రోదిస్తున్న భార్య సల్మా , షేక్‌గౌస్‌పీరా మృతదేహం
సులభమార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. క్రికెట్ మోజులో పడి అప్పు చేసి మరీ పందేలు కాశాడు. పందెంలో కలసిరాలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. చివరకు అప్పులిచ్చిన వాళ్లు డబ్బు కోసం ఇంటి వద్ద గొడవ చేశారు. మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనంతపురం సెంట్రల్: క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువకుడు అప్పుల వారి ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన శనివారం అనంతపురంలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సోమనాథ్‌నగర్‌లో నివాసముంటున్న షేక్‌గౌస్‌పీరా (27) తపోవనం సమీపంలోని వాటర్‌సర్వీసింగ్ సెంటర్ ద్వారా జీవనం సాగించేవాడు. కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడిన గౌస్‌పీరా రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులే దాదాపు రూ. 4 లక్షలకు పైగా అప్పులు చెల్లించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై కూడా బెట్టింగ్ ఆడేవాడు. ఈసారి కూడా అచ్చిరాలేదు. లక్షల్లోనే డబ్బు పోగొట్టుకున్నాడు. రెండు రోజుల నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలు, అప్పులు ఇచ్చిన వ్యక్తులు డబ్బు కట్టాలని గౌస్‌పీరా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి వచ్చి గొడవ చేశారు. శనివారం ఉదయానికల్లా కట్టకపోతే బాగుండదంటూ హెచ్చరించారు.
అప్పులిచ్చిన వారిని చూసి..
శనివారం ఉదయం ఆరు గంటలకే అప్పులిచ్చిన వారు నివాసం వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన గౌస్‌పీరా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు కూడా లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపులు కొట్టగా ఎంత సేపటికీ తీయలేదు. అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచారు. అప్పటికే గౌస్‌పీరా మృతి చెందాడు. మృతునికి భార్య (గర్భిణి), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భర్త మృతి చెందడంలో భార్య సల్మా బోరున విలపించారు. నాల్గవ పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment