వైఎస్ వివేకాను చంపిందెవరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడే ఇప్పుడు అమాయకంగా... హత్య చేసిందెవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇది వారం రోజుల్లో తేల్చాల్సిన కేసు అని చెబుతున్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత... హత్య జరిగాక రెండు నెలలపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడిని ప్రశ్నించనే లేదు. అంతే కాదు.. హత్య చేశానని, తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మరికొందరితో కలిసి వివేకాను తనే గొడ్డలితో నరికానని అంగీకరించిన దస్తగిరి ఇప్పుడు జైలు నుంచి విడుదలై దర్జాగా బయట తిరుగుతున్నాడు. సునీతకు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆత్మీయుడిగా మారాడు. చంద్రబాబు అనుకూల మీడియాకు వీఐపీ నాయకుడైపోయాడు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని సునీత బావగారు శివప్రకాశ్రెడ్డితో సహా పలువురికి ఫోన్లు చేసి చెప్పిన నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. తర్వాత ఓడిపోవటంతో బీజేపీలోకి ఫిరాయించారు. వీళ్లలో హత్య చేసిన వాళ్లు... చేయించిన వాళ్లు... దాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్న వారు... అంతా ఉన్నారు. అందరూ కలిసి లోతైన కుట్రతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై, ఆయన కుటుంబంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ కుట్రను మరింత లోతుకు తీసుకెళుతున్నారు.
కుట్రలో భాగంగానే...
చంద్రబాబు అనుకూల తోక పత్రికకు అధిపతిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మూడు రోజుల కిందట నర్రెడ్డి సునీతతో సహా చంద్రబాబును కలిశారు. కడప ఎంపీగా సునీతను పోటీకి దింపటంపై అక్కడ చర్చ జరిగింది. చివరకు సునీతను పోటీ చేయించని పక్షంలో ఆమె చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రచారమంటే... నియోజకవర్గంలో తిరగటం మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో మీడియా సమావేశాలు కూడా. అందులో భాగమే ఢిల్లీలో సునీత ప్రెస్ కాన్ఫరెన్స్. దానికి కొనసాగింపే శనివారం ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోవటం. ఇదంతా ఒక స్కెచ్. సూత్రధారి చంద్రబాబు. పాత్రధారులు సునీత నుంచి దస్తగిరి, బీటెక్ రవి వరకూ ఎందరో!!.
వివేకా హత్యతో లాభమెవరికి?
జాతీయ, అంతర్జాతీయ నేర పరిశోధన ప్రమాణాలు చెప్పేదొకటే.. ఒక నేరం వల్ల ఎవరికి లాభం ఉంటుందో వారే దోషులు, కుట్రదారులు. అలా చూసినప్పుడు వివేకా హత్యతో లాభమెవరికి? ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నది ఎవరు? ఈ కోణంలో పరిశీలించినప్పుడు వచ్చే సమాధానాలు రెండే. వివేకా సంపాదించిన ఆస్తులు తమకే దక్కాలని, ఆయన రాజకీయ వారసత్వమూ తమకే ఉండాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి పంతం పట్టారు.
కాకపోతే షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆమెతో వివేకాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ రెండో వివాహంతో వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివాహాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు, చిన్న బావమరిది అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ పులివెందులలో నివాసం ఉండకుండా హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్ద ఉంటున్నారు.
సునీత నర్రెడ్డి ?
ఆస్తి మొత్తం మాకే దక్కాలి....
వివేకా రెండో వివాహాన్ని ఆయన కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి యావదాస్తీ తమకే చెందాలని ఆమె పంతం పట్టారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇస్తానన్నారు. ఓ ఇల్లు ఇచ్చేశారు. హైదరాబాద్‌లోనూ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన కుమారుడిని అక్కడే ఉంచి బాగా చదివిస్తానని షమీమ్‌కు మాట ఇచ్చారు. దాన్ని వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకున్న చెక్ పవర్‌ను రద్దు చేశారు. షమీమ్‌తో సునీత గొడవ పడ్డారు. పరస్పరం దారుణంగా దూషించుకుంటూ వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా దర్యాప్తు సంస్థలు వెలికి తీశాయి. సౌభాగ్యమ్మ, సునీత మొండి పట్టుదల చూశాక వివేకా కాస్త జాగ్రత్తపడ్డారు.
తన ఆస్తిలో షమీమ్‌కు వాటా కల్పిస్తూ వీలునామా రాస్తానన్నారు. అందుకోసం స్టాంపు పేపర్లు కూడా తెప్పించుకున్నారు. అదిగో... అలా స్టాంపు పేపర్లు తెచ్చిన రోజుల వ్యవధిలోనే వివేకా హఠాత్తుగా హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య చేశాక దస్తగిరి సహా హంతకులు ఆ ఇంటిలో ఉన్న బీరువాలో ఏవో స్టాంపు పేపర్లు, రౌండ్ సీల్ కోసం వెతికారని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య తన వాంగ్మూలంలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. పైపెచ్చు వివేకా హత్య జరిగిన కొన్ని నెలలకే కుటుంబానికి చెందిన భూములు, ఇతర ఆస్తులన్నింటినీ సునీత తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి హత్య వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తోంది కదా!. మరి హత్య చేయించిందెవరో కనుక్కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి?
మాటమార్చి... చంద్రబాబు గూటిలోకి
తన తండ్రి వివేకా హత్య వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారని సునీత 2019 మార్చిలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకూ కృషి చేశారని కూడా చెప్పారు. 2019 మార్చి 21న హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మరీ ఇవన్నీ చెప్పిన సునీత... 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసి తన తండ్రి కోరిక నెరవేర్చాలని ప్రజలను కోరారు. కానీ 2020లో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఆమె పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావ శివప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లి టీడీపీ రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు.
చంద్రబాబు?
రాజకీయ లబ్ధికి ఇదే అదను..
2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజానికి కడప జిల్లాలోను, పులివెందులలోను టీడీపీకి ప్రధాన అడ్డంకి వైఎస్ వివేకా. ఆయన అడ్డు తొలగింది. వైఎస్సార్సీపీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని దీనిలో ఇరికించి దుష్ప్రచారం సాగిస్తే... కడప జిల్లాలో తాము పాగా వేయొచ్చనేది బాబు దురాలోచన.
అందుకే... మార్చి 15న వివేకా హత్య విషయం బయటకు వచ్చిన తరవాత బాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తన సొంత మనిషి అయిన అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రంగంలోకి దింపారు. ఆయన అందరినీ ప్రభావితం చేస్తూ దర్యాప్తును ఆదిలోనే తప్పుదోవ పట్టించారు. నిజానికి ఈ హత్య విషయంలో సునీత లక్ష్యం ఒక్కటే. హత్య వెనుకనున్న తన భర్త, బావగార్ల పేర్లు బయటకు రాకుండా ఉండటం. బాబు లక్ష్యమేమో తన ప్రత్యర్థులను ఇరికించటం.
అందుకే ఈ విజాతి ధ్రువాలు రెండూ ఆకర్షించుకుని... ఒకరి లక్ష్యానికి మరొకరు సాయంగా నిలిచారని... రానురాను కుట్రను మరింత లోతుల్లోకి తీసుకెళుతున్నారని ఈ వ్యవహారాన్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు చెప్పే మాట. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలపై సందేహాలు రేకెత్తించేలా పచ్చ మీడియా ద్వారా అభూతకల్పనలతో దుష్ప్రచారం చేయటం... హత్య వెనుక ఉన్న కుట్రదారుల పాత్ర బయటకురాకుండా కేసును సంక్లిష్టంగా మార్చటం... ఇవన్నీ ఇందులో భాగంగానే జరిగిపోయాయి.
చంద్రబాబు గ్యాంగ్‌కు కృతజ్ఞతలతో.. మీ సునీత
బహుశా... నాలుగేళ్లుగా తాము సాగిస్తున్న కుట్రను మరింత పదునెక్కించాలనుకున్నారో, ఇకపై ముందుకు వెళ్లాలంటే ముసుగు తీయక తప్పదని భావించారో గానీ... సునీత ముసుగు తీశారు. రెండ్రోజుల కిందట ఢిల్లీలో బాబు స్క్రిప్టును చదువుతూ... ఆఖరికి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా కృతజ్ఞతలు చెప్పారంటే టీడీపీ ఏ స్థాయిలో సునీతకు సహకరించిందో... ఈ కుట్ర ఎంత లోతైనదో తెలియకమానదు.
వైఎస్సార్సీపీ టికెట్టుపై గెలిచి... ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని దూషిస్తూ సమాజంలో వర్గవిభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిన ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అత్యంత పరుషపదంతో దూషించిన టీడీపీ నేత పట్టాభి... సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ అత్యంత వివాదాస్పదుడిగా మారిన టీడీపీ నేత, పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్.. తమ పార్టీ విధానాలతో నిమిత్తం లేకుండా చంద్రబాబు కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నారాయణ... బీజేపీలో ఉంటూ బాబు ఎజెండాను అమలు చేస్తున్న సీఎం రమేశ్... బాబు లాయరు సిద్ధార్థ లూథ్రా... నిరపరాధులను హింసించి, వేధించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్... సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా... వీళ్లందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు.
అంటే తాను ఆ పచ్చ ముఠాలో సభ్యురాలినేనని విస్పష్టంగా ప్రకటించారు. విశేషమేంటంటే వీళ్లందరిలో ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అది... తమ వృత్తులు, పార్టీలకు అతీతంగా చంద్ర బాబు కోసం పనిచేయటం. వైఎస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించటం. అది చాలదూ... సునీత పాత్రను బయటపెట్టడానికి!!.
ఇంకా వివేకా ఎవరెవరికి అడ్డంకిగా ఉన్నారు? ఆయన హత్యతో ఏ పాత్ర«ధారికి ఎలాంటి లాభం? ఇవన్నీ ఒకసారి చూద్దాం...
ఆదినారాయణ రెడ్డి?
గుండెపోటు అని మొదట చెప్పింది ఈయనే...
వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియా సాక్షిగా బయటకు చెప్పింది నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తనకు ఫోన్ చేసి గుండెపోటుతో వివేకా మరణించారని చెప్పారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనక అలా జరిగి ఉండొచ్చని తాను కూడా అన్నానని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. శివప్రకాశ్ రెడ్డి ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పటంతో... ఆయన తన వాహనాన్ని నిలిపేసి, వెనక్కు తిరిగి వివేకా ఇంటికి వచ్చారు. మరి గుండెపోటు అని ప్రచారం చేయాల్సిందిగా శివప్రకాశ్‌రెడ్డికి చెప్పిందెవరు?
ఆదినారాయణ రెడ్డికి ఆయనే అడ్డంకి...
2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి... టీడీపీకి అమ్ముడుపోయారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. కానీ ఎంపీగా గెలవటానికి వివేకానందరెడ్డి ప్రధాన అడ్డంకిగా నిలిచారు. జిల్లాపై పూర్తి పట్టున్న వివేకా రంగంలో ఉంటే తాను ఎంపీగా గెలవడం అసాధ్యమని ఆది నారాయణ రెడ్డి గుర్తించారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు గురయ్యారు.
వివేకా హత్య ఆదినారాయణరెడ్డికి రాజకీయంగా ప్రయోజనం కలిగించేదే కదా?
నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ?
లేఖను దాచి... గుండెపోటని ప్రచారం చేసి
వివేకా హత్య కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావ నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిది కీలకపాత్ర. ఎందుకంటే హత్యకు గురైనప్పుడు వివేకా తన స్వదస్తూరితో రక్తంతో ఓ లేఖను రాశారు. ఆ లేఖను చూసిన ఎవరికైనా... అది మామూలు మరణం కాదని, ముమ్మాటికీ హత్యేనని తెలిసిపోతుంది. అలాంటి లేఖను ఆ రోజు (2019, మార్చి 15) ఉదయం 6.10 గంటలలోపే వివేకా పీఏ కృష్ణారెడ్డి చూశారు.
ఆ విషయాన్ని వెంటనే సునీత భర్త రాజశేఖరరెడ్డికి ఫోన్లో చెప్పారు. ‘మేం వచ్చే వరకు ఆ లేఖను గానీ, వివేకా సెల్‌ఫోన్‌ను గానీ ఎవరికీ ఇవ్వవద్దు. పోలీసులకు కూడా చెప్పొద్దు’ అని వారు పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆ లేఖను గనక వెంటనే పోలీసులకు ఇవ్వమని వారు చెప్పి ఉంటే... మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. వివేకాది హత్య అని తేలిపోయేది. ఎవరూ మృతదేహం వద్దకు వెళ్లేవారు కాదు. పోలీసులు తమ పని తాము చేసేవారు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటంతో... వ్యవహారం మొత్తం వారు ప్లాన్ చేసినట్టే సాగింది.
బీటెక్ రవి... ?
వివేకా ఉంటే ఇక అంతే..
పులివెందుల నియోజకవర్గంలో కనీసస్థాయిలోనైనా పట్టు సాధించాలన్నది టీడీపీ నేత బీటెక్ రవి లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2019 ఎన్నికల్లో యథేచ్చగా అక్రమాలు సాగించవచ్చనేది ఆయన పన్నాగం. కానీ వివేకా వైఎస్సార్సీపీకి పెద్దదిక్కుగా నిలబడటంతో బీటెక్ రవి ఆటలు సాగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను దొంగదెబ్బ తీసిన బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని వివేకా పంతం పట్టారు.
ఈ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురయ్యారు. హత్యకు ముందు రోజు కొమ్మారెడ్డి పరమేశ్వర రెడ్డి(ఈయనకు వివేకాతో ఆర్థిక విభేదాలు తలెత్తాయి)తో బీటెక్ రవి రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందారు కూడా. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినా పరమేశ్వరరెడ్డి తిరస్కరించడం సందేహాలకు తావిచ్చేదే.
రామ్‌సింగ్?
చంద్రబాబు చేతిలో పావు...
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఎంతటి సిద్ధహస్తుడో వివేకా కేసులో సీబీఐ తీరే నిరూపిస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నిశితమైన దర్యాప్తు జరిగి దోషులు బయటపడాలని మొదటి నుంచీ భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... కేసును సీబీఐ దర్యాప్తు కోసం అప్పగించాలని సునీత కోరగానే సరేనన్నారు. సీబీఐకి అప్పగించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే ముందస్తు కుట్రతో బీజేపీలోకి పంపిన తన మనుషులు సీఎం రమేశ్, సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పటం మొదలెట్టారు.
సీబీఐ దర్యాప్తు అధికారిగా నియమితుడైన రామ్‌సింగ్ వివాదాస్పద వ్యవహార శైలే అందుకు తార్కాణం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన ఆయన ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని కేసును పక్కదారి పట్టించారు. దస్తగిరిని ఢిల్లీకి తీసుకువెళ్లి బెదిరించి... ప్రలోభాలకు గురిచేసి అప్రూవర్‌గా మార్చారు. తాము అనుకున్నది అతని అప్రూవర్ వాంగ్మూలంగా నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డిని, మరికొందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. తాను చెప్పిందే చెప్పాలని వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
వైఎస్సార్ జిల్లాలో పలువురిని అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేయడంతో వారి కుటుంబాలు బెంబేలెత్తిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామ్‌సింగ్ స్వయంగా అసత్య ఆరోపణలు చేశారు. కడపలో తాను కార్లో వెళ్తుంటే ఆగంతకులు వచ్చి హత్య చేస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఆయన కారుపై ఎలాంటి దాడి జరగలేదని... ఎవరూ బెదిరించలేదని నిర్ధారణ అయ్యింది. అనేక ఫిర్యాదులు రావటంతో ఇంతటి వివాదాస్పదుడైన రామ్సింగ్ను న్యాయస్థానం ఆదేశాలతో కేంద్ర హోమ్ శాఖ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించింది.
నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి?
రాజకీయ వారసత్వం మాకే దక్కాలి..
వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వంపై ఆయన అల్లుడు, చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి కన్నేశారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వంగా తమకే పదవులు దక్కాలని భావించారు. కానీ వివేకానందరెడ్డి తన రెండో భార్య షమీమ్‌తో తనకు కలిగిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించారు. దాంతో రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కంగుతిన్నారు. షమీమ్ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా హెచ్చరించారు.
ఆమె కుమారుడిని కిడ్నాప్ చేస్తామని కూడా బెదిరించారు. వారిద్దరికి భయపడి ఆమె పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఓ అజ్ఞాత ప్రదేశంలో ఉండేవారు. అంటే వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం తమకే దక్కాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారన్నది సుస్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే
వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు హత్యకు గురయ్యారు.
దస్తగిరి?
హత్య చేసి... హైడ్రామా
తండ్రిని చంపినవారిపై ఎవరికైనా కోపం, కక్ష ఉంటాయి. కానీ వివేకానందరెడ్డిని ఎంత పాశవికంగా హత్య చేసిందీ వెల్లడించిన దస్తగిరితో వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండటం విస్మయం కలిగించేదే. వివేకాను హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఉన్నారన్నది నిర్ధారణ అయ్యింది. కానీ అదే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై నిరాధారణ ఆరోపణలు చేయిస్తున్నారంటే... వెనుక ఎవరున్నారన్నది కీలకం.
చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి...ఇలా అందరూ దస్తగిరికి బహిరంగంగానే సహకరిస్తున్నారు. వివేకా హత్యకు ముందు రూ.500 కు కూడా అప్పులు చేసిన దస్తగిరి ప్రస్తుతం ఓ కాన్వాయ్‌తో కూడిన బొలేరో వాహనాలను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇక దస్తగిరి చేస్తున్న దుష్ప్రచారాన్ని పదే పదే టీడీపీ అనుకూల మీడియా ప్రసారం చేస్తోంది. ఆయన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తోంది. అంటే దస్తగిరి ఇష్టానుసారంగా చెబుతున్న కట్టుకథలు, చేస్తున్న అసత్య ఆరోపణల వెనుక చంద్రబాబు ముఠా, సునీత కుటుంబమే ఉందన్నది స్పష్టమవుతోంది కదా!.
సెల్ఫోన్లో డేటా డిలీట్ చేశారెందుకు?
ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డికి వివేకా రాసిన లేఖను, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందజేశారు. వారు ఆ సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేశారు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ‘‘ఆ రోజు ఉదయం పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి గాయాలతో వివేకా బాత్రూమ్లో పడి ఉన్నారని చెప్పారు.
మా నాన్నకు గతంలో కూడా గుండె సమస్య ఉన్నందున బాత్రూమ్లో పడి తలకు బలమైన గాయం అయి ఉండొచ్చని భావించా. అందుకే పోలీసులకు అలాగే ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డితో చెప్పా’’ అని సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు. లేఖను చూశాకైనా... వివేకా మృతదేహాన్ని చూశాకైనా ఒక డాక్టరైన సునీతకు ఎలాంటి అనుమానమూ రాలేదంటే ఏమనుకోవాలి? ఉద్దేశపూర్వకంగా నిజాలు దాటిపెట్టారని భావించనవసరం లేదా?
తండ్రిని ఓడించినా... సునీతకు ఇష్టులే
వివేకానందరెడ్డిని 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు దొంగదెబ్బ తీసి ఓడించారు. 2017లో వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకాను పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపిక చేశారు. జిల్లాలో మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ వారే కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు. వివేకా ఎమ్మెల్సీగా ఎన్నికైతే జిల్లాలో టీడీపీకి ఉనికే ఉండదని చంద్రబాబు భావించారు.
అందుకే వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి వివేకాను కుట్రతో ఓడించారు. అక్రమాలకు పాల్పడి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి సర్వంతామై వ్యవహరించారు. కానీ ఆ ముగ్గురూ సునీతకు, ఆమె భర్త, బావగారికిçప్పుడు అత్యంత సన్నిహితులైపోవటమే విచిత్రం.
– సాక్షి, అమరావతి