత్తులతో బెదిరించారు.‘మాకు కేసులు కొత్త కాదు. జైలు జీవితం గడిపే వచ్చాం. మా ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే, మేం మైనింగ్ చేసుకుంటాం. మీరెవరు అడ్డుచెప్పడానికి’.. అంటూ తెలుగు తమ్ముళ్లు రెచి్చపోయారు. చివరికి.. సీసీ కెమెరాలు అమర్చనీయకుండా అడ్డుకుని వెనక్కి పంపేశారు. పైగా.. ఇక్కడ కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో.. యాజమాన్య ప్రతినిధుల సూచనల మేరకు సూపర్వైజర్లు వేముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పనులు అడ్డుకున్నారు.. టిఫెన్ బెరైటీస్ కంపెనీ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు వెళ్లాం. అక్కడికి శేషా రెడ్డితో పాటు మరి కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేశారు. సీసీ కెమెరాల పనులను అడ్డుకున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచెయ్యొద్దని హెచ్చరిస్తూ మమ్మల్ని వెనక్కి పంపేశారు. – రామాంజనేయరెడ్డి (కంపెనీ సూపర్వైజర్), వేల్పుల దాడి చేసేందుకు యత్నం.. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు మా కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించేందుకు వెళ్లాం. కత్తులతో వచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేయబోయారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తే సహించేదిలేదు.. ఇకపై మీరిక్కడ కనిపించకూడదు.. కనిపిస్తే తీవ్ర పరిణమాలుంటాయని హెచ్చరించారు. – నాగేంద్రారెడ్డి (కంపెనీ సూపర్వైజర్), చింతలజూటూరు -
జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోండి.. సీఎంకు అవినాష్ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. చత్తీస్‌గఢ్‌లో ల్యాండ్ మైన్ పేలడంతో చనిపోయిన జవాన్ రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో సీఎంను అవినాష్ రెడ్డి కోరారు.ఇటీవల చత్తీస్‌గఢ్ అంబుజ్‌మడ్‌లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. సోమవారం రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబ సభ్యులు సాయం కోసం విన్నవించుకున్నారు. దీంతో, వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.ఈ లేఖలో రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, కుటుంబ పోషణ కోసం రాజేష్ భార్య స్వాతికి మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, వీర మరణం పొందిన రాజేష్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి
బద్వేలు అర్బన్/కడప కార్పొరేషన్/కడప రూరల్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు దస్తగిరమ్మ మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఒక్కగానొక్క కుమార్తె ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. అడ్డుతొలగించుకోవాలనే హత్య: ఎస్పీఇక దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు కేసు పూర్వాపరాలు వివరించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సిఫారసు చేస్తామని తెలిపారు.నా బిడ్డను తగలబెట్టిన వాణ్ణి నాకు అప్పగించండి..‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కారణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నానని.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. సీఎం చంద్రబాబుతోపాటు పోలీసులంతా నాకు న్యాయం చేయాలన్నారు. రేపు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకుంటారా?.. అమ్మాయిలను ఏడిపించే వారు బతకకూడదని ఆమె మండిపడ్డారు. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ దారుణ హత్య
వేముల : వైఎస్సార్ జిల్లా వి.కొత్తపల్లెలో వీఆర్ఏ యలంకూరి నరసింహులు(49)ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృతుడి భార్య సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. గ్రామంలో నరసింహులు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తూ ముగ్గురాయి మైనింగ్‌లో కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నరసింహులు భార్య సుబ్బలక్ష్మితో అదే గ్రామానికి చెందిన బాబు సన్నిహితంగా ఉండేవాడు.ఈ విషయంపై నరసింహులు, బాబు తరచూ గొడవపడేవారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్డులో చెరో మంచంలో నరసింహులు, భార్య సుబ్బలక్ష్మి పడుకున్నారు. నరసింహులుపై కక్ష పెంచుకున్న బాబు.. ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం రాత్రి జెలిటిన్ స్టిక్స్‌కు వైరు అమర్చి నరసింహులు ఇంటి ముందు ఉన్న పాడుబడ్డ ఇంట్లోంచి పేల్చి వేశాడు. పేలుడు ధాటికి నరసింహులు పైకి ఎగిరి రేకులకు తగిలి కిందపడ్డాడు.పేలుడుకు సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. సుబ్బలక్ష్మిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఆర్కే వ్యాలీ సీఐ నాగరాజు, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్‌లతో కలిసి ఆదివారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుడి కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు. ఇదే సమయంలో వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.అయితే, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులోని వంకలో ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇసుకను బయటి ప్రాంతాలకు తరలిస్తుండటంతో వైఎస్సార్సీపీకి చెందిన భూమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి మరికొందరు అడ్డుకున్నారు. పొలాల అవసరాలకు ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్లొచ్చు కానీ.. టిప్పర్లతో బయటకు తరలించడం ఏమిటని నిలదీశారు. తామే అధికారంలో ఉన్నాం కాబట్టి తమ ఇష్టం వచి్చనట్టి చేసుకుంటామని టీడీపీకి చెందిన నారప్పరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నారప్పరెడ్డి రమే‹Ùరెడ్డి ఘర్షణకు దిగారు.అనంతరం టీడీపీ నేతలు దాడికి తెగబడటంతో వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి వెంకటరమణరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయతి్నంచగా.. టీడీపీకి చెందిన వెంకటసుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండువర్గాల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీకి చెందిన బి.వెంకటరమణారెడ్డి, మరికొందరితోపాటు టీడీపీకి చెందిన ఎన్.వెంకటరమణ సుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డి, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు ఎర్రగుంట్ల సీఐ నరే‹Ùబాబు తెలిపారు. యంత్రాంగం ప్రేక్షక పాత్ర పెద్దనపాడు వంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని కలెక్టర్, ఎస్పీ పదేపదే చెబుతున్నా ఎర్రగుంట్ల మండలంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. నిత్యం గ్రామంలో రెవెన్యూ అ«ధికారులు తిరుగుతుంటారు. గ్రామస్తులు అడ్డుకునే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.