సాక్షి, బొమ్మలసత్రం: దొంగకు ఇంటి తాళాలు ఇవ్వడం అనేది ఓ సామెత. ఇక్కడ పోలీసులే ఆ పని చేసి అందిరినీ ఆశ్చర్య పరిచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే నిందితులకు స్టేషన్ తాళాలు ఇచ్చేశారు. ముందస్తు దాడుల వివరాలు, ఎఫ్‌ఐఆర్ నమోదు, నిందితుల రిమాండ్ తదితర వివరాలు నిందితులకు ఎప్పటికప్పుడు తెలిసే లా ఏర్పాటు చేశారు. పోలీసులకు చెందిన వాట్సప్ గ్రూపులో నంద్యాల మట్కా డాన్ కుమార్తె నంబర్ ఉన్నట్లు పోలీసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గ్రూప్‌లో ఆమె నంబర్ ఉండటంతో పోలీసుల దాడుల వివరాలు ముందే తెలుసుకుని ఆ సమాచారాన్ని మట్కా నిర్వాహకులకు తెలియజేస్తూ తప్పించేది. ఈ విషయం బయటపటంతో నంద్యాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 13వ తేదీ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో త్రీటౌన్ పరిధిలో ఉన్న కొలిమిపేటకు చెందిన చాంద్‌బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి మట్కా నిర్వ హిస్తుండగా సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐలు తిరుపాలు, నగీనా సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. చాంద్‌బాషా కుటుంబంలోని ఓ మహిళ సెల్ నెంబర్ త్రీటౌన్ అఫీషియల్ వాట్సప్ గ్రూప్‌లో ఉండటాన్ని పోలీసులు గమనించి వెంటనే గ్రూప్ నుంచి తొలగించారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన కానిస్టేబుల్ హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసి పూర్తి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఇద్దరు మహిళా పోలీసుల పాత్రపై కూడా అనుమానం ఉండటంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment