పులివెందుల రూరల్: వైఎస్పార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఇసుక టెండర్లలో బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించిన విషయం సద్దుమణగక ముందే శుక్రవారం రాంగోపాల్ రెడ్డి వర్గీయుడు ప్రకాష్‌ను చితకబాది కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.
నియోజకవర్గంలో చౌక దుకాణాలకు డీలర్లను నియమించేందుకు శుక్రవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయుడైన వేంపల్లెకు చెందిన ప్రకాష్ స్థానికంగా దుకాణం కోసం ఈ పరీక్ష రాయడానికి వచ్చాడు. అంతలో వేంపల్లెలోని అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, బీటెక్ రవి అనుచరుడు రామమునిరెడ్డి, మరికొంత మంది అక్కడికి చేరుకుని.. ప్రకాష్‌ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
చితక బాది కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాంగోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి అనుచరులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్‌ను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అక్కడికి వచ్చిన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి బీటెక్ రవి అనుచరులు ప్రకాష్‌ను వదిలేశారు. అనంతరం ఉమాదేవి మాట్లాడుతూ.. ఒకే పార్టీలో ఉంటూ బీటెక్ రవి వర్గీయులు ఇలా చేయడం తగదని మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్న వారిని ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రకాష్‌తో కలిసి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment