సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.
‘‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.
‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది.
..91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్ చేశారు.
..ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్‌లా..?. సోషల్ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్ అంటూ ఏబీఎన్ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు.
..కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది.
..ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment