cricket betting
-
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్‌లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్‌ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్‌ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్‌ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్‌లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్‌కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్‌కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్‌ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్
-
బీటెక్ రవి అరెస్టు
సాక్షి ప్రతినిధి, కడప: క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రవిపై వల్లూరు పోలీసుస్టేషన్లో ఓ కేసు పెండింగ్‌లో ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నేపధ్యంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, కాలు ఫ్యాక్చర్ కావడానికి బీటెక్ రవి కారకుడైనట్లు అప్పట్లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రవిని అరెస్టు చేసిన పోలీసులు... రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. మళ్ళీ బుధవారం ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు. నిజానికి ఈ మధ్యే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బీటెక్ రవి చుట్టూనే చేరింది. క్రికెట్ బెట్టింగ్ విషయాల్లో వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్‌గా ఉండటంతో... స్థానికంగా పేరున్న లాడ్జిలను ఆయనే స్వయంగా తనిఖీలు సైతం చేశారు. బెట్టింగ్ అణిచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరుమామిళ్ల బెట్టింగ్ రాకెట్ మొత్తం బీటెక్ రవి కనుసన్నుల్లో నడిచినట్లు రూఢీ అయ్యింది. పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో... బీటెక్ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నా బ్లడ్‌లోనే జూదం ఉంది.. బీటెక్ రవి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో సింహాద్రిపురం కేంద్రంగా ‘జూదం మా బడ్ల్‌లోనే ఉంది’ అంటూ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పలుసార్లు వివిధ సందర్భాల్లో ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి జూదం అలవాటు ఉన్నట్లుగా అప్పట్లో వచ్చిన ఆరోపణలపై స్వయంగా వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో పోలీసులు బెట్టింగ్‌ను సీరియస్‌గా తీసుకుని తనిఖీలు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడే అలవాటున్న బెట్టింగ్ రాయుళ్లందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్థులను పిలిపించి, క్రికెట్ బెట్టింగ్ ఎక్కడా నిర్వహించరాదని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలోనే పోరుమామిళ్ల కేంద్రంగా బెట్టింగ్ జరుగుతోందని, ఇదంతా బీటెక్ రవి కనుసన్నల్లోనే నడుస్తోందని బయటపడినట్లు సమాచారం. ఆ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కిడ్నాప్ అంటూ హైడ్రామా.... పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌లో బీటెక్ రవిని అదుపులోకి తీసుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి.. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంతే!! వాస్తవాలు ఏమాత్రం తెలుసుకోకుండా ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుగా ఎల్లో మీడియా కిడ్నాప్ కలకలం అంటూ కాసేపు ఊదరగొట్టింది. చివరకు పోలీసులు అరెస్టును ధ్రువీకరించటంతో ఈ గాసిప్‌లకు తెరపడింది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దొండపర్తి : ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు. బెట్టింగ్ వేసే వారిని నిలువునా ముంచుతున్న బుకీ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం డీసీపీ–1 కె.శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్ పేరుతో రూ.8 లక్షల వరకు తనను మోసం చేశారని నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల పోలీస్ స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన మెరుపురెడ్డి సూరిబాబు ఈ ముఠాలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరుగా పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో 20 నుంచి 30 మంది మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఒక్కో మ్యాచ్‌కు రూ.4 లక్షల వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా సేకరించిన మొత్తాన్ని నగరంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్‌కుమార్ అనే వ్యక్తికి పంపేవాడు. ఇందుకు అతడికి 2 శాతం కమీషన్ ఇచ్చేవాడు. ఇలా తనకు తెలిసిన వ్యక్తులను కూడా బుకీలుగా మార్చి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బుకీ గ్యాంగ్ గుట్టుగా బెట్టింగ్ నిర్వహించడంతో పాటు.. బెట్టింగ్ వేసే వారికి డబ్బులు నష్టపోయేలా సాఫ్ట్వేర్లను రూపొందించారు. సాధారణంగా గెలిచే అవకాశమున్న జట్టుకు తక్కువ పర్సెంట్, ఓడిపోయే అవకాశాలున్న జట్టుకు ఎక్కువ శాతం డబ్బును ఆఫర్ చేస్తుంటారు. ఆ విధంగా జట్టు మీద బెట్టింగ్ వేశాక కొంత సమయం వరకు వాటిని వేరొక జట్టుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వీరు అలా మార్చడానికి అవకాశం లేకుండా ఆ సమయంలో సర్వర్‌ను ఆఫ్ చేసేవారు. ప్రధానంగా గేమ్ విన్నర్, లాస్ ఆప్షన్స్.. హ్యాండ్లర్ చేతిలో ఉండడంతో ఒకవేళ గెలిచినప్పటికీ నష్టం వచ్చిందని చెప్పి వారి ఐడీని బ్లాక్ చేస్తారు. ఆ డబ్బును తమ కరెంట్ అకౌంట్లలోకి జమ చేసి వాటి నుంచి కార్పొరేట్ ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో నిర్ధారౖణెంది. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన 63 బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయగా.. అందులో 36 ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.367.62 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. వాటిలో 13 అకౌంట్లలో ఉన్న రూ.75 లక్షలు స్తంభింపచేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో సూరిబాబు, విశాఖకు చెందిన హండ దినే‹Ùకుమార్, బర్రి శ్రీను, గుర్రం శివ, కిల్లాడి శ్రీనివాసరావు, ఉరిటి కొండబాబు, ఉరిటి వెంకటేశ్వర్లు, సుందరాపు గణేష్, దూలి నూకరాజు, అల్లు నూకరాజు అవినాష్, ఉప్పు వాసుదేవరావులున్నారు. ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రదారి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ–1 శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ(ఎస్బీ) నాగేంద్రుడు, సైబర్ క్రైం సీఐ భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు!
అనకాపల్లిటౌన్: క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయిన విద్యార్థి పి.మధు ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ అంజిబాబు చెప్పారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలివి. మండలంలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన పి.మధు క్రికెట్ బెట్టింగ్‌లో నష్టం వచ్చిందని ఆవేదన చెందుతూ ఈనెల 23వ తేదీన గ్రామ సమీపంలో పొలాల్లో గులుకులు సేవించాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. (టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష) -
అశోక్‌రెడ్డి బెట్టింగ్ కథ.. అక్షరాలా వందకోట్ల రూపాయలు.. ఐపీఎల్–2023 లోనూ
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల కిందట బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనపై ఆసక్తి ఉన్నవాళ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. అది మొదలు క్రమంగా బెట్టింగ్‌కు బానిసై క్రికెట్ మొదలు హార్స్‌రైడింగ్‌వరకు అన్ని క్రీడలపై పందేలు నిర్వహించాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇటీవల ఐపీఎల్–2023లోనూ బెట్టింగ్‌కు పాల్పడి.. నగదు వసూలుకు వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఇది శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన జక్కిరెడ్డి అశోక్‌రెడ్డి కథ. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మీడియాకు శనివారం వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ పేరుతో.. శ్రీ వెంకటరమణ కాలనీకి చెందిన అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. నాగోల్‌లోని బండ్లగూడలో ఉంటున్న మిర్యాలగూడకు చెందిన ఏడుకుళ్ల జగదీష్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అశోక్, జగదీష్ ఇరువురు కలిసి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు ముందే పరిచయం ఉన్న, ప్రధాన బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్ మైలబాతుల అలియాస్ శివ, హరియాణకు చెందిన విపుల్ మోంగాలను జగదీష్ కు అశోక్ రెడ్డి పరిచ యం చేశాడు. కూకట్‌పల్లిలోని భక్తినగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా నియమించుకొని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ముగ్గురు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్9’ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తారు. నగదు వసూలుకు వెళ్తూ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ముఠా నిర్వహించిన బెట్టింగ్‌లో పంటర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు వెళ్తున్నట్లు ఎల్బీనగర్ ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్–9లోని బసంతి బొటిక్ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. శ్రీనివాసరావు, సురేష్ , విపుల్ మోంగాలు పరారీలో ఉన్నారు. ఐపీఎల్లో రూ.3 కోట్లు బెట్టింగ్.. పట్టుబడిన ముగ్గురు నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ ఖాతాలను పోలీసులు పరిశీలించగా.. ఐపీఎల్–2023 సీజన్లో ఇప్పటివరకు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును సీజ్ చేశారు. ఒక కారు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని..
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్‌గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది. చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా! ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొంపముంచిన అత్యాశ పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్లైన్లో వన్ ఎక్స్‌బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్‌లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు. ఆ డబ్బును సైతం బెట్టింగ్‌లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్‌లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు. దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్‌లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..
బెంగళూరు: పుట్టించి నుంచి డబ్బు తేవాలని వేధిస్తూ భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. హాసన్ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్ బెంగళూరులో ఒక ఆటోమొబైల్ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రూ.80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన అతడు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. పుట్టింటికెళ్లి డబ్బు తేవాలని భార్య తేజస్వినిని వేధించేవాడు. పెద్ద మనుషులు అనేకసార్లు రాజీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇక బెంగళూరులో జీవించలేని మంజునాథ్ సంసారాన్ని హాసన్‌కు మార్చాడు. అక్కడ తేజస్విని చిన్న ఉద్యోగానికి వెళ్లేది. ఆమెను అనుమానిస్తూ వేధించేవాడు. చివరకు సోమవారం ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్‌తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను అరెస్ట్ చేశారు. చదవండి: (షట్టర్ పగలగొట్టి.. గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచి..) -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్‌కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు క్రికెట్ బెట్టింగ్ ముఠా హాజరైనట్లు సమాచారం అందింది. లైవ్ మ్యాచ్ చూస్తూనే ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహించినట్లు తేలింది. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్క్వాడ్(ఏఆర్ఎస్) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురు బిహార్‌కు చెందిన సునీల్ కుమార్, అజయ్ కుమార్, అమర్ కుమార్, ఒబేదా ఖలీల్, అనికెత్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ఐదుగురు స్టేడియంలోని ఎఫ్-1 బ్లాక్‌లో ఎవరికి అనుమానం రాకుండా సామాన్య ప్రేక్షకుల్లాగా వచ్చి మ్యాచ్ చూడకుండా మొబైల్ ఫోన్స్‌లో మునిగిపోయారు. అనుమానం వచ్చి తోటి ప్రేక్షకులు స్టేడియం సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో మఫ్టీలో వచ్చిన యాంటీ రౌడీ స్వ్కాడ్ వారిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఇచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సంఖ్యలో మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ రూటర్ చార్జర్లు, డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి వెనుక పెద్ద హస్తం ఎవరిదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ సూపర్ సెంచరీతో ఆర్సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్ డెత్ ఓవర్లంటే చాలా భయం.. కానీ అదే నాకిష్టం -
తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్
అనపర్తి: యువతనే లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న ఐదుగురిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి (సత్య) ఇంట్లోనే నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్‌లకు ఆయనే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అనపర్తి సీఐ జె.వి.రమణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. అనపర్తి మండలం రామవరంలో ఓ ముఠా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి ఇంటిపై బుధవారం రాత్రి దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ సత్య, మరో నలుగురు యువకులు ఐపీఎల్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు. సత్యతో పాటు తేతలి కృష్ణారెడ్డి, కర్రి రమాకాంతరెడ్డి, కర్రి వీరవెంకటసత్యనారాయణరెడ్డి, తమలంపూడి వెంకటరెడ్డిలను అరెస్టు చేసి.. రూ.2.50 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ, బెట్టింగ్ లావాదేవీలు, బెట్టింగ్ ఆడుతున్నవారి వివరాలతో ఉన్న పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్య ఆధ్వర్యంలోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన బుకీలు, పంటర్లు ఎవరనే దానిపై లోతైన విచారణ నిర్వహించి, దీంతో సంబంధమున్న వారందర్నీ అరెస్ట్ చేస్తామని సీఐ వెల్లడించారు. -
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్‌పై అమిత్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
‘స్మార్ట్’ బెట్టింగ్.. ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేల జోరు
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్ మ్యాచ్‌లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్, ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. దీనికితోడు సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. ♦మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ యాప్ బెట్టింగ్ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ♦పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు ♦కుప్పంలో ఓ ఆటోడ్రైవర్ క్రికెట్ బెట్టింగుల్లో ఓడి తనకు జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ♦కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ♦జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్‌కు తెరతీశాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్‌లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిడెన్ యాప్‌లే కీలకం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్ మోడ్‌లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్‌లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్హౌస్లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్ రాజా కాయ్ అంటున్నట్టు తెలుస్తోంది. కోడ్లతో లావాదేవీలు ఐపీఎల్ మ్యాచ్‌లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్‌లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్ , ఓడిన జట్టును ఈటింగ్ , రూ.వెయ్యిని ఫింగర్ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్ అని పిలుస్తుంటారు. ఫోన్ పే, గూగు ల్ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. కర్ణాటక ముఠాలదే హవా కర్ణాటకలోని శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్‌కు ముందు బెట్టింగ్ రేట్ నిర్ణయించి ఆన్లైన్లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు. పలమనేరులో పందేల జోరు పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్‌కు అడ్డాలుగా మారినట్లు సమాచారం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం పలమనేరు సబ్డివిజన్పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్లో ప్రతి మ్యాచ్‌లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్‌కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. బెట్టింగ్‌లకు బానిసగా మారాడు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్లో క్రికెట్ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్ ఉదయ్ కుమార్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన లైన్లను తీసుకునేవాడు. మన్సూరాబాద్‌లోని చండీశ్వర్ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్‌ను సబ్– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్ లోటస్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్ దాడులు చేసి మెయిన్ ఆర్గనైజర్ దేవినేని చక్రవర్తి, సబ్ బుకీ హరీష్‌లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్రెడ్డి సురేశ్ రెడ్డి, సామ జైపాల్ రెడ్డి, షేక్ ఆసిఫ్ పాషాలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్ ఉదయ్ కుమార్ పరారీలో ఉన్నారు. (చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్ వీడియో) -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్‌ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్‌లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్‌కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్‌గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్‌లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్‌పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
భారత్‌లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్‌పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్‌కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్‌లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్‌పై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్‌ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్ పాండే..? -
భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్లైన్లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్‌నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా ప్రారంభించాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్లైన్లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ముంబై కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అభయ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు. చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే.. లాభాల పంపకంలో ఉండగా.. 2019లో బెట్టింగ్ నేరంపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్‌లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్లైన్లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్‌లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో రెండు, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్ ఇంటికి రాగా, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా.. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్‌బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌కుమార్, వెంకటసుదర్శన్‌రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్‌రావు వివరించారు. -
Hyderabad: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా అతిపెద్ద బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఏడు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచి్చ»ౌలి, మైలార్‌దేవ్‌పల్లిలోని ఏడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి 23 మంది బూకీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.93 లక్షల నగదు, 14 బెట్టింగ్ బోర్డ్‌లు, 8 ల్యాప్టాప్స్, 247 సెల్ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లు, 4 ట్యాబ్స్, 4 టీవీలు, 2 రూటర్స్, ప్రింటర్, 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2.21 కోట్లు. పరారీలో ఉన్న మెయిన్ బూకీ విజయవాడకు చెందిన మహా అలియాస్ సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇతను బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వివరాలను మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటీ) డీసీపీ సందీప్‌లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. విజయవాడకు చెందిన మెయిన్ బూకీ మహా నుంచి లీడ్స్ తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన చింత వేణు(35), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన గోదవర్తి వెంకటేష్ (32) ఇద్దరు బూకీలుగా అవతారమెత్తి ఏడేళ్లుగా హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2021లో మంగళవారం నాటి ముంబై–పంజాబ్ మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫ్యాన్సీ లైఫ్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365, బెట్ ఫెయిర్ వంటి యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్, లావాదేవీలను నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు బెట్టింగ్ నిర్వాహకులను మంగళవారం పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి ఆకువీడుకు చెందిన జెళ్ల సురేష్ (33), తిరుమణి మణికంఠ(23), కొల్లాటి మణికంఠ(21), పీ.శ్రీనివాస్(35), దుర్గాప్రసాద్ కొల్లాటి(22), జమ్ము నాగరాజు(36), ఈదర రవి(36), భీమవరం వడువు అజయ్ కుమార్ (27), అట్లూరి రంజిత్ కుమార్(35), జగన్నాథపురంకు చెందిన జయశ్రీనివాస్(29), నల్లజర్లకు చెందిన తూరెళ్ల సాయి(24), గుంటూరు జిల్లా మంత్రిపాలెం రేపల్లె నాగళ్ల రాకేష్(37), తూర్పు గోదావరి మొగిలి కూడురుకు చెందిన సుందర రామరాజు(34), విజయవాడకు చెందిన కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్(32), కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన కోట సాయి నవీన్(25), భద్రాచలం గౌరిదేవిపేట్కు చెందిన రవితేజ(37), బాచుపల్లికి చెందిన కామగాని సతీష్(39), మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మల్లిఖార్జున చారీ(38), కర్నాటకలోని రాయచూర్‌కు చెందిన బొప్ప వెంకటేష్ (30), గన్ని కల్యాణ్ కుమార్ (30), పత్తిపాటి రాము (32)లను అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ బూకీ మహాతో పాటు చెన్ను భాస్కర్‌రెడ్డి, గుంటూరుకు చెందిన సురేష్, కేపీహెచ్‌బీకి చెందిన పవన్ అలియాస్ ప్రవీణ్, రాయచూర్‌కు చెందిన కే.సుమన్, రామాంజనేయ, ముంబైకి చెందిన నందలాల్ గోరీ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు ముంబై, గోవా, బెంగళూరు, దుబాయ్‌లో కూడా ఉన్నాయని దర్యాప్తులో తేలిందని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బ్లాస్ట్: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ఫోటోలు
-
క్రికెట్ బెట్టింగ్ తో అప్పులు.. తీర్చేందుకు వేరే దారి లేక..
సాక్షి, బంజారాహిల్స్ ( హైదరాబద్): అప్పులు తీర్చేందుకు చోరీకి పాల్పడ్డ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన జన్నా రమేష్ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్మికనగర్‌లో నివాసం ఉంటున్నాడు. టైల్స్ వర్క్ చేస్తున్న రమేష్ కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా అప్పులు చేసి బెట్టింగ్‌లు కట్టాడు. వాటిని తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. ఎలాగైనా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో ఈ నెల 15న రెహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి ఆంజనేయులు ఇంట్లో చొరబడి అల్మారాలోంచి రూ.25,500 నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేశాడు. ఆంజనేయులు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం జన్నా రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఖాకీ అసాంఘిక దోస్తీ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్‌కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల కేంద్రంగా.. నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్‌బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్‌లే కాకుండా స్పోర్ట్స్ చానెల్లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు. బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు.. క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పేకాట క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్‌కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.