నిందితుడినితో సీఐ మురళీకృష్ణ
చీమకుర్తి రూరల్: క్రికెట్ బెట్టింగ్ స్టూడెంట్ ప్రాణం తీసింది. ఓబచెత్తపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి (21) గత నెల 27న రామతీర్థం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వేధింపులకు గురిచేసిన బీటెక్ విద్యార్థి కందుల సురేంద్రరెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి సోమవారం చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను సీఐ ఎం.మురళీకృష్ణ విలేకరులకు వివరించారు.
సీఐ కథనం ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ఒంగోలు హర్షిణీ డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. క్విస్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కందుకూరు మండలం పందలపాడుకు చెందిన సురేంద్రరెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరంతా ఇతర విద్యార్థులతో కలిసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో వేలకు వేలు పందేలు పెడుతున్నారు. దానిలో భాగంగా గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.22 వేలను సురేంద్రరెడ్డికి బాకీ పడ్డాడు. ఆ డబ్బులు చెల్లించాలని ఫోన్‌లో వేధించసాగాడు. ఇంట్లో చెప్పలేక, తాను డబ్బులు చెల్లించలేక శ్రీనివాసరెడ్డి మానసిక వేదనకు గురయ్యాడు.
సురేంద్రరెడ్డి వేధింపులు తట్టుకోలేక రామతీర్థం రిజర్వాయర్‌లో పడి చనిపోతున్నానని మెసేజీ కూడా పెట్టాడు. అయినా సురేంద్రరెడ్డి తనకు ఇవ్వాలసిన డబ్బులు సంగతేంటని తీవ్ర ఒత్తిడి చేశాడు. బెట్టింగ్ ముఠా సభ్యులకు సురేంద్రరరెడ్డి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వారు ఒత్తిడి చేసినప్పుడలా శ్రీనివాసరెడ్డిని సురేంద్రరెడ్డి ఒత్తిడి చేసేవాడు. చివరకు డబ్బులు ఇవ్వలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని ఆందోళనకు గురై రిజర్వాయర్‌లో గత నెల 27న దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు శ్రీనివాసరెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 29న పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సురేంద్రరెడ్డి వేధింపులే కారణంగా పోలీసుల విచారణలో తేలడంతో అతడిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ మురళీకృష్ణ మీడియాకు వివరించారు.
పిల్లలను గమనిస్తూ ఉండాలి: మురళీకృష్ణ, సీఐ
కాలేజీలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీకి వెళ్తున్నామంటే వేలకు వేలు డబ్బులు ఇచ్చి పంపటమే కాదు. ఆ డబ్బుతో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. విద్యార్థులు ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ఇంట్లో తీసుకెళ్లిన డబ్బులే కాకుండా వేలకు వేలు అప్పులు చేసి పందేలు కాస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుంటే కొంతమంది పిల్లలు అరాచకాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉంది. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment