ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్‌కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల కేంద్రంగా..
నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్‌బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్‌జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్‌లే కాకుండా స్పోర్ట్స్ చానెల్‌లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు.
బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు..
క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో పేకాట
క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్‌కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment