జీవితాలతో ఆట! | Matka And Cricket Betting Centre In Tadipatri | Sakshi
Sakshi News home page

జీవితాలతో ఆట!

Published Wed, Mar 7 2018 8:29 AM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

Matka And Cricket Betting Centre In Tadipatri - Sakshi

కొండసాని సురేశ్‌రెడ్డి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పీఏగా పనిచేసిన వ్యక్తి. జీవా తాడిపత్రి వాసి. వీరి కనుసన్నల్లో నడిచే బెట్టింగ్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేస్తే రూ.29.90 లక్షలు పట్టుబడింది. తాడిపత్రి అడ్డాగా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోందని   ‘సాక్షి’లో లెక్కలేనన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు బెట్టింగ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడంతో నిర్వాహకులతో పాటు బెట్టింగ్‌రాయుళ్లలో వణుకు పుడుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్కా.. క్రికెట్‌ బెట్టింగ్‌.. పేకాట. ఈ మూడింటికీ అనంత అడ్డాగా మారింది. తాడిపత్రి కేంద్రంగా ఎన్నో జీవితాలు కూలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బడా నేతల అండతో అనుచరవర్గం సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు ఈ ఆట గుట్టురట్టు చేసింది. అయితే అప్పటికప్పుడు బుకీలను అరెస్టు చేయడం.. బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకుని వదిలేయడంతో పోలీసులు తమ పని అయిందనిపించడం పరిపాటిగా మారుతోంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మంగళవారం నుంచి ముక్కోణపు టీ–20 సిరీస్‌ ఆరంభమైన నేపథ్యం లో ఒక రోజు ముందుగానే బెట్టింగ్‌ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పీఎస్‌ఎల్‌(పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌)మ్యాచ్‌లకు బెట్టింగ్‌ కాస్తూ పట్టుబడ్డారు. సోమవారం బెట్టింగ్‌ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నా మంగళవారం రాత్రి శ్రీలంక–భారత్‌ మ్యాచ్‌కు యథేచ్ఛగా భారీగా బెట్టింగ్‌ సాగడం గమనార్హం.

తాడిపత్రి, అనంత కేంద్రంగా బెట్టింగ్‌
ప్రొద్దుటూరులో క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు బుకీలు తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్‌ సాగిస్తున్నారు. బుకీలు ముంబయి, హైదరాబాద్‌లో ఉంటారు.  ఇక్కడ సబ్‌ బుకీలను నియమించుకుంటారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి.. ముగిసే వరకు బెట్టింగ్‌ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. దీనికి వ్యాట్సాప్‌ గ్రూపులను క్రియేట్‌ చేసి బెట్టింగ్‌ రేటును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. బుకీల ద్వారా మ్యాచ్‌ గెలుపోటములపై మాత్రమే ఎక్కుగా బెట్టింగ్‌ నడుస్తోంది. మ్యాచ్‌ ఆడే రెండు జట్లలో ఒక జట్టును ఫెవరెట్‌గా పరిగణిస్తారు. ఫేవరెట్‌ జట్టుపై బెట్టింగ్‌ కాసి ఆ జట్టు విజయం సాధిస్తే తక్కువ డబ్బు వస్తుంది. ఫేవరేట్‌ కాని జట్టు గెలిస్తే భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడిన వారిలో లక్షకు ఐదు లక్షల చొప్పున కూడా బెట్టింగ్‌ కాశారు. మ్యాచ్‌లో ఫేవరెట్‌ జట్టు త్వరగా వికెట్లు కోల్పోతే వెంటనే బెట్టింగ్‌ తీరు మారిపోతోంది. 50–50కి వస్తుంది. మ్యాచ్‌ తీరును బట్టి బెట్టింగ్‌ తన స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగే జిల్లాలో రోజూ రూ.2 కోట్ల దాకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

బాల్‌టు బాల్‌ బెట్టింగ్‌
సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్‌’బెట్టింగ్‌ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్‌ టు బాల్‌’ బెట్టింగ్‌ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్‌ పడుతుందా? లేదా? సిక్స్‌? ఫోర్‌ కొడతాడా? బౌలర్‌ డాట్‌ బాల్‌ వేస్తాడా? బ్యాట్స్‌మన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతీ బాల్‌కు బెట్టింగ్‌ జరుగుతుంది. అంటే ఒక మ్యాచ్‌ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్‌ జరిగే 240 బాల్స్‌పై బెట్టింగ్‌ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలు, ఇళ్లను రోజువారీ అద్దెకు తీసుకుని నడిపిస్తారు. ఇలాంటి ఇళ్లకు రోజుకు రూ.5వేలు కూడా అద్దె చెల్లిస్తున్నారు. అలాగే 10–20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి మ్యాచ్‌ సమయంలో ఓ లాడ్జీ ని అద్దెకు తీసుకుని అక్కడ బెట్టింగ్‌ ఆడుతుంటారు. సోమవారం పట్టుబడిన వారు కూడా అనంతలో ఓ గదిని అద్దెకు తీసుకుని పట్టుబడ్డారు. ఈ తరహా బెట్టింగ్‌ రోజూ రూ.1.50కోట్ల దాకా ఉంటోందని సమాచారం.

ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయిస్తేనే ప్రయోజనం
జీవా విజయవాడలో ఎక్కువగా ఉంటాడు. అక్కడి నుంచే బెట్టింగ్‌ను నిర్వహిస్తుంటాడని తెలుస్తోంది. జీవాను విచారిస్తే పూర్తిగా బెట్టింగ్‌ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ఇతని కనుసన్నల్లో తాడిపత్రిలో మరో ఆరుగురు సబ్‌బుకీలు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ‘అనంత’లోనూ భారీగా బెట్టింగ్‌ సాగుతోంది. వన్‌టౌన్‌ పరిధిలోని పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు వీధిలో రోజూ బెట్టింగ్‌రాయుళ్లు సమావేశమవుతుంటారు. అలాగే కమలానగర్‌లోని ఓ కేఫ్‌లోనూ మరో బృందం రోజూ సమావేశమై బెట్టింగ్‌ నిర్వహిస్తోంది. రాజు రోడ్డులోని ఓ హోటల్‌లో సూట్‌ బుక్‌ చేసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలో ఏ లీగ్, టోర్నీ జరిగినా పందేలు కాస్తున్నారు. రోజూ టీవీలో ఏదో ఒక మ్యాచ్‌ వస్తుంటుంది. అంటే రోజూ బెట్టింగ్‌ నడుస్తున్నట్లే లెక్క. భారత్‌ ఆడే మ్యాచ్‌లు ఉంటే బెట్టింగ్‌కాసే వాళ్లు మరింత ఎక్కువగా ఉంటారు. మంగళవారం నుంచి మొదలైన ముక్కోణపు టోర్నీ జరిగే సమయాల్లో దాడులు నిర్వహిస్తే భారీగా బెట్టింగ్‌ రాయుళ్లు పట్టుబడే అవకాశం ఉంది.

భారీ వడ్డీలకు అప్పులు
బెట్టింగ్‌లో కలిసొస్తే పదివేలతో వెళ్లిన వాడు రూ.లక్షతో తిరిగొస్తాడు. లేదంటే రూ.లక్ష తీసుకెళ్లిన వాడు రూపాయి కూడా మిగిల్చుకోలేని పరిస్థితి. దీంతో బెట్టింగ్‌ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీతో డబ్బులు తెస్తున్నారు. ఇంకొందరు పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement