
బాలాజీ మృతదేహం
ఏటూరునాగారం : తన అవసరాలను తీర్చుకోవడానికి తల్లిని రూ.10 వేలు అడిగితే ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు జంపన్నవాగు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఆకులవారి ఘణపురంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన భూక్య రాజు, విజయ దంపతుల కుమారుడు భూక్య బాలాజీ (23) బుధవారం రాత్రి తల్లిని రూ.10 వేలు కావాలని అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో బాలాజీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పలుచోట్ల వెతికినా అతడి జాడ కనిపించలేదు. గురువారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సోదరుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐపీఎల్ బెట్టింగ్ కారణమా ?
ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన బాలాజీ మృతికి ఐపీఎల్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్‌లు ఏటూరునాగారం ప్రాంతంలో జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు తన మిత్రులతో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టిన బాలాజీ, తాను చాలెంజ్ చేసిన జట్టు ఓడిపోవడంతో రూ.10 వేలు మిత్రుడికి బాకీ పడినట్లు తెలిసింది. డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని మిత్రులు ఒత్తిడి చేయడంతో డబ్బులను ఇంటి వారి నుంచి రాబట్టలేక, ఇటు స్నేహితులతో మాటపడలేక తనువు చాలించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో పోలీçసులు బెట్టింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేసి జరిమానా విధించారు. అయిన బెట్టింగ్‌లు అదుపులోకి రాకపోవడం గమనార్హం.