బీటెక్‌ రవి అరెస్టు  | TDP Leader B. Tech Ravi Arrested | Sakshi
Sakshi News home page

బీటెక్‌ రవి అరెస్టు 

Published Wed, Nov 15 2023 4:47 AM | Last Updated on Wed, Nov 15 2023 11:14 AM

TDP Leader BTech Ravi arrested - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: క్రికెట్‌ బెట్టింగ్‌ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్‌ బీటెక్‌ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రవిపై వల్లూరు పోలీసుస్టేషన్‌లో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటన నేపధ్యంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, కాలు ఫ్యాక్చర్‌ కావడానికి బీటెక్‌ రవి కారకుడైనట్లు అప్పట్లో కేసు నమోదయింది.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రవిని అరెస్టు చేసిన పోలీసులు... రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. మళ్ళీ బుధవారం ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు. నిజానికి ఈ మధ్యే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బీటెక్‌ రవి చుట్టూనే చేరింది.

క్రికెట్‌ బెట్టింగ్‌ విషయాల్లో వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సీరియస్‌గా ఉండటంతో... స్థానికంగా పేరున్న లాడ్జిలను ఆయనే స్వయంగా తనిఖీలు సైతం చేశారు. బెట్టింగ్‌ అణిచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరుమామిళ్ల బెట్టింగ్‌ రాకెట్‌ మొత్తం బీటెక్‌ రవి కనుసన్నుల్లో నడిచినట్లు రూఢీ అయ్యింది.

పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో... బీటెక్‌ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్‌ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

నా బ్లడ్‌లోనే జూదం ఉంది.. 
బీటెక్‌ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో సింహాద్రిపురం కేంద్రంగా ‘జూదం మా బడ్ల్‌లోనే ఉంది’ అంటూ మరోసారి వివాదాస్పదమైన వ్యా­ఖ్యలు చేశారు. అంతకుముందు పలుసార్లు వివిధ సందర్భాల్లో ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి జూదం అలవాటు ఉన్నట్లుగా అప్పట్లో వచ్చిన ఆరోపణలపై స్వయంగా వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రపంచ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో పోలీసులు బెట్టింగ్‌ను సీరియస్‌గా తీసుకుని తనిఖీలు చేశారు.

జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడే అలవాటున్న బెట్టింగ్‌ రాయుళ్లందరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పాత నేరస్థులను పిలిపించి, క్రికెట్‌ బెట్టింగ్‌ ఎక్కడా నిర్వహించరాదని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే పోరుమామిళ్ల కేంద్రంగా బెట్టింగ్‌ జరుగుతోందని, ఇదంతా బీటెక్‌ రవి కనుసన్నల్లోనే నడుస్తోందని బయటపడినట్లు సమాచారం. ఆ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. 

కిడ్నాప్‌ అంటూ హైడ్రామా.... 
పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌లో బీటెక్‌ రవిని అదుపులోకి తీసుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి.. బీటెక్‌ రవిని కిడ్నాప్‌ చేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రకటన చేశారు. అంతే!! వాస్తవాలు ఏమాత్రం తెలుసుకోకుండా ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుగా ఎల్లో మీడియా కిడ్నాప్‌ కలకలం అంటూ కాసేపు ఊదరగొట్టింది. చివరకు పోలీసులు అరెస్టును ధ్రువీకరించటంతో ఈ గాసిప్‌లకు తెరపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement