గిద్దలూరు: భర్త వేధింపులు తాళ లేకే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన నిబ్బరగండ్ల సౌమ్య (25) తండ్రి కెంచ వెంకటేశ్వరరెడ్డి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన నిబ్బరగండ్ల వెంకటరామిరెడ్డికి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కమలాపురానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమార్తె సౌమ్యను ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు.
వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డి 45 రోజుల క్రితం గిద్దలూరు వచ్చి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి నల్లబండ బజారులోని ఓ గృహాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు ఉండటంతో మొదట సౌమ్య రాలేదు. బంధువులు నచ్చజెప్పి 15 రోజుల క్రితం గిద్దలూరులో ఉన్న భర్త వద్దకు పంపారు. ఆదివారం వరకు సాపీగా ఉన్న దంపతుల మధ్య మరోసారి వివాదం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటరామిరెడ్డి వేధించడంతో తట్టుకోలేని సౌమ్య ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment