నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్
అనంతపురంలోని కోవూరు నగర్‌లో ఓ స్కూల్ సమీపంలో నివాస గృహాల మధ్య జోరుగా వ్యభిచారం సాగుతోంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. ఉన్నతాధి కారుల దృష్టికి విషయం వెళ్లడంతో ఈ నెల 4న తప్పని పరిస్థితిలో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 5న అనంతపురంలోని సోమనాథ్‌నగర్‌లో నివాసముంటున్న షేక్ గౌస్ పీరా (27) ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లో రూ. లక్షలు పోగొట్టుకున్న అతను నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ భూతానికి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది.
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పాలన గాడి తప్పింది. క్రికెట్ బెట్టింగ్, మట్కా, జనావాసాల మధ్య వ్యభిచారం.. తదితర అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దందాలకు అడ్డాగా టీకేఫ్‌లు మారాయి. బార్‌లు, మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా నాల్గో పట్టణపోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు మద్యం బాటిళ్లు అమ్ముతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దందాలకు అడ్డాగా..
అనంత నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలు అత్యధికంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఉంటున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని స్టేషన్‌పరిధిలో ఉన్న 68 రౌడీ షీటర్లు చిన్న చిన్న దందాలకు తెరలేపారు. తమ మాట వినకపోతే దాడులకు సైతం వెనుకాడడం లేదు. స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బైక్ రేస్, వీలింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రమైతే ఏకంగా జాతీయ రహదారి పక్కనే మందుబాబులు తిష్టవేసి బాటిళ్లను తెప్పించుకుని ఫుల్‌గా తాగి తందనాలాడుతున్నారు. జాతీయ రహదారిపై విచ్ఛలవిడిగా వ్యభిచారం సాగుతున్నా.. పోలీసులు నియంత్రించలేకపోతున్నారు.
రియల్ నజరానా..
స్టేషన్‌పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా సాగుతోంది. ఓ అధికారిని లోబర్చుకున్న రియల్‌వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి లావాదేవీలైనా.. తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవడంలో భాగంగా ఎదురయ్యే వివాదాలను సులువుగా పరిష్కరించుకునేందుకు రియల్టర్‌లు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ అధికారికి అన్ని హంగులూ సమకూరుస్తున్నారు. బెంగుళూరు నగరానికి పిలుచుకెళ్లి విందూ వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు.
అధిక వడ్డీ... అసాంఘిక కార్యకలాపాలు
నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జనావాసాల మధ్య వ్యభిచార కేంద్రాలు, పేకాట స్థావరాలు, క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పనుల కోసం వలస వచ్చిన వారు జీవనోపాధి కోసం చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీల్చి పిప్పి చేస్తున్నారు. రూ. 5 నుంచి రూ. 10 వరకు వడ్డీ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తూ నెలవారి మాముళ్లను మోస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మాముళ్లు అందకపోయినా.. స్థానికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువైనప్పుడు కంటి తుడుపు దాడులు నిర్వహిస్తూ నిందితుల అరెస్ట్ చూపుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ చర్యలు చేపడుతున్నా.. జిల్లా కేంద్రంలోనే అడ్డూఅదుపు లేకుండా సాగుతుండడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇటీవల నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమనాథ్‌నగర్‌లో షేక్ గౌస్‌పీరా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పోలీసుల వైఫల్యాలకు పరాకాష్టగా మారింది.
నేడు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ రాక
అనంతపురం సెంట్రల్: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదివారం జిల్లాకు రానున్నారు. పది రోజుల పాటు కుటుంబ సభ్యులతో యూఎస్‌ఏ పర్యటనకు వెళ్లిన ఆయన ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రానికి జిల్లాకు వస్తారు. సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment