Police Administration
-
ఖాకీ అసాంఘిక దోస్తీ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్‌కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల కేంద్రంగా.. నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్‌బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్‌లే కాకుండా స్పోర్ట్స్ చానెల్లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు. బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు.. క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పేకాట క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్‌కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
నైతిక పతనం దిశగా ఐపీఎస్
ఈ వారం చర్చనీ యాంశం.. భారత్ పోలీసు రాజ్యంగా ఉంటోందా? ఈ ప్రశ్నకు మూడు సత్వర స్పందనలు ఇలా ఉండవచ్చు: ‘కాకపోవచ్చు’, ‘అవును’ లేదా ‘ఇంకా కాదు’. దీనికి మీరు మరికొన్ని ప్రశ్నలను కూడా సంధించవచ్చు. ‘ఎందుకు’, ‘ఎలా’, ‘ఎప్పుడు’. ఈ స్పందనలను దాటి చూస్తే ఇండియన్ పోలీసు సర్వీస్.. ఇండియన్ పొలిటికల్ సర్వీసుగా రూపాంతరం చెందిందనేదే వాస్తవం. మన దేశంలో పోలీసు–రాజకీయనేతల మధ్య సంబంధం కొత్తదేమీ కాదు. కానీ ఇది నాటకీయంగా మరింత హీనస్థితికి చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎస్ ఇప్పుడు తన నైతిక, వృత్తిగతమైన ధృతిని కోల్పోయింది. పోలీసు రాజ్యం (పోలీస్ స్టేట్)కి ఆక్స్ఫర్డ్ నిఘంటువులో మరింత కఠినమైన అర్థం ఉంది. రాజకీయ, పోలీసు బలగాలచే తన పౌరుల కార్యకలాపాలపై రహస్యంగా నిఘా పెట్టి, పర్యవేక్షించే నిరంకుశ రాజ్యం అని దీనర్థం. మనమయితే ఇంకా ఆ దశకు చేరలేదు. భారత్ ఒక పోలీసు రాజ్యంగా ఇంకా మారి ఉండకపోవచ్చు కానీ పోలీసులు చట్టంగా ఉంటున్న దేశంగా మారుతోంది. ప్రస్తుతం పోలీసులు– రాజకీయనేతల మధ్య బంధం ఐఏఎస్‌లు, న్యాయవ్యవస్థను కూడా తోసిరాజంటోంది. దీనికి కొన్ని ఉదాహరణలను చూపించవచ్చు.1. తబ్రెజ్ అన్సారీ కేసు. జార్ఖండ్ వాసి అయిన 24 ఏళ్ల తబ్రెజ్ను సైకిల్ దొంగతనం చేశాడనే అనుమానంతో మూక చచ్చేంతవరకు చావబాదింది. కానీ ఆ రాష్ట్ర పోలీసులు మాత్రం మూక హింస వల్ల కాకుండా, గుండెపోటు వల్ల అతడు చనిపోయినట్లుగా కేసు తీవ్రతను తగ్గించి చూపారు. కానీ చైతన్యవంతులైన వైద్యుల బృందం దీన్ని తప్పుడు కేసుగా ఆరోపించింది.2. రాజస్తాన్‌లో పెహ్లూ ఖాన్ కేసు. గోమాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నాడనే ఆరోపణతో మూక తనను చావబాది చంపినట్లు కెమెరా సాక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని పోలీసులు సాక్ష్యంగా సమర్పించలేదు. దీంతో కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిం చింది. 3. ఉన్నావో అత్యాచార ఘటన. యూపీలోని ఉన్నావో నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని దళిత యువతి ఆరోపిస్తే ఆమెకు న్యాయం చేయడానికి బదులుగా పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టగా ఆయన కస్టడీలోనే చనిపోయాడు. పైగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ తనపైనే పోలీసులు కేసుపెట్టారు. తర్వాత బాధితురాలిపై, ఆమె లాయర్‌పై జరిగిన హత్యాప్రయత్నం ప్రజాగ్రహానికి దారి తీయడంతో సీబీఐ ఈ కేసులో ముగ్గురు పోలీసులపైనా నేరారోపణ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఢిల్లీ పోలీసులు కశ్మీర్ పౌర హక్కుల కార్యకర్త, రాజకీయనేత అయిన షెహ్లా రషీద్‌పై తాజాగా రాజద్రోహం కేసు పెట్టారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణ దీనికి మూలం. ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఆరోపణలు ఆధారంగా దేశద్రోహ కేసులను నమోదు చేయడం కన్నా మించిన న్యాయ పరిహాసం మరొకటి ఉండదు. దీంతో సంబంధిత పౌరులను తీవ్రంగా వేధించవచ్చు, విచారణ పేరుతో ఆర్థికంగా కుంగదీయవచ్చు. పైగా కన్హయ కుమార్ ఉదంతంలోవలే విచారణ లేకుండానే నెలల తరబడి జైలులో గడపవలసి రావచ్చు. ప్రభుత్వంపై, ఉన్నతాధికారులపై, సాయుధ బలగాలపై విమర్శ చేసినంత మాత్రాన దేశద్రోహం కిందికిరాదంటూ ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ గుప్తా స్పష్టం చేసిన వారంలోనే షెహ్లా రషీద్‌పై దేశద్రోహ కేసు పెట్టడం గమనార్హం. దశాబ్దాలుగా మన రాజ కీయ వర్గం పార్టీ భేదాలు లేకుండా పోలీసులను యూనిఫాంలోని మాఫియాలాగా వాడుకుంటూ, వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వస్తోంది. అయితే దీనికి రాజకీయనేతలను మాత్రమే తప్పు పట్టాలా లేక పోలీసు శాఖను నియంత్రిస్తున్న ఐపీఎస్‌కు దీంట్లో భాగం లేదా? నిజాయితీని అంటిపెట్టుకుని ఉన్న ఏ సీనియర్ పోలీసు అధికారి అయినా కాస్త బుర్రను ఉపయోగించినట్లయితే, పైన పేర్కొన్న కేసులు ఇంత దరిద్రమైన ముగింపునకు చేరుకోవన్నది వాస్తవం. న్యాయాన్ని ప్రసాదించాల్సింది కోర్టులు మాత్రమే అని నటించడం కంటే నేరచర్య మరొకటి ఉండదు. న్యాయప్రక్రియ తనంతటతాను శిక్షగా మారిపోతున్నందున దేశంలో ఏ పౌరుడైనా, తగిన వనరులున్న వారైనా సరే సంవత్సరాల తరబడి కేసుల్లో భాగంగా బాధపడాల్సి వస్తోంది. అవినీతి కేసులనుంచి మూక హింస ఘటనల దాకా రాజకీయనాయకులు ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించగలిగిన పక్షంలో న్యాయస్థానాలు అసంఖ్యాకమైన కేసుల విచారణ భారంతో నలిగిపోయే పరిస్థితే ఉండేది కాదు. అధికారంలో ఉన్న నేతల అభీష్టం మేరకు అమాయకులపై కేసులు మోపటం, వారు మద్దతిస్తున్న పార్టీలను వీడి అధికార పార్టీలోకి చేరేంతవరకు వారిని వేధిం చడం వంటి చర్యలు తప్పు అనీ, అలాంటి చర్యలకు నాయకత్వం పాల్పడవద్దని చెప్పగల దమ్ము ప్రస్తుతం ఐపీఎస్‌లో పూర్తిగా కొరవడినట్లే కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎస్ దేశంలోని రాజకీయ యజమానుల సేవకే నిబద్ధత చూపుతున్న సర్వీసుగా మారిపోయింది. నేతల ఒత్తిళ్ల ఫలితంగా పోలీసులు ఇప్పుడు దేన్నయినా తమ్మిని బమ్మిని చేసే స్థితికి పతనమయ్యారు. అవినీతి కేసులను తారుమారు చేయగలరు. మూకహత్యలో చనిపోయిన వ్యక్తిది గుండెపోటు మరణంగా మార్చేయగలరు. అత్యాచార బాధితురాలి నిరుపేద తండ్రిని కరడుగట్టిన నేరస్థుడిగా ముద్రవేసి భూమ్మీదే లేకుండా చేయగలరు. ప్రైవేట్ కంప్లయింటును కూడా రాజద్రోహ కేసుగా తారుమారు చేసేయగలరు. పీవీ నరసింహారావు తన ప్రత్యర్థుల పనిపట్టడానికి ప్రయోగించిన జైన్ హవాలా కేసుల నుంచి సీబీఐ తదితర నిఘా సంస్థల వృత్తిపర క్షీణత తొలి సంకేతాలు మొదలయ్యాయి. ప్రముఖ రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, అమాయకుల వ్యక్తిత్వ హననం ఆనాటినుంచే మొదలై ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. అనేకమంది యువ ఐపీఎస్ అధికారులు ఆదర్శవాదాన్ని రంగరించుకుని సర్వీసులోకి చేరుతుంటారు కానీ కాలక్రమంలో వారు ఆ లక్షణాన్ని పోగొట్టుకుని రాజీపడిపోవడం సహజమైపోతోంది. దీంతో సింహంలా ఉండాలనుకునేవాళ్లు చివరికి క్యారికేచర్లుగా మారిపోతున్నారు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
మావోల కదలికలపై అప్రమత్తం
సాక్షి, కొత్తగూడెం/ భూపాలపల్లి: దండకారణ్యం ఆవరించి ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సమీపంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పోలీసు యంత్రాంగం ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి సూచించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం 4 జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అరకులో చోటుచేసుకున్నటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. విధుల్లో ఏమాత్రం తేడా వచ్చినా మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. పోలీసు స్పెషల్ పార్టీ, ఆపరేషన్ టీంలతో పాటు జిల్లాల ఎస్పీలు స్పెషల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. ఏజెన్సీలో పర్యటించే నేతల వివరాలు తెలుసుకుంటూ వారి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాజిక పోలీసింగ్ విధానంతో రక్షణ చర్యలు సామాజిక పోలీసింగ్ విధానంతో రక్షణ చర్యలు చేపడతామని మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎన్నికల కేంద్రాల వద్ద లోకల్ పోలీస్‌లు, పారామిలటరీ, స్పెషల్ ఫోర్స్, గ్రేహౌండ్స్ బలగాలతో సమ న్వయం చేసుకుంటూ భద్రతను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. సమావేశంలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్సీ ఐజీ నవీన్‌చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు, రామగుండం కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
రాపూరు పీఎస్‌పై దాడి ఘటన: ఎస్ఐ బదిలీ
రాపూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎస్ఐ లక్ష్మణరావును బదిలీ చేశారు. ఈ మేరకు లక్ష్మణరావు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎస్ఐగా చల్లా వాసును నియమించారు. కాగా, శుక్రవారం రావూలో జాతీయ ఎస్.సి, ఎస్.టి కమిషన్ సభ్యుడు రాములు పర్యటించనున్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడితో పాటు దళిత కాలనీని రాములు సందర్శించనున్నారు. గత వారం కొంతమంది పోలీస్ స్టేషన్ గేట్లు ధ్వంస చేసి లోనికి చొరబడ్డ విషయం తెలిసిందే. దళితవాడకు చెందిన కొందరు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌కు డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్లోకి ప్రవేశించి విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చి న ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు. -
‘కళ’లతో కళ్లెం
సంగారెడ్డి క్రైం : మితిమిరిన వేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడుపడంతో తనతో పాటు రోడ్డుపై నడిచే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు సైతం భరోసా లేని ప్రస్తుత తరుణంలో జిల్లాపోలీస్‌శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తరుచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం యువత అతివేగం ఒక కారణం అయితే మద్యం తాగి వాహనాలు నడుపడం మరోకారణం. దీన్ని గుర్తించిన అధికారులు జరుగుతున్న పరిణామలు, వాటి వల్ల ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన ఇతివృత్తంతో షార్ట్‌ఫీల్మ్‌లను నిర్మించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కళా బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన, షార్ట్ ఫిల్మ్‌లతో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజులోనే వేల మంది ఈ వీడియోలను ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నారు. ఆన్లైన్ మోసాలపై... ప్రజల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకొని కొందరు ఆన్లైన్ మోసాలకు గురై నష్టపోయిన విషయాన్ని గుర్తించిన పోలీసు శాఖ స్థానిక యువకులతో ఇందుకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలను మోసగాళ్లు ఏ విధంగా ఆకట్టుకుంటారో అనంతరం ఎలా బురడి కొట్టిస్తారో కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం ద్వారా వివరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీని వలన మోసపోయి ఆత్మహత్యలకు పూనుకోకుండా ఉండేలా వారిలో ఆత్మస్థైర్యం కల్పించేలా అవి రూపొందిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించేలా ప్రోత్సాహిస్తున్నారు. ఈ దృశ్యాన్ని సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల చిత్రీకరించారు. డ్రంకెన్ డ్రైవ్ నివారణకు.. మద్యం తాగి వాహనాలు నడుపడం ద్వారా తనతో పాటు ఇతరులకు ప్రమాదం పొంచి ఉంటుందని అంతేకాకుండా తనపై ఇతరులు ఆధారపడి ఉన్న విషయాన్ని మర్చిపోకుండా ఆలోచింపజేసేలా చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. ఈ ప్రక్రియపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ కేసులు నమోదుచేయడమే కాకుండా పట్టుబడిన వారి పరివర్తన కోసం తనదైన పంథాలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రేమ, పెళ్లి తదితర సమస్యలపై.. యుక్త వయస్సులో సామాజిక కట్టుబాట్లు, కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోయి ప్రేమపేరుతో వివాహాలు చేసుకుంటున్న జంటలు.. ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన చిత్రం సైతం తీయడానికి పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. కులం, మతాలకు ఆతీతంగా ప్రేమ వివాహాలు చేసుకోవడంతో రెండు కుటుంబాలు ఆదరించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒంటరిగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘనటలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంతో కూడిన చిత్రాన్ని రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. కళాబృందాలతో చైతన్యం.. ప్రజల భాషలో వ్యవహరిక ఇతివృత్తాలతో రూపొందించిన గేయ రూపంలో పోలీస్ కళాబృందాలు గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, అంటరానితనం, షీ టీమ్ అందిస్తున్న సేవలు, ఆన్లైన్ మోసాలు, పేకాట, జూదం, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 20 గ్రామ పంచాయతీలో కళాబృందాలు పర్యటించి అవగాహన కల్పించాయి. అందరికీ అర్థం కావాలనే.. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేసే విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. అలాంటి అంశాలపై ప్రజలకు సులభమైన పద్ధతిలో చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ఆలోచనతో షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రజల నుంచి వీటికి వస్తున్న ఆదరణతో మరికొన్ని నూతన చిత్రాలు నిర్మించేందుకు సమాయత్తమవుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ , సంగారెడ్డి -
సకల హంగులతో పోలీస్ కార్యాలయం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లాలో నూతన పోలీస్ కార్యాలయం భవన నిర్మాణానికి ఎస్పీ చందనాదీప్తి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఔరంగాబాద్ గ్రామ శివారులో నూతనంగా జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 60 ఎకరాల్లో ఈ కార్యాలయ సముదాయం ఉంటుందన్నారు. ఈ మేరకు రూ. 25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా.. రూ. 15కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మిగతా నిధులతో ఇందులో ఏఆర్ హెడ్ క్వార్టర్, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్, పరేడ్ గ్రౌండ్, సిబ్బందికి సంబంధించిన బ్యారక్‌లు నిర్మించడం జరుగుతుందన్నా రు. ఇటీవల సీఎం కేసీఆర్ ఔరంగాబాద్ శివా రులో సమీకృత కలెక్టరెట్, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అయితే జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీసు కార్యాలయం నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేయడం చర్చనీయాంశంగా మా రింది. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈఈ టి.విశ్వనాథం, ఏఈ సంజయ్, మెదక్ అదనపు ఎస్పీ నాగరాజు, మెదక్ రూçరల్ సీఐ రామకృష్ణ, హవేళిఘణాపూర్ ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య
గూడూరు: రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య అని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయమై కొన్ని చానళ్లలో వాస్తవాలు చూపకుండా వక్రీకరించారని తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబుతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాపూరుకు చెందిన జోసఫ్ అనే వ్యక్తి సుబ్బరాయులుకు గతంలో రూ.2వేలు ఇచ్చి ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జోసఫ్ భార్య దీనమ్మ అతని వద్దకు వెళ్లి నగదు ఇవ్వాలని కోరగా అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. ఈ క్రమంలో జోసఫ్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారన్నారు. అతనుతో పాటు కొందరు మద్యం సేవించి ఉండగా వారిని బయటే ఉండాలని పోలీసులు సూచించారని తెలిపారు. పోలీసులను మద్యం తాగి దూషిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారన్నారు. దీంతో ఏదో జరుగుతున్నట్లు వక్రీకరించి కొందరు దళితవాడలోని ప్రజలను రెచ్చగొట్టే విధంగా సమాచారం ఇవ్వడంతో కాలనీ నుంచి కొంతమంది పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసులు సంయమనం పాటించారే తప్ప వారిపై ఎలాంటి దాడి చేయలేదని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఎం.పిచ్చయ్య, కె.రమేష్, రంగయ్య, జార్జి, ఎం.వేమయ్య, ఆర్.రాజేష్. ఎం.లక్ష్మి, ఎం.పెంచలమ్మ, వరలక్ష్మి, పి.కనకమ్మ, ఆర్.పెంచలమ్మ, ఆర్.హైమావతితో పాటు రాపూరు గ్రామ సర్పంచ్ భర్త తుమ్మలపల్లి మధుసూదన్‌రావు ప్రమేయం ఉందని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. దాడి అమానుషం గూడూరు రూరల్: పోలీసు స్టేషన్లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేయడం అమానుష చర్య అని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. గూడూరు రూరల్ పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రాపూరు పోలీసు స్టేషన్‌పై అక్కడి దళితులు బుధవారం రాత్రి దాడి చేసి ఎస్సై, సిబ్బందిని గాయపరిచారు. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో 30 మందిని గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరువర్గాలను పిలిచి రాపూరు ఎస్సై లక్ష్మణరావు మాట్లాడుతుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడన్నారు. గొడవకు దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అతనికి సంబంధించిన బంధువులు ఒక్కసారిగా మూకుమ్మడిగా పోలీసు స్టేషన్లోకి చొరబడి విచక్షణారహితంగా ఎస్సై, సిబ్బందిపై దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
రాపూర్ పోలీస్‌స్టేషన్ దాడి కేసులో పురోగతి
-
నెల్లూరు జిల్లా కలువాయి పీఎస్‌ను ముట్టడించిన గ్రామస్థులు
-
ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి
తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): ఓ కానిస్టేబుల్ తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ గొల్లపాలెం పోలీసు స్టేషన్ ఎదుట ఒక యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. బాధితురాలు, నిందితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శలపాకకు చెందిన వాకపల్లి నాగబాబు ఇండియన్ టిబెట్ బోర్డర్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా హర్యానాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పోలినాటి సంధ్య, నాగబాబు ప్రేమించుకుంటున్నారు. సంధ్య కాకినాడలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతుంది. ఈ క్రమంలో జూలై 23న సంధ్యతో కలిసి నాగబాబు బైక్‌పై వెళుతున్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికీ గాయాలయ్యాయి. దీంతో వారి ప్రేమ సంగతి తెలుసుకున యువతి కుటుంబీకులు ఇరువురికీ వివాహం చేయమని నాగబాబు కుటుంబీకులను అడిగారు. నాగబాబు ఆసుపత్రి నుంచి వచ్చాక మాట్లాడదామంటూ అతడి తల్లిదండ్రులు విషయాన్ని దాటవేశారు. దీంతో సంధ్య కుటుంబీకులు జూలై 29న కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నాగబాబు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని తలంచాడు. అదే రోజు రాత్రి శలపాక గ్రామానికే చెందిన దడాల పద్మశ్రీ అనే మరో అమ్మాయిని తుని చర్చిలో వివాహం చేసుకున్నాడు. దీంతో సంధ్య మంగళవారం తన బంధువులతో వచ్చి గొల్లపాలెం పొలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. ఎస్సై షేక్ జబీర్ ఆందోళనకారులను శాంతింపజేసి నిందితుడు నాగబాబును పోలీసు స్టేషన్‌కు రప్పించారు. తాను ముందు నుంచీ దడాల పద్మశ్రీనే ప్రేమిస్తున్నానని జూలై 14న తమ ఇద్దరికీ వివాహమైందంటూ అబద్ధం చెప్పాడు. సంధ్య ఆరోపించినట్టుగా తమ విహహం జూలై 29న జరగలేదని, ఆ రోజు తాను గాయాలతో ఆసుపత్రిలో ఉన్నానని నిందితుడు ఫొటోలు, ఇతర ఆధారాలు చూపి, పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు, అతడి స్నేహితుల సెల్ఫోన్లు సేకరించిన ఎస్సై షేక్ జబీర్ ఇరు వర్గీయులను విచారించారు. బాధితురాలు జూలై 29న ఎస్పీకి ఫిర్యాదు చేశాక, అదే రోజు రాత్రి నిందితుడు దడాల పద్మశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సమయానికి అతడికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు సెల్ఫోన్లో తీసిన ఫొటోలు బయట పెట్టారు. దీంతో నిందితుడు నాగబాబు తాను చేసిన మోసాన్ని అంగీకరించాడు.దీంతో నాగబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. -
శిక్షించండి లేదా..క్షమించండి!
సాక్షి, సిటీబ్యూరో: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు కావస్తోంది... అతడితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు పోలీసులకు తాఖీదులు జారీ చేసి ఏడాదిన్నర దాటింది... దీనికి వారు సమాధానం ఇచ్చి సంవత్సరం కావస్తోంది... అయినా ఇప్పటికీ దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్‌కు గురైన వారిపై చర్యలు ఉపసంహరించిన అధికారులు తాఖీదుల విషయం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చార్జ్మెమోలపై నిర్ణయం తీసుకోకుంటే అది తమ పదోన్నతుల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అనేక మందికి చార్జ్‌మెమోలు... నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి వ్యవహారాలను దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పలువురు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు అనేక మంది పోలీసుల పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరికి నయీంతో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు లభించగా.. మరికొందరు అతడితో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో 20 మందిపై విచారణ నిర్వహించారు. వీరిలో 16 మందికి నయీంతో ఉన్న సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ చార్జ్‌మెమోలు జారీ చేశారు. సమాధానాన్ని పట్టించుకోలేదు... చార్జ్‌మెమోలు అందుకున్న వారిలో డీఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వీరంతా ఆరు నెలల్లోపే వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేసిన నయీంతో విధి నిర్వహణలో భాగంగానే సంబంధాలు కొనసాగించామని, ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు అధికారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అతడితో ఎలాంటి సంబంధాలు లేవని, అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్‌లో అతడు కలిశాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు ప్రతి అధికారీ అతడితో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని, సెటిల్మెంట్లతో సంబంధాలు లేకపోవడమే కాదు అప్పట్లో ఈ వివరాలు తమకు తెలియవని చెప్పారు. పట్టించుకోని ఉన్నతాధికారులు... నయీంతో సంబంధాల ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో ఇద్దరిపై ఇటీవల చర్యలు ఉపసంహరించారు. చార్జ్‌మెమోలు అందుకున్న అధికారులు వివరణలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సాధారణంగా పోలీసులపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తే వారికి చార్జ్‌మెమో జారీ చేస్తారు. సదరు అధికారి ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే చార్జ్‌మెమో ఉపసంహరించడం, లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నయీం కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు ఇచ్చిన వివరణల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. సాధారణంగా వివరణ ఇచ్చిన మూడు నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉన్నా... డీజీపీ కార్యాలయంతో పాటు నగర పోలీసు కార్యాలయం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. పదోన్నతి ప్రక్రియకు అడ్డంకిగా... పోలీసు విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం పదోన్నతి ఓ ప్రహసనం. ఓ అధికారికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి చార్జ్‌మెమోలు అడ్డంకిగా మారితే ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఆ మెమో డ్రాప్ చేసినా.. మళ్లీ పదోన్నతి ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎన్నాళ్లకు సాకారమవుతుంతో చెప్పలేని స్థితి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతి కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబితాలో చార్జిమెమోలు అందుకున్న వారుసైతం ఉన్నారు. వారి వివరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ప్రమోషన్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా అధికారులు కోరుతున్నారు. -
కొత్త ‘పోలీసులు’
హైదరాబాద్ : పోలీస్ స్టేషన్లో విధులు ఎవరు నిర్వర్తిస్తారు..? పోలీసులే కదా అని తేలికగా అనేయకండి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఆ మాట మాత్రం మీరు చెప్పరు. ఎందుకంటే అక్కడ పోలీసులతో పాటు సీమకోళ్లు కూడా విధులు నిర్వర్తిస్తుంటాయి. అదేంటి సీమకోళ్లకు అక్కడేం పని అని ఆశ్చర్యపోకండి. అవి ఎవరికి కాపలా కాస్తున్నాయనే కదా మీ అనుమానం. బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలోని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లోని పురాతన క్వార్టర్స్‌లోకి మార్చారు. అయితే ఇటీవల ఈ క్వార్టర్లోకి పాములొస్తున్నాయి. వారం కింద రెండు నాగుపాములు ట్రాఫిక్ సీఐ బల్వంతయ్య గదిలోనే తిష్టవేశాయి. వీటి బారి నుంచి రక్షించుకునేందుకు సీమకోళ్ల ఉపాయాన్ని అమలు చేశారు. సీమకోళ్లు ఉన్న ప్రాంతంలో పాములు తిరగవు. పాములను రానివ్వవు. శనివారం స్టేషన్ ఆవరణలోకి రెండు సీమకోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. -
టెక్కలి పోలీసు సబ్ డివిజన్‌కు ప్రతిపాదనలు
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలోని మూడు పోలీసు సబ్ డివిజన్లకు అదనంగా టెక్కలిలో మరో సబ్ డివి జన్ను ఏర్పాటుకు, కాశీబుగ్గ సబ్‌డివిజన్ కేంద్రాన్ని ఇచ్ఛాపురానికి మార్చేందుకు ప్రతిపాదించా మని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ తెలిపారు. నరసన్నపేట, ఆమదాలవలసల్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నరసన్నపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో గతంలో పొల్చితే కానిస్టేబుళ్ల సంఖ్య బాగా పెరిగిందని, రిమోట్ మండలాల్లోనూ అవసరం మేరకు వేశామన్నారు. ఇటీవల 260 మంది కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. తగ్గిన ప్రమాదాలు.. జిల్లాలో 170 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై మే నెలలో ముగ్గురు మాత్రమే ప్రమాదాల్లో మరణించారన్నారు. ఇతర ప్రమాదాలు చాలా మేరకు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. గతేడాది మేలో 51 ప్రమాదాలు కాగా, ఈ ఏడాది మేలో 17కు తగ్గాయన్నారు. వీటిని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగతనాలు అదుపులో ఉన్నాయని, గుట్కా అమ్మకాలపై పూర్తిగా పట్టుబిగించామని, రహదారిపై అక్రమ రవాణా ను ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. బెల్ట్ షాపులు తగ్గాయని తెలిపారు. ఆటోలు, మినీ వ్యాన్‌ల్లో అధిక లోడ్ కేసులు పెడుతున్నామని, డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండో స్థానంలో కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ జిల్లాలో 2,901 మంది కమ్యూనిటీ పోలీసుల పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 410 మం ది వరకూ రోజూ విధులకు వస్తున్నారని ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ నిర్వహిం చడంలో చిత్తూరు తరువాత మనమే ఉన్నామని పేర్కొన్నారు. వీరికి వారి ఇష్టం మేరకే పనులు అప్పగిస్తున్నామని, అమ్మాయిలు కూడా వస్తున్నారని తెలిపారు. పాలకొండ, రాజాంలో షీ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సబ్ డివిజ న్ వద్ద ప్రత్యేక షీటీంలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయని, నరసన్నపేటలో క్వార్టర్స్ దుస్థితి స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. వీటి మరమ్మతులకు నివేదికలు పంపామన్నారు. -
ఠాణాలో బెల్లం మాయం ?
సాక్షి, మహబూబాబాద్ : పోలీస్ స్టేషన్లో బెల్లం మాయమైంది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. స్టేషన్లో దొంగతనం ఏంటి.. ఏ దొంగకు అంత ధైర్యం ఉంటుందనే కదా మీ డౌటు. కానీ కేసముద్రం పోలీస్ స్టేషన్లో మాత్రం బెల్లం, మోటారు వాహనాల స్పేర్ పార్టులు కూడా మాయమవుతాయనే ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రోజువారి తనిఖీల్లో పట్టుబడిన బెల్లాన్ని పోలీసులు సాధారణంగా ఎక్సైజ్ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలం రావటం, బెల్లం తడిసి కారుతూ వాటి చుట్టూ ఈగలు ముసురుతుండటంతోపాటు, దుర్వాసన వస్తుండటంతో కేసముద్రం స్టేషన్‌లోని బెల్లాన్ని బావిలో వేయాలని స్థానిక ఎస్సై సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఇదే అదనుగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సుమారు 20 క్వింటాళ్ల బెల్లాన్ని పాడుబడ్డ బావిలో వేస్తామని చెప్పి ట్రాక్టర్లో పట్టుకెళ్లారు. కానీ బెల్లాన్ని కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాల్లోకి తీసుకెళ్లాక వేరే వాహనంలోకి తరలించి, నామమాత్రంగా అందులో కొంత బెల్లాన్ని గ్రామశివారులోని బావిలో వేసినట్లు సమాచారం. సదరు కానిస్టేబుళ్లు ఇద్దరు గతంలోనూ ఇలాంటి పనులు చేయటంతో పాటు, స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే రికవరీ చేశాం : ఎస్సై సతీష్ ఇదిలా ఉండగా ఈ విషయమై కేసముద్రం ఎస్సై సతీష్ వివరణ కోరగా అలాంటిది ఏమి లేదని, ఐదు క్వింటాళ్ల బెల్లంను బావిలో పడేయడానికి తీసుకెళ్తున్న క్రమంలో కూలీలు ఐదు బస్తాలు కాలేజీ ఆవరణలో విసిరేశారని తెలిపారు. సమాచారం తెలుసుకొని వాటిని వెంటనే రికవరీ చేసినట్లు వివరణ ఇచ్చారు. -
బాలికపై వేధింపులు.. పోలీస్ స్టేషన్లో.. విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : వేధింపులకు గురైన ఓ బాలిక ఇంటికి వెళ్లటం ఇష్టంలేక పోలీస్ స్టేషన్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన న్యూఢిల్లీలోని తిలక్ విహార్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన ఓ బాలికను పొరుగింటి వారు వేధింపులకు గురి చేయటంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలో వారు గొడవ పడ్డారు. తన వల్లే గొడవలు జరుగుతున్నాయని మనోవేదనకు గురైన బాలిక పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసు అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విచారణ కోసం ఇరుకుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించామన్నారు. వారు గొడవ పడుతున్న సమయంలో బాలిక ఇంటికి పోవటానికి ఇష్టపడలేదన్నారు. దీంతో ఆమెను నారీ నికేతన్‌కు పంపించాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తెలిపారు. బాలిక తల్లి మాట్లాడుతూ.. తన కూతురిని పొరుగింటి వాళ్లు అపహరించి వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. వారి కొడుకుతో తన కూతురి పెళ్లి చేయటానికే ఇలా చేశారని తెలిపింది. -
మద్యం ఎంతైనా తాగండి, కానీ.. : డిప్యూటీ సీఎం
పెరవలి: మద్యం ఎంతైనా తాగండి అది మీఇష్టం, కానీ రోడ్డుపైకి వస్తే మాత్రం కేసులు పెడతాం అని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెరవలిలో రూ.68 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలంటే ఇటువంటి కేసులు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిని పడుతున్నారని, వీటి నివారణ కోసమే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు వంటివి నిర్వహిస్తున్నారన్నారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మ్‌ట్ వాడాలని అది మీ రక్షణకేగానీ మా గురించి కాదన్నారు. ఈ నాలుగేళ్లలో 40 పోలీస్ స్టేషన్లకు భ వనాలు నిర్మించామని, అందులో పెరవలి పోలీస్ స్టేషన్ ఒకటన్నారు. నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. యువత పెడదోవ పట్టటానికి సెల్ఫోన్లు కారణమని వారికి అవి అందకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదేన్నారు. జిల్లాకు పోలీసుల కొరత: మంత్రి పితాని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారని, వెంటనే భర్తీ చేయాలని కోరారు. హోం మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రం మొత్తం మీద 6వేల పోస్టులు భర్తీ చేయగా అందులో జిల్లాకు 350 మందిని కేటాయించామన్నారు. అవసరమైతే మరింత మందిని పెంచుతామన్నారు. ఇంటికి తీసుకెళ్లి తాగండి : మంత్రి జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. మద్యం తాగొద్దని తాము చెప్పబోమని, ఇంటికి తీసుకెళ్లి తాగాలని చూచించారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రసంగించారు. పోలీస్ స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. మంత్రులు రాజప్ప, పితాని, జవహర్, ఎస్పీ రవిప్రకాశ్‌లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరావు, సీఐ అప్పలస్వామి, ఎస్సై పి. నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు అతికాల కుసుమాంజలిరమ్యశ్రీ, ఎంపీపీ నల్లి శిరీష, సర్పంచ్ సలాది సత్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు ఆగిర్తి స్వరూపారాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన నవదంపతులు
కావలిఅర్బన్: తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ నవదంపతులు గురువారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దంపతులు కట్టా పవన్‌కుమార్, ఎం.మనీషాలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీరు నెల్లూరులో మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో రెండురోజుల క్రితం ముసునూరులోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. -
‘గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’
నటి రేణూ దేశాయ్.. నటుడు పవన్ కల్యాణ్‌తో విడాకుల వ్యవహారంపై మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ‘పవనే విడాకులు కావాలని కోరారంటూ’ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ కొందరు ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పవన్-అన్నాలెజ్నెవా కూతురు పొలెనా ప్రస్తావన తెస్తూ రేణూ దేశాయ్ పీఆర్ టీమ్ ఆవిడ ఫేస్బుక్ పేజీలో వరుస పోస్టులు చేసింది. ‘బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తర్వాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకుల వ్యవహారం మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అన్నాలెజ్నెవా గర్భం దాల్చిన విషయం రేణూ మేడమ్‌కు తెలియదు. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత పవన్‌కు రేణూ మేడమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఆవిడ మరో ఇంటర్వ్యూలో చెప్పారు’ అని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ట్రోల్ టెంప్లేట్లను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. -
పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణం
సాక్షి, చెన్నై/వేలూరు: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పోలీస్టేషన్ గేటు ముందే దారుణ హత్యకు గురికావటం తమిళనాట సంచలనం సృష్టిచింది. వివరాలు.. వేలూరు జిల్లా రాణిపేటలోని సెంగాడు ప్రాంతానికి చెందిన సుగుణ పొరుగునే ఉంటున్న సురేంద్రకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సురేంద్రపై ఫిర్యాదు చేసేందుకు సుగుణ బుధవారం స్థానిక మహిళా పోలీస్టేషన్‌కు వచ్చింది. ఫిర్యాదు చేసి బయటకు వస్తుండగా స్టేషన్ గేటు దగ్గరే కాపుగాసిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో ఆమెపై దాడిచేశారు. విచక్షణారహితంగా ఆమెను నరికేశారు. తీవ్ర గాయాలతో సుగుణ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. రెప్పపాటు కాలంలో పోలీస్టేషన్ ఎదుటే ఈ దారుణ ఘటన జరగడం గమనార్హం. మృతదేహాన్ని వాలాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామనీ, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. సురేంద్ర, సుగుణకు గతంలో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి చాంపియన్ సెబాస్టియన్ వెటెల్
ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 27 నిమిషాల 29.784 సెకన్లలో ముగించాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది నాలుగో విజయం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఏడో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. -
పోలీస్ స్టేషన్లో కొత్త పెళ్లికూతురి నిర్వాకం
చండిఘడ్ : పంజాబ్ రాజకీయాలన్ని ఇప్పుడు డ్రగ్స్ చుట్టే తిరుగుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే.. పోలీసులు మాత్రం మాకు ఇవేవి పట్టవన్నట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఫిరోజ్‌పూర్ డీఎస్పీ ఒక మహిళకు బలవంతంగా మత్తు పదార్ధాలు అలవాటు చేసిన సంగతి బయటకు రావడంతో మొత్తం పోలీస్ శాఖ మీదనే చెడు అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వీడియో మరొకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక నవ వధువు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే కూర్చుని ‘చిట్టా’(హెరాయిన్ లాంటి మత్తు పదార్ధం) తాగుతుంది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. పెళ్లి దుస్తులు ధరించిన ఓ యువతి వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ఉంది. ఆ మంట మీద ‘చిట్టా’ ఉన్న ఫాయిల్ పేపర్‌ను పెట్టి దాన్ని తాగుతు ఉంది. యువతి పోలీస్ స్టేషన్లోనే ‘చిట్టా’ సేవిస్తుందనడానికి నిదర్శంగా అక్కడ ఉన్న కొవ్వొత్తి నలుపు రంగు ఇనుప పెట్టెలో ఉంది. ఈ ఇనుప పెట్టే సాధారణంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కనిపిస్తుంది. వీడియోలో ఒక వ్యక్తి గొంతు కూడా వినిపిస్తుంది. అతను ‘నేను జలందర్‌లో రైడ్ చేయడానికి వెళ్తున్నని’ అంటున్నాడు. యువతి పోలీస్ స్టేషన్లోనే ఇంత దర్జాగా డ్రగ్స్ సేవిస్తుందంటే దీని వెనక కూడా పోలీసుల హస్తం ఉన్నదేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానికంగా ‘చిట్టా’ అని పిలిచే ఈ మత్తు పదార్ధంలో హెరాయిన్‌తో పాటు ఎల్ఎస్డీ కూడా కలిసి ఉండి ఎక్కువ మత్తు కల్గిస్తుంది. గతంలో ‘చిట్టా’ అంటే కేవలం హెరాయిన్ మాత్రమే. కానీ నేడు వేర్వేరు పదార్ధాలు కలిసి అదో శక్తివంతమైన మత్తు పదార్ధాంగా తయారయ్యింది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్ టెస్ట్‌లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పోలీసు బదిలీ(ల)లు!
సాక్షి, గుంటూరు: పోస్టింగ్‌ల కోసం పోలీసు అధికారుల పైరవీలు ఊపందుకున్నాయి. నచ్చిన పోస్టింగ్ ఇప్పించే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యనేతలతో సన్నిహితంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలతో బేరాలు సైతం కుదుర్చుకుంటున్నారు. పోస్టును బట్టి ధర నిర్ణయిస్తున్నారు. డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణతో పోలీసు శాఖలో బదిలీల హడావుడి ఊపందుకుంది. పోస్టింగ్ పడాలంటే ముఖ్యనేతల సిఫార్సు ఉండాలనేది బహిరంగ రహస్యమే. నీతి, నిజాయితీ, అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా పోస్టింగ్‌లు కేటాయిస్తున్న పరిస్థితి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు .. నిజాయతీగా పని చేసే ఆరికి లూప్‌లైన్ పోస్టింగ్‌లు కేటాయిస్తున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో.. రాజధాని ప్రకటన నుంచి గుంటూరు జిల్లాలో పోలీసుల పోస్టింగ్‌లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత సంప్రదాయాన్ని తుంగలో తొక్కి సిఫార్సులు ఉన్నవారికే పోస్టింగ్‌లు దక్కేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తోంది. గతంలో సీఐల బదిలీలు చేపట్టాలంటే రేంజ్ పరిధిలోని ఎస్పీలతో సమావేశం నిర్వహించి పని తీరు ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించే వారు. ప్రస్తుతం రాత్రికి రాత్రే రెండు, మూడు పోస్టింగ్‌లు చొప్పున వేసేస్తూ ఎస్పీలు ఇచ్చిన నివేదికలు పక్కన పడేసి అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సారి జరిగే తమకు అనుకూలమైన వారికి ఇష్టమొచ్చిన ప్రాంతాల్లోకి బదిలీ చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాము చెప్పినట్లు వినే అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. నిజాయతీకి దక్కని గౌరవం పోలీసు అధికారుల్లో నిజాయతీగా పని చేసే అనేక మందికి నాలుగేళ్లుగా ఒక్క లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కూడా దక్కని పరిస్థితి ఉండగా, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే పోలీసు అధికారులకు మాత్రం వరుస పోస్టింగ్‌లు ఇస్తూ ప్రాధాన్యత గల స్టేషన్లు అప్పగించారు. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు బదిలీ అవుతారంటూ అధికార పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఎస్పీ బదిలీతో రూరల్ జిల్లా పరిధిలో పలువురు సీఐలను సైతం మార్చేందుకు అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారులకు జాబితా పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత నెలకొనాలంటే సిఫార్సులను పక్కన బెట్టి సమర్థత గల పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. పోస్టును బట్టి ధర పోలీసు స్టేషన్లను ప్రాధాన్యతను బట్టి ఏ,బీ,సీ గ్రేడ్లుగా విభజించినట్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నేతలు సైతం పోస్టింగ్‌ను బట్టి ధర నిర్ణయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలతో సరైన సంబంధాలులేని పోలీసు అధికారులు ద్వితీయ శ్రేణి నేతలకు ముడుపులు ఇచ్చి అయినా పోస్టింగ్ దక్కించుకోవాలని బేరసారాలు కొనసాగిస్తున్నారు. -
శ్రీరాముడు సీతమ్మ ఆయనతో ఉంటే బాగుండేది: కత్తి మహేష్
కరీమాబాద్: ‘శ్రీరాముడు దగుల్బాజీ..సీతమ్మ రావణుడితోనే ఉంటే బాగుండేదని’ హైందవుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆదివారం నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో లేబర్‌కాలనీకి చెందిన అడ్వకేట్ బాలినె శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నందిరామ్‌ను వినతిపత్రంలో కోరినట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పుప్పాల రాజేందర్ ఉన్నారు. -
సొత్తు మాయం.. రికవరీ మేమెరుగం
2016 మార్చి 19న పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్‌లో బ్రాహ్మణపల్లెకు చెందిన సూదా తిరుపతిరెడ్డి అనే ఖాతాదారుడిని ఏమార్చి రూ.4.30లక్షల క్యాష్‌బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొద్దుటూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఎస్ఐ వెంకటరమణ వారంరోజుల్లో దొంగలను పట్టుకుంటానని చెప్పారు. రెండేళ్లు అయినా దొంగల జాడలేదు. పోయిన సొమ్ము రికవరీ లేదు. 2016 జూలై 22వ గిద్దలూరు ప్రధాన రహదారిలో ఉన్న నాలుగు ఇళ్లలో, పోలీస్‌శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మరియన్న ఇంట్లో దొంగలు పడి సొత్తు దోచుకెళ్లారు. కేసు నమోదు చేయమని బాధితులు ఎస్ఐని అడిగితే ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు బాధితులు పోరుమామిళ్ల సీఐని సంప్రదించారు. సీఐతో చివాట్లు తిన్న ఎస్ఐ తర్వాత కేసు నమోదు చేశారని తెలిసింది. అయితే ఇంతవరకు దొంగలు దొరకలేదు. సొత్తు రికవరీ కాలేదు. ఇలా కలసపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల పదికిపైగా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు వాటిపై కేసులు లేవు.. రికవరీ లేదు. బాధితులు స్టేషన్‌వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కలసపాడు : ఒక పుస్తెల గొలుసు సమకూర్చుకోవడం ఓ కూలీ కుటుంబానికి ఎవరెస్టు శిఖరం ఎక్కినంత కష్టం. మధ్యతరగతి వారు జీవితాంతం కష్టపడితేగానీ నాలుగు తులాల బంగారం సమకూర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి కుటుంబాల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి దోచుకుని పండుగ చేసుకుంటున్నారు దొంగలు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళుతున్నా తమ మెడకు మరో కేసు చుట్టుకుంటుందని భావించే పోలీసులు బాధితులపై చిందులేసి తరుముతున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదు. ఇదీ కలసపాడు పోలీసుస్టేషన్ తీరు. ఒక పోలీసుస్టేషన్ పనితీరును జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలంటే దాని పరిధిలో కేసుల నమోదు, పెండింగ్ కేసుల ఆధారంగా బేరీజు వేస్తుండంటంతో తమకు భారంగా తోచే ఏ కేసునైనా కలసపాడు పోలీసులు ఆదిలోనే తుంగలో తోక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది కలసపాడులో దాదాపు పదికిపైగా చోరీలు జరిగితే స్టేషన్లో నమోదైంది మాత్రం ఒక్కటే కేసు. కేసులు తక్కువ ఉన్న పోలీస్స్టేషన్లు ఉన్నతాధికారుల దృష్టిలో బాగా పనిచేస్తున్నట్లు. కానీ కలసపాడులో జరగుతుంది వేరు. స్టేషన్లో రికవరీ కేసులు ఏమీ నమోదు చేయడంలేదు. అంతేగాకుండా తనకు భారంగా తోచే ఏ కేసునూ ఎస్ఐ నమోదు చేయడం లేదు. గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న ప్రజలు ఇటీవల దొంగలు తిరుగుతున్నారంటూ గ్రామాల్లో ప్రచారం ఎక్కువైంది. దీంతో ఆయా గ్రామాల్లోని యువత కర్రలు చేతపట్టుకుని రాత్రిపూట గస్తీ తిరగడం ప్రారంభించారు. పోలీసులు మాత్రం గ్రామాలకు వెళ్లడం గానీ.. మేమున్నామన్న ధైర్యం చెప్పడంగానీ చేయలేదు సరికదా దొంగల గురించి ఎవరైనా వాట్సాప్‌ల్లో ప్రజలకు సమాచారం అందిస్తే వారిని పట్టుకుని హింసించడం ఒక పనిగా పెట్టుకున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. వరుస ఘటనలతో వణుకుతున్న ప్రజలు ఇటీవల వరుసగా దొంగతనాలు గ్రామస్తులకు నిద్ర లేకుండా చేశాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధిలో ఒకరి ఇంట్లో, శివాలయంలో, పెండ్లిమర్రి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, లింగారెడ్డిపల్లె బాలింతమ్మ గుడిలో, నల్లగొండు పల్లె పోలేరమ్మ గుడిలో, ఇటీవల ముద్దిరెడ్డిపల్లెలోని మూడు ఇళ్లలో, కాశినాయన మండలం నరసాపురంలోని బ్రహ్మంగారిగుడిలో చోరీలు జరిగాయి. 20రోజుల కిందట పెండ్లిమర్రి సమీపంలోని ఆంజన్న గుడిలో పూజారిపై దొంగలు దాడి చేసి అతనిని గాయపరిచి పరారయ్యారు. ఇన్ని ఘటనలు జరిగినా ఒక్క కేసు నమోదు చేయలేదు. కలసపాడు స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగడం లేదని ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పోలీసు అనిపించుకునేందుకు ఎస్ఐ ఆరాటపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. సొత్తు పోగొట్టుకున్న బాధితులు మాత్రం బాధలు అనుభవిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ రోజుల్లో నేరం చేసిన వ్యక్తి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేదని నేర సమీక్షల్లో ఉన్నత అధికారులు తరచూ చెబుతుంటారు. కానీ కలసపాడు ఎస్ఐ.వెంకటరమణకు ఇవేవి వంటపట్టినట్లులేదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ, నచ్చని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న యువకులు విడుదల కాశినాయన : నకిలీ నోట్లు ఉన్నాయని కలసపాడు ఎస్ఐ వెంకటరమణ మండల కేంద్రమైన నరసాపురానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కలసపాడు మండలం రామాపురానికి చెందిన తిరుపతిరెడ్డి అనే వ్యక్తి గతంలో నకిలీ నోట్ల కేసులో అరెస్టు అయ్యాడు. అతను చెప్పిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రెండు రోజుల నుంచి విచారణ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా నరసాపురం గ్రామానికి వెళ్లి ఓ ముద్దాయి ఇంటిని సోదా చేశారు. అక్కడ ఏమీ దొరకలేదు. నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయ్యేనా అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. గతంలో నకిలీ నోట్ల కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చెబితే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు అంటున్నారు. వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు వదిలేశారు. ఈ విషయమై కలసపాడు ఎస్ఐ వెంకటరమణను వివరణ కోరగా వారిని విచారించామని, వారి వద్ద నకిలీ నోట్లు లేవని తెలిసి వదిలేశామని సమాధానమిచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి దొంగతనం కేసులు ఒకటి రెండు బుక్ అయిన విషయం నిజమే. అలాగే కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే సంఘటనలు అన్నీ తెలుస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి కూడా పోయాయి. టైం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. బాధితులకు న్యాయం చేస్తాం.– మధుసూదన్ గౌడ్, సీఐ పోరుమామిళ్ల -
పోలీస్‌స్టేషన్‌లో సీమంతం
మండ్య: పోలీస్‌స్టేషన్‌లో మమతానురాగాలు వెల్లివిరిశాయి. గర్భిణి అయిన తమ అధికారిణికి సిబ్బంది సీమంతం నిర్వహించి పండంటి బిడ్డ పుట్టాలని దీవించారు. జిల్లాలోని పాండవపుర తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఎస్ఐగా సుమారాణి బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం కిత్రం వివాహం చేసుకున్న సుమారాణి ప్రస్తుతం గర్భిణి. దీంతో ఆమెకు పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా సిబ్బంది శుక్రవారం ఘనంగా సీమంతం నిర్వహించారు.సహోద్యోగులు,సిబ్బంది కుటుంబ సభ్యులుగా మారి సీమంతం చేయడంతో ఎస్ఐ సుమారాణి భావోద్వేగానికి లోనయ్యారు. -
ఇక్కడికొస్తే టాఠాణా!
జంగారెడ్డిగూడెం: అయ్య బాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషనా.. అంటూ ఇక్కడకు కొత్తగా వచ్చే అధికారులు చెబుతున్న మాట. ఈ స్టేషన్‌కు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడాది కూడా పనిచేయడం లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది? ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి రెండేళ్లు కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ రకాల కారణాలతో బదిలీ అవుతున్నారు. పలువురు అధికారులు వివిధ రకాల ఆరోపణలతో బదిలీ అయితే మరికొంత మంది పలు కారణాలతో బదిలీ అవుతున్నారు. దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపమా.. ఇంచుమించుగా పోలీస్‌స్టేషన్ కట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు, సిబ్బంది కూడా చర్చించుకుంటున్నారు. 2007 నుంచి ప్రస్తుత ఎస్సై వరకు అంటే 11 ఏళ్లలో 12 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో బదిలీలు జరగడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన అతి తక్కువ కాలంలో పలువురు సస్పెండ్ అవడం లేదా బదిలీలు కావడం జరిగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. 2007లో ఇక్కడ పనిచేసిన సీఐ ఎం.వెంకటేశ్వరరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఒక మహిళా కేసు విషయంలో ఈ బదిలీలు జరిగాయి. అప్పట్లో ఇక్కడ ఎస్సై చింతా రాంబాబు పనిచేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో రాంబాబుకు సీఐగా పదోన్నతి లభించింది. జంగారెడ్డిగూడెంలోనే పోస్టింగ్ ఇచ్చారు. 2008 జనవరిలో సీఐ చింతా రాంబాబు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. స్థానిక బైపాస్ రోడ్డులో కోడి పందేల నిర్వహణ నేపథ్యంలో ఒక వ్యక్తిని పోలీసులు తీసుకురావడం, అతను పోలీస్‌స్టేషన్‌లో అస్వస్థతతకు గురికావడం, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా అతను మృతిచెందడంతో దీనికి సంబంధించి సీఐ రాంబాబు, ముగ్గురు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తరువాత చాలా కాలం ఎస్సై లేకుండానే జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ కొనసాగింది. అనంతరం 610 జీఓలో భాగంగా తెలంగాణ నుంచి ఎంవీఎస్ మల్లేశ్వరరావు ఎస్సైగా బదిలీపై వచ్చారు. సరిగ్గా ఐదు నెలలు అంటే 2008 మేలో మల్లేశ్వరరావు కూడా సస్పెండ్ అయ్యారు. అప్పట్లో సబ్రిజిష్ట్రార్పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాల్సి ఉండగా కేసు నమోదులో 13 రోజులు ఆలస్యం కావడంతో మల్లేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఎస్సైగా వచ్చిన ఏఎన్ఎన్ మూర్తిని 2009 మేలో వీఆర్‌లో ఉంచారు. ఆ తరువాత ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇది కూడా సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయానికి సంబంధించి దస్తావేజు లేఖరుల మధ్య జరిగిన విభేదాలపై కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఎస్సై మూర్తిని సస్పెండ్ చేశారు. ఆ తరువాత పి.శ్రీనివాసరావు ఎస్సైగా సుమారు 8 నెలలు పనిచేశారు. తరువాత బీఎన్ నాయక్ ఇక్కడ ఎస్సైగా వచ్చినా వివిధ కారణాలతో ఆయన కూడా బదిలీ అయ్యారు. ఆయన తరువాత పి.విశ్వం, బీఎన్ నాయక్ 2011 డిసెంబర్ నుంచి 2014 జనవరి వరకు పనిచేశారు. వారి తరువాత వచ్చిన సీహెచ్ రామచంద్రరావు 2014లో జనవరిలో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనికి సంబంధించిన రామచంద్రరావును మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. 2014 జూలైలో కె.శ్రీహరిరావు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించగా, ఆయనపై కూడా ఒక మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆయన కూడా ఇక్కడ 9 నెలలు మాత్రమే పనిచేసి బదిలీ అయ్యారు. ఆ తరువాత ఆనందరెడ్డి ఎస్సైగా వచ్చారు. ఆయన ఇక్కడ ఏడాదిన్నర పనిచేసిన అనంతరం వీఆర్‌కు వెళ్లారు. అనంతరం జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సైగా వచ్చారు. ఆ తరువాత 2016 అక్టోబర్‌లో ఎస్సైగా వచ్చిన ఎం.కేశవరావు కేవలం 10 నెలలకే ఆరోపణలతో వీఆర్‌కు, అక్కడి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. 2017 సెప్టెంబర్‌లో ఇక్కడ ఎస్సైగా జీజే విష్ణువర్ధన్‌ను నియమించారు. ఆయన కూడా ప్రస్తుతం వీఆర్‌కు వెళ్లారు. అయితే ఆయన తన ఇష్ట పూర్వకంగానే వీఆర్‌కు వెళుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే కేవలం 9 నెలలు మాత్రమే ఇక్కడ పనిచేశారు. అయితే ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో కొత్తగా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది బదిలీల్లోను, సస్పెన్షన్లోను కారణాలు ఉన్నప్పటికీ మరి కొంతమందికి చాలా చిన్న చిన్న విషయాలకే బదిలీలు కావడం, వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. -
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో నగ్నంగా...
నేలకొండపల్లి ఖమ్మం : మండలంలోని రాజారాంపేటకు చెందిన మాధవరావు, తనకు న్యాయం చేయాలంటూ నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో నగ్నంగా కూర్చున్నాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, కుటుంబీకులు తన జీవీతాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలంటూ అతడు ముందుగా రూరల్ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి ఎదుట పురుగు మందు డబ్బాతో హల్చల్ చేశాడు. ఇతడి సమస్యను పరిష్కరించాలంటూ నేలకొండపల్లి ఎస్హెచ్ఓ గణపతిని ఏసీపీ ఫోన్ చేసి ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఏసీపీ సూచించారు. దీంతో, మాధవరావు బైక్‌పై నేలకొండపల్లి స్టేషన్‌కు చేరుకున్నాడు. దుస్తులన్నీ విప్పి పూర్తి నగ్నంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడున్న పోలీసులు వెంటనే బయటి నుంచి బట్టలు తెప్పించి కట్టించారు. ఇతడి మానసిక పరిస్థితి బాగాలేదని రాజారంపేట గ్రామస్తు లు చెప్పినట్టు ఏఎస్ఐ గణపతి తెలిపారు. -
ఖాకీ కాంప్లెక్స్‌కు ‘కుచ్చుటోపీ’..!
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. అలాంటి పోలీసు శాఖ పర్యవేక్షణలో ఉన్న పోలీసు కాంప్లెక్స్ దుకాణాల నిర్వాహకులు కొందరు ఆ శాఖ ఆదాయానికి గండిపడేలా ప్రవర్తించి ఏకంగా వారికే ‘కుచ్చుటోపీ’ పెడుతున్నారు. ఈ వ్యవహారంపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జిల్లా పోలీసు యంత్రాంగం సంక్షేమం కోసం కడప నగరం నడిబొడ్డున పాతబస్టాండ్ సమీపంలో 14 సెంట్ల స్థలంలో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంతో అక్కడే ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్ నిర్వహణ, ఇతర ఖర్చులు, సంక్షేమం కోసం అప్పట్లో కడప ఒన్‌టౌన్ సీఐ పర్యవేక్షణలో వినియోగించేవారు. 2002కు ముందు ఈ దుకాణాల అద్దె నామమాత్రంగా ఉండేది. తర్వాత 2003లో 22 దుకాణాలకు గానూ టెండర్లను ఆహ్వానించి అద్దెలను దుకాణం విస్తరణ స్థలాన్ని బట్టి నిర్ణయించారు. తర్వాత ఇప్పటి వరకు టెండర్ల ఆహ్వానం లేకుండా అద్దెలను చెల్లిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్థలంలో ఓ మూలన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ గదుల నుంచి పోలీస్‌శాఖకు రూ.1.87 లక్షలు మాత్రమే నెలసరి ఆదాయం వస్తోంది. పేరుకే 22 దుకాణాలు.. ఉన్నవి ఇంకెన్నో.. పోలీసుశాఖ పాతబస్టాండ్‌లోని తమ కాంప్లెక్స్‌కు కేవలం 22 దుకాణాలను కేటాయించి, తద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. కానీ ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. పోలీసు శాఖ నిర్ణయించిన అద్దెను చెల్లిస్తూనే మరికొంతమందికి అనధికారికంగా తమ దుకాణాల ముందు ప్రజలకు ఇబ్బందికరంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారు. మరికొంతమంది ఇది పోలీసు కాంప్లెక్స్ అనే ధీమాతో ఇష్టానుసారంగా తాము ఉంటున్న దుకాణానికి ముందు స్థలాన్ని అక్రమిస్తున్నట్లు, ఈ వ్యవహారాన్ని కూడా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీస్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెల గడువు ఈనెలాఖరుకు ముగియనుంది. ఈ క్రమంలో పోలీసు కాంప్లెక్స్ అద్దె నిర్ణయ కమిటీ దుకాణాల కొలతలు చేపట్టారని, అయితే ఇదే దుకాణాల్లో పూల వ్యాపారం చేస్తున్న ఓ ప్రముఖుడు తాను అధికార పార్టీ నేతలతో మాట్లాడి టెండర్లు లేకుండానే చూస్తాననీ ధీమాగా ఇతరులకు చెబుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసు అధికారులచేత కేవలం అద్దె పెంచేలా చూస్తామనీ ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.వేలల్లో వసూలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు దుకాణాల్లో అద్దెలకుంటున్న కొందరు అద్దెను చెల్లిస్తూనే, విద్యుత్ మీటర్లను తమ పేర్లతో తీసుకుని బిల్లులను కడుతున్నట్లు కూడా సమాచారం. 2003 నుంచి ప్రతి మూడేళ్లకోసారి టెండర్ల ద్వారా ఆశావహులను పిలిపించి అద్దెలను నిర్ణయిస్తే.. ఇప్పటికి నెలసరి అద్దె రూ.10–12 లక్షలు అవవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఆదాయ వనరుకు చక్కటి ఉదాహరణగా కడప నగరంలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపానికి సంబంధించి అద్దెను పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వివాహాది ఫంక్షన్ల కోసం నామమాత్రంగా కేటాయించారు. అయితే ఇదే కల్యాణ మండపానికి ఇతరులు శుభకార్యాల సమయంలో డెకరేషన్‌కు సంబంధించి కాంట్రాక్ట్‌ను గతంలో రూ.2 లక్షలు ఏడాదికి కేటాయించారు. ఇదే కాంట్రాక్ట్‌ను ఈ ఏడాది 2018 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఏడాదికి డెకరేషన్ కాంట్రాక్ట్‌ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. -
185 మంది పోలీసులకు స్థాన చలనం
ఒంగోలు: జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మొదలు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ బి.సత్యయేసుబాబు శనివారం నిర్వహించారు. ఈ ప్రక్రియ స్థానిక ఎస్పీ కార్యాలయం ఆవరణలోని గెలాక్సీ కాంప్లెక్స్‌లో జరిగింది. మొత్తం 185 మందిని బదిలీ చేయనున్నట్లు ప్రకటించగా వారిలో 177 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ బదిలీల ప్రక్రియకు సంబం«ధించి ఎటువంటి ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డు ప్రామాణికంగా 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారిని, స్వస్థలంలో పని చేస్తున్న 11 మంది ఏఎస్సైలు, 61 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 105 మంది కానిస్టేబుళ్లను కౌన్సెలింగ్‌కు రావాల్సిందిగా శుక్రవారం వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపించారు. శనివారం ఉదయం వారిలో 177 మంది మాత్రమే హాజరయ్యారు. నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఆరోగ్య కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో వారిని వీఆర్‌కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే వారు తిరిగి విధుల్లో జాయిన్ అయినప్పుడు వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారు. ముందుగానే సూచనలు: కౌన్సెలింగ్‌కు హాజరైన వారికి ముందుగానే జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా చేపట్టబోతుంది తదితర వివరాలను వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోను నేటివ్ ప్లేస్‌ను కోరుకోరాదని, అదే విధంగా గతంలో రెండు సంవత్సరాలకు మించి పనిచేసిన స్టేషన్ కోరుకోరాదంటూ పలు సూచనలు చేశారు. అంతే కాకుండా స్టేషన్ ప్రాతిపదికన కాకుండా ప్రాంతం ప్రాతిపదికన బదిలీలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒంగోలు , చీరాల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సిబ్బంది బదిలీ అయ్యారు. వీరిలో చీరాల సిబ్బంది ఒంగోలుకు, ఒంగోలు సిబ్బంది చీరాలకు బదిలీ కాగా, మిగిలిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీ కాక తప్పలేదు. ఖాళీల ప్రక్రియను స్క్రీన్‌పై చూపిస్తూ ముందుగా గుర్తించిన ఖాళీలను మాత్రమే కోరుకోవాలని సూచిం చారు. అంతే కాకుండా బదిలీ కోరుకున్న వెంటనే అప్పటికప్పుడు బదిలీ ఉత్తర్వుల కాపీని కూడా సిబ్బందికి కౌన్సెలింగ్ సమయంలోనే అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు నాన్ క్యాడర్ ఎస్పీ ఏబీటీఎస్ ఉదయరాణి, డీటీసీ, డీసీఆర్బీ, సీసీఎస్ డీఎస్పీలు, ఎస్బీ, డీటీఆర్బీ, డీటీసీ సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా కేవలం ఎంచుకున్న ప్రామాణికత ఆధారంగా సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ పట్ల సిబ్బందిలో సంతృప్తి వ్యక్తం అయింది. అయితే స్టేషన్ ప్రామాణికంగా కాకుండా ప్రాంతం ప్రాతిపదికగా తీసుకోవడంతో ఎక్కువ పోలీసుస్టేషన్లు ఉన్న ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాల్లోని సిబ్బంది సుదూర ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కుటుంబంతో సహా సుదూర ప్రాంతంలో పోస్టింగ్ పడడం వారిలో కొంత అసంతృప్తి నెలకొంది. సంవత్సరాల తరబడి రూరల్ ఏరియాలకే పరిమితమవుతూ పట్టణాలకు వద్దామనుకున్న సిబ్బందికి మాత్రం ఈ కౌన్సెలింగ్ వందశాతం వరంగా నిలిచిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏ శాఖలో అయినా బదిలీలకు సంబం ధించి ఒకటి రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యేవారు ఉంటే వారికి బదిలీల ప్రక్రియ నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఈ బదిలీల్లో మాత్రం రెండు నెలల్లో బదిలీ అయ్యేవారిని కూడా కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. -
వసూల్ రాజాలు..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పోలీస్‌శాఖలో అవినీతి సర్వసాధారణం. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు మామూళ్లకు అతీతులు కాదనే విషయం బహిరంగ రహస్యమే. కానీ పోలీస్స్టేషన్లలో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు నెలానెలా మామూళ్లు వసూలు చేసి అందించే ప్రత్యేక వ్యవస్థ ఉందని చాలా మందికి తెలియదు. పోలీస్స్టేషన్ల పరిధిలో గుట్టుగా సాగే ఈ వ్యవహారం గురువారం బట్టబయలైంది. రాష్ట్రంలో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో మామూళ్లు వసూలు చేసే పోలీసుల వివరాలను నిఘా వర్గాలు సేకరించాయి. జిల్లాల్లో పోలీస్స్టేషన్ల వారీగా ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది పోలీసులతో కూడిన ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన 19 మంది ఐడీ పార్టీ, క్రైం పార్టీ పోలీసుల పేర్లు కూడా ఉండడం విశేషం. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎవరు ఎవరి కోసం మామూళ్లు వసూలు చేస్తారనే వివరాలు, పోలీసుల పేర్లు, గుర్తింపు నెంబర్‌తో సహా పోలీస్ పెద్దల దృష్టికి వచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నుంచి పలు సామాజిక వె»Œబ్సైట్లలో కూడా ‘అవినీతి పోలీసుల చిట్టా’ పేరుతో 391 మంది పోలీసుల జాబితా చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు అభాసుపాలయ్యారు. ఈ వివరాలన్నీ అధికారికమే కావడంతో పోలీస్స్టేషన్లలో ‘కలెక్టర్’ల పేరుతో గుట్టుగా సాగే మామూళ్ల వసూలు వ్యవహారం బట్టబయలైంది. ఆదిలాబాద్ టౌన్‌తోపాటు మండలాల్లో... ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆరు పోలీస్స్టేషన్లలో మామూళ్లు వసూలు చేసే వ్యవస్థ కొనసాగుతోందని పోలీస్ నిఘా వర్గాల నివేదికలో తేలింది. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూల్‌రాజాలుగా నిలిచారు. మావల, ఆదిలాబాద్ రూరల్, ప్రస్తుతం వన్‌టౌన్‌కు అటాచ్ అయిన మహిళా పోలీస్స్టేషన్లలో కానిస్టేబుళ్లు పై అధికారులకు మామూళ్లు వసూలు చేసే పనిలోనే ఉంటారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తాంసి మండలంలో వసూళ్ల కోసం ఓ హెడ్ కానిస్టేబుల్‌ను నియమించారు. తాంసి పరిధి దాటితే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఉంది. ఇక్కడ పాటన్‌బోరి ప్రాంతం పేకాట, మట్కా, సట్టా వంటి జూదానికి పెట్టింది పేరు. ఇక్కడ ఆడేందుకు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా కస్టమర్లు వస్తున్నందున తాంసి పోలీసులకు సరిహద్దు వద్ద పండుగే. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేసే ఎస్హెచ్ఓకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చేందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబులే పనిచేస్తుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో 8మంది.. పోలీస్ అక్రమాలకు పేరుమోసిన మంచిర్యాల జిల్లాలో ఎనిమిది మంది పోలీసులు శాంతిభద్రతలను గాలికి వదిలి మామూళ్లు వసూళ్లకు పనిచేస్తున్నారు. ఆదాయం అధికంగా ఉండే పోలీస్స్టేషన్లతో పాటు కొత్త పోలీస్స్టేషన్లలో కూడా ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు ఈ వసూల్‌రాజాల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం విశేషం. అధికాదాయ వనరులున్న జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏకంగా ఏఎస్ఐకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఇక జిల్లాలో అక్రమ దందాలకు నిలయంగా మారిన జన్నారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మామూళ్లు వసూలు చేసే పనిలో ఉన్నాడట. బెల్లంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కూడా హెడ్ కానిస్టేబుల్‌కే సంబంధిత ఉన్నతాధికారి వసూళ్ల డ్యూటీ అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఓ హోంగార్డు కూడా ఇదే పనిలో ఉండడం గమనార్హం. లక్సెట్టిపేట, కోటపల్లి, తాండూర్లలో కానిస్టేబుళ్లు వసూళ్ల దందా సాగిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు డ్యూటీ కుమురంభీం జిల్లాలో ప్రధాన ఆదాయవనరు కాగజ్‌నగర్. ఇక్కడ అక్రమ దందాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారి పోస్టు కోసం భారీ ప్రయత్నాలు సాగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఒక్క పోలీసుతో మామూళ్ల వసూలు కష్టం. అందుకే ఇద్దరు కానిస్టేబుళ్లకు వసూళ్ల బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాలు నిగ్గు తేల్చాయి. ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌కు వసూళ్ల పనిలో ఉన్నాడు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, ముథోల్‌లో కానిస్టేబుల్ వసూళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిగతా మండలాల్లో సక్రమమేనా..? ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాలల్లో ఒకటికి మించి పోలీస్స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మండలాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు ఉన్నాయి. కానీ పోలీస్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల నుంచి విడుదలైనట్లు చెపుతున్న వసూల్‌రాజాల జాబితాలో జిల్లాకు చెందిన 19 మంది పోలీసుల పేర్లే ఉన్నాయి. దీన్నిబట్టి మిగతా పోలీస్స్టేషన్లలో అన్నీ సక్రమమే అనుకుంటే పొరబాటే. అక్రమాలకు అలవాటుపడ్డ పోలీస్ అధికారులు కొన్ని చోట్ల ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇటీవల తరచూ పోలీస్స్టేషన్లలో ఎస్ఐ, సీఐల మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంకా కుదురుకోని కొందరు అధికారులు వసూళ్ల కోసం ప్రత్యేకంగా పోలీసులను నియమించుకోలేదు. ఆదాయ వనరులు అధికంగా ఉన్న పోలీస్స్టేషన్లకు సీఐ, ఎస్ఐల బదిలీల్లో చేతులు మారే లక్షల రూపాయలను బట్టే వారి ఆదాయం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వసూల్‌రాజాల డ్యూటీ ఏంటంటే... స్టేషన్ ‘కలెక్టర్’గా పిలవబడే వసూల్‌రాజా అంటే ఆ స్టేషన్ పరిధిలో అందరికీ హడలే. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అక్రమాలన్నీ ఈ స్టేషన్ ‘కలెక్టర్’ల కనుసన్నల్లోనే సాగుతాయి. మద్యం దుకాణాలు, బార్లు, గుడుంబా తయారీదారులు, కల్లు సొసైటీల నుంచి ప్రతినెలా ముందుగానే నిర్ధేశించిన మేరకు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్హెచ్ఓలు నేరుగా మాట్లాడి సెటిల్ చేసే సివిల్ వివాదాలకు సంబంధించి కూడా క్యాష్ కలెక్షన్ బాధ్యత వీరిదే. సంబంధిత స్టేషన్ అధికారికి ‘రైట్‌హ్యాండ్’గా వ్యవహరించే ఈ స్టేషన్ ‘కలెక్టర్’ అంటే అక్కడ పనిచేసే ఇతర పోలీసులకు కూడా హడలే. -
ఖాకీలకు అవినీతి మరక
రాజమహేంద్రవరం క్రైం: పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపకుండా తమ స్వలాభం కోసం హౌస్ ఆఫీసర్లు ఇరువర్గాల వద్ద లంచాలు గుంజుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెటిల్మెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు స్థానిక రాజకీయ నేతల అంగీకారం లేనిదే ఆ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాలంటే ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని అనంతరం వారు చెప్పిన రేటు చెల్లించిన తరువాత పోస్టింగ్‌లు తీసుకోవలసి వస్తుందని పోలీస్ అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాలని కొందరు పోలీస్ అధికారులు లంచాలకు పాల్పడుతున్నారు. ఏసీబీకీ చిక్కిన సౌత్‌జోన్ డీఎస్పీ అలాగే 2017 మే 31వ తేదీన రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్ కుమార్, సామర్లకోటకు చెందిన కీర్తిప్రియ అనే మహిళ వద్ద ఇల్లు కొన్నాడు. ఇంటి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కీర్తిప్రియ ఇంటికి మరికొంత ఎక్కువ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విల్సన్ కుమార్‌పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో సౌత్‌జోన్ డీఎస్పీ నారా యణరావు, కీర్తిప్రియ వద్ద లంచం తీసుకొని వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునే విధంగా విల్సన్ కుమార్‌పై వత్తిడి తెచ్చాడు. రూ.ఏడు లక్షల నష్టానికి విల్సన్, కీర్తిప్రియతో రాజీ చేసుకున్నాడు. కేసు రాజీ కుదుర్చుకున్న అనంతరం సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావు తన వద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్‌తో ఫోన్లు చేయిస్తూ రాజీ కుదుర్చుకున్న తరువాత తనకు రావలసిన వాటా రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో విల్సన్ కుమార్ రూ.50 వేలు డీఎస్పీకి, రూ.5 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై బాధితుడు విల్సన్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో రూ.55 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇస్తుండగాఏసీబీ అధికారులు మే 31వ తేదీ గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం కానిస్టేబుల్ రమేష్‌కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకూ అవినీతి మయంగా మారింది. కొందరు అవినీతి పోలీస్ అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పట్టుబడిన పోలీస్ అధికారులు వీరే అవినీతికి పాల్పడుతూ పోలీస్ అధికారులు ఏసీబీకీ చిక్కుతున్నారు. 2016 మార్చి 15వ తేదీన రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే 2016 డిసెంబర్ 12వ తేదీన అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న జక్కి నాగేశ్వరరావు, హోమ్ గార్డు గంటి శ్రీనివాసరావు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవనిగడ్డ టెంపోరావుకు చెందిన ఒక కేసు విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీన ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న ఫజల్ రహ్మన్, రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన యనమదల భరత్ వద్ద ఒక కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హేండెడ్‌గా చిక్కాడు. -
న్యాయమా.. నీవెక్కడా!
నెల్లూరు మెక్లిన్స్‌రోడ్డుకు చెందిన సయ్యద్ జకావుల్లా 2016 సెప్టెంబర్‌లో దారుణ హత్యకు గురైయ్యాడు. ఆయన్ని అధికార పార్టీ నేతల అనుచరులు హత్యచేశారని, అలాగే నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారుస్తున్నారని హతుడి తండ్రి సయ్యద్ మహబూబ్‌బాషా పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. తన కుమారుడి హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా గ్రీవెన్స్‌డేలో పోలీసు ఉన్నతాధికారులకు అర్జీలిచ్చారు. అయినా ఇంతవరకూ న్యాయం జరగలేదు. నెల్లూరు(క్రైమ్): ‘‘పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగడం లేదు.. కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. మీరైనా న్యాయం చేయండి సారూ’’ అంటూ ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో బాధితులు గ్రీవెన్స్‌డేలో పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమగోడును వినిపిస్తున్నారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉన్నతాధికారులు సంబం ధింత సిబ్బందిని ఆదేశించి ‘‘న్యాయం జరుగుతుంది, ఇక వెళ్లండి’’ అని పంపివేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం మిధ్యగానే మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో గడచిన ఐదు నెలల్లో పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 1461 ఫిర్యాదులు అందగా అందులో 1131 ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదు. కానరాని న్యాయం జిల్లాలో సుమారు 35 లక్షల మంది జనాభా ఉండగా వారి రక్షణ కొరకు ఐదు సబ్డివిజన్ల పరిధిలో 22 సర్కిళ్లు, 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 2500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని గ్రహించి 2001లో అప్పటి ఎస్పీ కె.శ్రీనివాసులరెడ్డి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్‌డేకి పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగని బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వారి సమస్యలను విన్న పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారించి, సత్వరమే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం, వారు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరిగేది. అలాగే సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేవి. దీంతో పెద్ద ఎత్తున బాధితులు గ్రీవెన్స్‌డేకి వచ్చేవారు. అయితే తర్వాత కొంతకాలం ఈ పక్రియకు బ్రేక్ పడింది. 2011 జూలైలో అప్పటి ఎస్పీ బి.వి.రమణకుమార్ గ్రీవెన్స్‌డేను కొనసాగించారు. అనంతరం సెంథిల్‌కుమార్ హయాంలోనూ గ్రీవెన్స్‌డేలో సమస్యలు చకచకా పరిష్కారమయ్యేవి. అయితే అనంతరం వచ్చిన ఎస్పీల ఉదాసీన వైఖరి కారణంగా సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆయన గ్రీవెన్స్‌డేని సోమవారమే కాకుండా గురువారం నిర్వహించడం ప్రారంభించారు. దీంతో బాధితుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పిస్తున్నారు. తొలిరోజుల్లో ఎస్పీపై ఉన్న భయంతో సిబ్బంది బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేవారు. అయితే రానురాను పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. 1131 ఫిర్యాదులు పెండింగ్ ఈ ఏడాది మే వరకు జిల్లా వ్యాప్తంగా 1461 ఫిర్యాదులు అందాయి. వాటిలో కేవలం 330 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 1131 ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా భార్య, భర్తల గొడవలు, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అదృశ్యం కేసులు, చీటింగ్ కేసులు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ రామకృష్ణ కేసును పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. అయితే ఎస్పీ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఆ ఆదేశాలను లెక్కచేయకుండా బాధితులను స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొందరు సిబ్బంది మరో అడుగు ముందుకేసి ఎస్పీ చెప్పినా ఏం చేసేది లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు స్టేషన్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. అర్థ, అంగబలం ఉన్నవారికే న్యాయం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. 2018లో 1461 ఫిర్యాదులు అందగా 1131 ఫిర్యాదులు నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. కేసులన్నీ పరిష్కారమవుతున్నాయి గ్రీవెన్స్‌డేకి వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికంగా సివిల్ వివాదాలు, దొంగతనం కేసుల్లో రికవరీకి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. దొంగతనాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నేరస్థులను పట్టుకుని, సాధ్యమైనంత మేర సొత్తును రికవరీ చేస్తున్నాం. ఇక సివిల్ వివాదాల విషయంలో చట్టపరిధిలో ఉన్న అంశాలన్నింటినీ పరిశీలించి, అవసరమైన మేరకే చర్యలు తీసుకుంటున్నాం. – పీహెచ్డీ రామకృష్ణ, ఎస్పీ -
సనత్‌నగర్ పీఎస్‌లో లాకప్ డెత్?
హైదరాబాద్ : దొంగతనం కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన బుధవారం సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు వారు కొట్టిన దెబ్బలతోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవున్నాయి. రామంతాపూర్‌కు చెందిన కూలీ ప్రేమ్‌చంద్ (37)ను ఎర్రగడ్డ బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏజెంట్లు వాహనాలు, ఈఎంఐల రికవరీ కోసం తీసుకుని వెళుతుంటారు. ఇదేక్రమంలో వారంక్రితం ఓ ఏజెంట్ రికవరీ అయిన రూ.2లక్షలను బజాజ్ ఆఫీసులో చెల్లించాల్సిందిగా ప్రేమ్‌చంద్‌కు ఇచ్చాడు. ప్రేమ్‌చంద్ ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా అక్కడ డబ్బు దొరకలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలోనే నిందితుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దెబ్బలతోనే మరణించాడా? నగదు రికవరీ కోసం పోలీసులు ప్రేమ్‌చంద్‌పై థర్డ్ డిగ్రీని ప్రయోగించడం వల్లే మరణించి ఉండొచ్చని, అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఎలక్షన్’ పోలీస్?
సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల నేపథ్యంలో పోలీసింగ్‌కు సంబంధించి ప్రాథమిక, అత్యంత కీలక ఘట్టం బదిలీలు. వీటికోసం అధికారులు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ పరిపాలన ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లిన తర్వాత భారీ స్థాయిలో బదిలీలు అనివార్యంగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా స్థానాల్లోకి వస్తున్న కొత్త అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బదిలీపై బయటి కమిషనరేట్లకు వెళ్తున్న అధికారులు తిరిగి రావడం పెద్ద ప్రహసనంగా మారిపోతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘ఎన్నికల బదిలీలకు’ కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వీటికి గరిష్టంగా ఏడాది సమయం కూడా లేదు. ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరవాత బదిలీలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అప్పుడు పరిపాలన మొత్తం ఈసీ చేతిలో ఉంటుంది. అధికారుల బదిలీపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహాల్లో భాగంగా అధికారులు సిబ్బంది జాబితాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సందర్భంలో బదిలీలు అనివార్యమైన అంశంగా మారుతాయి. కమిషనరేట్లలో పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పిలిచే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుంటారు. నిర్ణీత కాలం మించి (2 లేదా 3 ఏళ్లు) ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఈసీ స్పష్టం చేస్తుంది. వీటిలోనే ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారనేది పరిగణనలోకి తీసుకుంటుంది. 2009 ఎన్నికల సందర్భంలో జోన్‌ను యూనిట్‌గా తీసుకుని ఈసీ మార్గదర్శకాలను జారీ చేయగా... 2014 నాటికి కమిషనరేట్ యూనిట్‌గా మారింది. ఫలితంగా పొరుగు కమిషనరేట్‌తో పాటు జిల్లాల్లో ఉన్న వారికి ఇక్కడకు తీసుకువచ్చి, ఇక్కడి వారిని బయటకు పంపాల్సి వచ్చింది. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పుతో కొత్తగా వచ్చిన పూర్తి కొత్త అధికారులు నిలదొక్కుకోవడం సమస్యగా మారుతోంది. దీని ప్రభావం ఎలక్షన్ పోలీసింగ్‌పై పడుతోంది. సాధారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ సొంత నియోజకవర్గాల్లో లేకుండా చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌లు, ట్రాఫిక్ విభాగాన్నీ పరిగణలోకి తీసుకుని బదిలీలు చేయాల్సి ఉంటుంది. ఈసీ నిబంధనలతో నగర కమిషనరేట్‌కు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరవాత పాత స్థానాలకే రావచ్చని అధికారులు చెప్తున్నారు. క్రతువు ముగిసిన తర్వాత దీని అమలు కోసం సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన అధికారులు తిరిగి రావడానికి ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండట్లేదు. 2014 సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ‘మూడేళ్ల నిబంధన’ విధించిన ఎన్నికల సంఘం ఆ గడువు పూర్తి చేసుకున్న వారిని కమిషనరేట్ నుంచి బయటకు పంపాల్సిందిగా స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో ఉన్న రెంటు కమిషనరేట్ల నుంచి భారీగానే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అనేక మంది పొరుగు జిల్లాలకూ ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లారు. ఆ సమయంలో వీరిని పంపిన ఉన్నతాధికారులు ఎలక్షన్ కోడ్ ఉపసంహరించిన వెంటనే తిరిగి పాత స్థానాల్లోనే నియమిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో మరికొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్న ఉన్నతాధికారులు వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు–సెప్టెంబర్ నాటికి రెండేళ్ళ గడువు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను రూపొందించి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఎన్నికల నాటికి రెండు, మూడేళ్ళు పూర్తి చేసుకున్న వారు ఎవరూ ఉండరని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నికల సమయానికి పెద్దగా జరిగే బదిలీలు ఉండవని, ఫలితంగా పోలీసింగ్, భద్రత, బందోబస్తుపై ప్రభావం ఉందని అధికారులు యోచిస్తున్నారు. -
పొమ్మన్నందుకు పోలీసును చావబాదారు..!!
ఉత్తరప్రదేశ్/ముజఫర్‌నగర్ : రాష్ట్రంలో అల్లరి మూకల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. పోలీసు ఔట్‌పోస్టు వద్ద మద్యం సేవిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. దుడ్డు కర్రలతో ఆయన్ని చావ బాదారు. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలోని ఉఖావలి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిరామ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉఖావలి పోలీసు ఔట్‌పోస్టు వద్ద దీపక్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఔట్‌పోస్టు సమీపంలో మద్యం సేవిస్తున్న కొందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దీపక్ హెచ్చరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ గుంపులోని వారంతా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. దీపక్ ఒంటరిగా ఉండడంతో అతనిపై దుడ్డు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రమేయమున్న 21 మందిపై కేసు నమోదు చేశామనీ యాదవ్ తెలిపారు. అనిల్‌కుమార్, మోనూ, ముఖేష్, మనోజ్‌కుమార్‌లను అనే నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామని యాదవ్ పేర్కొన్నారు. -
పోలీస్ బదిలీలకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో కొనసాగుతున్న ఆర్డర్ టు సర్వ్, సాధారణ బదిలీలపై ఉత్కంఠకు తెరపడింది. కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న బదిలీల సమస్యలపై చర్చించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అధికారుల సంఘంతో భేటీ అయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలను అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి మీడియాకు వివరించారు. బదిలీలకు ఇవీ మార్గదర్శకాలు.. సిబ్బందిని ఉమ్మడి జిల్లాల పరిధిలోనే బదిలీ చేస్తారు. ఆర్డర్ టు సర్వ్‌లో బదిలీ అయిన వాళ్ల (ఆర్మ్డ్/సివిల్) విజ్ఞప్తిని పరిశీలించి అడిగిన చోటికి, అడిగిన జిల్లా పరిధికి బదిలీ చేస్తారు. ఆర్డర్ టు సర్వ్ వారి స్థానంలోకి వెళ్లేందుకు ఎవరైనా సుముఖంగా లేకుంటే లాటరీ పద్ధతి అవలంబిస్తారు. వచ్చే ఏడాదిలోనూ స్థానికత ప్రకారం బదిలీల ఉత్తర్వులు రానట్లైతే మళ్లీ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే సాధారణ బదిలీలు చేపడతారు. కొత్త జిల్లాల పరిధిలోని వారు పూర్వ జిల్లాల్లో ఉన్నట్లుగానే భావించాలి. ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తియిన వారికి ఐదు ఆషన్లు (పాత జిల్లాల పరిధిలో) ఇచ్చి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తారు. మారుమూల, నక్సల్స్ ప్రభావిత, రవాణా సౌకర్యాలు లేని స్టేషన్ల వారికి మూడేళ్లకే బదిలీలకు అవకాశం కల్పిస్తారు. వరంగల్ జిల్లాలో 2013 జూన్ 21న బదిలీ అయినవారి విజ్ఞప్తి ప్రకారం బదిలీలకు అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి కొత్త జిల్లాల పరిధిలోనే బదిలీలు చేశారు. అలా బదిలీ అయిన వారి సర్వీసును ఉమ్మడి జిల్లాల్లో బదిలీ అయిన తేదీ నుంచి పరిగణించి ఇప్పుడు బదిలీకి అవకాశం ఇవ్వాలి. స్పౌజ్, మెడికల్ గ్రౌండ్, పదవీ విరమణకు రెండేళ్ల ముందు వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వేరే జిల్లా పరిధిలోకి వెళ్లిన స్టేషన్ల సిబ్బందికి కూడా పాత జిల్లా పరిధిలోనే బదిలీలు అవుతాయి. ఈ నిబంధనలతో శనివారమే సర్క్యులర్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు గోపిరెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు ఎదుర్కొనే ఇతర సమస్యలపై యూనిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని, బదిలీల అమల్లో తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి డీజీపీ సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఆర్గనైజేషన్స్ అదనపు డీజీపీ రాజీవ్ రతన్, పర్సనల్ విభాగం ఐజీ శివధర్‌రెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కమిషనర్లు, మహబూబ్‌నగర్, వనపర్తి, సంగారెడ్డి ఎస్పీలు పాల్గొన్నారు. -
స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
సాక్షి, నెల్లూరు : పోలీసులు అకారణంగా తమపై దాడి చేశారంటూ గిరిజనులు చేపట్టిన ఆందోళన సంగంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని నీలగిరి జలాశయం వద్ద రోజు మాదిరిగానే గిరిజజన మత్సకారులు చేపల వేటకు వెళ్ళారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు.. మత్సకారులను తరిమేసే ప్రయత్నం చేశారు. దీంతో మత్సకారులకు పోలీసులకు గొడవ మొదలైంది. ఏ కారణం లేకుండా పోలీసులు కొట్టడంతో గిరిజనులు తిరగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు 8 మందిని మత్స్యకారులను అరెస్టు చేసి సంగం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీనిపై స్థానిక గిరిజన మహిళలు స్టేషన్ ముందు ఆందోళకు దిగారు, ఏ కారణం లేకుండానే వారిని కొట్టారని ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న మత్సశాఖ అధికారిని వెంటనే పోలీసు స్టేషన్‌కు రావడంతో పోలీసులు అతడిని కూడా అడ్డుకున్నారు. -
పోలీస్ స్టేషన్లో అనుమానిత వ్యక్తులు
మర్పల్లి : మర్పల్లి సంతకు వచ్చిన తొమ్మిది మంది బిహార్ యువకులను స్థానికులు మంగళవారం పోలీసులకు పట్టించారు. మర్పల్లి సమీపంలోని వినోద్ ఫాంహౌస్‌లో పని చేసేందుకు వీరు హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మర్పల్లి బస్టేషన్లో దిగారు. ఫాంహౌస్‌కు వెళ్లేకన్నా ముందు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మర్పల్లి సంతలో తిరిగారు. వీరిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను స్టేషన్‌కు తరలించారు. దొంగల ముఠాలు సంచరిస్తున్నాయనే వదంతుల నేపథ్యంలో వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. జనాల సమక్షంలోనే వీరిని తనిఖీ చేసిన పోలీసులు ఆధార్ కార్డులు పరిశీలించి బీహార్‌వాసులుగా గుర్తించారు. ఫాంహౌస్‌లో పని చేసేందుకు వచ్చామని చెప్పడంతో యజమా ని వినోద్‌కు, అందులో పనిచేసే సూపర్వైజర్ రవికి ఫోన్ చేసి పిలిపించారు. పీఎస్‌కు చేరుకున్న వినోద్, రవి ఫాంహౌస్‌లో పనుల నిమిత్తం తామే వారిని పిలిపించామని చెప్పారు. వీరి సొంతపూచీకత్తుపై యువకులను పంపించేశారు. -
రౌడీ షీటర్ల మేళా
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గల టూ టౌన్, త్రీ టౌన్, ఫోర్తుటౌన్, మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా చేరిన 70 మంది కానిస్టేబుళ్లకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో గల 78 మంది రౌడీషీటర్లను ఈ మేళాకు పిలిపించగా 44 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మాట్లాడుతూ రౌడీషీటర్ల వివరాలు, వారి అడ్రస్‌లు, వారేం చేస్తుంటారు తదితర వివరాలను సిబ్బందికి తెలియజేశారు. వారిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. అదే విధంగా నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్ల ఫొటోలు, వివరాలు, అడ్రస్తు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక ఫోల్డర్లో భద్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు జీవీ రమణ, ఇమ్మానుయేల్ రాజు, కె.వెంకటనారాయణ, ఆయా స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్లో నాగుపాము
కడప , ఓబులవారిపల్లె : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి నాగుపాము కనిపించింది. స్టేషన్ బయట ఉన్న మరుగుదొడ్డి పక్కనే శబ్దం రావడంతో అటువైపు వెళుతున్న కానిస్టేబుల్ అమర్ చూశాడు. ఆయన గమనించి తోటి సిబ్బందికి తెలిపాడు. పాము పడగవిప్పి బుసలు కొడుతుండటం, రాత్రి కావడంతో దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. రెండు గంటల సేపు అలాగే ఉన్న పాము పక్కనే ఉన్న వాహనాల్లోకి వెళ్లింది. పట్టుబడ్డ వాహనాలను రైల్వేకోడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన వారు పోలీసు క్వార్టర్స్‌లో ఉంచారు. అవి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. విషసర్పాలకు అడ్డాగా మారాయి. తరచూ క్వార్టర్స్‌లోకి వస్తుండటంతో పోలీసు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలను మరో చోటుకు తరలించాలని పోలీసులు కోరుతున్నారు. -
రక్షణ కల్పించాలని ప్రేమ జంట వినతి
పశ్చిమ గోదావరి, వీరవాసరం: తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట ఆదివారం వీరవాసరం పోలీసులకు వినతిపత్రాన్ని అందచేశారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన మట్టా నవీన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన పిట్టా సుస్మిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం భీమవరం శివారు చిన రంగని పాలెంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం వీరవాసరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సుస్మిత కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉన్నాయని, వారి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి వివాదాలు పెట్టుకోవద్దని నచ్చచెబుతామని ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. -
విభజనపై ఉత్కంఠ
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల విభజన ప్రక్రియపై పోలీసు సిబ్బందిలో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 21 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఎస్పీ ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. ఒకే బ్యాచ్‌లోని వారిని రోస్టర్‌లో కేటగిరీల వారీగా ఎలాంటి నష్టం లేకుండా మ్యూచ్వల్స్ చేసే అవకాశం ఉందని ఈనెల 12న ఎస్పీ ప్రకటించారు. సమస్యలు ఉన్నవారు, కోర్టును ఆశ్రయించిన వారు అభ్యంతరాలను తెలపాలని కోరుతూ ఐదు రకాల ఆప్షన్లను ఇస్తూ శుక్రవారం రూరల్ ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది విభజన విభాగాన్ని ప్రారంభించడంతో పాటు ఐదు బాక్సుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. కొత్తగా మ్యూచ్‌వల్ ట్రాన్స్ఫర్ పెట్టుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. వారి వినతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు. సిబ్బందిలో తర్జనభర్జన పూర్తి వివరాలను ఎస్పీ అన్ని పోలీస్ స్టేషన్ల అధికారుల ద్వారా అందజేయడంతో పాటు శుక్రవారం ఉదయం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యంతరాలు, ఆప్షన్లు, మ్యూచ్వల్స్ కోరుకునే వారు తాను చెప్పిన విధానంలో సీనియార్టీ కోల్పోవడానికి సిద్ధపడితే అభ్యంతరం ఉండదని వివరించారు. దీంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. కొందరైతే ఎలా జరిగినా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఏళ్ల తరబడి గుంటూరులో ఉంటూ సొంత ఇళ్లు ఉన్నవారు విభజనలో రూరల్‌కు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. తోటి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ అభ్యంతరాలు తెలియజేస్తే ఎలా చేయాలి? అనే విషయాల గురించి సీనియర్ల సలహాలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగుల సూచనలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నామమాత్రంగానే ఫిర్యాదులు మొదటి రోజున సిబ్బంది ఎస్పీ కార్యాలయానికి నామమాత్రంగానే వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాక్స్‌లో అభ్యంతరాలు, వినతులు, ఆప్షన్లు, మ్యూచ్వల్స్కు సంబంధించినవి వేసే ముందుగా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి రశీదు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటిరోజున 10లోపు ఫిర్యాదులు మాత్రమే అందాయి. మరో రెండు రోజుల సమయం ఉన్నందున వీటి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
పోలీసులూ..మీకూ తప్పదు!
‘పోలీస్ అయినా...సాధారణ పౌరులైనా ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఒక్కటే. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు’ అంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈమేరకు ట్రాఫిక్ రూల్స్ పాటించని 371 మంది పోలీస్ సిబ్బంది, అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మీడియాకు చిక్కిన పంజగుట్ట ఎస్సై నర్సింహ్మ నాయక్‌పై ఆదివారం వేటు పడింది. అతడిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేస్తూ కొత్వాల్ అంజినీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం రాంగ్ రూట్లో వాహనం నడిపిన ఓ పోలీసు డ్రైవర్ అంశాన్ని స్వయంగా గుర్తించిన డీజీపీ ఉల్లంఘనకు జరిమానా విధించడంతో పాటు బాధ్యుడికి తాఖీదు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే వేటు తప్పట్లేదు. కొన్నాళ్ల క్రితం ప్రారంభించిన ఈ విధానాన్ని నగర పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా సీపీ ఆదేశాలు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ కొన్నాళ్ల క్రితం చర్యల నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వవాహనాలూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. అయినా మార్పు రాని వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలతో... పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొందరు అధికారులపై బదిలీ/ఎటాచ్మెంట్ వేటు కూడా వేస్తున్నారు. -
పోలీసులకు తీపి కబురు
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల పోలీస్ సిబ్బందికి త్వరలో తీపి కబురు అందనుంది. ఎనిమిదేళ్లుగా నలుగుతున్న పోలీస్ సిబ్బంది విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు పారదర్శకంగా జాబితాను సిద్ధం విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ వైపు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేశారు. జాబితాలో పొరపాట్లు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 12న సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చారు. వాటి ఆధారంగా సమస్యలు లేకుండా జాబితాను సవరించే పనిలో ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. నేడో, రేపో తుది జాబితాను రూపొందించి ఉన్నతాధికారుల అనుమతితో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొం దించారు. కొనసా..గిన విభజన 2010 మేలో గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఎనిమిదేళ్ల నుంచి నలుగురు ఎస్పీలు సిబ్బందిని విభజన చేయాలని యత్నించారు. 2013లో డీజీపీ ఆదేశాల మేరకు అప్పట్లో తుది జాబితాను కూడా రూపొందించి ప్రకటించేలోగా కొందరు సిబ్బంది తమకు సీనియార్టీలో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి నుంచి సిబ్బంది విభజన ఎస్పీలకు సవాలుగానే మారింది. అనంతరం 2015లో పీహెచ్డీ రామకృష్ణ కూడా విభజన చేసేందుకు యత్నించారు. పూర్తిస్థాయిలో సీనియార్టీలను పరిశీలించి వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని ఉద్యోగుల్ని ఆదేశించారు. ఈలోగా ఆయన బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి విభజన ప్రక్రియను పూర్తిచేసి దిశగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు సమస్యను పరిష్కరించి సిబ్బంది, అధికారుల పదోన్నతుల్లో ఆటంకం తొలగించాలనే నిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. ఆచితూచి అడుగు జిల్లావ్యాప్తంగా 4500 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు జరిగేతే పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చేసుకోవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న ఎస్పీ ఈలోగానే పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విమర్శలు లేకుండా తుది జాబితాను రూపొందించి డీజీపీ అనుమతితో విడుదల చేసేందకు కృషి చేస్తున్నారు. ఐపీఎస్‌ల తరహాలోనే విభజన రాష్ట్రం విడిపోయే సమయంలో ఐపీఎస్‌ల విభజన జరిగిన తరహాలోనే ప్రక్రియ ఉంటుంది. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆరోపణలకు తావు లేకుండా విభజన పూర్తి చేయడమే నా లక్ష్యం. తుది జాబితా వెలువడిన అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లి న్యాయం కోరవచ్చు. త్వరలో జాబితా విడుదల చేస్తాం.– సీహెచ్ వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ -
కొట్టింది మేమే.. ఏం చేస్తారు
ప్రొద్దుటూరు క్రైం : ‘కొట్టింది మేమే.. ఏం చేస్తారు.. వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు ఏం చేస్తారు’ ఈ మాటలు అన్నది ఒక అధికార పార్టీ కౌన్సిలర్. ఎక్కడో కాదు.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో. పోలీసుల సాక్షిగా స్టేషన్లో అందరూ చూస్తుండగా ప్రొద్దుటూరులోని అధికార పార్టీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య అన్న మాటలివి. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. అయితే స్టేషన్‌కు వెళ్లిన బాధితుడి ముందే కౌన్సిలర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించి పోతున్నాయి. ఓర్వలేనితనంతో సామాన్యులపై కూడా వారు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడని.. నాలుగు రోజుల క్రితం ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన ఇంటర్ చదివే బాలుడు టీడీపీ నాయకుల పోస్టింగ్‌పై ఫేస్బుక్లో లైక్ కొట్టాడు. పోస్టు పెట్టిన వారిని కాకుండా లైక్ కొట్టిన ఆ బాలుడిని అధికార పార్టీ నాయకులు కొందరు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. కార్యాలయంలోనే బాలుడిని నిర్బంధించి రామేశ్వరం రోడ్డుకు చెందిన ఒక కౌన్సిలర్‌తో పాటు టీడీపీ నాయకులు కలిసి చితక్కొట్టారు. నేను లైక్ చేశానని, నాకేం తెలియదని చెప్పినా వారు కనికరించలేదు. తర్వాత బ్లూకోల్ట్ పోలీసులకు ఫోన్ చేసి బాలుడిని వారికి అప్పగించారు. ఇందులో బాలుడి తప్పు ఉంటే కేసు నమోదు చేయాల్సిందే. పోస్టింగ్‌తో అతనికి సంబంధం లేకున్నా అధికార పార్టీ నాయకులు విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. బాలుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కూడా బాలుడినే మందలించడం గమనార్హం. గతంలో కూడా తమకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టారని టీడీపీ నాయకులు రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారం రోజుల పాటు వారిని లాకప్‌లో వేసి నరకం చూపించారు. ఇదంతా సీనియర్ నాయకుడి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేశాడని.. ఇటీవల రామేశ్వరంలోని చర్చి వీధిలోకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెళ్లారు. అదే వీధిలో నివాసం ఉంటున్న బెనర్జీ అనే యువకుడు అభిమానంతో ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేసి ఆయనతో పాటు వీధిలో తిరిగాడు. అయితే దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు మూకుమ్మడిగా యువకుడిపై దాడి చేశారు. మంగళవారం ఉదయం బెనర్జీ రామేశ్వరం రోడ్డులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద పేపర్ చదువుతుండగా కౌన్సిలర్ తలారిపుల్లయ్య, మార్కాపురం గణేష్బాబుతో పాటు మరి కొందరు అతనిపై దాడి చేశారు. దాడిలో యువకుడికి రక్తగాయాలు అయ్యాయి. మా వీధిలో ఉంటూ మాకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ వారు కులం పేరుతో దూషించారు. దీనిపై అతను వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. తనపై జరిగిన దాడిని పోలీసులకు వివరిస్తుండగా అక్కడికి వెళ్లిన కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘ కొట్టింది నేనే.. ఏం చేస్తారు..? అంటూ పోలీసులతో అన్నాడు. ఒకరిపై దాడిన చేసిన వారే స్టేషన్‌కు వెళ్లి నేనే కొట్టాను.. ఏం చేసుకుంటారని చెప్పడం చూస్తుంటే ప్రొద్దుటూరు టీడీపీ నేతల దౌర్జన్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. జరిగిన సంఘటనపై బాధితుడు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ, ఎస్ఐలు ఆ సమయంలో స్టేషన్లో ఉన్న కానిస్టేబుళ్లను విచారించగా కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘కొట్టింది నేనే.. ఏం చేసుకుంటారని’ చెప్పిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ విషయంపై పోలీసు అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కౌన్సిలర్లు తలారి పుల్లయ్య, మార్కాపురం గణేష్‌బాబు సహా మరో ముగ్గురిపై వన్‌టౌన్ పోలీసులు ఎస్టీ ఎస్సీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ నాయకుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
పోలీసుల సమక్షంలోనే యువతి ఆత్మహత్యయత్నం
తూర్పుగోదావరి ,పిఠాపురం రూరల్/సర్పవరం: పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగింది. ఆమెను చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన యువతి కర్రి దేవి తన స్నేహితురాలితో పిఠాపురంలోని ఓ జిమ్‌కు వెళ్లేది. ఇదే జిమ్‌కు పిఠాపురం పట్టణం మంగయమ్మరావుపేటకు చెందిన చింతా మహేష్ వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో మహేష్ దేవితో పరిచయం పెంచుకుని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి విషయాన్ని దేవి ప్రస్తావించగా మహేష్, అతని బంధువులు నిరాకరించడంతో 15 రోజుల క్రితం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఈ మేరకు పిఠాపురం సీఐ బి.అప్పారావు బుధవారం కౌన్సెలింగ్ నిమిత్తం దేవి, మహేష్‌లను తన కార్యాలయానికి పిలిపించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మహేష్ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో మనస్తాపంతో దేవి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. అక్కడే ఉన్న బాధితురాలి బంధువులు, పోలీసులు ఆమెను పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ దేవి పిఠాపురం జిమ్‌కు వెళ్లే సమయంలో పిఠాపురం చర్చి సెంటర్లో బట్టల దుకాణం నిర్వహిస్తున్న చింతా సాంబ కుమారుడు మహేష్ అదే జిమ్ కోచ్‌గా చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వంచించాడని, దఫదఫాలుగా అతడి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి వరకట్నం అడిగాడని ఆరోపించారు. -
మార్పులు..చేర్పులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎట్టకేలకు మూడు దశాబ్దాల తర్వాత నగరంలో పోలీస్స్టేషన్ల పునర్విభజన జరిగింది. మొదట్లో 1898లో నెల్లూరు నగరంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. తర్వాత 1970లో మరో మూడు పోలీస్స్టేషన్లు ఏర్పడ్డాయి. అప్పటికి నెల్లూరు జనాభా 65 వేలు మాత్రమే. ఆ తర్వాత 1990 నుంచి 1992 మధ్య ఐదు, ఆరు టౌన్ల పోలీస్స్టేషన్లు ఏర్పడ్డాయి. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత నగరంలోని పోలీస్స్టేషన్ల పునర్విభజనతో పాటు స్టేషన్ల పేర్లు, సరిహద్దులు, పరిధిని పెరిగిన జనాభా, పెరిగిన సరిహద్దుల విస్తీర్ణానికి అనుగుణంగా మార్చారు. దీంతో నెల్లూరు నగరంలో వన్ టౌన్, టూ టౌన్ స్టేషన్లుగా కాకుండా ప్రాంతాల పేర్లతో పనిచేయనున్నాయి. స్టేషన్ల భౌగోళిక హద్దులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుల్లో కూడా స్టేషన్ల పేర్లు మారనున్నాయి. రేపట్నుంచి అమలు నగరంలో 8 లక్షల జనాభా, 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరం విస్తరించింది. ఆరు పోలీస్స్టేషన్లను పునర్విభజన చేస్తూ జీఓ ఎమ్మెస్ నంబర్ 48ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ గురువారం నుంచి నగరంలో అమల్లోకి రానుంది. నగరంలో కొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జనాభా సంఖ్య, నేరాల సంఖ్య తక్కువగా ఉండగా, మరికొన్ని పోలీస్స్టేషన్లలో అత్యధికంగా ఉండటంతో శాంతిభద్రతలను పరిరక్షించడం కత్తిమీద సాములా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది కొరత ఉన్నా, కొత్తగా పెంచే అవకాశాల్లేవు. దీంతో స్టేషన్ల హద్దులకు మార్పులు, చేర్పులు చేసి ఎక్కువ పరిధి ఉన్న స్టేషన్లను కొంత తగ్గించి ఇతర పోలీస్స్టేషన్లలో ఆ ప్రాంతాలను విలీనం చేస్తూ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పేర్లు, పరిధుల మార్పు ఇలా.. ♦ నెల్లూరు ఒకటో నగర పోలీస్‌స్టేషన్ పేరును చిన్నబజార్ పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని పుత్తా ఎస్టేట్స్, పరమేశ్వరినగర్, రాజీవ్‌గృహకల్ప, నాలుగో నగర పీఎస్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, ఫతేఖాన్‌పేట, అరవిందనగర్, జూబ్లీ హాస్పిటల్, మద్రాస్ బస్టాండ్, ముత్తుకూరు బస్టాండ్ ఈ పీఎస్ పరిధిలో కలిశాయి. ♦ నెల్లూరు రెండో నగర పీఎస్ పేరును నవాబుపేట పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, పరమేశ్వరినగర్ నవాబుపేట పీఎస్ పరిధిలోకి వచ్చాయి. ♦ నెల్లూరు మూడో నగర పీఎస్ పేరును సంతపేట పోలీస్‌స్టేషన్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని గాంధీగిరిజన కాలనీ ఈ స్టేషన్ పరిధిలోకి చేరింది. ♦ నాలుగో నగర పీఎస్ పేరును దర్గామిట్ట పీఎస్‌గా మార్చారు. ఒకటో నగర పీఎస్ పరిధిలోని బారాషహీద్‌దర్గా, కలెక్టర్ బంగ్లా, డీకేడబ్ల్యూ కళాశాల, పోలీస్ కార్యాలయం, ఐదో నగర పీఎస్ పరిధిలోని ప్రగతినగర్, జీజీహెచ్, రాజరాజేశ్వరి దేవాలయం, ఏసీ స్టేడియం, పోలీస్ కాలనీ, రెవెన్యూ కాలనీ, జ్యూడీషియల్ క్వార్టర్స్, జెడ్పీకాలనీ, పోస్టల్‌కాలనీ, నగర డీఎస్పీ కార్యాలయం దర్గామిట్ట పీఎస్ పరిధిలోకి వచ్చాయి. ♦ ఐదో నగర పీఎస్ పేరును వేదాయపాళెం పీఎస్‌గా మార్చారు. నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలోని కొత్తూరు, అంబాపురం దీని పరిధిలోకి వచ్చాయి. ♦ ఆరో నగర పీఎస్ బాలాజీనగర్ పీఎస్‌గానే కొనసాగనుంది. నాలుగో నగర పీఎస్ పరిధిలోని రామలింగాపురం, హరనాథపురం, మినీబైపాస్‌లోని టీడీపీ కార్యాలయం, ముత్యాలపాళెం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఈ స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. సిబ్బంది నామమాత్రం పెరిగిన దానికి అనుగుణంగా సిబ్బంది కేటాయింపులు జరగకపోవడంతో ఉన్న అరకొర సిబ్బందితోనే స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించాలి. ఒక్కో స్టేషన్లో సుమారు 20కుపైగా ఖాళీలు ఉన్నాయి. ఉన్న వారిలో పది మందికి పైగా ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే డ్యూటీలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ఉన్న వారిపైనే పనిఒత్తిడి పెరగనుంది. కేసుల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. -
పాత గుంటూరులో భీభత్సం, పీఎస్‌పై దాడి
సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారయత్నం ఘటనతో పాత గుంటూరులో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన పాత గుంటూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద భీభత్సం సృష్టించారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడమే కాకుండా, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత గుంటూరు 144 సెక్షన్ విధించారు. పోలీస్ స్టేషన్ దాడిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాచారయత్నం చేసిన నిందితుడు రఘును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. గుంటూరులో మరో దారుణం -
పోలీస్‌స్టేషన్‌లో ప్రేమికుల ఆత్మహత్య
లక్నో : ఇద్దరు ప్రేమికులు పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బిజ్నూరు జిల్లాలోని నూర్పూర్లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డగించడంతో ఆందోళనకు గురై ఈ దారుణానికి సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టకిపూరాకి చెందిన సుమిత్, అంజలిలు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికి పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే భయంతో ఇంట్లో నుంచి పారిపోయారు. సోమవారం రాత్రి తమ స్నేహితుడు అన్జు సహాయంతో బైక్‌పై బయలుదేరారు. తెల్లవారు జామున 3.30 గంటలకు నూర్పూర్కు చేరుకున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు, ఓ యువతి ఉండటంతో అనుమానం వచ్చి వారిని అడ్డగించారు. కాగా అంజలి ‘నేను సుమిత్ ప్రేమించుకుంటున్నామని.. ఇంటి నుంచి పారిపోయి వచ్చామని.. ఇందుకు మా స్నేహితుని సహాయం తీసుకున్నాం’ అని పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని వారికి సమాచారం ఇచ్చి.. వారిని పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చారు. అయితే ఉన్నట్టు ఉండి అంజలి, సుమిత్‌లకు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో భయానికి గురైన అంజలి, సుమిత్‌లు తమ వెంట తెచ్చుకున్న విషపు మాత్రలు తీసుకున్నారు. బాధితుల తల్లిదండ్రుల కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు చనిపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా బీజ్నూర్ ఎస్పీ ఉమేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. -
రాత్రి పాతగుంటూరులో ఉద్రిక్తత
-
ఐసిస్ హిట్ లిస్ట్‌లో పోలీస్‌స్టేషన్..?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) రాజధానిలోని పోలీసుస్టేషన్‌ను టార్గెట్ చేస్తోందా..? ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. 2016లో సిటీలో చిక్కిన దీని అనుబంధ సంస్థ జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) ఉగ్రవాదులు ఠాణాలను టార్గెట్ చేసినట్లు అప్పట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. దీనికి కొనసాగింపుగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వా్కడ్ (ఏటీఎస్) టీమ్ పట్టుకున్న ఐసిస్ ఉగ్రవాదులు ఒబేద్ మీర్జా, ఖాసిం స్టింబర్‌వాలా విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏటీఎస్ అధికారులు నోరు మెదపట్లేదు. రాష్ట్ర పోలీసు వర్గాలు సైతం ధ్రువీకరించకుండా గోప్యంగా ఉంచుతున్నాయి. జేకేబీహెచ్ విఫలం కావడంతో... నగరానికి సంబంధించి షఫీ ఆర్మర్ 2016లో రెండు మాడ్యుల్స్‌ను తయారు చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర చేశారు. ఈ రెండు ముఠాలను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఆ ఏడాది జూన్‌లో చిక్కిన జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్ (జేకేబీహెచ్) మాడ్యుల్లో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇబ్రహీం నేతృత్వంలో పని చేసిన ఈ గ్యాంగ్‌లో రిజ్వాన్ ఒకడు. అప్పట్లో హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేయాలని సూచించిన షఫీ ఆర్మర్ వాటిలో పోలీసుస్టేషన్లు సైతం ఉండాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే 10 ఠాణాల వద్ద రెక్కీ నిర్వహించిన రిజ్వాన్ ‘మాల్ తయ్యార్ హై’ (సరుకు సిద్ధంగా ఉంది) అంటూ షఫీ ఆర్మర్‌కు ఆన్లైన్ సందేశం కూడా పంపాడు. ఈ పథకం అమలు కావడానికి కొన్ని రోజుల ముందే మాడ్యుల్ మొత్తాన్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో షఫీ ఆర్మర్ టార్గెట్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే అతను గుజరాత్‌కు చెందిన ఒబేద్, ఖాసింల హిట్ లిస్ట్‌లో రాజధానిలోని ఠాణాను చేర్చినట్లు తెలుస్తోంది. సూరత్‌కు చెందిన ఖాసిం అంకలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో ల్యాబొరేటరీ సూపర్వైజర్గా పని చేస్తుండగా... ఒబేద్ వృత్తిరీత్యా లాయర్ కాగా ఇతడికి అంకలేశ్వర్‌లోని వేసు ప్రాంతంలో దావత్ అనే రెస్టారెంట్ సైతం ఉంది. ఆయుధాలతో పాటు విషప్రయోగం... ఒబేద్, ఖాసింలకు టార్గెట్లు అప్పగించిన షఫీ ఆర్మర్ రోటీన్‌కు భిన్నమైన విధానంలో హిట్ చేయాల్సిందిగా సూచించాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి సంగ్రహించిన ఆయుధాలతో పాటు విషప్రయోగంతోనూ బీభత్సం సృష్టించాలని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వీరు ‘బీ–18’ అనే విషపదార్థం వినియోగంపై అధ్యయనం చేశారు. దీనిని ప్రయోగించడం ద్వారా టార్గెట్ గుండె ఆగి చనిపోతాడని, కొన్ని గంటలకే శరీరం నుంచి దీని ఆనవాళ్లు తొలగిపోవడంతో పోస్టుమార్టం పరీక్షల్లోనూ మరణానికి కారణం తెలియదని దీనిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. గత వారం అంకెలేశ్వర్ న్యాయస్థానంలో వీరిద్దరి పైనా అభియోగపత్రాలు దాఖలు చేసింది. వీరు హైదరాబాద్‌లోని ఠాణాను టార్గెట్ చేసినట్లు పేర్కొంటున్న ఏటీఎస్ అధికారులు అది ఏ పోలీసుస్టేషన్ అనేది స్పష్టం చేయట్లేదు. దీనిపై రాష్ట్ర పోలీసు వర్గాలు మాత్రం తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపాయి. 2016లో చిక్కిన జేకేబీహెచ్ మాడ్యుల్లో వీరు పరోక్షంగా పాత్రధారులై ఉండవచ్చని, అప్పటి ‘టార్గెట్ ఠాణా’నే కొనసాగిందని అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారం ఉంటే గుజరాత్ పోలీసుల ద్వారా విషయం తెలుసుకునే నిఘా వర్గాలు హెచ్చరిస్తారని చెబుతున్నారు. ‘ఆ నలుగురి’కీ స్ఫూర్తి వీరే... గుజరాత్ ఏటీఎస్ అధికారులు గతేడాది అక్టోబర్ 25న అక్కడి అంకెలేశ్వర్ ప్రాంతంలో ఒబేద్, ఖాసింలను పట్టుకున్నారు. సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతూ సోషల్‌మీడియా ద్వారా రిక్రూట్మెంట్స్ చేపడుతున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న వీరికి సిటీకి చెందిన నలుగురు యువకులతోనూ లింకులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరంలోని దక్షిణ మండలానికి చెందిన అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేని, మాజ్ హసన్ ఫారూఖ్‌లు కాశ్మీర్ మీదుగా సిరియా వెళ్లాలనే ప్రయత్నాల్లో 2016లో నాగ్‌పూర్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. దీనికి రెండేళ్ల ముందు 2014లో బాసిత్‌తో పాటు మాజ్ హసన్, అబ్రార్, నోమన్ కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్ చేరుకుని అట్నుంచి సిరియా వెళ్లడానికి ప్రయత్నించగా, వీరిని కోల్‌కతాలో గుర్తించిన నిఘా వర్గాలు వెనక్కు తీసుకువచ్చాయి. ఈ నలుగురినీ సరిహద్దులు దాటేందుకు ప్రోద్భలం ఇచ్చింది ఒబేద్, ఖాసిం అని తేలింది. ఆన్లైన్ ద్వారా షఫీ ఆర్మర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వీరిద్దరూ సిటీకి చెందిన నలుగురినీ రిక్రూట్ చేసి సరిహద్దులు దాటించేందుకు యత్నించారు. 2014లో వీరిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుజరాత్ ద్వయం వాంటెడ్‌గా మారలేదు. -
లాకప్‌లో వేయండి.. ఎవరొస్తారో చూద్దాం!
ఒకే శాఖ. అందునా కిందిస్థాయి ఉద్యోగి. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి తన హోదా మరిచి వ్యవహరించాడు. అవసరమైతే అతనికి సహాయం చేయాల్సింది పోయి.. అతని డబ్బుకే ఎసరు పెట్టాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ‘సార్.. డబ్బు తిరిగివ్వండి’ అని అడిగిన పాపానికి ఓ కానిస్టేబుల్‌ను ‘వీడిని లాకప్‌లో వేయండిరా.. ఎవరు అడ్డొస్తారో చూద్దాం’ అని గద్దించిన ఘటన అనంతపురం నాల్గో పట్టణ పోలీసుస్టేషన్లో చోటు చేసుకుంది. అనంతపురం సెంట్రల్: నాల్గో పట్టణ పోలీసుస్టేషన్లో ఓ అధికారి వ్యవహార శైలి తవ్వేకొద్దీ కొత్త విషయాలతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిర్యాదుదారులు ఆ స్టేషన్ మెట్లెక్కేందుకే జంకుతుంటే.. సొంత శాఖ సిబ్బంది కూడా ఆయన చేష్టలతో వణికిపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రిపోర్టు రాసి సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ‘సాక్షి’లో గత రెండు రోజులుగా వరుస కథనాల నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ కోవలోనే అదే స్టేషన్లో పని చేస్తూ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ఓ కానిస్టేబుల్ సైతం ఆయనను అవమానాల పాలు చేసిన విషయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. రక్షక్ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్న సదరు ఏఆర్ కానిస్టేబుల్ ఇటీవల అధికారి వేధింపులు తాళలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు. అందుకు కారణాలను పరిశీలిస్తే.. ఓసారి వాహనం మరమ్మతుకు లోనైంది. విషయాన్ని అధికారి దృష్టికి తీసుకెళ్తే.. ‘‘డబ్బు సర్దుబాటు చేసుకొని మరమ్మతు చేయించు.. స్టేషన్‌కు ఏదైనా డబ్బు వస్తే సర్దుబాటు చేస్తా’’నని చెప్పాడు. పై అధికారి కావడంతో సదరు కానిస్టేబుల్ తన జేబు నుంచి వాహనానికి మరమ్మతులు చేయించాడు. ఆ తర్వాత రెండు నెలలైనా పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ‘సార్.. డబ్బు సర్దుబాటు చేయండి’ అని కోరాడు. చూద్దాంలే అని చెప్పి.. మరో ఆరు నెలలు గడిచినా అధికారి నుంచి స్పందన లేకపోయింది. ఇటీవల తిరిగి డబ్బు అడగటంతో రెచ్చిపోయిన అధికారి స్టేషన్లో అందరూ చూస్తుండగానే ‘వీడిని లాకప్‌లో వేయిండిరా.. ఎవరు అడ్డొస్తారో చూద్దాం’ అంటూ దుర్భాషలాడినట్లు సమాచారం. అధికారికి ఎదురొడ్డి నిలవలేని ఆ కానిస్టేబుల్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు. అయితే ఈ బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే చెబుతున్నా.. బయటకు చెప్పుకోలేని ఉద్యోగులు కొందరు లోలోపల మదనపడుతున్నారు. స్టేషన్ అవసరాల పేరిట వసూళ్లు సమస్యలతో పోలీసుస్టేషన్ మెట్లెక్కితే చాలు.. స్టేషన్ అవసరాల పేరిట ముక్కుపిండి వసూలు చేయడం పరిపాటిగా మారింది. కక్కలపల్లి సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థి చనిపోతే స్టేషన్‌కు చెందిన బొలెరో వాహనం మరమ్మతుల పేరిట వేలల్లో డబ్బు గుంజినట్లు సమాచారం. స్టేషన్ అవసరాల పేరిట లక్షల్లో వసూళ్లు చేస్తున్నా.. రక్షక్ వాహన మరమ్మతుకు తన చేతి నుంచి డబ్బు పెట్టుకున్న కానిస్టేబుల్‌కు తిరిగి చెల్లించకపోవడం గమనార్హం. ఇకపోతే సదరు అధికారికి ఇద్దరు కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాత్రిళ్లు ఆయనతో పాటు తనిఖీకి వెళ్లిన సమయంలో హైవేపై వచ్చివెళ్లే వాహనాల నుంచి డబ్బు గుంజడం.. రాంనగర్‌లోని ఓ బార్, టీ కేఫ్‌ల వద్ద వసూళ్ల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే కేసుల విషయంలోనూ డబ్బు వ్యవహారం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లే చక్కబెడుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారి అండదండలతో.. ఈ ‘నాల్గో’ సింహం పనితీరు ఉన్నతాధికారులకు తెలియనిది కాదు. అయితే జిల్లా స్థాయిని మించి ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ఇక్కడ ఆయన ఆటలు సాగిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. బాధితులు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేసినా ప్రతిసారీ ఆ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఇకపోతే ఓ మంత్రి సోదరునికి నమ్మిన బంటుగా ఉంటున్న ఈ అధికారి ఆయన చెప్పిన ప్రతి కేసునూ సెటిల్మెంట్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అధికారిపై ఆరోపణలు తీవ్రం కావడంతో మంత్రి సోదరునితో ఉన్నతాధికారులకు సిఫారసు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసు శాఖ ప్రతిష్టకే భంగం కలిగే పరిస్థితి ఉండటంతో ఉన్నతాధికారులు సదరు అధికారి విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. 18 తులాలకు.. రెండే! గతేడాది నగరంలోని రాంనగర్లో సుధారాణి, ప్రవీణ్‌కుమార్ దంపతుల ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుడు నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల దొంగను పట్టుకున్న పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేశారు. బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన ఆ పెద్దపోలీసు 2 తులాలు తీసుకొని 18 తులాలకు అంగీకారం తెలిపినట్లు సంతకం చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇదెక్కడి న్యాయమని బాధితులు ప్రశ్నిస్తే నాకే ఎదురు తిరుగుతావా అంటూ విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో బాధితులు సదరు అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చోరీ సొత్తు రివకరీ విషయంలోనూ సదరు అధికారి చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎదురులేని హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్లో 64వ విజయం. నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. -
కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ ఓవైపు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ దూసుకెళ్తుంటే.. మరోవైపు కింది స్థాయి సిబ్బంది మాత్రం ఇంకా నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. వీక్లీ ఆఫ్ హామీ పదేళ్లుగా ఏ మాత్రం ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతి భద్రతల విధుల కారణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది. అయితే గత మూడు నాలుగేళ్లలో పోలీసు శాఖలో వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా కూడా.. వీక్లీ ఆఫ్ ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత పేరిట..: పోలీసుశాఖలో దాదాపు 46 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అందులో మెజారిటీ శాతం సివిల్ విభాగంలో పనిచేసేవారే. వీరికి వీక్లీ ఆఫ్ ఇస్తామని పదేళ్లుగా ఉన్నతాధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. సివిల్ విభాగం శాంతి భద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారు. కొత్తగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినందున సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్య కాదని.. దీనిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేయకపోవడమే ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు టెక్నాలజీ పెరిగినకొద్దీ పనిభారం తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో వీక్లీ ఆఫ్ అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తగిన విధంగా వినియోగించుకుంటే.. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే వీక్లీ ఆఫ్ ఇవ్వడం కష్టం కాదన్నది కొందరు సీనియర్ ఐపీఎస్‌ల అభిప్రాయం. ఠాణాల వారీగా సిబ్బంది ఎంత మంది ఉన్నారు, వారి డ్యూటీ చార్ట్, సెక్టార్ల కేటాయింపు తదితరాలపై వారం పదిరోజులు కసరత్తు చేస్తే వీక్లీ ఆఫ్ అమలు పెద్ద కష్టం కాదని పేర్కొంటున్నారు. ఒక కానిస్టేబుల్‌కు ఠాణా లో పక్కాగా ఒక డ్యూటీ కేటాయించడం, ఆ వ్యక్తికి రిలీవర్‌గా మరో కానిస్టేబుల్‌ను నియమించి నెల, రెండు నెలల పాటు పైలట్‌గా డ్యూటీలు చేయించడం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటాయా? ఉంటే వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై సబ్ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆయా ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ఠాణాల్లో పరిస్థితి ఇదీ.. జిల్లాల్లోని మండల స్థాయి పోలీస్స్టేషన్లు/ఎస్సై స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఠాణాల్లో 21 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఒక మండల స్థాయి ఠాణా పరిధిలో గరిష్టంగా 22 నుంచి 25 గ్రామాలు ఉంటాయి. ఠాణాకు రోజువారీ ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమో దు తదితర స్టేషన్ మేనేజ్మెంట్కు ఒక ఏఎస్సై అడ్మిన్‌గా ఉంటే.. బందోబస్తు, కేసుల దర్యాప్తులకు మరో ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను కేటాయించుకోవచ్చు. మిగతా వారు గ్రామాలు, అక్కడ జరుగుతున్న నేరాలు, రోజువారీ శాంతి భద్రతలు, స్టేషన్ డ్యూటీలను పర్యవేక్షిస్తారు. సరైన రీతిలో వర్క్ మేనేజ్మెంట్ ఉపయోగిస్తే వీరందరికీ వీక్లీ ఆఫ్ కేటాయించడం పెద్ద కష్టం కాదన్నది జిల్లా ఎస్పీల అభిప్రాయం. అర్బన్ స్టేషన్లలో కష్టమే! పోలీస్ కమిషనరేట్లు, అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక ఇన్స్పెక్టర్, 4 ఎస్సై, 6 ఏఎస్సైలు, 8 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో వీఐపీల బందోబస్తు, నేరాలు కారణంగా వీక్లీ ఆఫ్ కొంత కష్టమని చెబుతున్నారు. ప్రతి ఠాణాకు మరో 6 నుంచి 8 మంది కానిస్టేబుళ్లను కేటాయిస్తే, వీక్లీ ఆఫ్ అమలు సులభమని పోలీస్ కమిషనర్లు చెబుతున్నారు. -
రైలులో సీటు కోసం డిష్యుం డిష్యుం
కమలాపురం: ఆస్తి పాస్తుల కోసమో.. డబ్బు కోసమో ఘర్షణ పడి పోలీస్ స్టేషన్ వరకు వచ్చే వారిని చూస్తుంటాం. కానీ రైలులో ప్రయాణిస్తూ సీటు కోసం ఘర్షణ పడి పోలీస్ స్టేషన్‌కు చేరిన సంఘటన కమలాపురంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా, సీఎస్ పురం మండలం, చెర్లోపల్లెకు చెందిన రామనబోయిన సుబ్బయ్య, రామయ్య, సుధూర్, ఇండ్ల వెంకటేష్ తదితరులు వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుణేలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు సాయంత్రం రేణిగుంటలో దాదర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అలాగే వేంపల్లెకు చెందిన నామా శ్రీనివాసులు, హేమంత్, కశెట్టి నరసింహులు తమ కుటుంబ సభ్యులతో తిరుపతిలో మలుపెళ్లి చూసుకొని రేణిగుంటలో రైలు ఎక్కారు. కడప వరకు వారి ప్రయాణం సజావుగా సాగింది. కడప రైల్వే స్టేషన్ దాటాక ఆ రెండు కుటుంబాల వారు సీటు కోసం ఘర్షణకు దిగారు. మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. అయితే ప్రకాశం జిల్లా వాసులు ఎక్కువ మంది ఉండటంతో వేంపల్లె వారిని గాయ పడే విధంగా కొట్టారు. ఈ విషయాన్ని గమనించిన రైల్వే పోలీసులు వారిని కమలాపురం పోలీస్ స్టేషన్లో దించి వేశారు. దీంతో వారు కమలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే కమలాపురం పోలీసులు రైలులో జరిగిన ఘర్షణతో తమకు సంబంధం ఉండదని, కడప రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సూచించడంతో వారు కడప రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. -
పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మందు పార్టీ
-
పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరంగం
సాక్షి, గుంటూరు: పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరంగం సృష్టించారు. ఏకంగా స్టేషన్లోనే తన మిత్రులకు మందు పార్టీ ఇచ్చారు. ఈ ఘటన బాపట్ల ఎక్సైస్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. రవికుమార్ అనే వ్యక్తి బాపట్లలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శక్రవారం తన స్నేహితులకు స్టేషన్లోనే మందుపార్టీ ఇచ్చారు. దీనిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌ను ఎస్ఐ అడ్డుకున్నారు. రిపోర్టర్ దగ్గర ఉన్న కెమెరాను లాక్కుని విజువల్స్ డిలీట్ చేశారు. రిపోర్టర్‌పై స్నేహితులకు చిన్న పార్టీ కూడా ఇవ్వటం నేరమా అంటూ ఎస్ఐ రవికుమార్ మండిపడ్డారు. వైఎస్సార్: జిల్లాలోని కమలాపురంలో మరో ఎస్ఐ వీరంగం సృష్టించారు. దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో వేంపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిపై పూణే వాసులు దాడి చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అక్కడ కమలాపురం ఎస్సై రఫీ బాధితుడి రోదన వినకుండా సర్ది చెప్పి పంపారు. బాధితుడు బయటకు రాగానే పూణే వాసులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. దీన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన సాక్షి విలేఖరిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించారు. -
పోలీసులు కావలెను!
నేరడిగొండ(బోథ్) : ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌లో సరిపడా సిబ్బంది లేక పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. నేరడిగొండ పోలీసు స్టేషన్లో 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు సరైన సమయంలో తగిన సేవలు అందకుండా పోతున్నాయి. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం 30 మంది సిబ్బంది ఉండాలి. అందులో ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు 21 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. అలా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామపంచాయతీల్లో సుమారు 30 వేలకు పైగా ఉన్న జనాభాకు సరైన సమయంలో రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగకుండా అడ్డుకోగలుగుతారు. కానీ ప్రస్తుతం ఆ స్టేషన్లో 12 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగితా సిబ్బంది కొందరు డిప్యూటేషన్లపైన వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పనులే అధికం. డిప్యూటేషన్‌పై వెళ్లిన వారితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు మిగిలిన 12 మందిలో ఒకరు కోర్టు డ్యూటీ, మరొకరు రైటర్‌గా పనిచేస్తుండగా, ఇంకొకరు ఫిర్యాదులు తీసుకునేందుకు నిత్యం స్టేషన్లో ఉండాల్సి వస్తోంది. మిగిలిన 8 మంది, ఎస్సైతో పాటు ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు పోలీసులు ఉన్నారు. వీరితో మాత్రమే మండల ప్రజలకు రక్షణ కల్పించాల్సి వస్తోంది. దీంతో వారికి నిత్యం పనితప్ప ఏ ఒక్క గంట తీరిక దొరకడం లేదు. అందులోనే అప్పుడప్పుడు జాతీయ రహదారి గుండా మంత్రులు, వివిధ ప్రజాప్రతినిధులు వెళ్తుండడంతో వారిని పంపించడంలో కొంత సమయం కోల్పోతున్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో జరిగే పలు ఉత్సవాలు, పార్టీ సభలకు ఇక్కడి నుంచి ఎస్సైతో పాటు సిబ్బందిని బందోబస్తుకు పంపిస్తున్నారు. దీంతో మండల ప్రజలకు పోలీసుల సేవలు అందకుండా పోతున్నాయి. ఏదైనా దరఖాస్తులు ఇస్తే సిబ్బంది సరిపడా లేని కారణంగా రెండుమూడు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగి తగవులు పరిష్కరించుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజలకు సరైన సమయంలో పోలీసు సేవలు అందించేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం స్టేషన్లో సరిపడా సిబ్బంది లేని విషయాన్ని అనేకమార్లు ఉన్నతాధికారులకు విన్నవించాం. 16 మంది కానిస్టేబుళ్లు ఉండి ఉంటే ప్రజలకు అవసరమైన సేవలు వెంటనే అందించేవాళ్లం. ఇప్పటికీ కొంత ఇబ్బందవుతున్నా మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. త్వరలోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. -
మనోడైతే ఓకే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు అనుకూలంగా ఉన్న వారికి, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సు ఉన్న వారిని ఐదేళ్లు దాటినా అదే సబ్ డివిజన్లో కొనసాగించగా, కొంతమందిని పక్కనే ఉన్న స్టేషన్లకు బదిలీ చేశారు. మిగిలిన వారిని సబ్ డివిజన్ దాటి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. కొంతమందికి మినహాయింపు ఇవ్వడాన్ని ప్రశ్నించిన 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లను వీఆర్‌లో పెట్టడం వివాదాస్పదంగా మారింది. జిల్లాలో పోలీసు సిబ్బంది బదిలీల్లో పారదర్శకత కరువైంది. ఓ సబ్‌డివిజన్‌లో ఐదేళ్లు పనిచేసిన సిబ్బందిని మరో సబ్ డివిజన్‌కు బదిలీ చేస్తామని చెప్పినా వాస్తవంలో దానికి భిన్నంగా జరిగింది. రాజకీయ సిఫార్సులు చేయించుకున్న వారికే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. వారిని పక్కనే ఉన్న సర్కిల్‌కు బదిలీ చేసి సిపార్సులు చేయించుకోలేని వాళ్లని దూర ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీ చేస్తున్నారంటూ కొంత మంది హెడ్‌కానిస్టేబుళ్లు వ్యతిరేకించినట్లు సమాచారం. నాలుగు రోజుల నుంచి జిల్లాలోని పోలీసు స్టేషన్లలో పనిచేస్తూ ఐదేళ్లు పూర్తి అయిన సిబ్బందికి ఎస్పీ ఎం.రవిప్రకాష్ కౌన్సిలింగ్ చేసి బదిలీలు చేపట్టారు. అయితే బదిలీలు చేసే ముందు యూనిట్ అధికారి ఇంత వరకు ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లలో పనిచేయని వారిని ఏజెన్సీ ప్రాంతాల్లోని స్టేషన్లకు బదిలీలు చేస్తామని, సిబ్బంది ఏవరూ రాజకీయ నేతలతో ఒత్తిడి తీసుకురావద్దని చెప్పారు. కానీ తాజాగా జరిగిన బదిలీల్లో మొత్తం రాజకీయ, సామాజిక కోణంలో బదిలీలు జరిగాయని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి అనుకొని ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సిఫార్సులతో ఏలూరు నగరంలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్న కొంత మంది సిబ్బందిని ఏలూరు మహిళ పోలీసుస్టేషన్, సీసీఎస్, ఏలూరు రూరల్ స్టేషన్లుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. యూనియన్ నాయకుడు కీలకపాత్ర... బదిలీల్లో పోలీసు అధికారుల సంఘం నాయకుడు ఒకరు కీలక పాత్ర పోషించారని, తన సామాజిక వర్గానికి చెందిన, తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని కావాల్సిన స్టేషన్‌కు బదిలీ చేయించుకున్నారని ఆ శాఖ సిబ్బంది బహిరంగగానే చెబుతున్నారు. నగరంలోని పోలీసు ఉన్నతాధికారి బంగ్లాకు అనుకొని ఉన్న పోలీసుస్టేషన్లో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళ హెడ్‌కానిస్టేబుల్ పేరు బదిలీ జాబితాలో లేకపోవడం చూస్తుంటే బదిలీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో అర్థం అవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు వీఆర్ రాజకీయ నేతల సిఫార్సులు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో కొంత మంది హెడ్‌కానిస్టేబుళ్లు యూనిట్ అధికారి తీరును తప్పుబట్టారు. దాంతో వారు బదిలీ చేసిన స్టేషన్లకు వెళ్లమని ఖరాకండిగా చెప్పినట్లుగా సమాచారం. ఫలితంగా సుమారు 32 మంది హెడ్‌కానిస్టేబుళ్లను వీఆర్‌లో పెట్టినట్లుగా తెలిసింది. మళీ కౌన్సెలింగ్ జరుపుతాం బదిలీల కౌన్సెలింగ్ అంతా పారదర్శకంగా జరిగింది. ఎవరినీ వీఆర్‌కు పంపలేదు. అందరూ ఒకే స్టేషన్ కోరుకోవడం వల్ల సమస్య వచ్చింది. వారిని పక్కన పెట్టాం. ఒకటి రెండు రోజుల్లో వారికి మళ్లీ కౌన్సెలింగ్ చేసి పోస్టింగులు ఇస్తాం. ఎం.రవిప్రకాష్, ఎస్పీ -
ఠాణాకు తాళం!
చారకొండ (కల్వకుర్తి): 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌కు తాళం వేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో వెలుగు చూసింది. నిబంధనల ప్రకారం ఒకరి తర్వాత మరొకరు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లాల్సి ఉండగా, స్టేషన్‌కు తాళం వేసి అందరూ ఒకేసారి వెళ్లారు. చారకొండ పోలీసు స్టేషన్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఎస్సై పోచయ్య దొంగతనం కేసు విచారణకు ఆదివారం బయటకు వెళ్లారు. కానిస్టేబుల్ శరత్ భోజనానికి బయటకు వెళ్లారు. ఆయన వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ భూపతిరెడ్డి స్టేషన్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారి వెల్దండ సీఐ దృష్టికి వెళ్లింది. ఆయన హుటాహుటిన చారకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకునే సరికే స్టేషన్ తాళం తీశారు. దీనిపై సీఐని వివరణ కోరగా తాళం ఎందుకు వేశారో విచారించి తెలుసుకుంటామని తెలిపారు. -
పరిగి పోలీస్‌స్టేషన్‌లో దారుణం
వికారాబాద్ జిల్లా : పరిగి పోలిస్ స్టేషన్లో దారుణం జరిగింది. ఓ కేసు విషయంలో రాజు అనే యువకుడిని స్థానిక ఎస్సై ఓబుల్ రెడ్డి చితకబాదారు. ఎస్సై దెబ్బలు తాళలేక రాజు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తాళలేకే స్పృహ కోల్పోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హూటాహుటిన బాధితుడిని పోలీసులు ఇంటికి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల బదిలీలకు రంగం సిద్ధం
గుంటూరు: అర్బన్ జిల్లా పరిధిలో సుదీర్ఘకాలంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న పోలీసుల బదిలీకి రంగం సిద్ధం అయింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు బదిలీ చేసేందుకు ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్లు ఒకే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలనే నిబంధనలు ఉండటంతో ఆ మేరకు జాబితాను రూపొందిస్తున్నారు. అయితే, ఇప్పటికే పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారీలో పాటు విజ్ఞప్తుల మేరకు వారం రోజుల కిందట 48 మందిని ఎస్పీ బదిలీ చేశారు. వీరిలో అధికంగా ట్రాఫిక్, జాతీయ రహదారుల వెంట నిఘా, వాహనాల క్రమబద్ధీకరణలో విధులు కేటాయించారు. మూడు ఆప్షన్ల విధానంలో బదిలీలు విమర్శలకు తావులేకుండా మూడు ఆప్షన్ల విధానంలో బదిలీలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బదిలీ జాబితాలో ఉన్నవారు గతంలో పనిచేయని పోలీస్ స్టేషన్లను కోరుకోవాలి. అలాకాకుండా గతంలో పని చేసిన స్టేషన్ల కోసం ఆప్షన్లలో నమోదు చేస్తే మాత్రం నిర్ణయం అధికారులు తీసుకుంటారు. రెండేళ్ల కాలం పూర్తయిన ఎస్ఐలను కూడా బదిలీ చేసేందుకు జాబితాను రూపొందిస్తున్నారు. వీరితో పాటు వీఆర్‌లో ఉన్న వారికి కూడా ఖాళీల వారీగా పోస్టింగ్‌లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల ద్వారా పైరవీలు కొందరు సిబ్బంది ఎలాగైనా తాము కోరుకుంటున్న స్టేషన్లలోనే ఉద్యోగం కావాలంటూ ప్రజా ప్రతినిధుల చేత సిఫార్సులు చేయిస్తున్నట్లు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు కూడా వారికి అనుకూలమైన వారిని తమ పరిధిలోని స్టేషన్లకు వేయించుకుంటే భవిష్యత్‌లో ఉపయోగకరంగా వుంటారనే ఆలోచనలతో పావులు కదుపుతున్నారు. ప్రజా ప్రతినిధులతో కొందరు ఎస్ఐలు కూడా సిఫార్సులు చేయిస్తున్నారని చర్చించు కుంటున్నారు. -
కాల్ టు సీపీ 94906 16000
నగరంలో పోలీసుల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నడుం బిగించారు. ఖాకీల వల్ల ఎలాంటి ఇబ్బందులు, వేధింపులుఎదురైనా స్వయంగా తనకే ఫిర్యాదు చేయాలంటూ ప్రజలు, వ్యాపారులకువిజ్ఞప్తి చేశారు. సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఏవైనా అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే నేరుగా తనకే సమాచారం ఇవ్వాలని నగర కొత్వాల్ అంజినీ కుమార్ కోరారు. తన ఫోన్ నంబర్ 94906 16000కు ఉప్పందించాలంటూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి ఆరోపణలు రుజువైన సైదాబాద్ ఠాణా కానిస్టేబుల్ అహ్మద్ బిన్ అమర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు హోంగార్డు భోగి నాగరాజును విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గస్తీ విధుల్లో ఉన్న వీరిద్దరూ శివగంగ థియేటర్ రోడ్‌లోని ఎస్బీఐ వద్ద రహదారి పక్కన టీ–షర్ట్స్ విక్రయిస్తున్న వ్యక్తి నుంచి ఓ టీషర్ట్ తీసుకున్న వీరు.. డబ్బు చెల్లించలేదు. దీన్ని స్థానికులు వీడియో తీసి ట్విటర్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. విచారణకు ఆదేశించిన ఆయన.. అవినీతి నిరూపితం కావడంతో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవినీతి చర్యల్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఎల్కతుర్తి : రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రేమజంట మంగళవారం ఎల్కతుర్తిలో విలేకరులతో మాట్లాడింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం నాగలక్ష్మి, కొండి ధనుంజయ ఆరు సం వత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీంతో నాగలక్ష్మి తల్లిదండ్రులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. 21వ తేదీన ధనుంజయ ఇంటిపై నాగలక్ష్మి బంధువులు దాడి చేశారు. తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ, నాగలక్ష్మి ఈ సందర్భంగా సీఐ రవికుమార్‌ను కోరారు. -
ఆ పోలీసుస్టేషన్ అంటే ఎస్ఐలకు దడ !
రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రూరల్ (మన్నూరు) పోలీసుస్టేషన్ ఎస్ఐలుకు అచ్చిరావడంలేదు. మన్నూరు పోలీసుస్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న ఎస్ఐలు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సస్పెన్షన్ కావడమో..రాజకీయ బదిలీ...లేక వ్యక్తిగతగ ఫెయిల్యూర్స్‌తో ఎస్ఐలు స్టేషన్ వీడిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టింగ్ అంటే ఎస్ఐలు వెనడుగు వేస్తున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లాకప్‌డెత్ నుంచి నేటి వరకు పనిచేసిన ఎస్ఐలు అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారంటే ఈ స్టేషన్ ప్రభావం ఏ పాటిదే అవగతమవుతుంది. పరిధి విస్తారం..మానసిక ఒత్తిడిలు.. పేరుకే రూరల్ పోలీస్టేషన్..కానీ పరిధి విస్తా రం. ప్రజల కోసం పనిచేసే ఎస్ఐలకు రాజ కీయ ఒత్తిళ్లు అధికం అన్న విమర్శలున్నాయి. మన్నూరు పోలీసుస్టేషన్ పరిధి ఎక్కువుగా ఉండటంతో ఒక ఎస్ఐ విధులు నిర్వర్తించాలంటే కష్టమవుతోంది. ఇక్కడ పనిచేసే ఎస్ఐకు మానసిక ,విధి పరమైన ఒత్తిడిలతో కుటుంబాలతో గడపలేని పరిస్ధితులు దాపురించాయి. ఇటీవల మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో ఈ స్టేషన్ అంటేనే హడలెత్తిపోతున్నారు. వాస్తుపరంగా ఈస్టేషన్‌కు దోషాలు ఉన్నాయనే అనుమానాలు మన్నూరు పోలీసులను వేధిస్తున్నాయి. పట్టణతరహాలో ఎస్హెచ్ఓ అవసరం.. రాజంపేట పట్టణపోలీసుస్టేషన్ తరహలో స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌కు సీఐ స్ధాయి అధికారిని పోలీసుశాఖ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రూరల్ సీఐ ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో ఒక మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, పుల్లంపేట మండలాలు చూసుకోవాల్సి వస్తోంది. మన్నూరు పరిధిలో అధిక సంఖ్యలో గ్రామాలు, అటవీ పల్లెలు, పట్టణంతో పాటు అభివృద్ధి చెందుతున్న బోయనపల్లె, పలు ఉన్నత విద్యాసంస్ధలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిలో ఈ స్టేషన్‌ను ఒక ఎస్ఐ మెయింటెన్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు.. ఇప్పటి వరకు మన్నూరు పోలీసుస్టేషన్లో అనేక మంది సీఐలు, ఎస్ఐలు పనిచేసినప్పటికి వివాదాలు నడుమ వెళ్లిపోవడం ఈ స్టేషన్ సంప్రదాయం. 1998 నుంచి తీసుకుంటే మునిరామయ్య, గోరంట్ల మాధవ్, సయ్యద్ సాబ్జాన్, శాంతుడు, ఓవీ రమణ, రామచంద్రారెడ్డి, జెవీఎస్ సత్యనారాయణ, ఎం.కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, రెడ్డప్ప, కృష్ణయ్య, కృష్ణమోహన్, డి.శ్రీనివాస్, ఎస్వీనరసింహారావు, మధుసూదన్‌రెడ్డి, సుధాకర్, మహమ్మద్‌రఫి, ప్రవీణ్‌కుమార్, ఎన్వీనాగరాజు, పి.మహేశ్‌లు పనిచేశారు. వీరిలో సగానికిపైగా పోలీసు అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకొని ఇక్కడి నుంచి వీఆర్, బదిలీలో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ ఎక్కడుండాలి... మన్నూరు పోలీసుస్టేషన్ రూరల్ పరిధిలో కాకుండా పట్టణంలోని పట్టణ పోలీస్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. గతంలో హరితహోటల్ సమీపంలో ఉన్న మన్నూరు పోలీసుస్టేషన్‌ను నిర్మాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు.బోయనపల్లె మెయిన్‌రోడ్డులోని పీఓబి, ఎర్రబల్లి వద్ద స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించేందుకు పోలీసు బాస్‌లు ఆలోచన చేయడంలేదు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరోచోటుకు తరలించాలని అధికారులను స్టేషన్లో పని చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
రెండు నెలలుగా తల్లికి నరకం
గుణదల (విజయవాడ తూర్పు): అన్నీ తానై పెంచిన కన్న తల్లిని కడతేర్చాలనుకున్నోడో ప్రబుద్ధుడు. ఆస్తిని అమ్మేసుకుని చివరికి ఆమెకు వచ్చే పింఛను సైతం తీసుకుంటూ ఆమె అడ్డు తొలగించాలనుకున్నాడు. దీనికి కోడలు కూడా సహకరించడంతో ఏడు పదుల వయస్సులో ఉన్న ఆమె రెండు నెలలుగా నరకాన్ని చవిచూసింది. కూడు, నీరు లేకుండా గొలుసులతో కట్టేసి రెండు నెలలు హింసించారు. స్థానికులు చాటుమాటుగా పెట్టిన ఆహారంతోనే ఆమె జీవించింది. స్థానికుల సమాచారంతో వెలుగుచూసిన ఈ ఘటనతో ఆమె కొడుకు, కోడలు కటకటాలపాలయ్యారు. ఏసీపీ సత్యానందం, మాచవరం సీఐ సహేరాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన పోతురాజు ప్రకాశమ్మ (70) ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదల బెత్లెహా నగర్‌లోని తన కుమారుడు పోతురాజు అంజయ్య అలియాస్ ఏసు వద్ద ఉంటోంది. గతంలో ప్రకాశమ్మ పేరిట ఉన్న ఆస్తిని అమ్మేసి తల్లి బాధ్యత తానే తీసుకుంటానని నమ్మబలికాడు ఏసు. ఆఖరికి ప్రకాశమ్మకు వస్తున్న వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్న ఆయన తల్లి బాధ్యత మరిచిపోయాడు. అంతే కాక భార్య మేరి నిర్మలారాణి తో కలిసి తల్లిని హింసించడం ప్రారంభించాడు. ఇంటిలోకి రానీయకుండా ఇంటిపై భాగంలో ఫ్లెక్సీలతో పాక నిర్మించి మండుటెండలో వదిలేశాడు. కూడు, నీరు కూడా ఇవ్వలేదు. రెండు నెలలుగా ఆమె ఎండలోనే పడిఉంది. ఆమె ఎటూ కదలకుండా ఇనుప గొలుసులతో కట్టి పడేశారు. దీంతో కాల కృత్యాలు కూడా మంచంలోనే వెళ్లాల్సిన దయనీయ స్థితి. భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. వృద్ధురాలిని సంకెళ్లతో చూసి అవాక్కయ్యారు. తొలుత ఆమెకు అల్పాహారం, నీరు అందించి వివరాలు సేకరించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధురాలికి వాంబేకాలనీలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఆసరా కల్పించారు. ఆమెను కుమారుడు ఏసు, కోడలు మేరి నిర్మలారాణిలను అరెస్టు చేశారు. తెలిపారు. -
పోలీసులూ..ఇదెక్కడి న్యాయం?
మంచిర్యాలక్రైం: వారిద్దరు క్లాస్‌మెట్స్. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంతకాలం కలిసి జీవించారు. పెళ్లి విషయం పెద్దలకు చెప్పేందుకు మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భవతి. అయితే భార్యను కాపురానికి పంపించాలని ఆ యువకుడు ఆరు నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. మందమర్రి పట్టణం ఊరురామకృష్ణాపూర్కు చెందిన బీమ కిశోర్‌కు మందమర్రికి చెందిన వనితతో 2017 ఆగస్టు 16న హన్మకొండ నర్సింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. వనిత గర్భం దాల్చినట్టు 2017 సెప్టెంబర్ 16న వైద్య పరీక్షల ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలుగు నెలల గర్భవతి. ఎలాగైనా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పాలని కిశోర్ తన భార్యతో కలిసి మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో 2017 సెప్టెంబర్ 18న ఫిర్యాదు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పటి ఎస్సై వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా యువతి మాటమార్చడంతో కథ అడ్డం తిరిగింది. ఈ విషయంలో తనను పోలీసులు బెదిరించారని కిశోర్ తెలిపాడు. ఈ నెల 16న టవరెక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా నా భార్యను కాపురానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని, నాలుగు నెలల గర్భాన్ని తొలగించి బ్రూణ హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని బెల్లంపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశానని కిశోర్ తెలిపాడు. -
వారి వివాహానికి కులం అడ్డుకావడంతో..
పళ్లిపట్టు: కులాంతర వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమజంట శుక్రవారం పొదటూరుపేట పోలీసులను ఆశ్రయించారు. వధూవరులు ఇద్దరూ మేజర్ కావడంతో కొత్త జంటకు పోలీసులు శుభాకాంక్షలు తెలిపి పంపారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపం పొదటూరుపేట టౌన్ చవటూరుకు చెందిన శేఖర్ కుమార్తె పొర్కొడి(22) వారం రోజుల ముందు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పొర్కొడి, ఈచ్చంతోపు గ్రామానికి చెందిన తాపిమేస్త్రి కుమారుడు ఉమాపతి(24) అనే యువకుడితో పొర్కొడికి వివాహం జరిగి తమకు రక్షణ కల్పించాలని పొదటూరుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో పొర్కొడి, ఉమాపతి ప్రయివేటు కర్మాగారంలో పనిచేసే సమయంలో వారిమధ్య ప్రేమ చిగురించినట్లు, అయితే వారి వివాహానికి కులం అడ్డుకావడంతో ఇరు కుటుంబాల వారు వ్యతిరేకించిన నేపథ్యంలో తిరుపతికి వెళ్లి అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి కుటుంబాల నుంచి తమకు వ్యతిరేకత ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఇద్దరూ మేజర్ కావడంతో వారిని తిరుత్తణి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరు రక్షణ కల్పిస్తామని వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు తగిన రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు. -
నిర్మాణాల్లో ‘పోలీస్’ వేగం
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల భవన నిర్మాణాలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు. పదవీ బాధ్యతలు స్వీకరించి సోమవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తోడ్పాటుతో పోలీసుశాఖకు కొత్త భవనాలు, క్వార్టర్లు, ఠాణాల ఆధునీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 95 శాతం వృద్ధిరేటు సాధించామని, ఈ ఏడాది బడ్జెట్లో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 464.46 కోట్లను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ హౌసింగ్ కార్పొరేషన్‌పై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని అన్నారు. పోలీసు భవనాలనే కాకుండా జైళ్ల, అగ్నిమాపకశాఖ, హార్టి్టకల్చర్ కాలేజీలు, ఇతర విభాగాల్లోని భవనాల నిర్మాణ బాధ్యతలనూ కార్పొరేషన్ చేపట్టడం గర్వకారణమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 13 జిల్లాల్లో పోలీస్ హెడ్క్వార్టర్లు(డీపీవో), పరేడ్ గ్రౌండ్స్, క్వార్టర్లు నిర్మిస్తున్నట్టు దామోదర్ తెలిపారు. సిద్దిపేటతోపాటు రామగుండం కమిషనరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 313 పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 103 కొత్త ఠాణాలను నిర్మిస్తున్నామని, రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పోలీసు గెస్ట్‌హౌస్, వెల్ఫేర్ సెం టర్ నిర్మాణం జరుగుతోందన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పారదర్శకంగా జరగడంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ బి. మల్లారెడ్డి కృషి ఎంతో ఉందని, సీఈ గోపాలకృష్ణ, ఎస్ఈ విజయ్‌కుమార్ తో పాటు మిగిలిన సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని దామోదర్ కొనియాడారు. సీఎం తోడ్పాటు మరువలేనిది: మల్లారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు పెద్దగా గుర్తింపు లేదని, కానీ స్వరాష్ట్రం లో పక్కా నిర్మాణాలన్నింటినీ తామే చేపట్టడం గర్వంగా ఉందని కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్ కమిషనరేట్ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. గతేడాదిలో రూ. 220 కోట్ల పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి బిల్లు పంపించామని, ఇది మొత్తం పోలీస్ హౌసింగ్ చరిత్రలో రికార్డు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తోడ్పాటు, కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ సూచనలతో హౌసింగ్ కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధించాలని మల్లారెడ్డి ఆకాం క్షించారు. అధికారులు, సిబ్బంది కృషి వల్లే నిర్మాణాలు, ఆధునీకరణ వేగవంతమవుతోందన్నారు. కాగా, పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పోలీసుశాఖలో భవనాలు, హెడ్ క్వార్టర్ల నిర్మాణంలో క్రియాశీలపాత్ర పోషిస్తున్న దామోదర్‌తోపాటు అంకితభావంతో పనిచేస్తున్న ఐజీ, ఎండీ మల్లారెడ్డిని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
యాలాల: కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట రక్షణ కల్పించాలంటూ ఆదివారం యాలాల పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని జక్కేపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి రేణుక, అదే గ్రామానికి చెందిన కొరవాని సురేష్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరిద్దరివి వేర్వేరు కులాలు. ఇద్దరు మేజర్లు కావడంతో కేవీపీఎస్ నాయకుల సమక్షంలో యాలాల మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ యాలాల ఎస్ఐ సురేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య, చైల్డ్‌లైన్ ప్రతినిధి వెంకటేష్, నాయకులు మైసప్ప, అంజిలప్ప, రాజు, లాలప్ప ఉన్నారు. యాలాల పీఎస్ ఆవరణలో ప్రేమ జంట -
విదేశీ జంట ప్రైవేట్ వీడియో కలకలం!
సాక్షి, ఉదయ్‌పూర్: విదేశీ జంట ఏకాంత వీడియోపై దుమారం రేగుతోంది. పోలీస్ స్టేషన్‌పై వీరు ఏకాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం.. ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌పైనే ఈ అసాంఘీక కార్యకలాపాలు జరిగాయని, స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుండటం గమనార్హం. అంటే.. పోలీసుల సహకారంతోనే విదేశీ జంట పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్ఐ వేధింపులు తాళలేక
తాడిపత్రి: చేయని నేరాన్ని బలవంతంగా ఒప్పించేందుకు ఓ ఎస్ఐ యత్నించడంతో ఇద్దరు వ్యక్తులు పోలీస్‌స్టేషన్ ఎదటే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి చెందిన దస్తగిరి, మనోహర్ అనే వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డిపల్లిలో కొద్ది రోజుల క్రితం గొర్రెలు చోరీకి గురయ్యాయి. అయితే ఈ నేరం ఒప్పుకోవాలని గ్రామానికి చెందిన దస్తగిరి, మనోహర్ అనే వ్యక్తులను రూరల్ ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. గొర్రెలను దొంగతనం చేశామని ఒప్పుకోవాలని దస్తగిరి, మనోహర్‌కు దేహశుద్ధి చేశారు. తాజాగా బుధవారం ఉదయం రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట దస్తగిరి, మనోహర్‌లు పోలీసుల వేధింపులు తాళలేక పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న వారు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మనోహర్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గొర్రెలను తామే దొంగిలించామని, వాటికయ్యే నగదు చెల్లిస్తామని దస్తగిరి, మనోహర్ చెప్పినట్లు ఎస్ఐ ‘సాక్షి’కి తెలిపారు. డబ్బు చెల్లించాల్సి వస్తుందనే ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నిర్మల్‌రూరల్ : జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్రలో చోటు చేసుకున్న అల్లర్లపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు మంగళవారం ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ.. భక్తులు, పోలీసులపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రావుల రాంనాథ్, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, వొడిసెల శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
ఔట్‌గోయింగ్ కాల్
నేరం చీకటి పొదలాంటిది. మనసును తన వైపు లాగుతుంది. ఎవరూ చూడరని ఎవరికీ కనిపించదని మనసును తన వైపు పురిగొల్పుతుంది.కాని చివరకు క్లూ అనే వెలుతురుకు దొరికిపోతుంది. 2015, వేసవి మొదటి నెల, కాకినాడ.ఇన్స్పెక్టర్కి ఉబ్బరింతగా ఉంది. చెమటతో యూనిఫామ్ తడిసిపోయి ఉంది. రాత్రి పదిన్నర దాటిపోవడంతో టీ దొరికే మార్గం కూడా లేదు. గవర్నమెంట్ ఆస్పత్రి కాంపౌండ్‌లో చాలాసేపుగా ఉన్నాడు. మళ్లీ ఎమర్జన్సీ వార్డు దగ్గరకు వెళ్లాడు.‘ఎలా ఉంది?’ డాక్టర్ని అడిగాడు.‘ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అతడు ఔట్ ఆఫ్ డేంజర్ అనుకుంటున్నాము’వాళ్లు స్పృహలోకి రావడం ఇంపార్టెంట్. స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో చెబితే తప్ప జరిగిందేమిటో పూర్తి పిక్చర్ రాదు.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదు. ఇంతటి చిక్కుముడి కూడా. అప్పటికే టౌన్ ఔట్స్కర్ట్స్లో పెట్రోలింగ్ పెట్టాడు. అనుమానంగా ఎవరూ దొరకలేదు.మరి దాడి చేసిందెవరు? కొద్ది సేపటి ముందు.పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. ‘సార్... కాకినాడ– శొంఠివారిపాకల రూట్లో పొదల్లో ఒక జంట చావుబతుకుల్లో పడి ఉంది. భార్యాభర్తలు కావచ్చు. మీరు వెంటనే రండి’‘మీరెవరు?’‘ఆ దారిన వెళ్లే గ్రామస్తులమండీ’వెంటనే ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లాడు. చుట్టూ చీకటి. సన్నని మట్టి రోడ్డు. కొద్ది దూరంలో ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు నిలబడి పొదలవైపు చూపించారు.పొదల్లోంచి మూలుగులు వినిపిస్తున్నాయి. సెల్‌ఫోన్ లైట్లో చూశాడు ఇన్స్పెక్టర్. ఓ యువతి, యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. భార్యాభర్తలని అనిపించింది. ఆమె నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. రోడ్డు పక్కనే మోటారు సైకిల్ పడి ఉంది. మరో వైపు బీరుబాటిళ్లు పగిలి పడున్నాయి. బీరుబాటిళ్లను పగలగొట్టి పొడిచినట్టున్నారని అర్థమైంది. గాజు ఒంట్లో దిగితే చాలా ప్రమాదం.చాలా త్వరగా వాళ్లను ఆస్పత్రికి చేర్చే ఏర్పాటు చేశాడు ఇన్స్పెక్టర్. అతడి జేబులో దొరికిన సెల్‌ఫోన్ ద్వారా సంబంధీకులకు సమాచారం కూడా చేరవేశాడు. టైమ్ పదకొండున్నర.ఇద్దరూ స్పృహలోకి రాలేదు.ఏం జరిగిందో తెలియడం లేదు. ఈ పరిస్థితికి ఉబ్బరింత తోడై విసుగ్గా ఉంది. దూరంగా వయసు మీరిన భార్యాభర్తలు దిగులుగా నిలబడి ఉన్నారు. మధ్య మధ్య ఏడుస్తున్నారు. ఇన్స్పెక్టర్ వాళ్లను కలిశాడు.‘వాళ్లు మీకు ఏమవుతారు?’‘నా కొడుకండీ. పెళ్లయి పదిహేను రోజులవుతోంది. అమ్మాయి మా ఆడపడుచు కూతురు. బయటి సంబంధం ఎందుకు అని చేసుకున్నాం. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మావాడు వయసులో పెద్ద కనుక కొంచెం బెరుగ్గా దూరంగా ఉండేదా అమ్మాయి. పెళ్లయ్యాక కూడా ఆ బెరుకు పోలేదు. కాస్త అలా షికారుకు తీసుకెళితే మాటల్లో పడి బెరుకు పోతుందని సాయంత్రం తీసుకువెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మేం కంగారు పడుతుంటే మీ వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది’ ఏడుస్తూ చెప్పిందామె.‘మీకెవరైనా శత్రువులున్నారా?’‘లేరండీ’‘అమ్మాయి ఒంటి మీద బంగారం ఉండాలి. అది లేదు. దొంగలే ఈ పని చేసి ఉండాలి’ అన్నాడు ఆ పెద్దాయన.ఇన్స్పెక్టర్కు కూడా అదే అనిపిస్తోంది. రాత్రి రెండు మూడు దాక కూడా ఇద్దరికీ స్పృహ రాలేదు.ఇన్స్పెక్టర్ కాసేపైనా నిద్రపోయి వద్దామని ఇంటికి వెళ్లి తిరిగి తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చాడు. ‘స్పృహ వచ్చిందా’ కాపలా ఉన్న కానిస్టేబుల్స్‌ని అడిగాడు.‘ఆమెకు ఇప్పుడే వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అతనికి ఇంకా రాలేదు’ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లాడు. భయంతో భీతితో హడలిపోయి ఉంది. కొనప్రాణంతో మాట్లాడినట్టుగా మాట్లాడింది. ‘నా పేరు జయ. నా భర్త పేరు సురేశ్. కొత్తగా పెళ్లయ్యింది. నన్ను షికారుకు తీసుకెళదామని మేట్నీకి తీసుకెళ్లాడాయన. సినిమా అయ్యాక పార్క్‌లో చల్లగాలికి కాసేపు కూర్చున్నాం. ఇక ఇంటికి వెళ్లిపోదామనుకుంటుండగా ఆయనకు బీచ్‌కు తీసుకెళదామనిపించింది. బీచ్‌లో షికారు చేసి హోటల్లో భోజనం చేసుకుని ఇల్లు చేరుకుందాం అనుకున్నాం. బీచ్‌లో తొమ్మిది దాకా ఉన్నాం. తిరిగి బయలుదేరాక ఆయన దారిలో పొదల దగ్గర యూరిన్ కోసమని ఆగాడు. నేను బైక్ దిగి కొంచెం పక్కన నిలుచున్నాను. ఇంతలో ఓ మోటారు సైకిల్ వేగంగా వచ్చింది. దాని మీద ముగ్గురు ఉన్నారు. వాళ్లు రావడంతోటే మా మీద దాడికి దిగారు. ఇద్దరు సురేశ్‌ను కొడుతున్నారు. మూడో అతను నా ఒంటిపై ఉన్న నగలు ఇవ్వాలని బెదిరించాడు. నేను ఇవ్వను అనడంతో దగ్గరున్న బీరు సీసాలతో బాగా కొట్టాడు.మరొకడు పగిలిన బీరుసీసాతో నన్ను పొడిచాడు. అంతే నాకు మైకం కమ్మేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు.’చాలా అనుభవం ఉంది ఇన్స్పెక్టర్కు. ఆమె చెప్పింది అబద్ధం అనిపించలేదు.ఆమె భర్తకు స్పృహ వస్తే ఇంకొంత సమాచారం తెలుస్తుందనిపించింది.ఎనిమిది గంటలప్పుడు భర్తకు స్పృహ వచ్చింది.ఇన్స్పెక్టర్ మాట్లాడితే భార్య చెప్పిందే అటు ఇటూగా చెప్పాడు. అదనంగా ఏమీ తెలియడం లేదు. ఈ కేస్‌ని ఛేదించాలంటే క్లూ ఏమిటి? ఉదయం పదిన్నరకు రాత్రి ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చాడు.‘సారీ... కొంచెం లేటయ్యింది. ఇప్పుడే వాళ్లను చూసి వస్తున్నాను. దే ఆర్ వెల్. బయటపడిపోయారు’ ‘క్లూ ఏమీ దొరకడం లేదు డాక్టర్. మీకేం అనిపి స్తోంది’‘అనిపించేది ఏముంది బ్రూటల్ ఎటాక్. నగల కోసమో మరెందుకో అయి ఉండాలి. రేప్ అటెంప్ట్ మాత్రం లేదు’‘అదే అనుకున్నాను. కాని ఆమె కళ్లు తెరుస్తుందనుకోలేదు. ఉదయానికి స్పృహ వచ్చింది.ఆమెకు వచ్చాకే అతనికి వచ్చింది’‘వాట్? అంతేం లేదే. అతనికి రాత్రే స్పృహ రావాలే.’ అన్నాడు డాక్టర్.‘అవునా?’‘హెడ్ ఇంజ్యురీ ఏమీ లేదు కదా ఆఫీసర్. పైదెబ్బలు మాత్రమే తగిలాయి. అతడికి రాత్రే స్పృహ వచ్చి ఉండాలి’.ఇన్స్పెక్టర్ తల పంకించాడు. సురేశ్ కాల్‌డేటాలో లాస్ట్ కాల్ నాగబాబు అని ఉంది.ఎంక్వయిరీ చేస్తే అది సురేశ్ తమ్ముడి వరుసయ్యే వ్యక్తిది. క్యాజువల్ కాల్ కావచ్చు. ఎందుకైనా మంచిదని నాగబాబును పట్టుకొచ్చారు పోలీసులు. అతడు బాగా భయపడిపోయాడు.‘సార్ నాకేం తెలియదు. నేనసలు ఊళ్లోనే లేను. ఊరికే కాల్ చేశాను. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కుందామని. అంతే’ అన్నాడు.ఇన్స్పెక్టర్ తల ఆడించి ‘సరే వెళ్లు’ అనబోయి మళ్లీ ఆగాడు. సురేశ్ కాల్‌డేటాలో ఉన్నది ఔట్ గోయింగ్. ఇతనేమో తనే ఫోన్ చేశాను అంటున్నాడు.‘ఒక్క నిమిషం’ అని ఆపాడు ఇన్స్పెక్టర్.ఆ తర్వాత కానిస్టేబుల్ వైపు తిరిగి ‘లాఠీ తీసుకురా’ అన్నాడు. ‘సార్... పెళ్లికి ముందే సురేశ్‌కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. కాని పెద్దవాళ్లు బలవంతం చేశారని మరదలిని పెళ్లి చేసుకున్నాడు. కాని మొదటి అమ్మాయిని వదులుకోలేకపోయాడు. ఇంకో వైపు అతనికి అప్పులున్నాయి. వీటన్నింటి నుంచి బయటపడటానికి భార్యను చంపేయడమే కరెక్ట్ అని నన్ను కాంటాక్ట్ చేశాడు’ అన్నాడు నాగబాబు.‘ఏంటి ప్లాన్’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘మొదట కిరాయి హంతకులతో హత్య చేయించాలని పథకం వేశాడు. కాని వాళ్లు ఎక్కడ ఉంటారో తెలియలేదు. అందుకని నన్ను కలసి ఈ పని చేస్తే యాభై వేలు ఇస్తానని చెప్పాడు. నేను గోకవరం దగ్గర కొత్తపల్లి సమీపంలోని ఏజన్సీ ప్రాంతానికి చెందిన ఇంకో ఇద్దరిని కలుపుకున్నాను’‘వాళ్లకు ఎంతిస్తానన్నావు?’‘మనిషికి 1500’‘తర్వాత’‘సురేశ్ ముందే నిర్ణయించుకున్న విధంగా భార్యను టౌన్లో సినిమాకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత బీచ్‌కు తీసుకు వచ్చాడు. అక్కడ ఒక చోట బండి ఆపుతానని వెంటనే దాడి చేసి భార్యను హత్య చేయాలని, ఎవరికీ అనుమానం రాకుండా తనపై కూడా స్వల్పంగా దాడి చేయాలని, అలాగే ఆమె వేసుకున్న నగలు తీసి తనకు ఇవ్వాలని సురేశ్ మాకు ముందే చెప్పాడు. సరే అన్నాం. రాత్రి 9 గంటల సమయంలో కొత్తపల్లి మండలం శొంఠివారిపాకలు సమీపంలోకి వచ్చే సరికి యూరిన్ విషయం చెప్పి బండిని ఓ వైపుగా ఆపిన సురేశ్ పొదల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మాకు కాల్ చేసి చెప్పడంతో ఫాలో అయ్యి బండి దగ్గర నుంచుని ఉన్న జయపై ఒక్కసారిగా అటాక్ చేశాం. అప్పటికే బీరు తాగుతున్నాం.బాటిల్స్ చేతిలో ఉన్నాయి. నేను ఆ సీసాను పగలగొట్టి ఆమెను పొడిచాను. జయ స్పృహæతప్పి పడిపోవడంతో చనిపోయిందనుకుని, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఉంగరాలు, కాళ్లపట్టీలు లాక్కున్నాం. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ ప్రకారం సురేశ్ మెడలో ఉన్న చైన్ కూడా లాక్కొని అతడి ఒంటిమీద బీరు సీసాలతో అక్కడక్కడా చిన్న చిన్న గాట్లు పారిపోయాం’ అని ముగించాడు నాగబాబు.నేరం దాగదు. క్లూ తప్పక పట్టి ఇస్తుంది. క్లూ కథనాలు పంపండి రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com – వీఎస్‌వీఎస్ వరప్రసాద్. సాక్షి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. -
నా భర్త మృతికి వారే కారణం
చీపురుపల్లి: ఎస్సై కాంతికుమార్, ఎంపీడీఓ రామకృష్ణల తీరు కారణంగానే తన భర్త తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందాడని రామలింగాపురం గ్రామానికి చెందిన అప్పలనరసమ్మ ఆరోపించింది. ఈ మేరకు భర్త మృతదేహంతో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద గ్రామస్తులతో కలసి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లాన పైడితల్లి ఆదివారం మృతి చెందాడు. అయితే పైడితల్లి ఎస్సై, ఎంపీడీఓ వేధింపుల వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి భార్య అప్పలనరసమ్మ, కుమారుడు నాగరాజు మాట్లాడుతూ, జనవరి నెలలో ఎంపీడీఓ తమ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులపై కేసు పెట్టారని.. అందులో ఎలాంటి సంబంధం లేని పైడితల్లిపై కూడా కేసు పెట్టారన్నారు. కేసు పెట్టడంతో పైడితల్లి మనస్తాపానికి గురై అకాల మరణం చెందాడని చెప్పారు. ఇటీవల కొద్దిరోజులుగా ఇంటికి పోలీసులు రావడంతో ఆయన తట్టుకోలేకపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన రోజున పైడితల్లి ఓ ఆదర్శ వివాహంలో ఉన్నారని.. అయినప్పటికీ ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎస్సై కాంతికుమార్, ఎంపీడీఓ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు గేదెల లక్ష్మణరావు మాట్లాడుతూ, గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇదే విషయమై ఎస్సై కాంతికుమార్ మాట్లాడుతూ, ఎంపీడీఓ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో మృతుడు పైడితల్లి ఉన్నాడో లేదో కూదా తమకు తెలియదని.. ఇంకా విచారణ కొనసాగుతోందని వివరించారు. -
నా భర్తను తెచ్చివ్వండి
కోలారు: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త అత్తమామలు వారి పాలిట విలన్లుగా మారి చిచ్చుపెట్టారు. తన భర్తను వెదికి ఇవ్వాలని కోరుతూ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం సాయంత్రం నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు ప్రతిఘటన నిర్వహించింది. తాలూకాలోని వక్కలేరి గ్రామానికి చెందిన అంబిక ఇలా నిరసన చేపట్టింది. తన మామ తన భర్తకు వేరే పెళ్లి చేసి తనకు దూరంగా ఉంచారని, తనకు, పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని బాధితురాలు విలపించింది. న్యాయం కోసం గత 8 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించింది. వక్కలేరి గ్రామానికి చెందిన మనోహర్, తాను గత 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని అత్తమామలు వ్యతిరేకించడంతో తాము వేరే కాపురం పెట్టామని చెప్పింది. తన భర్తకు తాగుడు మాన్పిస్తామని తెలిపి తననుంచి నెలల తరబడి దూరం చేశారని ప్రస్తుతం తన మామ తన భర్తకు వేరే వివాహం చేసి తన నుంచి దూరం చేశారని ఆరోపించింది. గత 8 రోజుల క్రితమే రూరల్ స్టేషన్లో తన భర్తను వెతికి ఇవ్వాలని ప్రతిఘటన నిర్వహించినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నానని తెలిపింది. తన భర్తకు తనపై లేనిపోని చాడీలు చెప్పి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలు కలిగిన తాను భర్తను వీడి ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించింది. తనకు భర్తను తెచ్చివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తన మామ రిటైర్డు ఏఎస్సై కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
చూసే కళ్లుంటాయ్..! స్వేచ్ఛగా వెళ్లమంటాయ్
‘నిర్భయ’ నుంచి నిధులు: ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ ‘సేఫ్ సిటీ’ ప్లాన్‌లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ బిబిఎమ్పి అధికారులు స్మార్ట్ ఐస్‌ను అమరుస్తున్నారు. ఇందుకోసం 667 కోట్ల నిర్భయ నిధులు మంజూరయ్యాయి. అవే కళ్లు... నిఘా కళ్లు... డేగ చూపులకంటే తీక్షణమైన చూపులు. ఈ మాటలన్నీ విలన్ని సూచిస్తుంటాయి. రాబోయే ప్రమాదానికి ఉపోద్ఘాతంలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఇక మహిళలకు ఫ్రెండ్లీ కళ్లు. ఆ చూపులు ఆడవాళ్లకు అన్నయ్యల్లాంటి చూపులు. ఆ చూపుల కింద ఆడవాళ్లు ధైర్యంగా నడిచి వెళ్లవచ్చు. అది అర్ధరాత్రయినా అపరాత్రయినా సరే! బెంగళూరు పోలీసు వ్యవస్థ చొరవతో రూపొందిన ‘చురుకైన కళ్ల’ ప్రోగ్రామ్ అది. పేరు.. ‘స్మార్ట్ ఐస్’ మహానగరంలో మహిళ బెంగళూరు అనగానే టెక్నాలజీ హబ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నగరం ఐటి అడుగులు నేర్చుకునేటప్పటికే బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగం వేళ్లూనుకున్నది. పొరుగు రాష్ట్రాల వలసలతో ఆ నగరం రోజు రోజుకీ విస్తరిస్తోంది. ప్రధానమైన రోడ్డు మీద ఎడమ నుంచి కుడివైపుకి వెళ్లాలంటే యు టర్న్ కోసం కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాంటి మహానగరంలో మగవాళ్లతోపాటు మహిళలు కూడా అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇరవై నాలుగ్గంటలూ షిఫ్టులుంటాయి. ఎవరి డ్యూటీ టైమ్‌కి వాళ్లు ఇళ్ల నుంచి బయలు దేరాలి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇళ్లకు చేరాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆపదలు, టీజింగ్‌లు ఎదురైనా సరే ఇట్టే పట్టేయడానికి వీలుగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది పాలన వ్యవస్థ. అర్ధరాత్రి అయినా సరే మిట్టమధ్యాహ్నమే అన్నంత ధైర్యంగా ఆడవాళ్లు సంచరించవచ్చు. మాయగాళ్లపై నిఘా! ఇప్పటికే ఉన్న ‘సురక్ష మిత్ర’ పథకంలో భాగంగా బెంగళూరు నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన హాస్పిటళ్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాలు... అన్నీ కలుపుకుని మొత్తం 4,500 ప్రదేశాల్లో పదివేల నిఘా కెమెరాలను అమరుస్తోంది బిబిఎమ్పి (బృహత్ బెంగళూరు మహానగర పాలికె). జేబుదొంగలు, ఆకతాయిలు, రౌడీషీటర్లు, ట్రాఫికింగ్‌కు పాల్పడే కరడుగట్టిన నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ ‘స్మార్ట్ ఐస్’ ఆలోచన రూపుదాల్చింది. రోజులో 24 గంటలూ ఈ కళ్లు పని చేస్తూనే ఉంటాయి. వీటిని ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టమ్’ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నగరంలో ఒక వ్యక్తి రోజూ ఒక రోడ్డు మీద ప్రయాణిస్తూ, అదే వ్యక్తి ఒక్కరోజు ఊహించని మరోచోట సంచరించినట్లయితే ఆ ‘మార్పు’ కూడా వెంటనే రికార్డు అవుతుంటుంది. అవసరమైతే కెమెరా బ్యాకప్‌తో విశ్లేషించడానికి సాధ్యమవుతుంది. అలా నగరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి మీద మూడో కంటికి తెలియకుండానే పోలీస్ నిఘా మొదలవుతుంది. – మను -
బాలికపై లైంగిక దాడి
కాచిగూడ: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాచిగూడ ఏసీపీ జోగుల నర్సయ్య వివరాల ప్రకారం.. కాచిగూడ కబే ళా ప్రాంతానికి చెందిన బాలిక (17) చాదర్ ఘాట్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెం దిన నాగరాజు కుమారుడు అఖిలేష్ (19) బ్యాండ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడున్నాడు. బాలిక గర్భం ధరించడంతో పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు అఖిలేష్‌ను అడగగా తనకు సంబంధంలేదంటూ దుర్భా షలాడాడు. శుక్రవారం రాత్రి సదరు బాలి కకు రక్తస్రావమైంది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న బాలిక ఫిర్యాదు మేరకు అఖిలేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.సత్యనారాయణ తెలిపారు. అఖిలేష్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రాత్రయితే చాలు స్టేషన్లలో గాజుల మోతలు..
దందాలు... ఇసుకదోపిడీలు... సెటిల్ మెంట్లు... ఇవీ ఇప్పటివరకూ చాలా వరకూ జిల్లాలోని పోలీసులపై ఉన్నఅపవాదు. కానీ రాత్రయితే చాలు స్టేషన్లలో గ్లాసుల గలగలలు... గాజుల మోతలు వినిపిస్తాయని తాజాగారుజువైంది. పోలీస్ శాఖలో ఉన్నకొద్దిమంది బాధ్యతారాహిత్యం ఏకంగాఆ శాఖకే మచ్చతెస్తోంది. క్రమశిక్షణకొరవడి... విచక్షణ కోల్పోయి...అవకాశంగా వచ్చిన ఉద్యోగానికే ఎసరుపెట్టుకుంటున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎవరైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు పనులు చేసి సర్వీసు కే మచ్చతెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే మందు కొట్టి చిందులేస్తున్నారు. దత్తిరాజేరు మండలం, పెదమానా పురం పోలీస్ స్టేషన్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరువు మరో సారి రోడ్డున పడింది. గాడి తప్పిన ఏడుగురిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. చాలాచోట్ల పగలంతా సెటిల్మెంట్లు, మామూళ్లు అంటూ బిజీగా గడిపి, చీకటి పడగానే పోలీస్ స్టేషన్లనే బార్లుగా మార్చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రియురాళ్లను తీసుకువచ్చి తమ సీటులోనే కూర్చోబెట్టుకుంటున్నారు. అసలేం జరిగింది ఈ నెల 9వ తేదీ రాత్రి పెదమానాపురం ఎస్ఐ నాయుడు విధులు ముగించుకుని రాత్రి డ్యూటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లగానే స్టేషన్లో ఉన్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్‌గార్డులు కలిసి ఆ రాత్రి మద్యం తెచ్చుకుని పీకలదాకా తాగి, కడుపునిండా బిర్యానీ తిని అక్కడే ఒళ్లు మరిచి చిందులేశారు. ఇదంతా గమనించిన అజ్ఞాతవ్యక్తులు వారి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పోలీసుల బాగోతం అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టి జిల్లా ఎస్పీ జి.పాలరాజు దృష్టికి వెళ్లింది. వెంటనే స్టేషన్లో జరిగిన దానిపై వాస్తవాలను తెలుసుకోవాలని విచారణ నిమిత్తం ఒక అధికారిని పంపించారు. ఆయన వెళ్లి వీడియో చూసిందంతా నిజమేనని తేల్చి నివేదిక ఇచ్చారు. వెంటనే ఆ ఏడుగుర్నీ ఏఆర్‌కి అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా వారిలో ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇలాంటోళ్లు ఇంకా ఉన్నారు జిల్లాలో పోలీసులు సేవలు, సందేశాలు అంటూ ఓ వైపు ప్రచారంలో నిలుస్తూనే తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎస్‌కోట పరిధిలో ఓ కుర్ర ఎస్ఐ అయితే ఏకంగా తన ప్రియురాలిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని తన సీటులోనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారనే ఆపోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అతని వద్ద ప్రస్తావిస్తే నా లవర్ని నా సీటులో కూర్చోబెట్టుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం పట్టణంలో అయితే ఓ అధికారి సిబ్బందికి నెల నెలా ఎంతివ్వాలో ఫిక్స్ చేసి మరీ వసూలు చేసుకుంటున్నారని డిపార్ట్మెంట్ కోడై కూస్తోంది. ఇటీవల అతని ఇంట్లో ఓ శుభకార్యం జరిగితే బలవంతంగా భారీ మొత్తంలో కానుకలు దండేశారంట. ఆరుగంటలకే మొదలు పోలీస్ స్టేషన్లలో మద్యం సేవించడం సర్వసాధారణమని ఓ పోలీస్ అంటున్నారు. పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఆయన ‘రాత్రి వరకూ అవసరం లేదు, సాయంత్రం ఆరుదాటాకే మా వాళ్లు స్టేషన్లో మందు తాగడం మొదలెట్టేస్తారు. ముద్దాయిలు ఉంటే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మెన్ ఉంటారు. వారు రాత్రి గడవడానికి ముద్దాయి డబ్బులతోనే మద్యం, విందు చేసుకుంటుంటారు. ఆదివారం అయితే చెప్పక్కర్లేదు. ఆ రోజు పండగే. ముఖ్యంగా ఏఆర్ గార్డులుగా పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఇలా చేస్తుంటారు. వారితో పాటు కానిస్టేబుళ్లు జతకలుస్తుంటారు.’ అని చెప్పుకొచ్చారు. తప్పు ఎవరు చేసినా తప్పే పెదమానాపురం వ్యవహారం మా దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టాం. నిజమని తేలడంతో శాఖాపరంగా చర్యలు చేపట్టాం. ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ రిమూవ్ చేశాం. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హెచ్సీలపై సస్పెన్షన్ వేటు వేశాం. ఎక్కడైనా ఎటువంటివి జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. పోలీస్ సిబ్బంది ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే సహించేది లేదు. – జి.పాలరాజు, జిల్లా ఎస్పీ, విజయనగరం. -
పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పెందుర్తి: సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేయని నేరాన్ని అంగీకరించాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి చేయడమే ఘటనకు కారణంగా తెలుస్తుంది. పోలీస్‌స్టేషన్‌లోని కిటికీ అద్దాన్ని పగలగొట్టిన బాధితుడు(నేరారోపిత వ్యక్తి) అదే అద్దంతో పీక కోసుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సబ్బవరం మండలం చినగొల్లలపాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ వివాహంలో జరిగిన చోరీ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు బాధితుని వాగ్మూలం ప్రకారం ఇలా ఉన్నాయి. సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన చీపురపల్లి రాజశేఖర్ నాయుడుతోట సమీపంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 10న సబ్బవరం మండలం చినగొల్లలపాలెంలో తన స్నేహితుడు పల్లా రాజేష్ వివాహానికి ఉదయం, సాయంత్రం హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి భోజనం అనంతరం వివాహం నుంచి అమృతపురంలోని తన ఇంటికి వచ్చిన రాజశేఖర్ కాసేపటి తరువాత నాయుడుతోటలో తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లిపోయాడు. పోలీసుల నుంచి కబురు మరుసటి రోజు(ఆదివారం) విధులకు హాజరైన రాజశేఖర్‌కు ‘ఓ భూ తగదాలో నీ మీద కేసు ఉంది..దానిపై విచారణకు హాజరు కావాలని’ సబ్బవరం పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన అతడు వెంటనే స్టేషన్‌కు వెళ్లగా ‘నువ్వు నిన్న పెళ్లిలో దొంగతనం చేశావు.. నీ మీద పెళ్లింటివారు కేసు పెట్టారు’ అని ఎస్ఐ వివరించాడు. దీంతో తాను ఎటువంటి చోరీ చేయలేదని రాజశేఖర్ చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. నేరం అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారు. రాజశేఖర్ నేరం ఒప్పుకోకపోవడంతో ఆ రోజంతా పోలీస్‌స్టేషన్‌లోనే అతడ్ని ఉంచారు. ఎస్ఐల ఓవరాక్షన్ ఈ క్రమంలో సోమవారం సబ్బవరం ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, భోగాపురం ఎస్ఐ మహేష్(పల్లా రాజేష్‌కు బంధువు), గాజువాక పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్(రాజేష్‌కు పరిచయస్తుడు) నేరాంగీకారం కోసం రాజశేఖర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నేరం ఒప్పుకోకపోతే గంజాయి కేసులో ఇరికిస్తానని ఎస్ఐ మహేష్ తనను బెదిరించినట్లు రాజశేఖర్ వివరించాడు. నేరం ఒప్పుకోమని పోలీసులు తనను తీవ్రంగా హింసించారని ఆరోపించాడు. తనకు ఎటువంటి నేర చరిత్ర లేదని..కేవలం పెళ్లింటివాళ్లు కక్షపూరిత ఆరోపణలు.. కేసుతో సంబంధం లేని ఎస్ఐ మహేష్ ఓవరాక్షన్ కారణంగానే తనకు దిక్కుతోచలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని వాగ్ములంలో పేర్కొన్నాడు. అంతా గోప్యత: సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై పోలీసులు నోరు మెదపడం లేదు. వాస్తవానికి పెళ్లింటిలో చోరీ జరిగినట్లు వరుడు రాజేష్ బంధువులు నోటిమాటతోనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణ మీద రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాజేష్ బంధువైన ఎస్ఐ మహేష్ తనకు సంబంధం లేని కేసులో ఓవరాక్షన్ ప్రదర్శించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్ పోలీస్‌స్టేషన్‌లోనే గొంతు కోసుకున్నాడు. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన పోలీసులు బాధితుడ్ని సోమవారం పోలీస్ వాహనంలోనే సబ్బవరం పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై సబ్బవరం ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా తమకు ఎటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, రాజశేఖర్‌ను తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. -
సోదరి ప్రేమ పెళ్లి.. అన్న ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి: ఓ యువకుడు భిక్కనూరు పోలీసుస్టేషన్లో బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా, ఈ పెళ్లిని ఒప్పుకోనంటూ అమ్మాయి సోదరుడు ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా ఉత్కంఠ రేపింది. అసలేం జరిగిందంటే.. భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన భూమని నర్సింహులు, అదే గ్రామానికి చెందిన జోగు అవంతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో బుధవారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని భిక్కనూరు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వారిద్దరు మేజర్ కావడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, ఈ పెళ్లికి తాను ఒప్పుకోనంటూ అవంతి సోదరుడు రాజు ఠాణా నుంచి బయటకు వచ్చి విష గుళికలు మింగాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
వైరారూరల్: మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన సట్టి రామకృష్ణ, బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు.. తనను రామకృష్ణ వేధిస్తున్నాడంటూ రెబ్బవరం గ్రామస్తురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అతడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనతోపాటు తెచ్చుకున్న పురుగు మందును తాగాడు. పోలీసులు గమనించి, వెంటనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
యువకుడిని బలిగొన్న పోలీసు వాహనం
సుజాతనగర్ : గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆటోను పోలీసుల వాహనం ఢీకొంది. యువకుడిని బలిగొంది. కొణిజర్ల మండలానికి చెందిన ముండ్లగిరి కిశోర్(23), యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, ముత్తమాల కిశోర్, కాసిమల్ల రాజేష్.. ఎయిర్టెల్ కంపెనీలో ఇన్స్టాలేషన్ పనులు చేస్తుంటారు. ఇదే పనిపై ఈ నెల 17న భద్రాచలం వెళ్లారు. 22వ తేదీన పని ముగించుకున్నారు. అదే రోజు రాత్రి 9.00 గంటల సమయంలో ఆటోలో కొణిజర్లకు బయల్దేరారు. సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామ సమీపంలోగల అయ్యప్ప టెంపుల్ వద్ద వీరి ఆటోను, ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ప్రయాణిస్తున్న పోలీసు వాహనం (టాటా సుమో, టీఎస్09 పీఏ1538) ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న కొణిజర్ల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ముండ్లగిరి కిశోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్తమాల కిశోర్, యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, కాసిమల్ల రాజేష్‌ను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. వీరిలో తంబళ్ళ అశోక్, యామాల ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగ్రాతుల నుంచి వివరాలను సుజాతనగర్ ఎస్సై ఇ.రతీష్ సేకరించారు. టాటా సుమో డ్రైవర్ ఉప్పర శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ముండ్లగిరి వెంకటేశ్వర్లు–భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నవాడైన కిశోర్, గత మూడు నెలలుగా ఎయిర్టెల్ టవర్ పనులు చేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. -
పోలీసు స్టేషన్లో ఆత్మహత్యాయత్నం
సామర్లకోట: రెండో భార్య పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన భర్త పోలీసు స్టేషన్ ఆవరణలోనే మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన చెల్లూరి దుర్గా ప్రసాద్ నాలుగేళ్ల క్రితం తణుకుకు చెందిన పూజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పూజిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ తరుణంలో దుర్గాప్రసాద్ కాకినాడలో మకాం పెట్టాడు. కారు డ్రైవరుగా తిరుగుతున్న సమయంలో సామర్లకోటకు చెందిన మీనాక్షితో ఏడాది క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు జరిగిన మొదటి వివాహం విషయాన్ని దాచిపెట్టాడు. ఇటీవలే ఆ విషయం తెలుసుకున్న మీనాక్షి సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మొదటి భార్య పూజిత, దుర్గ ప్రసాద్‌లను స్టేషన్‌ను తీసుకువచ్చారు. అయితే పోలీసు స్టేషన్లోనే మీనాక్షితో ఎందుకు ఫిర్యాదు చేశావని వాదనకు దిగాడు. ఆ వాదన పెద్దది కావడంతో దర్గాప్రసాద్ బ్లేడుతో మెడ కోసుకున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వెంటనే దుర్గప్రసాద్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్సై శ్రీనివాసు నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ సిబ్బందికి తీపికబురు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన యూనిఫాం అలవెన్స్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం విడుదల చేశారు. ప్రస్తుతం సిబ్బందికి ఏడాదికి రూ.3,500 యూనిఫాం అలవెన్స్ చెల్లిస్తున్నారు. సీఎం నిర్ణయంతో ఇక నుంచి రూ.7,500 చెల్లించనున్నారు. అలవెన్స్ పెంచడంపై పోలీస్ సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడేందుకు కృషిచేసిన డీజీపీతో పాటు ఇతర అధికారులకు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. పోలీస్ శాఖలోని గ్రేహౌండ్స్, స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాల్లో పనిచేస్తున్న సిబ్బంది మినహా మిగతా వారు పెంచిన యూనిఫాం అలవెన్స్‌ను పొందనున్నారు. -
విడ్డూరం.. హోంమంత్రికి దారివ్వలేదని
సాక్షి, ముమ్మడివరం : తూర్పు గోదావరి ముమ్మడివరం పోలీసులు అత్యుత్సాహం చూపారు. స్వామి భక్తిని నిరూపించుకొనే పని చేశారు. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా.. పోలీసుల అనుకుంటే కేసుల కొదవా అన్నట్లు ముమ్మడివరం పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బస్సును పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే. ఏం జరిగిందంటే.. హోంమంత్రి చిన రాజప్ప జిల్లా పర్యటన నిమిత్తం కాన్వాయ్ కాకినాడ - అమలాపురం మార్గంలో వెళ్తోంది. అదే మార్గంలో నాన్‌స్టాప్ సర్వీస్ ఆర్టీసీ బస్ వెళ్తోంది. రోడ్డులో ఇతర వాహనాలు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ డైవర్ హోంమంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేక పోయారు. అంతే హోంమంత్రి దగ్గర స్వామి భక్తి నిరూపించుకొనే అవకాశం వచ్చిందనుకున్నారో ఏమో, ఆర్టీసీ బస్సును ముమ్మడివరం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి దారి ఇవ్వలేదంటూ బస్సును పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. తాము ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో ఉన్న నాయకులు, ప్రజలను ఇలా ఇబ్బందుల పాలు చేయడం ఏంటని మండిపడ్డారు. -
ఒక్కసారి నా భర్తను చూపండి సార్ !
ధర్మవరం అర్బన్ : ‘నా భర్తను ఒక్క సారి చూపించండి సార్. నా భర్తను మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇంత వరకు ఎక్కడున్నాడో తెలియలేదు. నా భర్తకు గుండెజబ్బు ఉంది. రోజూ 5 మాత్రలు మింగాలి. నాకు ఐదుగురు పిల్లలు. తండ్రిని చూడాలని పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ధర్మవరం, కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి ఇలా అన్ని పోలీస్స్టేషన్లకు తిరుగుతున్నా నా భర్త ఏ స్టేషన్లో ఉన్నాడో పోలీసులు చెప్పలేదంటూ పట్టణంలోని బోయవీధికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులు భార్య వేదవతి కన్నీటి పర్యంతమైంది. తీవ్ర మనస్థాపంతో అనారోగ్యానికి గురైన వేదవతి శనివారం రాత్రి ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త , వైఎస్సార్సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులును మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. బాంబుదాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉపేంద్రను ఎవరో వెంబడించారని పోలీసులు తన భర్తను తీసుకెళ్లారు. తన భర్తతో ఒక్కసారి మాట్లాడించాలని పోలీసుల కాళ్లు పట్టుకుంటే చివరికి శనివారం సాయంత్రం ఫోన్లో మాట్లాడించారని చెప్పింది. ఫోన్లో తన భర్త చాలా బాధగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెడుతున్నారని, ఏ స్టేషన్లో పెట్టారో చెప్పకుండా పోలీసులు నరకయాతన పెడుతున్నారని వాపోయింది. తన భర్తకు ఏమైనా జరిగితే పిలలతో పాటు తాను కూడా అనాథలమవుతామని పేర్కొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో నాగుపాము పట్టివేత
రామనగర(దొడ్డబళ్లాపురం): కనకపుర పట్టణ పోలీసులకు చెమటలు పట్టించిన నాగుపాము ఎట్టకేలకు పట్టుబడింది. రెండు రోజుల క్రితం పెద్ద నాగుపాము ఒకటి పట్టణ పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో, స్టేషన్‌లోపల తిరుగుతూ సిబ్బందికి చెమటలుపట్టించింది. చివరకు కాంపౌండ్‌లోని చిన్న కలుగులో దూరింది. అప్పుడప్పపుడూ వచ్చి కనిపించి వెళ్తోంది. దీంతో పోలీసులు శుక్రవారం పాములు పట్టే పునీత్ అనే వ్యక్తిని రప్పించారు. అతను చాకచక్యంగా పామును బంధించాడు. పామును శివనహళ్లి సమీపంలోని అడవిలో వదిలేస్తామని పునీత్ తెలిపాడు. -
పోలీస్ స్టేషన్లకు హద్దుల్లేవ్!
ఏదైనా నేరం జరిగితే బాధితులు ఫిర్యాదు చేసేందుకు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళతారు. అయితే అత్యధికులకు ఎదురయ్యేది స్టేషన్ల పరిధి సమస్య. నగరంలో మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 60, సైబరాబాద్‌లో 36, రాచకొండలో 42 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా ఒకటే అయినా.. సాంకేతికంగా వేర్వేరు ప్రాంతాలు. ఒకే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వేర్వేరు పోలీసుస్టేషన్ల పరిధిలోకి వస్తుంటాయి. సరిహద్దుల్లో నేరం జరిగితే ఎవరి పరిధిలోకి వస్తుందో తేలక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై ఏ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే. సాక్షి, సిటీబ్యూరో: ఏదైనా నేరం బారినపడిన బాధితులు తమకు జరిగిన అన్యాయం, ఎదురైన సమస్యలపై స్పందించమంటూ సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు పరిగెడతారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రాంతం సదరు ఠాణా పరిధిలోకి రాకుంటే... మరో ఠాణాకు వెళ్లమంటూ అధికారులు పంపిస్తుంటారు. ఇకపై కీలకాంశాల్లో ఇలా చేయడానికి కుదరదు. శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన అంశాలపై సమాచారం/ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధులతో సంబంధం లేకుండా స్పందించాల్సిందే. ఈ మేరకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించిన అధికారులు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫస్ట్‌లాన్సర్ ఉదంతంతో కదిలి.. ఇటీవల హుమయూయున్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఓ ఉదంతం జరిగింది. రెండు అల్లరి మూకల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన ప్రాంతం హుమయూన్ నగర్, బంజారాహిల్స్ ఠాణాల పరిధుల మధ్య ఉంది. దీంతో కొంత గందరగోళం ఏర్పడి పోలీసుల రాక ఆలస్యమైంది. దీన్ని ఉన్నతాధికారులు తీవ్రంగాపరిగణించారు. ఇకపై అలా కుదరదంటూ.. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో ఇకపై సరిహద్దులు, పరిధులు పట్టించుకోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రాథమికంగా ఎవరికి సమాచారం వస్తే వారు తక్షణం స్పందించాలని, ఘటనాస్థలికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాతే పరిధుల విషయం చర్చించాలంటూ ఎస్ఓపీ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈ పరిధుల అంశంలో ఇకపై సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నాం. మరోపక్క ఆక్టోపస్ కమాండోల మోహరింపు విషయంలోనూ కీలక మార్పులు చేశాం. ఇప్పటి వరకు ఆక్టోపస్ కమాండోలు ఏదో ఒక ప్రాంతంలో స్టాండ్ బైలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలా ఓ చోట ఉండటానికి బదులు నగరంలోకి కీలక ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో మోహరించాలని డీజీపీ నిర్ణయించారు. అందులో భాగంగానే గురువారం అసెంబ్లీ, సెక్రటేరియేట్స్ వద్ద వీరిని మోహరించాం. ఇకపై ప్రతి రోజూ వ్యూహాత్మకంగా వీరిని మోహరించనున్నాం’ అని తెలిపారు. ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 సిటీ సెంటర్ వైపు బంజారాహిల్స్ ఠాణా పరిధిలోకి, రోడ్డుకు ఇటున్న కేర్ ఆస్పత్రి ప్రాంతం పంజగుట్ట స్టేషన్ పరిధిలోకి వస్తాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో కోణార్క్ థియేటర్ రోడ్డుకు ఓ వైపు రాచకొండ కమిషనరేట్లోది కాగా, మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్లోనిది. ఇలాంటి చోట్ల నేరం జరిగితే సరిహద్దుల సమస్య తలెత్తుతుంది. -
ఆర్డర్ టు సర్వ్ బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పనిచేస్తున్న పోలీసుల బదిలీలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో తాత్కాలిక పద్ధతిలో కేటాయించిన పోలీస్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఏడాదిగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు ఊరట లభించినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అన్నిశాఖల్లో పాత జిల్లాల పరిధిలోని ఉద్యోగులను విభజించి ఆర్డర్ టు సర్వ్(తాత్కాలిక) పద్ధతిలో కొత్త జిల్లాలకు కేటాయించింది. పోలీసుశాఖ కూడా ఇదే పద్ధతిని అమలు చేసింది. కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు తాత్కాలికంగానే కేటాయించారు. అప్పటి నుండి శాశ్వత బదిలీల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆర్డర్ టు సర్వ్ విధానం వల్ల పోలీసుశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ ఏడాదిన్నరగా ఆగిపోయింది. పదోన్నతులు ఇవ్వాలంటే సీనియారిటీతోపాటు ఆ జిల్లాల్లో ఖాళీలుండాలి. ఇవి తాత్కాలిక కేటాయింపులు కావడంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో ఖచ్చితమైన లెక్కలులేవు. దీంతో కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కేటాయించిన పోలీసు సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి అప్పగించాలని హోంశాఖ ముఖ్యమంత్రిని కోరింది. పోలీస్‌శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్డర్ టు సర్వ్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయసలహా తీసుకున్నారు. దరఖాస్తు చేసుకుంటేనే... ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాత్కాలిక పద్ధతిలో కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీల కోసం డీజీపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో కొత్త జిల్లాల్లో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐల బదిలీలకు పదోన్నతులకు లైన్ క్లియరైంది. కొత్త జిల్లాల కేటాయింపుల విషయమై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా వచ్చే పోస్టులను పాత జిల్లాల ఎస్పీలకు కేటాయిస్తారు. పాత హెడ్ క్వార్టర్లో ఉన్న అధికారి ఆ జిల్లా పరిధిలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకు పోస్టులను కేటాయించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
టిప్‌టాప్‌గా.. ఠాణా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌ను పంజగుట్టలా మోడల్ పోలీస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌లో భాగంగా 700 పోలీస్స్టేషన్లను ఆధునీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు దశలుగా స్టేషన్ల ఆధునీకరణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాల పర్యటన, పోలీస్స్టేషన్లు, వాటి పరిస్థితులు, సదుపాయాలపై డీజీపీ అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. ఒక్కో స్టేషన్‌కు రూ.15 లక్షలు.. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని స్టేషన్లను ఇప్పటికే ఆధునీకరించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్, వెయిటింగ్‌హాల్, అడ్మిన్ అధికారి, సిబ్బంది, ఎస్ఐలకు క్యాబిన్లు, ప్రత్యేక విశ్రాంతి బ్యారక్‌లు, మహిళా సిబ్బందికి ప్రత్యేకమైన విశ్రాంతి గదులు నిర్మించాలని భావిస్తున్నారు. ప్రతి ఫైలు, కేసు షీటు, పెండింగ్ కేసులను విభజించి భద్రపరిచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం, బాధితులకు మౌలిక సదుపాయాలు, కౌన్సెలింగ్ సెంటర్ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ఇందుకు ఒక్కో స్టేషన్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అవసరం అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్ దాడి
బారాముల్లా, కశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. బారాముల్లా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో స్టేషన్ ధ్వంసమైనట్లు సమావేశం. కశ్మీర్‌లోని పోలీస్ స్టేషన్లపై గత 24 గంటల్లో గ్రనేడ్ దాడి జరగడం ఇది రెండోసారి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది. -
ఖల్ 'నాయక్స్' ..
ప్రొద్దుటూరు క్రైం : నేరాలను అరికట్టాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన రక్షక భటులే స్టేషన్లో మద్యం తాగి కొట్టుకుంటే ఏ శిక్ష విధించాలి.. ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీ తలబడ్డ సంఘటన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. కేకలు వేస్తూ వారి మధ్య ముష్టి యుద్ధం జరగడంతో దారిన వెళ్లే స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఒకానొక దశలో ఎస్ఐలు సర్దిచెప్పినా వారు వినిపించుకోలేదు. సుమారు 30 నిమిషాల పాటు వారి కేకలు, తిట్లతో స్టేషన్ పరిసరాలు మారుమోగిపోయాయి. స్టేషన్లో ఇద్దరు ఎస్ఐలు ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడం విశేషం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు దీనికి సంబం«ధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్లో చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. చంద్రానాయక్ ముఖ్యమైన కేసుల్లోని నిందితులను పట్టుకొని రావడం, చోరీ సొత్తు రికవరీ చేయడం చేస్తుంటాడు. ఈ కారణం చేతనే అతను అధికారులతో చాలా దగ్గరగా ఉంటాడని సిబ్బంది అంటున్నారు. దీంతో తమను లెక్కచేయడని హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వాపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆడకున్నా పలువురిని డబ్బు ఇమ్మని వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ ఉండగానే... మంగళవారం మధ్యాహ్నం అందరూ స్టేషన్లో ఉండగా చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్ గొడవ పడినట్లు తెలిసింది. వీళ్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘర్షణలో వెంకటేశ్వర్లు నాయక్‌కు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. డబ్బు పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగినట్లు కొందరు చెప్పగా, ఇంకొందరేమో ఇద్దరూ వరుసకు మామా అల్లుళ్లు కావడంతోనే తమాషాగా తిట్టుకున్నారని అంటున్నారు. ఈ సంఘటనపై స్టేషన్ అధికారులు ఎస్పీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మద్యం సేవించి స్టేషన్‌కు రావడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఇన్ని రోజులు సివిల్ డ్రస్‌లో ఉన్న చాంద్రానాయక్ అధికారుల ఆదేశాల మేరకు యూనిఫాంతో వచ్చాడు. ఇకపై స్టేషన్లోనే ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్ అధికారులు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మనస్పర్థల వల్లనే.. కానిస్టేబుళ్లు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారని వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. వారి గ్రామంలో ఉన్న మనస్పర్థల వల్ల స్టేషన్లో గొడవ పడ్డారన్నారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగే క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు బొటన వేలికి గాయం అయిందని, ఇద్దరిని మందలించినట్లు సీఐ వివరణ ఇచ్చారు. -
నిన్న హజ్ బిల్డింగ్.. నేడు పోలీస్ స్టేషన్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి సర్కార్ రాష్ట్రాన్ని కాషాయమయం చేస్తోంది. యూపీ లో యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకూ బుక్లెట్స్, స్కూల్ బ్యాగ్‌లు, టవళ్లు, కుర్చీలు, బస్సులకే పరిమితమైన కాషాయీ కరణ పోలీసు స్టేషన్లకు, హజ్ కార్యాలయాలకు చేరింది. తాజాగా లక్నోలో సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ పోలీసు స్టేషన్‌కు ఉన్న భవనం రంగును యోగి ప్రభుత్వం మార్చివేసింది. సాధారణంగా పోలీసు స్టేషన్లకు పసుపు, ఎరుపు రంగులు ఉంటాయి. కానీ, యోగి ప్రభుత్వం లేత కాషాయరంగును లక్నో పోలీసు స్టేషన్‌కు వేయించింది. గత ఏడాది సీఎం కార్యాలయం లాల్ బహుదూర్ శాస్త్రి భవన్‌కు, నిన్న లక్నోలోని హజ్ కార్యాలయం సరిహద్దు గోడకు యోగి ప్రభుత్వం కాషాయ రంగు వేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముస్లిం సంఘాలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి. -
పోలీస్ స్టేషన్‌కూ పులిమారు
సాక్షి, లక్నో : యోగి ఆదిత్యానాథ్ యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ర్టం క్రమంగా కాషాయరంగు పులుముకుంటున్నది. ఇటీవల హజ్ హౌస్‌ను కాషాయంతో అలంకరించిన పాలకులు తాజాగా రాష్ర్ట రాజధాని లక్నో పోలీస్ స్టేషన్‌కూ కాషాయ రంగు పులిమారు. బుక్లెట్లు, స్కూల్ బ్యాగులు, టవల్స్, కుర్చీలకు కాషాయం రంగు పూసిన సర్కార్ తాజాగా ఈ లిస్ట్‌లో స్ధానిక ఖైసర్ బాగ్ పోలీస్ స్టేషన్నూ చేర్చింది. 1939లో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకూ సంప్రదాయ పసుపు, ఎరుపు రంగుల్లోనే ఉండేది. అయితే ఇటీవల భవనంలోని పిల్లర్లు, కొంత భాగానికి కాషాయ రంగు వేశారు. పోలీస్ స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఈ రంగులు వేశామని, తీవ్ర చలి కారణంగా వర్కర్లు రాకపోవడంతో ఈ పనులు ఇంకా పూర్తికాలేదని ఇన్స్పెక్టర్ డీకే ఉపాధ్యాయ చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో సీఎం కార్యాలయం ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి భవన్‌కు కాషాయ రంగు వేశారు. యోగి ఆదిత్యానాథ్ సీఎం అయ్యాక రాష్ర్ట సచివాలయ ప్రాంగణానికీ కాషాయం కలర్ ఇచ్చారు. తన కార్యాలయంలోని తన సీటులో కాషాయ టవల్‌ను యోగి ఇష్టపడతారు. ఇటీవలే ఆయన 50 కాషాయ రంగులతో కూడిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. -
ఉరేసుకుని ప్రేమికుడు ఆత్మహత్య.. కలకలం!
సాక్షి, గుంటూరు: జిల్లాలోని రేపల్లె మండలంలో కలకలం చెలరేగింది. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని ఓ యువకుడు మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. ప్రేమ పేరుతో అతను ఓ మైనర్ బాలికను పెళ్ళి చేసుకున్నాడు. దీంతో ప్రేమికులిద్దరిని కౌన్సిలింగ్ నిమిత్తం పోలీసులు స్టేషన్‌ను తీసుకొచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తీవ్ర మనస్థాపనికి గురైన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రుంకి వెళ్లిన ఆ యువకుడు చాలాసేపు వరకూ తిరిగి రాకపోవడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి చూశారు. అతడు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడు రేపల్లె మండలం గుడికాయలంకకు చెందిన శ్రీనివాసరావు అని పోలీసులు తెలిపారు. -
పెద్ద మనుషులు.. చిన్న బుద్ధులు
‘మీకు.. దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి.’ అని ఒకరు.. ‘మీ వద్ద లాఠీలు ఉంటే.. మా వద్ద కట్టెలు ఉన్నాయి. పది నిమిషాలు సమయం ఇస్తున్నాం! ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు.’ అని మరొకరు.. ఇవే కాదు పత్రికల్లో రాయలేని దుర్భాషలు. ఏకంగా సీఐ ఛాంబర్లోకి వచ్చి అధికార పార్టీనేతలు సీఐని బెదిరిస్తే, దారుణంగా దూషిస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు మౌనం దాల్చారనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆ నేత ఊరు తాడిపత్రి. అదొక ప్రత్యేక సామ్రాజ్యం కాబట్టి. అక్కడ రెండే మాటలు. జీ హుజూర్ అనడమా? పెట్టేబేడ సర్దుకుని వెళ్లిపోవడమా? ఇంతటి అరాచక పరిస్థితుల్లో పోలీసుల మాటకు.. చేతలకు ‘పవర్’ ఉంటుందనుకోవడం పొరపాటే! సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అనంతపురం కార్పొరేషన్ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించలేదని మేయర్ స్వరూప విమర్శించారు. దీనిపై జేసీ అనుచరుడు శివనాయుడు అనే వ్యక్తి మేయర్‌కు, ఆయన భర్త వెంకటేశ్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి దుర్భాషలాడారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు గత నెల 21న తాడిపత్రి పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. జేసీ పీఏ, రవీంద్రారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్‌తో పాటు భారీ సంఖ్యలో స్టేషన్‌కు వెళ్లారు. తమ అనుచరున్ని ఎలా అదుపులోకి తీసుకుంటారని, గతంలో తాము ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని పోలీసులపై మాటల దాడి చేశారు. వారంతా తీవ్రంగా స్పందిస్తుంటే సీఐ, ఎస్ఐతో పాటు పోలీసులు సమాధానం చెప్పలేక మౌనంగా నిల్చుండిపోయారు. పోలీసుల మౌనాన్ని మరింత అలుసుగా తీసుకున్న జిలాన్ దుర్భాషలకు దిగారు. ఎమ్మెల్యే వస్తే పరిస్థితి చేదాటిపోతుంది.. 10నిమిషాలే సమయం ఇస్తున్నామని జేసీ పీఏ రవీంద్రారెడ్డి పోలీసులకు గడువు విధించే పరిస్థితి. సీఐ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని సీఐతో పాటు పోలీసు వ్యవస్థపైనా బూతుల వర్షం కురిసింది. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు అయింది. జేసీ అనుచుల స్థానంలో మరొకరు ఉంటే పోలీసులు లాఠీచార్జి చేసి, వారిపై కేసులు నమోదు చేసి నానా బీభత్సం సృష్టించేవారు. కానీ జేసీ అనుచరులు కావడంతో నిమ్మకుండిపోవడం గమనార్హం. తాడిపత్రిలో ఏ అధికారి వచ్చినా భయభ్రాంతులకు గురిచేసి తమ దారికి తెచ్చుకోవడం అక్కడి నేతల నైజం. గతంలో ఓ బ్యాంకు అధికారిణిపై కూడా దుందుడుకుగా వ్యవహరించడంతో ఆమె సెలవులో వెళ్లిపోయారు. గుత్తి మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి గ్రానైట్ మాఫియాకు అడ్డుగా నిలబడి కొరకరాని కొయ్యగా మారడంతో ఆయన్ను బదిలీ చేయించారు. ఇప్పడు భాస్కర్‌రెడ్డి అనే సీఐపై దుర్భాషలాడారు. తాడిపత్రిలోని అరాచకాలపై పత్రికల్లో కథనాలు రాస్తే విలేకరులను సైతం బెదిరించడం, భౌతికదాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. గతంలో ‘సాక్షి’ విలేకరి రాజశేఖర్‌ను తాడిపత్రిలో సజీవదహనానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ సీనియర్ విలేకరిని పిలిపించి మందలిస్తే ఆయన పత్రికలో మానేశారు. ఇప్పుడు రవికుమార్ అనే మరో విలేకరిపై కొందరు భౌతికదాడికి తెగబడ్డారు. ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా ఇక్కడ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడికి వచ్చేందుకు అధికారులు విముఖత చూపుతున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇలా అధికార వర్గాలను గుప్పిట్లో పెట్టుకుని, తాడిపత్రిలో తమ దారికి రాని వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టడం ఇక్కడి నేతలు చేసే రాజకీయం. ఉన్నతాధికారులు కూడా అక్కడి నేతలు సిఫార్సుల మేరకు తమ సిబ్బందిని నడిపించడం మినహా స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. తాజాగా పోలీసులపైనే దుర్భాషలాడినా ఎలాంటి చర్యలు లేవంటే.. జిల్లాలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోతున్నాయో అర్థమవుతోంది. ఉన్నతాధికారులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులకు భరోసా లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? స్టేషన్‌పైకి వచ్చి ఓ సీఐని దుర్భాషలాడి పదిరోజులు గడుస్తున్నా ఎస్పీ జోక్యం చేసుకుని కేసు నమోదు చేయలేదంటే జిల్లాలో పోలీసులు ఎంత నిస్సహాయులుగా ఉన్నారో ఇట్టే తెలుస్తోంది. సీఐల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటని చాలామంది ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డీఎస్పీలు, ఐపీఎస్ అధికారులు సీఐకి అండగా నిలవలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రూ.2.8 కోట్లతో పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ
పాతపట్నం: జిల్లాలో ఉన్న పలు పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడతున్నట్లు రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డీఈఈ బి.ఎస్.ఎస్.ఆర్.కె.సాయిబాబు తెలిపారు. స్థానిక కోర్టు కూడలిలో పశు వైద్యశాల భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, ఆమదాలవలస పోలీస్స్టేషన్లకు రూ.2.8కోట్లు నిధులు మంజురయ్యాయని, టెక్కలి పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. సోంపేట, రాగోలు, కళింగపట్నం, వీరఘట్టంలో పశువైద్యశాల భవనాలకు రూ.90లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. నరసన్నపేట, రణస్థలంలో రూ.4కోట్ల శాప్ నిధులతో రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు. పాత్రునివలస స్టేడియం పనులకు రూ.6కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఆయనతో పాటు ఏఈ టి.కోదండరామ్ ఉన్నారు. -
పోలీసులే పెద్దలు.. స్టేషనే కల్యాణ వేదిక
పొదలకూరు: ప్రేమించుకున్నారు..పెళ్లి వరకు వచ్చేసరికి యువకుడు ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీస్ అధికారులే పెద్దలుగా కౌన్సెలింగ్ ఇచ్చి.. పోలీస్‌స్టేషన్‌నే కల్యాణ వేదికను చేసి బుధవారం రాత్రి పెళ్లి చేశారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన శ్రీలతను పొదలకూరు మండలం అంకుపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కొప్పోలు సురేష్ రెండేళ్లుగా ప్రేమించారు. ఇటీవల శ్రీలత వివాహం చేసుకోమనడంతో సురేష్ ముఖం చాటేశాడు. దీంతో శ్రీలత పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై అల్లూరు జగత్సింగ్ ఒకటి, రెండు పర్యాయాలు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసినా వివాహానికి కానిస్టేబుల్ తరఫున వారు సమ్మతించలేదు. దీంతో చివరి కౌన్సెలింగ్‌ను సీఐ చేపట్టడంతో ఆయన ప్రయత్నం ఫలిచింది. కానిస్టేబుల్ సురేష్ శ్రీలతను వివాహం చేసుకునేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతం అయింది. వెంటనే సీఐ శివరామకృష్ణారెడ్డి సర్కిల్ కార్యాలయం వద్దనే ఉన్న వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో ఇద్దరిని ఒక్కటి చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో శ్రీలత, సురేష్ ఒక్కటై పూలదండలు మార్చుకున్నారు. అమ్మాయి తరఫున చెక్కా మదన్మోహన్, దార్ల రాజశేఖర్, తాటిచెట్ల రవీంధ్రబాబు, ఉక్కాల దామోదరం, నంబూరు కరుణాకర్ దగ్గరుండి వివాహం జరిపించారు. -
పాండి మరణం కేసులో మలుపు
సాక్షి, చెన్నై: తమిళ ఇన్స్పెక్టర్ పెరియ పాండి మరణం కేసు మలుపు తిరిగింది. ఆయనను దుండగులు కాల్చి చంపేశారంటూ తమిళ పోలీసుల బృందం రచించిన నాటకాన్ని రాజస్తాన్ రాష్ట్రం పాలి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. చెన్నై కొళత్తూరులోని ఓ నగల దుకాణం దోపిడీ కేసు ఛేదింపునకు రాజస్తాన్‌కు వెళ్లిన పోలీసుల బృందంపై దుండగులు కాల్పలు జరపడం, ఇందులో మదుర వాయిల్ ఇన్స్పెక్టర్ పెరియపాండి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఇది కట్టు కథగా పాలి పోలీసులు తేల్చారు. దుండగుడ్ని పట్టుకునే క్రమంలో మరో ఇన్స్పెక్టర్ మునిశేఖర్ తుపాకీ గురి తప్పడంతోనే పెరియపాండి మరణించినట్టు నిర్ధారించారు. తన తుపాకీ తీసుకుని దుండగుడు నాదూ రాం.. ఇన్స్పెక్టర్ పెరియ పాండిని కాల్చాడని మునిశేఖర్ పేర్కొనడంతో అనుమానమొచ్చిన పాలీ పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీని కాల్చింది మునిశేఖరే అని విచా రణలో తేలినట్లు పాలీ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 12న నాదూరాంను పట్టుకున్నప్పుడు పెరియపాండిపై దుండగుడి బంధువులు దాడి చేయగా, అతడిని రక్షించే క్రమంలో మునిశేఖర్ నాదూరాంకి గురిపెట్టి కాల్చిన తూటా గురి తప్పి పెరియపాండిని బలిగొనట్లు తేల్చారు. -
నేరాలు గంపెడు.. స్టేషన్లు గుప్పెడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, ఆ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల పోలీసు అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు, బందోబస్తు కష్టసాధ్యంగా మారింది. జిల్లా కేంద్రాల్లో పట్టణ ప్రాంత విస్తరణ, దానికి తగ్గట్టే నేరాల నమోదూ పెరగడంతో మూడింటినీ ఒకే ఇన్స్పెక్టర్ పర్యవేక్షించడం కత్తిమీద సాములా తయారైంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా గతేడాది కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని జిల్లా హెడ్క్వార్టర్లలో ఇప్పటికీ ఒకే స్టేషన్, మరికొన్నింటిలో ఎస్హెచ్ఓ ర్యాంకు అధికారిగా సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. దీంతో తీవ్రమైన నేరాలు జరిగినపుడు దర్యాప్తు చేయడం కష్టమవుతోంది. ఈ ప్రాంతాల్లో తప్పదు.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏటా 700–750 వరకు కేసులు నమోదువుతున్నాయి. అర్బన్ ప్రాంతం, పైగా జిల్లా కేంద్రం కావడంతో ఒకే స్టేషన్‌తో నేరాల దర్యాప్తు, శాంతి భద్రతల పర్యవేక్షణ ఇన్స్పెక్టర్కు కత్తిమీద సాములా మారింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ ఒకే స్టేషన్ ఉంది. పైగా ఎస్సై ర్యాంకు అధికారి స్టేషన్ ఇన్చార్జిగా ఉన్నారు. ఇక్కడ కూడా మరో స్టేషన్, ఇన్స్పెక్టర్ ర్యాంకు అ«ధికారి అవసరం ఉంది. ఇలా పలు జిల్లా కేంద్రాలు, జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో వన్‌టౌన్, టూ టౌన్, సీసీఎస్, ట్రాఫిక్ స్టేషన్ల అవసరముంది. నల్లగొండలోని దేవరకొండ, మహబూబ్‌నగర్ లోని కోస్గి, భూపాలపల్లి జిల్లా కేంద్రం, హుజూరాబాద్ జమ్మికుంట, పెద్దపల్లి కేంద్రంతోపాటు మంథని, సుల్తానాబాద్, వరంగల్‌లోని నర్సంపేట, పరకాల, సిద్దిపేటలోని హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, మహబూబాబాద్ కేంద్రంతో పాటు తొర్రూర్, కొత్తగూడెం కేంద్రంతో పాటు మణుగూరు, ఇల్లెందు, జగిత్యాల కేంద్రం, కోరుట్ల, మెట్పల్లి, ఆసిఫాబాద్ కేంద్రంతో పాటు కాగజ్‌నగర్, నిజామాబాద్‌లోని ఆర్మూర్, బోధన్, కామారెడ్డి జిల్లా కేంద్రం, సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ, మెదక్ జిల్లా కేంద్రం, వనపర్తి జిల్లా కేంద్రం, జనగామ జిల్లా కేంద్రాల్లో అదనపు స్టేషన్లతో పాటు ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకుకు అప్‌గ్రేడ్ చేస్తే పర్యవేక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు సులభతరం కానుంది. జనాభా ప్రాతిపాదికన కాదు.. పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు జనాభా దామాషాతో సంబంధం లేదు. అయితే కొత్తగా మండలం ఏర్పాటైతే ప్రభుత్వ కార్యాలయాల్లాగే పోలీస్ స్టేషనూ సర్కారు ఏర్పాటు చేస్తుంది. పట్టణాల్లో నేరాల నమోదు, తీవ్రత, పారిశ్రామిక అభివృద్ధి ఆధారంగా స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. స్టేషన్ల ఏర్పాటు సమయంలో జనాభాను పరిగణనలోకి తీసుకుంటారని, అయితే జనాభా దామాషాలో ఠాణాల ఏర్పాటు ఉండదని చెప్పారు. కమిషనరేట్లలో అప్‌గ్రేడ్ సంగతేంటి? సైబరబాద్ కమిషనరేట్‌ను విభజించి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌గా పునర్విభజన చేశారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చి చేరాయి. వాటిని అప్‌గ్రేడ్ చేసి ఇన్స్పెక్టర్ ర్యాంకు ఎస్హెచ్ఓగా మార్చాల్సి ఉంది. కానీ పునర్విభజన జరిగి ఏడాదిన్నర గడిచినా ఎస్సై ర్యాంకు ఎస్హెచ్ఓ పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
యాదాద్రి టెంపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్
సాక్షి, యాదాద్రి: తిరుమల తిరుపతి స్థాయిలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. భక్తుల భద్రతకు అంతే పెద్దపీట వేస్తోంది. యాదాద్రి క్షేత్రం పనులు పూర్తయితే దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకొచ్చే కంటే స్థానికంగా ఆర్మ్డ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్షేత్రం భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. యాదాద్రి రక్షణ దళం ప్రధానంగా భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దానికోసం రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను యాదాద్రిలోనే ఏర్పాటు చేస్తారు. యాదాద్రికి ప్రత్యేకంగా ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ మంజూరు చేశారు. మొత్తం పోలీసు శాఖకు కావాల్సిన కార్యాలయాలు, క్వార్టర్లు నిర్మించుకోవడానికి 50 ఎకరాల స్థలం కేటాయిస్తున్నారు. సాయుద దళం ఏర్పాటు వీవీఐపీలు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తారు. రిజర్వ్‌పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో మొత్తం మూడు ప్లాటూన్ల సాయుధ పోలీస్‌లు నిరంతరం యాదాద్రి క్షేత్ర రక్షణ బాధ్యతలను చూస్తుంటారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం పనిచేస్తుంది. ఇదీ స్వరూపం.. యాదాద్రి పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అ«ధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏసీపీని నియమించారు. కొండపైన అప్హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్‌తోపాటు మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు అవుతుంది. వీటికి స్టేషన్ హౌజ్ అధికారులుగా ఇన్స్పెక్టర్లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా రానున్నారు. -
బొటాస్‌కు ‘పోల్’ పొజిషన్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 36.231 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. బొటాస్ కెరీర్లో ఇది నాలుగో ‘పోల్’ కావడం విశేషం. హామిల్టన్ రెండో స్థానం నుంచి, ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 8, 9 స్థానాల నుంచి మొదలు పెడతారు. -
భరత్‌రెడ్డి కోసం రంగంలోకి మరో టీమ్!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భరత్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే, స్థావరాలు మార్చుతూ భరత్‌రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అభంగ పట్నంలో భరత్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
నా భర్తను హత్య చేశారు... న్యాయం చేయండి
కర్నూలు : తన భర్త నాగరాజును గత నెల 25వ తేదీన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హత్య చేసి శవాన్ని కనిపించకుండా చేశారని, దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని బనగానపల్లె పట్టణానికి చెందిన నిర్మల ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. 94407 95567 సెల్ నంబర్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజాదర్బార్ కార్యక్రమానికి నేరుగా వచ్చి కలసిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోస్పాడు మండలం పసులవాడు గ్రామానికి చెందిన తమ కుటుంబం 20 ఏళ్లుగా బనగానపల్లెలో ఉంటుందని, తన భర్త నాపరాయి బండల వ్యాపారం చేసేవాడని నిర్మల ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బనగానపల్లెకు వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని నిర్మల కలిసి తన సమస్య చెప్పుకుంది. ఆయన సూచన మేరకు సోమవారం కుటుంబ సభ్యులతో ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకుంది. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో మరి కొన్ని... ♦ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, పిల్లలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బనగానపల్లె మండలం బీరపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని ఆమె వేడుకున్నారు. ♦ భార్య ఆరోగ్యం సరిగా లేనందున పొలాన్ని అమ్మి వైద్యచికిత్సలు చేయించేందుకు ప్రయత్నిస్తుండగా కుమారులు అడ్డుకుంటున్నారని చాపిరేవుల గ్రామానికి చెందిన మద్దిలేటి ఫిర్యాదు చేశారు. ఆరుగురు పిల్లలున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ♦ కొందరు తమ ఇళ్లస్థలాలను దౌర్జన్యంతో ఆక్రమించుకున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సుజాత, బతుకమ్మ, జాన్, చిట్టెమ్మ, రాహేలమ్మ ఫిర్యాదు చేశారు. ♦ వెల్దుర్తిలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట, మట్కా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీ బాబుప్రసాద్, వినోద్‌కుమార్, నజీముద్దిన్, సీఐ పవన్‌కిషోర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎస్ కోట సర్కిల్లో ఉన్నతాధికారి అవినీతి దందాలపై ఇటీవల కాలంలో సాక్షి ప్రచురించిన వరుస కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనమైన విషయం విది తమే. సాక్షి కథనాలు పోలీస్ శాఖలో గుబులు రేపాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి.పాలరాజు స్పందించారు. అసిస్టెంట్ ఎస్పీ అట్టాడ వెంకటరమణను విచారణాధికారిగా నియమించారు. కొద్ది రోజుల క్రితమే వెంకటరమణ ఎస్ కోట వెళ్లి పలువురు సాక్షులను, అక్కడి సిబ్బం దిని విచారించారు. ఈ క్రమంలో తన దందా వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే కోణంలో సీఐ కూడా విచారణ చేస్తున్నారు. అనుమానం ఉన్నవారి కాల్ డేటా తీయించడం, స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించడం, తన అనుచరుల ద్వారా అడిగించడం, కొందరికి ఫోన్లు చేయించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తనకు ఎదురుతిరిగిన వారిని టార్గెట్ చేశారు. దానిలో భాగంగా కొంత కాలం క్రితం తనకు ఎదురుతిరిగిన మురళిని ముందుగా ఎంపిక చేసుకున్నా రు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మురళి మాటల్లోనే.. నన్ను వాడుకున్నారు... మాది ఎస్ కోట. ముస్లిం యువతిని ప్రేమించి పోలీసులు, మీడియా సమక్షంలోనే ఆదర్శ వివాహం చేసుకున్నాను. మా ప్రాంతంలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. నాకు ఒక కారు, ఒక లారీ, ఒక ట్రాక్టర్ ఉన్నాయి. అవి కూడా అప్పు చేసి కొన్నాను. వాటితో ఇసుక, రాళ్లు రవాణా చేస్తుంటాను. ట్రాక్టర్‌ను వ్యవసాయపనులకు వినియోగిస్తుంటాను. మరోవైపు పోలీస్మిత్రగా కూడా సేవలందించేవాడిని. మా ప్రాంతానికి సీఐగా వచ్చిన రమణమూర్తితో పరిచ యం ఏర్పడింది. ఆయనకు అవసరమైనప్పుడల్లా నా కారు వినియోగించుకునేవారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నా కారులోనే తిరిగేవారు. నేనే డ్రైవర్‌గా కూడా పనిచేసేవాడిని. నిందితులతో కుమ్మక్కయ్యారు పోలీస్ మిత్రగా నేను ఓ కేసు పట్టుకున్నాను. సీహెచ్ అబద్ధం అలియాస్ సురేష్ అనే వ్యక్తి ఉద్యోగాలిప్పిస్తామనంటూ కొందరి నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశాడు. అతనిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు అప్పగిస్తే సీఐ రమణమూర్తి, కానిస్టేబుళ్లు శేఖర్, రాంనా యుడు, సూర్యనారాయణ అబద్ధంతో కుమ్మకై విడిచిపెట్టేశారు. దానికి ప్రతిఫలంగా కాపుసోంపురం–2లో యాభై సెంట్ల భూమిని రాయించుకున్నా రు. రెండు చెక్కులు కూడా తీసుకున్నారు. వాటిలో ఎంత రాశారనేది తెలియదు. నేనే కాదు నాలా మరికొంతమంది పోలీస్ మిత్రలు పట్టుకున్న కేసుల్లోనూ వీరు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసి వదిలేశారు. గంజాయి కేసులో దొరికిన చెవర్లేట్ కారును వదిలేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ బావ మరిది అకౌంట్లో ఆ కారు యజమాని రూ. 50వేలు డిపాజిట్ చేశారు. అతని నుంచి ఎస్ఐ నరేష్ ద్వారా సీఐకి ఆ డబ్బు చేరింది. శెట్టి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గం జాయి స్మగ్లర్. ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాటిపూడి నుంచి తాగునీరు సరఫరా చేసేందుకు రోడ్డు పక్కన పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. వారి నుంచి కూడా రూ. 25వేలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ ఏజెన్సీకి చెందిన గంజాయి స్మగ్లర్ లారీని వదిలేసినందుకు సీఐకి రూ. 25లక్షలు ప్రతిఫలం దక్కినట్లు కూడా చెబుతున్నారు. ఉన్నతాధికారులు సరిగ్గా విచారిస్తే ఇవన్నీ బయటకొస్తాయి. అడ్డుపడ్డానని కక్ష గట్టారు ఇసుక అక్రమ వ్యాపారానికి సీఐ అండ పుష్కలంగా ఉంది. లారీ ఓనర్లంతా కలిసి ప్రతినెలా రూ. 5వేలు చొప్పున కానిస్టేబుల్ శేఖర్‌కు అందజేస్తుంటాం. ఆయన ద్వారా సీఐకి వెళుతుంది. ఇసుక లారీ ఓనర్ల మధ్య వివాదంలో అక్రమ ఇసుక రవాణా లారీని నేను మీడియాకు పట్టిచ్చాను. దాని వల్ల నెల నెలా వచ్చే మామూళ్లు ఆగిపోతాయనే కారణంతో సీఐ నాపై కక్ష గట్టారు. స్టేషన్‌కు రావాల్సిందిగా కొద్ది రోజులుగా కబురుపెడుతున్నారు. నాపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. దానిని ఆపాలంటే రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. రౌడీషీట్ తెరిచేంత తప్పులు నేనేం చేశానో నాకే తెలియడం లేదు. అదే జరిగితే ఇక ఆత్మహత్యే శరణ్యం. ‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం.. ఎస్ కోట పోలీస్ సర్కిల్ పరిధిలోని అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. వాటిలో కొన్నిటికి నేనే సాక్షిని. ఇప్పుడు నాపై కక్ష కట్టారు. రౌడీషీట్ తెరుస్తామని బెదిరిస్తున్నారు. నన్ను కాపాడమని పోలీసుల్లో ఎవరికీ చెప్పుకోలేక మిమ్మల్ని ఆశ్రయించాను. సీఐ అక్రమాలపై ఎక్కడైనా, ఎవరిదగ్గరైనా సాక్ష్యం చెప్పడానికైనా నేను సిద్ధం.’ – ‘సాక్షి’తో ఒకప్పటి పోలీస్ మిత్ర వాకాడ మురళి -
నయీం అనుచరులకు ఖాకీల అండ
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం అరెస్ట్ చేసిన అతడి అనుచరులకు పోలీస్‌ల సహకారం మెండుగా ఉంటోంది. శుక్రవారం వెలుగు చూసిన నలుగురు పోలీసుల సస్పెన్షన్‌తో నయీం ముఠాకు ఖాకీల సహకారం ఏ మేరకు ఉందో మరోసారి తేటతెల్లమైంది. ముఖ్య అనుచరుడు పాశం శ్రీను వరంగల్‌జైల్లో ఉన్నప్పటికీ అతనికి ఆరు నెలలుగా కొందరు పోలీసులు సహకరించారని తేటతెల్లమైంది. గురువారం పోలీసులు భువనగిరిలో పాశం శ్రీనుకు చెందిన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేయడంతో మరోమారు విషయం చర్చనీయాంశమైంది. పీడీ యాక్టు నమోదై వివిధ కేసుల్లో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న పాశం శ్రీనును భువనగిరి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎస్కార్ట్ పోలీస్‌లు సహకరించినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. అయితే పాశం శ్రీను ఎస్కార్ట్ పోలీస్‌లకు పెద్దఎత్తున డబ్బులను ముట్టజెబుతుండడంతో ఆ డ్యూటీలకు ఏఆర్ పోలీసుల్లో తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి భువనగిరి కోర్టుకు తీసుకువచ్చి తిరిగి జైలులో అప్పగించే వరకు పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. డ్యూటీలో ఉన్న ఒక్కో పోలీస్‌కు రూ.30వేలు, డ్యూటీ వేసిన అధికారికి రూ.10 వేలు పాశం శ్రీను ముట్ట చెబుతున్నారని సమాచారం. ఒక్కసారి ఆ డ్యూటీకీ వెళ్తే చాలు కొంత మొత్తం చేతికి వస్తుందన్న ఆశతో డిమాండ్ పెరిగింది. శ్రీనుకు స్వేచ్ఛ..సెల్ఫోన్లలో బెదిరింపులు డబ్బులు తీసుకుంటున్న ఎస్కార్ట్ పోలీసులు..పాశం శ్రీనును స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించారు. కొన్ని సెటిల్మెంట్ల విషయంలో అతను సెల్ఫోన్లో బెదిరింపులకు దిగడంతో బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిపిన విచారణలో పోలీసుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో ఎస్కార్ట్ పోలీస్‌ల సెల్ఫోన్లతోపాటు, పాశం శ్రీనుకు చెందిన మరికొందరు అనుచరుల ఫోన్లపై నిఘాపెట్టారు. గత నెల భువనగిరి కోర్టుకు వచ్చి తిరిగి వరంగల్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరిహద్దు దాటిన తర్వాత..జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయరహదారి పక్కన గల డాబాలో పాశం శ్రీను, అతని అనుచరులు కలిసి విందులు, వినోదలు చేశారు. ఎస్కార్ట్ పోలీస్ బృందంలోని ఆర్ఎస్ఐలు రమేష్, పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు రమేష్, లక్షినారాయణకు చెందిన సెల్ఫోన్ల నుంచి బెదిరింపు కాల్స్ చేశాడు. ఈ విషయం సిట్ విచారణలో బయటపడడంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే కేసులో పాశం శ్రీను తమ్ముడు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పాశం అమర్నాథ్, అనుచరులైన అందెసాయి కృష్ణ, అంగడి నాగరాజు,మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్ లపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. పెరిగిన నిఘా.. కొంతకాలంగా నయిమ్ ముఠా సభ్యుల బెదిరింపులు ప్రారంభమయ్యాయని పలువురు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో..నిఘాపెంచారు. ఇందుకోసం సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిరంతర నిఘా కొనసాగిస్తూ నయీమ్ పేరుతో ఆగడాలు సాగించే వారిని అణిచివేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పెద్దవడుగూరు/ అనంతపురం న్యూసిటీ: క్రిష్టిపాడు సింగిల్‌విండో ప్రెసిడెంట్ అప్పేచర్ల చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీ కావాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో వైఎస్సార్సీపీ కార్యకర్త చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుమందు తాగడం కలకలం రేపింది. బాధితుని బంధువులు తెలిపిన మేరకు.. జేసీ సోదరుల వెన్నంటి ఉండే చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి 2015లో వైఎస్సార్సీపీలో చేరాడు. అదే ఏడాది మార్చి 31న దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన అనుచరులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గ్రామంలో ఏ సంఘటన జరిగినా వైఎస్సార్సీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేసేవారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో రాజీకి రావాలని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీవ్రం చేసి.. వ్యతిరేకించే వారిని గొడవల్లో ఇరికించి అక్రమ కేసులు బనాయించేవారు. పోలీసుల ఓవరాక్షన్ అక్టోబర్ 31న అప్పేచర్ల గ్రామం 521 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో గల చింత తోపు కొలతలు వేయడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. వీరి ద్విచక్రవాహనాల టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు పంక్చర్ చేసి, ప్లగ్గులు ఎత్తుకెళ్లారు. బాధితులు పొలం అనుభవదారులపై అనుమానం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిక్కెం విజయభాస్కర్‌రెడ్డితోపాటు మరికొంతమందిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ పేరిట.. మరోసారి ‘రాజీ’ కోసం వేధించడంతో చిక్కెం విజయభాస్కర్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పరామర్శించారు. చిట్టెంరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి హత్య విషయంలో సీఐ, ఎస్ఐలు పదే పదే రాజీకావాలని చిక్కెం విజయభాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు. గ్రామాన్ని వదిలిపోతారా లేక రాజీ అవుతారా అంటూ బెదిరిస్తున్నారని పోలీసుల తీరును తప్పుపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదన్నారు. పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, పార్టీ నగరాధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, నేతలు చుక్కలూరు దిలీప్‌రెడ్డి, కసునూరు రఘునాథరెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సస్పెన్షన్ల సర్కిల్
తణుకు అర్బన్ : తణుకు సర్కిల్ పోలీస్ స్టేషన్.. సస్పెన్షన్ల సర్కిల్‌గా పోలీస్ వర్గాల్లో పేరుగాంచింది. పోలీస్ అధికారులు ఇక్కడకు వచ్చేటప్పుడు ఎంత హుషారుగా వస్తారో ఆ తర్వాత ఏదో ఒక వివాదం చుట్టుముట్టుకుని వెళ్లేటప్పుడు వివాదాస్పదంగా బయటకు వెళుతుంటారు. గత కొన్నేళ్లుగా వరుసగా అధికారులు సస్పెండ్ అయి వెళ్లడమే ఇందుకు కారణం. ఇక్కడ పనిచేసిన సీఐలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని మరీ వచ్చిన వారే అత్యధికం. తీరా ఇక్కడకు వచ్చాక ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం సస్పెండ్ కావడం పరిపాటిగా మారింది. దీంతో ఇప్పుడు తణుకు సర్కిల్ అంటే అధికారులు భయపడుతున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో నలుగురు అధికారులు సస్పెండ్ అయి వెళ్లగా తాజాగా ఈ నెల 31న తణుకు సీఐ చింతా రాంబాబు బదిలీపై వీఆర్‌కు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈయన ఇక్కడ రెండేళ్లు ఉద్యోVýæ జీవితం పూర్తి చేసుకున్నారు. ఆర్థికంగా బలమైన సర్కిల్ జిల్లాలో ఎక్కువ క్రైమ్ రికార్డు ఉండడంతో పాటు ఆర్థిక వనరులు కూడా బలంగా ఉండడం తణుకు సర్కిల్ స్టేషన్ ప్రత్యేకత. పట్టణం వ్యాపార, వాణిజ్య రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతుండడం కూడా ఇందుకు కారణం. దీంతో తణుకు వచ్చేందుకు అధికారులు ఉత్సాహం చూపించేవారు. తణుకు సర్కిల్ కార్యాలయానికి సంబంధించి తణుకు, తణుకు, రూరల్, తణుకు ట్రాఫిక్, ఉండ్రాజవరం, పెరవలి, అత్తిలి స్టేషన్లు ఉన్నాయి. 2009 నుంచి అధికారులకు ఎదురుదెబ్బలే 2009 నుంచి పనిచేసిన సర్కిల్ అధికారుల్లో ఒక్కరు తప్ప మిగిలినవారంతా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సస్పెండ్ అయి వెళ్లినవారే. 2011, 2012, 2014, 2016 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసిన సీఐలు వివిధ వివాదాల్లో ఇరుక్కుని సస్పెండ్ అయ్యారు. 2013లో తణుకు సర్కిల్ అధికారిగా వచ్చిన జి.మధుబాబు ఒక్కరే బదిలీపై వెళ్లారు. తాజాగా తణుకు సీఐ చింతా రాంబాబు కూడా ఇటీవల కాలంలో ఇటు రాజకీయం గానూ అటు డిపార్ట్మెంట్లోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరగవరం మండలం రేలంగిలో దళితవర్గాల మధ్య ఏర్పడిన తగాదాలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సీఐ పాత్రపై రాజకీయంగా గుర్రుగా ఉన్నా అధికారిని బదిలీ చేయిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో వేటు పడలేదు. మరోవైపు ఆయన వ్యవహార శైలిపై స్వయంగా పోలీస్ సిబ్బందే ఉన్నతాధికారికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను వీఆర్‌లో ఉంచారు. రెండేళ్లు పదవీకాలం పూర్తికావడం కూడా ఆయన బదిలీకి కారణంగా కనిపిస్తోంది. స్టేషన్‌కు వాస్తు దోషం సర్కిల్ అధికారులంతా వరుసగా సస్పెండ్ అవుతున్నారనే ఉద్ధేశంతో గతంలో నెమ్మదస్తుడు, అందరివాడని ముద్రపడిన ఒక అధికారిని ఇక్కడకు బదిలీ చేశారు. ఆయన వచ్చిన తర్వాత తణుకు సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎదురుగా ఉన్న సిగ్నల్ టవర్‌ను వాస్తు దోషానికి మూలంగా ఉందని పెద్ద మొత్తం వెచ్చించి మరీ స్టేషన్ వెనుక వైపునకు మార్పించారు. కానీ తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు కూడా తిరిగి ఇక్కడ నుంచి సస్పెండ్ అయి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ వాస్తుదోషంపై గుసగుసలాడుకుంటున్నారు. -
ఎర్ర స్మగ్లర్ల కోసం పోలీసుల వేట
ఆత్మకూరురూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్సీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డివిజన్ పరి«ధిలోని పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్మగ్లర్లను వేటాడుతున్నారు. స్థానిక స్మగ్లర్లు అంతర రాష్ట్ర స్మగ్లర్లతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. వారి సాయంతో తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోని అడవుల్లోకి పంపుతున్నారు. ఎర్రచందనాన్ని నరికివేయించి స్మగ్లింగ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం మర్రిపాడు మండలం బాటసింగనపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ అనుమానస్పద వాహనం కనిపించింది. పోలీసులు అడ్డుకోగా తమిళ కూలీలు దాడులకు పాల్పడ్డారు. 30 అడుగులకుపైగా ఉన్న వంతెనపై నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు, గూడూరు, కావలి డీఎస్పీలు ఆత్మకూరు, కలిగిరి, వెంకటగిరి సీఐలు, ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమా నం ఉన్న మండలాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురు అక్రమార్కులు, ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజా వళి, మర్రిపాడు ఎస్సై షేక్ అబ్ధుల్ రజాక్ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఛేజింగ్ చేసి మర్రిపాడు వద్ద వాహనా న్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటనలో సైతం స్మగ్లర్లు పోలీసులపై దాడులకు ప్రయత్నించడం గమనార్హం. తమిళనాడులోని పొన్నేరి, గుమ్మడిపూండికి చెందిన ఇద్దరు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరు అంతరరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఆదివారం ఏకకాలంలో మూడు మండలాల్లో నిర్వహించిన దాడుల్లో వెంకటగిరి, డక్కిలి, వెలిగొండ ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది స్మగ్లర్లతో పాటు నలుగురు అంతరరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడడం విశేషం. ఈ దాడుల్లో రూ.కోటి విలువైన 905 కేజీల బరువు కలిగిన 81 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ ఎం రామాంజనేయులరెడ్డి తెలిపారు. రెండు వ్యాన్లు, రెండు మోటార్‌సైకిళ్లు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
కారుతో యువతి హల్చల్
హైదరాబాద్: కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ యువతి తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు దుర్భాషలాడుతూ హల్చల్ చేసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ వాహనదారుడు దీనిని వీడియో తీసి సామా జిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై ట్వీటర్లో హరీష్ఓజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యక్ష సాక్షి అయిన ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలింగరాజు బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ సిక్ విలేజ్‌కు చెందిన లుబ్న అనే యువతి వోక్స్ వ్యాగన్ వైట్ కారులో సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్తుంది. స్థానికంగా ఉన్న నల్లి సిల్క్స్ వద్దకు రాగానే కారును అతివేగంతో నడుపుతూ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. పలువురి వాహనాలను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారులో నుంచి వాహనదారులతో వాగ్వివాదానికి దిగింది. ఓ ద్విచక్రవాహనదారుడిని యువతి బెదిరించడంతో పాటు దుర్భాషలాడింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలింగరాజు ఆమెను నియంత్రించేందుకు యత్నించినా వినిపించుకోకుండా ఇష్టారాజ్యంగా దూషిస్తూ కారులో వెళ్లిపోయింది. ఈ క్రమంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జాం నెలకొంది. ఆమెపై ర్యాష్ డ్రైవింగ్ చేసి వాహనదారులపై దూసుకెళ్లినందుకు గాను ఐపీసీ 279, దుర్భాషలాడి రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు గాను 70(బీ) సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్లో ప్రభాకర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ప్రభాకర్‌ను స్మరించుకుంటూ అతని కుటుంబం నివాసం ఉండే యాప్రాల్ లో అభిమానులు స్థూపాన్ని కట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇది తెలిసి అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ ఏడుగురూ ఠాణాలోనే ఆందోళనకి దిగటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఠాణా ఏ గ్రేడ్.. నిధులు సీ గ్రేడ్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో అవినీతిని నియంత్రించేందుకు ఠాణాల నిర్వహణ (మెయింటెనెన్స్) కోసం ప్రభుత్వమే నిధులిస్తుందని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పినా.. అమలులో మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల విడుదల కోసం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను 3 కేటగిరీలుగా విభజించినా.. అన్ని స్టేషన్లకూ ఒకే విధంగా నిధులు విడుదలవుతున్నాయి. రెండేళ్ల తర్వాత విష యం బయటకు పొక్కడంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖ తలపట్టుకుంది. 2015లో అమల్లోకి..: పోలీస్ స్టేషన్లకు నిర్వహణ నిధులిచ్చేందుకు బడ్జెట్లో ప్రభుత్వం రూపకల్పన చేయగా.. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లు ఏ గ్రేడ్, జిల్లా హెడ్ క్వార్టర్లు, అర్బన్ స్టేషన్లు బీ గ్రేడ్.. రూరల్, మారుమూల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు సీ గ్రేడ్‌గా విభజించారు. ఈ మేరకు ఏ గ్రేడ్ ఠాణాలకు రూ.75 వేలు, బీ గ్రేడ్‌కు రూ.50 వేలు, సీ గ్రేడ్‌కు రూ.25 వేలు ప్రతీ నెలా పోలీస్ శాఖ విడుదల చేయాల్సి ఉంది. కానీ 2015 నుంచి ఇప్పటివరకు అన్నీ స్టేషన్లకు ఒకేలా నిర్వహణ నిధులు విడుదల చేస్తోంది. సీఎం చెప్పినట్లు కాకుండా.. పోలీస్ శాఖలో అవినీతి నియంత్రించేందుకు ఠాణాల ఖర్చులకు తామే డబ్బులిస్తామని, అందుకు గ్రేడ్ల వారీగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బడ్జెట్లోనూ ఆ అంశాలు ప్రతిపాదించారు. కానీ సీ గ్రేడ్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్లకు చెల్లించే రూ.25 వేలే అన్ని గ్రేడ్లకు ఇస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఏ, బీ, సీ గ్రేడ్ల స్టేషన్ల ఖర్చులు వేర్వేరు కదా అని వివరణ కోరగా.. ఆర్థిక శాఖ నుంచి రూ.25 వేలకే క్లియరెన్స్ వచ్చిందని, దీనిపై అనేక సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా బడ్జెట్ లేమి వల్ల ఇవ్వలేకపోతున్నట్లు సమాధానమిచ్చారని అధికారులు స్పష్టం చేశారు. మంజూరవుతున్న రూ.25 వేలనే అన్ని స్టేషన్లకు క్వార్టర్లీ వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.6 కోట్లకు గాను రూ.4.7 కోట్లే.. ఏ, బీ, సీ గ్రేడ్ పోలీస్ స్టేషన్లకు ప్రతీ క్వార్టర్ పీరియడ్‌కు (3 నెలలు) రూ.6 కోట్లు నిర్వహణ కోసం విడుదల చేయాల్సి ఉండగా, రూ.25 వేలు చెల్లించేందుకుగాను రూ.4.7 కోట్లే ఆర్థిక శాఖ నుంచి విడుదలవుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో మాత్రం ఈ ఏడాది నుంచి ఏ గ్రేడ్ చెల్లింపులు కమిషనర్ ఖాతా నుంచి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో సీ గ్రేడ్ల వారీగానే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. యూసీలు సమర్పిస్తేనే నిధులు: డీజీపీ కార్యాలయం ఠాణాల నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని, నిధుల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఆర్థిక శాఖకు మరోసారి లేఖ రాస్తామని స్పష్టం చేశాయి. ఠాణాల నిర్వహణ నిధులను కూడా యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పిస్తేనే విడుదల చేస్తున్నామని.. ఈ విషయమై ఎస్పీలు, కమిషనర్లు మానిటరింగ్ చేసుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చాయి. -
చంపడం.. తెచ్చిపడేయడం..
పటాన్చెరు : రామచంద్రాపురం కొల్లురూ శివారులో బిర్లా స్కూల్ వెనక ప్రాంతంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళల మృతి చెంది పడి ఉన్నారని వారంతా అమీన్‌పూర్‌కు చెందిన వారని సమాచారం రావడంతో అమీన్పూర్ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇటీవల చాందిని జైన్ అనే అమ్మాయి అమీన్పూర్ 343 గుట్టలో శవంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం దొరికిన మృతదేహాలు ఎవరివి అనేది మిస్టరీగా మారింది. అదృష్టవశాత్తు మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే పోలీసులకు సమాచారం రావడంతో వారంతా అమీన్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అశోక్‌నగర్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి తన భార్య మాధవి (26), కుమారుడు వర్షిత్ (2)తో పాటు వరుసకు పిన్ని లక్ష్మి (46), ఆమె కూతురు సింధూజ (16) ఓఆర్ఆర్ సమీపంలో విగత జీవులుగా పడి ఉండడం అమీన్పూర్లో చర్చనీయాంశమైంది. ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీకి అధ్యక్షుడిగా ఉన్న రవీందర్‌రెడ్డి భార్య, కుమార్తె ఆ సంఘటనలో చనిపోయారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఎలా చనిపోయారనే దానిపై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. విష ప్రయోగమే కారణమా? ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు లక్ష్మి, సింధూజల మృతికి విష ప్రయోగమే కారణమని బంధువులు భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి మృతి చెంది ఉన్న కారులో విషం కలిపిన నీటి బాటిళ్లు లభించాయని బందువులు చెప్పారు. ఆ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులందరికీ ఆ విషం ఎవరు తాగించారనేది తేలాల్సి ఉంది. మృతులంతా కలిసే ఆ మందు తాగారా లేక వారికి తెలియకుండా ఆ విషాన్ని తాగించారా? లేదంటే ప్రభాకర్‌రెడ్డే మిగతా వారెవరికీ తెలియకుండా తాగించారా? అన్నది తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. షేర్ వ్యాపారంలో నష్టాలా? ప్రభాకర్‌రెడ్డి కొన్ని రోజులుగా అశోక్‌నగర్‌లో ఉంటున్నారు. స్థానికంగా ఆయన ఓ స్టాక్ బ్రోకర్ కంపెనీలో ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ చేస్తుంటారని బంధువులు చెబుతున్నారు. మొత్తం రూ.పది కోట్ల వరకు అప్పులు చేశారని అనుమానిస్తున్నారు. రవీందర్‌రెడ్డి కుటుంబానికి ప్రభాకర్‌రెడ్డిపై ఎంతో విశ్వాసం ఉండేది. ఆర్థిక లావాదేవీల్లో ప్రభాకర్‌రెడ్డికి నష్టం రావడమే వీరందరి మృతికి కారణమైందా అనేది అంతటా చర్చనీయాంశమైంది. చంపడం.. తెచ్చిపడేయడం.. అమీన్పూర్ మాత్రమే కాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్ఆర్పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్పూర్ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు. -
పోలీస్ స్టేషన్లో బర్త్‌డే!
ముంబై: కారు ప్రమాదంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్(28)కు ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. ఏకంగా పోలీసులే అతని పుట్టిన రోజునాడు శుభాకాంక్షలు తెలిపి కేకు అందించడంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు. ఈ ఘటన ముంబైలోని సకినలా పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చందీవలీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనీశ్ జైన్(28) తన కొత్త కారులో ఘట్కోపర్కు వెళుతుండగా ఓ టెంపో ఢీకొంది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి టెంపో డ్రైవర్‌తో కలిసి వెళ్లిన అనీశ్..అన్ని వివరాలను అందించారు. ఫిర్యాదు నమోదైన అక్టోబర్ 14 నాడే అనిశ్ పుట్టిన రోజని గుర్తించిన అధికారులు, కేకు తీసుకొచ్చి వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నారు. అనంతరం కేకు తీసుకొచ్చి ఘనంగా అనీశ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వ హించారు. ఈ విషయమై అనీశ్ స్పందిస్తూ..‘ ఆ రోజు ఫిర్యాదు చేశాక కొద్దిసేపు ఆగమని పోలీసులు సూచించారు. నా పుట్టిన రోజు కావడంతో ఆలస్యమవుతున్న కొద్దీ అసహనానికి లోనయ్యాను’ అని తెలిపారు. -
కొత్త ఠాణాలకు పక్కా భవనాలేవి?
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన 94 పోలీస్స్టేషన్లకు పక్కా భవనాలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నూతన జిల్లాల్లో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పునాది రాళ్లు వేస్తుండడంతో నూతన పోలీస్స్టేషన్ల నిర్మాణ అంశంపై పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. కొత్త పోలీస్స్టేషన్లలో కొన్ని ప్రైవేట్భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పురాతన భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాత పాఠశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అసలే వర్షాకాలం.. ఆపై పాతబడ్డ భవనాలు... ఎప్పుడు కూలుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిధుల లేమితో సందిగ్ధం నూతనంగా ఏర్పడిన ఏ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి కూడా ఈ ఏడాది బడ్జెట్ కేటాయించలేదు. గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన ఆధునీకరణ నిధులు, కేంద్రం నుంచి వచ్చే ఎంఓపీఎఫ్(మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పథకం నిధులతో ఠాణాల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం చేపట్టింది. అయితే, కొత్త పోలీస్స్టేషన్ల నిర్మాణానికి కనీసం రూ.2 కోట్ల చొప్పున ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు 94 పోలీస్స్టేషన్ల నిర్మాణానికి కనీసం రూ.200 కోట్లు కావాల్సి ఉంది. ఠాణాలు, క్వార్టర్ల నిర్మాణాలకు మొత్తంగా రూ.500 కోట్లకు పైగా అవసరమని అంచనా. ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదనలు పంపే ఆలోచనలో ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మరో ఐదు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం నిధులు కేటాయిస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. -
స్మార్ట్ ఖాకీ
పోలీస్ అంటే ఖాకీ.. ఖాకీ అంటే పోలీస్.. ఈ రెండింటిదీ విడదీయరాని అనుబంధం. పోలీసులు ఎలా ఉంటారు అనగానే ఖాకీ డ్రెస్ మనసులో మెదులుతుంది. అలాంటి ఖాకీ యూనిఫాం ఇప్పుడు మారబోతోంది. ఈ దిశగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్‌అండ్‌డీ) విభాగం కసరత్తు చేస్తోంది. కొత్త పోలీసు యూనిఫాం ఎలా ఉండబోతోందన్న దానిపై దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. – సాక్షి, హైదరాబాద్ ప్రజల నుంచీ అభిప్రాయ సేకరణ.. పోలీసులపై అభిప్రాయంతో పాటు యూనిఫాం మార్పుపై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు నాలుగు ప్రశ్నల రూపంలో అభిప్రాయాలు కోరింది. 1? పోలీసులతో మీరు తరచుగా మాట్లాడతారా? వారిని కలవాల్సి వచ్చిందా? అనే ప్రశ్నపై వారిని ఎక్కువగా కదిలించింది. ఇందుకుగానూ 66 శాతం మంది చాలా అరుదుగా పోలీసులను కలవాల్సి వస్తోందని చెప్పారు. 13 శాతం మంది అసలు కలవాల్సిన పరిస్థితి లేదని, 12 శాతం మంది తరచుగా పోలీసులను కలుస్తామని చెప్పగా, 4 శాతం మంది చాలా తరచుగా కలుస్తామని జవాబిచ్చారు. 2? పోలీస్ యూనిఫాంను చూడగానే మీకు కలిగే భావం ఏంటి? అని అడిగారు. 22 శాతం మంది సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుందని, 39 శాతం మంది యూనిఫాం చూడగానే బెదిరించినట్టుగా ఉంటోందని చెప్పారు. 7 శాతం మంది ఖాకీ యూనిఫాం చూడగానే గర్వంగా అనిపిస్తుందని, మరో 20 శాతం మంది యూనిఫాం చూస్తే గౌరవం ఇవ్వాలని అనిపిస్తుందని చెప్పగా.. 34 శాతం మంది ఎలాంటి అభిప్రాయం తెలుపలేదు. 3? ప్రస్తుతం ఉన్న పోలీస్ యూనిఫాంపై అభిప్రాయం కోరగా.. 3 శాతం మంది స్మార్ట్‌గా అనిపిస్తుందని, 23 శాతం మంది యూనిఫాం చూస్తే అసహ్యంగా, చిరిగిన దుస్తుల్లా కనిపిస్తాయని తెలిపారు. 50 శాతం మంది ధరించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని తెలుపగా, 24 శాతం మంది ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. 4? మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ధరించే యూనిఫాంపై అభిప్రాయం కోరగా 17 శాతం మంది యూనిఫాం స్మార్ట్‌గా ఉంటుందని, 46 శాతం మంది చాలా సాధారణంగా, పెద్దగా గుర్తించలేని విధంగా ఉందని తెలిపారు. 7 శాతం మంది భారత సంస్కృతికి సరిపడదని చెప్పారు. 21 శాతం మంది మహిళా సిబ్బంది యూనిఫాం ఏంటో తెలియదని చెప్పారు. బీపీఆర్‌అండ్‌డీ నేతృత్వంలో.. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పులు, ఆధునీకరణపై నిరంతర అధ్యయనాలు, అభిప్రాయ సేకరణ చేసే బీపీఆర్‌అండ్‌డీ విభాగం..పోలీస్ యూనిఫాంలో తీసుకురావాల్సిన మార్పులపైనా అధ్యయనం చేసింది. గుజరాత్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థతో కలసి దేశవ్యాప్తంగా పోలీస్ యూనిఫాం మార్పు, కొత్త యూనిఫాంపై అధ్యయనం నిర్వహించింది. ఇందుకుగానూ 2012 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పోలీస్ బలగాల యూనిట్లను పరిశీలించి నివేదికను రూపొందించింది. నేషనల్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ఎవరి శైలి వారిదే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ఖాకీ దుస్తులు ఉంటున్నాయని బీపీఆర్‌అండ్‌డీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో బాగా ముదురు రంగు ఖాకీ దుస్తులు వాడుతున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో లేత ఖాకీ రంగు దుస్తులు వాడుతున్నారని పేర్కొంది. అయితే ఒక రాష్ట్రంలోనే వివిధ రకాల్లో యూనిఫాంలు కుట్టించుకుంటున్నారని, కానిస్టేబుళ్లు ఒక శైలిలో, అధికారులు మరో శైలిలో యూనిఫాంలను కుట్టిస్తున్నారని, దీని వల్ల ఏకరూపత సాధ్యం కావడం లేదని అభిప్రాయపడింది. కిందిస్థాయి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కుట్టించుకుంటున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఖాకీ యూనిఫాం, శైలిపై పోలీస్ సిబ్బంది, అధికారుల నుంచీ అభిప్రాయ సేకరణ చేసింది. చాలా అసౌకర్యంగా ఉందని కొన్ని రాష్ట్రాల సిబ్బంది చెప్పగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. యూనిఫాంతో పాటు టోపి, షూ, బెల్ట్ తదితరాలపై అసంతృప్తి వ్యక్తమైంది. ప్రధాన రకాలు ఇవే.. : అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అక్కడి వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని బీపీఆర్‌అండ్‌డీ స్పçష్టం చేసింది. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ‘స్మార్ట్ పోలీస్ యూనిఫాం’తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఖాకీ యూనిఫాం స్థానంలో పోలీస్ సిబ్బంది ధరించాల్సిన డ్రెస్‌ల మోడళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. పోలీస్, మహిళా పోలీస్‌కు ఒకే యూనిఫాం రూపొందించింది. అయితే హాఫ్ షర్ట్, ఫుల్ షర్ట్ రకాల్లో తయారు చేసింది. ప్రస్తుతమున్న ముదురు రంగును కొంత తగ్గిస్తూ.. లేత ఖాకీ రంగు అనిపించేలా చొక్కా రూపొందించింది. ఖాకీతో పాటు కొంచెం పసుపు రంగు కలిసేలా చొక్కా ఉండనుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తెలిపింది. చొక్కాపై ఇండియన్ పోలీస్ బ్యాడ్జ్, దానిలోనే బ్లడ్ గ్రూప్ స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. హోదాను బట్టి చొక్కాపై నీలిరంగు షోల్డర్‌పై స్టార్స్‌ను పెట్టుకోవాల్సి ఉంటుందని డిజైన్‌లో స్పష్టంచేసింది. స్మార్ట్‌గా ఉండేందుకే.. దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్‌ను అందుబాటులోకి తెచ్చే యత్నంలోనే ఖాకీ యూనిఫాం, శైలిపై డిజైన్లు చేయిస్తున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ స్పష్టం చేసింది. యూనిఫాం మాత్రమే కాక టోపి, బెల్ట్, నేమ్ బ్యాడ్జ్, డ్యూటీ జాకెట్, షూ, సాక్స్, రెయిన్ కోట్.. ఇలా టాప్ టూ బాటమ్.. పోలీస్ యూనిఫాం వ్యవస్థనే మార్చాలని నిర్ణయానికి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన పలు డిజైన్లపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ వర్గాలు స్పష్టం చేశాయి. -
ఈ స్టేషన్‌కు దిక్కెవరు..?
మహబూబ్‌నగర్ క్రైం : ఈ పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువ.. నిత్యం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతాయి. ఇద్దరు ఎస్ఐలు అక్కడ అవసరమవుతారు. కానీ ఒక్క ఎస్ఐ కూడా లేకుండా గత పది రోజుల నుంచి పోలీస్ స్టేషన్ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పదిరోజుల నుంచి ఎస్ఐ స్థాయి అధికారి లేకుండానే పోలీస్ వ్యవహారాలు నడుస్తున్నాయి. గతంలో పనిచేస్తున్న ఎస్ఐ పది రోజుల నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా.. ఆయనను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రూరల్ మొదటి ఎస్ఐ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో రోజువారిగా అయ్యే కేసుల దగ్గర నుంచి ఇతర నేరాలను అదుపు చేయడం బందోబస్తు, ఇతర విషయాలకు సమస్యగా మారింది. ప్రధానంగా ప్రస్తుతం దసరా సెలవులు ఉండటం వల్ల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలు అధికంగా జరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం రూరల్ ఇద్దరు ఎస్ఐల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఆ బాధ్యత సీఐతోపాటు ఏఎస్ఐలపై పడింది. తాత్కలికంగా కేటాయిస్తారా? రూరల్ పోలీస్ స్టేషన్‌కు తాత్కలికంగా ఓ ఎస్ఐని కేటాయించాలని ఇప్పటికే ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఎస్పీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే టూటౌన్లో పనిచేసే ఓ ఎస్ఐని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలిక ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. రెగ్యులర్ ఎస్ఐ వచ్చే వరకు తాత్కాలిక ఎస్ఐకి బాధ్యతలు అప్పాగిస్తారా.. లేకుంటే రెగ్యులర్ ఎస్ఐనే నియామకం చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వారిపై చాలా ఆరోపణలు రావడం జరుగుతుంది. చాలాకాలం నుంచి అక్కడే.. పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో చాలాకాలం ఒకే స్టేషన్లో పనిచేస్తున్న రైటర్లతోపాటు డ్రైవర్లు ఉన్నారు. దాదాపు 13, 8, ఆరేళ్ల నుంచి కూడా ఒకే పోలీస్‌స్టేషన్‌లో పని చేయడం వల్ల స్థానికంగా పట్టు సాధించి స్టేషన్ వ్యవహారాలు పూర్తిగా వారి చేతులోకి తీసుకుంటున్నారు. ఇలా ఒకే పోలీస్ స్టేషన్లో పాతుకుపోవడం వల్ల పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయంలో వారికి తెలియకుండా ముందుకు సాగడం లేదు. ఒక పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే రైటర్లు ఎస్ఐ అందుబాటులో లేకుంటే జీడీతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చెప్పిన స్టేట్మెంట్, రికార్డులు రాయడం, పంచనామాలు, రిజిష్టర్లలో వివరాలు నమోదు చేయడం చేస్తారు. దీంట్లో పంచనామాలు రాయడానికి రైటర్లు క్షేత్రస్థాయికి వెళ్లిన సమయంలో బాధితుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం తాత్కాలిక ఎస్ఐగా రాజేందర్ బాధ్యతలు చేపట్టారు. -
ఎస్ఐ దాడి చేశాడంటూ ఆందోళన
బేతంచెర్ల : సారా విక్రయిస్తున్నాడనే నెపంతో ఎస్ఐ తిరుపాలు దాడి చేయడంతో బేతంచెర్ల హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన ఆదినారాయణ గౌడ్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఎస్ఐ తీరుకు నిరసనగా బాధిత కుటుంబీకులు ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడి భార్య లక్ష్మి, కుమార్తె, కోడలు సుధారాణి, రమాదేవి వివరాల మేరకు.. ఆదినారాయణగౌడు నాటుసారా విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇందుకు ప్రతిగా పోలీసులకు డబ్బులు ముట్టజెప్పేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి రూ.30 వేలు ఇవ్వాలని పోలీసులు ఫోన్ చేసి బెదిరించారు. ఇవ్వకపోవడంతో ఆదివారం ఉదయం ఎస్ఐ తిరుపాలు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకుంటే కేసు పెడతానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదినారాయణపై చేయిచేసుకోవడంతో అతడు అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతన్ని పోలీసులే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు కాలనీవాసులంతా ప్రాథమిక చికిత్స అనంతరం ఆదినారాయణను పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడే ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ మాట్లాడుతూ నాటు సారా విక్రయిస్తూ కేసుపెడతారనే సాకుతో స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారని తెలిపారు. -
పోలీసుస్టేషన్లో దుప్పటి పంచాయితీ!
అనంతపురం సెంట్రల్: పోలీసుల దుప్పటి పంచాయితీతో తనకు అన్యాయం జరిగిందని పామిడికి చెందిన నూర్‌బాషా మనస్తాపంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... నూర్‌బాషా కటిక వ్యాపారంలో మధ్యవర్తిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి రకరకాల వ్యాపారాలు చేశాడు. ఇటీవల ఇమ్రాన్ 20 దున్నపోతులు విక్రయించు అని నూర్‌బాషాకు అప్పగించాడు. వీటిని రూ. 4లక్షలకు విక్రయించాడు. నూర్‌బాషాకు గతంలో ఇమ్రాన్ కొంతమొత్తం బాకీ ఉన్నాడు. దాన్ని పట్టుకుని మిగతా రూ.2లక్షల మేర ఇస్తానని చెప్పడంతో ఈ వ్యవహారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. రెండు రోజులుగా స్టేషన్లో పంచాయితీ జరుగుతోంది. పోలీసులు మాత్రం రూ. 3లక్షలు ఇవ్వాల్సిందేనని పంచాయితీ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని నూర్‌బాషా బుధవారం ఉదయం పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. -
ఒక్కటైన దొంగ.. పోలీస్ !
కదిరి: ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని గత వారం రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ దొంగలు, పోలీస్ అధికారులు ఒక్కటై ఎవరింట్లో దొంగతనం జరిగిందో ఆ బాధితులను పోలీస్ అధికారులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నట్లు సమాచారం. ‘రేయ్ మీ ఇంట్లో 30 తులాలు దొంగతనం అయినట్లు మాకు ఆరోజు ఫిర్యాదులో ఇచ్చావ్. కానీ మీ ఇంట్లో దొంగ ఆరోజు ఎత్తుకెళ్లింది కేవలం 5 తులాలు మాత్రమేనని ఆ దొంగ మాతో చెప్పాడు. రేపో, మాపో ఆ 5 తులాలు రికవరీ చూపిస్తాం. వచ్చి తీసుకెళ్లు..మీ ఇంట్లో ఎంత దొంగతనం అయిందో అంతా రికవరీ చేసి ఇవ్వాలని ఏ చట్టంలో లేదు. మర్యాదగా ఇచ్చింది తీసుకెళ్లు’ అంటూ పోలీస్ అధికారులు బాధితులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకో బాధితుడు ఆరోజు తన ఇంట్లో ఒక ఎల్ఈడీ టీవీ, 5 తులాల బంగారంతో పాటు రూ.50 వేలు నగదు పోయిందని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. అయితే టీవీ రికవరి చేయడం సాధ్యం కాదంటూ ఆరోజు పోలీసు అధికారులే ఆ బాధితుడిని తన ఫిర్యాదులో టీవీ విషయం రాయద్దని చెప్పి అలాగే ఫిర్యాదు ఇప్పించుకున్నారు. అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న దొంగ తాను సదరు వ్యక్తి ఇంట్లో టీవీ కూడా ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు చేసేది లేక టీవీని సదరు బాధితుడికి అందజేశారు. అయితే అతని ఇంట్లో దోచుకెళ్లిన 5 తులాలు అబద్దమని, దొంగకూడా ఇదే చెబుతున్నాడంటూ బాధితుడిని పోలీసులు బయటకు గెంటేసినట్లు తెలిసింది. దొంగ.. తాను ఏ ఇంట్లో ఎంత దోచుకున్నాడో.. ఏ బంగారు షాపులో అమ్మాడో చెప్పినప్పటికీ పోలీసు అధికారులు మాత్రం బాధితులకు అన్యాయం చేసి, తాము ఇచ్చింది తీసుకోండి అంటూ బెదిరిస్తున్నారట. నేడో, రేపో పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న దొంగలను మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలిసింది. -
కాలం చెల్లిన పోలీసు వ్యవస్థలో న్యాయం బహు దూరం
అవలోకనం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన కాలం చెల్లిన వ్యవస్థలో పనిచేస్తున్న మన పోలీసులు శాస్త్రీయమైన దర్యాప్తు పద్ధతుల్లో నేరాన్ని పరిష్కరించడం లేదు. కాబట్టి తీవ్ర నేరాలకు పాల్పడే వారిలో సైతం అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. కాబట్టి, గౌరీ లంకేశ్‌ను హత్యచేసినవారు, వారిని అందుకు పురమాయించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే ఆశ్చర్యపోను. గత ముప్పయ్యేళ్లలో మన దేశంలోని నగరాలు బాగా మారిపోయాయి. ఇది పోలీ సుల పనితీరును బాగా ప్రభావితం చేసింది. నగరాలు ఎలా పెరిగిపోయాయి లేదా నివాసయోగ్యం కానివిగా ఉన్నా చాలా మంది ప్రజలు అక్కడే ఎలా నివసించాల్సి వస్తున్నది అనే వాటి గురించి నేను మాట్లాడటం లేదు. మన నగరాలను అసలు ఎలా రూపకల్పన చేశారు, అవి ఎలా మారిపోయాయి అనేదాన్ని ప్రస్తావిస్తున్నాను. మన దేశం ప్రాచీనమైనదే అయినా, మన నగరాలలో చాలా వరకు కొత్తవే. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి అతి పెద్ద నగరాలు 300 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినవి. హైదరాబాద్, సూరత్ లాంటి నగరాలు దాదాపు మరో 200 ఏళ్లు ముందు నిర్మించినవి. మన ‘పాత’ ఢిల్లీ సైతం 400 ఏళ్ల క్రితం నిర్మించినదే. కాశీని మాత్రమే ప్రాచీన నగరంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ నగరం దాదాపుగా అంతా వాస్తవానికి కొత్తగా నిర్మించినదే. అక్కడి ఘాట్లు సైతం సాపేక్షికంగా ఇటీవలివే. 500 ఏళ్ల కంటే ముందు నుంచీ ఉన్నదని సమంజసమైన ఆధారాలతో చెప్పగల కట్టడం ఒక్కటీ అక్కడ నేడు లేదు. రోమ్తో దీన్ని పోల్చి చూడండి. అక్కడి పేంథియన్ (రోమన్ దేవాలయం) దాదాపు 2,000 ఏళ్ల క్రితం నాటిది. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది. రోమ్‌లోని పురాతన కట్టడాల చుట్టూతా ఆ నగర జనాభా ప్రాచీనకాలం నుంచి నేటి వరకు తమ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆధునికమైన సైకిళ్లు, మోటార్ కార్లు, రెస్టారెంట్లు వచ్చి చేరినా అది కొనసాగుతూనే ఉంది. జీవిత విధానంలో వచ్చిన ఈ మార్పులు తప్ప, అక్కడి ఏ నివాస ప్రాంతాన్ని చూసినా శతాబ్దాల తరబడి మారనట్టే కనిపిస్తుంది. మన దేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమైనది. ఏవో కొన్ని కొత్త భవంతులు పుట్టుకొస్తుండని ప్రాంతాలు మన నగరాలలో అరుదు. కొన్నేళ్ల తర్వాత తిరిగివస్తే మన నగరాల్లోని చాలా ప్రాంతాలు గుర్తు పట్టరానివిగా మారిపోతాయి. ఈ మార్పు, పోలీసులు తమ విధులను నిర్వహించే తీరును ప్రభావితం చేసిందని నేను ఎందుకు అంటున్నట్టు? సాంప్రదాయక పద్ధతిలో ఒక నివాస ప్రాంతంలోని ఠాణా నేరాలతో వ్యవహరిస్తుండేది. ‘హిస్టరీ షీటర్ల’ (నేర చరిత్రుల) జాబితా, వారి ఫొటోలు పోలీసు స్టేషన్ నోటీసు బోర్డులో అతికించి ఉండేవి. కొత్తగా వచ్చిన పోలీసులు ఆ ప్రాంతం గురించి, నేరాలకు ‘అలవాటుపడ్డవారి’ గురించి తెలుసుకోడానికి ఇది తోడ్పడేది. కానీ నేటి మన నగరాలలో ప్రజలు ఉద్యోగాలు మారుతుంటారు, నగరాలు మారుతుంటారు, అద్దె ఇళ్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటారు. కాబట్టి బోలెడంత గందరగోళం ఉంటుంది. పట్టణ ప్రాంతాలు నిరంతరం మారిపోతున్నా పాత పోలీసు వ్యవస్థే మిగిలి ఉంది. సీసీటీవీ కెమెరాల వంటి వాటి ద్వారా కొంత సాంకేతిక సహాయం లభిస్తోంది. అది కూడా ఇతర దేశాలకు భిన్నంగా దైవాధీనం అన్న తీరులోనే సాగుతోంది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే దొంగతనాల కేసులను ఇప్పటికి కూడా పనివాళ్లనందర్నీ పట్టుకొచ్చి, ఎవరో ఒకరు నేరాన్ని ఒప్పుకునే వరకు చితగ్గొట్టే పద్ధతిలోనే పోలీసు దర్యాప్తు సాగుతోంది. హత్య సహా ఏ నేరం విషయంలోనూ సక్రమమైన దర్యాప్తు అనేదే లేదు. గౌరీ లంకేశ్ హత్యా ప్రదేశానికి తొలుత చేరుకున్న వారు.. అది ఎవరైనా ఇష్టానుసారం వచ్చి వెళ్లడానికి వీలుగా ఉండటం చూసి ఉంటారు. అలాంటి చోట చెప్పుకోదగిన ఫోరెన్సిక్ ఆధారాలేవీ మిగలవు. సమాంతరంగా సంభవించిన మరో పరిణామం కూడా పోలీసు పనిని ప్రభావితం చేసింది. పోలీసులకు ఎప్పటికప్పడు సమాచారాన్ని చేరవేసే ‘కబ్రీ’లు మాయమయ్యారు. నేడు ఆ పనిని చేస్తున్నది, నేరగ్రస్తత అంచుల్లో ఉండే పోలీసు ఇన్ఫార్మర్లు మాత్రమే. ఇన్ఫార్మర్లు కొంత చట్టవిరుద్ధమైన పనులను కూడా చేస్తుం టారు. పోలీసులు వారిని భయపెట్టి లేదా లంచమిచ్చి సమాచారాన్ని తెలుసుకుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై, సూరత్ అల్లర్లు, ఆ తర్వాత వాటికి ప్రతిగా బాంబు దాడుల రూపంలో జరిగిన దాడుల తదుపరి పోలీసులకు కబ్రీలు లేకుండా పోయారు. కబ్రీలలో ఎక్కువ మంది ముస్లింలు కావడమే అందుకు కారణం. మతపరమైన విభజన పాత నమూనా పోలీసు పనిని ప్రభావితం చేసింది. ఆధునిక ఫోరెన్సిక్స్‌పై ఆధారపడ్డ దర్యాప్తు పూర్తిగా లోపిస్తుంది. పాత నమూనా దర్యాప్తు ఇక ఎంత మాత్రమూ ఫలితాలను ఇవ్వగలిగేది కాదు. 1996లో నేను ఒక విలేకరిగా ముంబై సెషన్స్ కోర్టులో ఉండగా, ఇక్బాల్ మిర్చి అని మాదకద్రవ్యాల సరఫరాదారు తరఫు న్యాయవాదిౖయెన శ్యామ్ కేశ్వానీ నన్ను కలిశారు. అప్పట్లో ఇక్బాల్ మిర్చిని అప్పగించాలని భారత్ ఇంగ్లండ్‌ని కోరుతోంది. ఆ కేసు కోసం సీబీఐ నలుగురి బృందాన్ని పంపింది. కేశ్వానీ నాకు దాదాపు 200 పేజీల చార్జీ షీటు ప్రతిని ఇచ్చారు. అందులో ఒకే ఒక్క చోట ఆయన క్లయింట్ పేరు ఉంది. అది కూడా చిట్టచివరి పేజీలో ‘ఈ కేసులో ఇక్బాల్ మెమన్ లేదా మిర్చి కూడా అవసరమైన వ్యక్తి’ అన్న ఒక్క వాక్యంలోనే ఉంది. భారత ప్రభుత్వం నాడు సమర్పిస్తుండిన మొత్తం ‘ఆధారం’ అదే. ఇంగ్లండ్ మిర్చిని అప్పగించలేదు. ఇది భారత పోలీసుల తప్పు అనడం లేదు. వారు చాలా కష్టించి పనిచేస్తున్నారు. కాకపోతే, ఒక నివాస ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం బ్రిటిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వ్యవస్థలోనే మన పోలీసు ఇంకా పనిచేస్తున్నాడు. దర్యాప్తు ద్వారా నేరాన్ని పరిష్కరించడం లేదు. జపాన్‌లో నేరాభియోగాలకు గురైన వారిలో శిక్షపడినవారి నిష్పత్తి 95 శాతం. అంటే ఏదైనా నేరానికిగానూ పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారంటే, కోర్టు అతన్ని దోషి అని నిర్ధారించడానికి హామీ దాదాపుగా ఉంటుంది. భారత్‌లోలాగే తరచుగా చిత్రహింసలకు గురిచేయడం ద్వారా రాబట్టిన నేరాంగీకార ప్రకటనలపై ఆధారపడే ఈ వ్యవస్థను విమర్శించేవారూ ఉన్నారు. అదే లోపాలున్నా, భారత్‌లో శిక్షలు పడేవారి నిష్పత్తి 50 శాతం కంటే తక్కువే ఉంటోంది. తీవ్ర నేరాలుసహా నేరాలకు పాల్పడే భారతీయులలో అధికులు తప్పించుకుపోగలుగుతున్నారు. ఈ కారణంగా, గౌరీ లంకేశ్‌ను హత్యచేసినవారు, వారిని ఆ పని చేయడానికి నియమించినవారు ఎప్పటికీ శిక్ష అనుభవించాల్సి రాకపోతే నేను ఆశ్చర్యపోను. ఈ వైఫల్యం వ్యవస్థాగతమైనది, కొన్ని ప్రత్యేక సందర్భాలలో అది పనిచేస్తుందని ఆశించడం మన ఆశావాదాన్ని సూచిస్తుందే తప్ప, వాస్తవాలు తెలిపే నిజపరిస్థితిపై అంచనాను మాత్రం సూచించదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
మహిళ ఆత్మహత్యాయత్నం
కేకే.నగర్: పుదుచ్చేరి పోలీస్‌స్టేషన్ ఎదుట బుధవారం మహిళ శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు.. పుదుచ్చేరి లాస్‌పేట ప్రాంతానికి చెందిన వెనోనికా(35). ఈమె భర్త నుంచి విడాకులు పొందింది. ఈ స్థితిలో మంగళవారం సాయంత్రం పుదువై పోలీస్‌స్టేషన్ ప్రధాన కార్యాలయం ముందు వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడున్న పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకుని కిరోసిన్ క్యాన్‌ను లాక్కున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నుంచి క్యాన్‌లో నీళ్లు తెచ్చి మహిళపై పోశారు. అనంతరం ఆమె వద్ద విచారణ జరిపారు. విచారణలో సదరు మహిళ భర్త నుంచి విడాకులు పొందిన స్థితిలో లాస్‌పేట ప్రాంతానికి చెందిన సెంథిల్‌కుమార్ వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని తెలిపింది. దీనిపై లాస్‌పేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొంది. దీనిపై పెరియకడై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ కళ్లలో కిరోసిన్ పడి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హామిల్టన్ హవా
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మోంజా (ఇటలీ): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్–10లో నిలిచారు. ఒకాన్ ఆరో స్థానంలో, పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 20 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. వెటెల్ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా... బొటాస్ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. -
హామిల్టన్ ‘పోల్’ రికార్డు
ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 69 సార్లు పోల్ పొజిషన్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు మోంజా (ఇటలీ): ఫార్ములావన్ క్రీడలో శనివారం కొత్త రికార్డు నమోదైంది. మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ క్రీడా చరిత్రలో అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.554 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తాజా ప్రదర్శనతో హామిల్టన్ జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (68 సార్లు) పేరిట ఐదేళ్లుగా ఉన్న ‘పోల్ పొజిషన్’ రికార్డును బద్దలు కొట్టాడు. తన కెరీర్లో హామిల్టన్ పోల్ పొజిషన్‌తో మొదలుపెట్టిన రేసుల్లో 37 సార్లు విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఐదో స్థానం నుంచి, పెరెజ్ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. రికియార్డో (రెడ్‌బుల్), 4. లాన్స్ స్ట్రాల్ (విలియమ్స్), 5. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 6. బొటాస్ (మెర్సిడెస్), 7. రైకోనెన్ (ఫెరారీ), 8. వెటెల్ (ఫెరారీ), 9. మసా (విలియమ్స్), 10. వాన్డూర్నీ (మెక్లారెన్), 11. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 13. అలోన్సో (మెక్లారెన్), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. సెయింజ్ (ఎస్టీఆర్), 16. మాగ్నుసెన్ (హాస్), 17. పాల్మెర్ (రెనౌ), 18. ఎరిక్సన్ (సాబెర్), 19. వెర్లీన్ (సాబెర్), 20. గ్రోస్యెన్ (హాస్). -
తీరం.. రక్షణ ప్రశ్నార్థకం
♦ తెరపైకి మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ♦గతంలోనే స్థల పరిశీలన ♦ ఐదేళ్లుగా నిరీక్షణ నరసాపురం : నరసాపురం తీరప్రాంతంలో రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలంగా మెరైన్‌పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై హడాÐవుడి చేయడం, మళ్లీ విషయం మరుగున పడడం పరిపాటిగా మారింది. నాలుగైదేళ్లుగా ఇదేతంతు నడుస్తోంది. రెండేళ్ల క్రితం అంతర్వేదిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో, ఇక ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు ఉండవని భావించారు. అయితే జిల్లాలో తీరప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. కచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని రెవెన్యూ శాఖలు పేర్కొంటున్నాయి. కొన్నేళ్ల క్రితం సముద్ర మార్గం ద్వారా కసబ్ సహా పలువురు తీవ్రవాదులు ముంబై నగరంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. సరిగ్గా అప్పుడే కేంద్రం మన రాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో రక్షణ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా నరసాపురం తీరప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఉపయోగాలున్నా.. పెండింగ్ ఎందుకో? మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఐదేళ్ల క్రితం అంటే 2012లో దాదాపు రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడిన ప్రతినిధి బృందం నరసాపురం తీరగ్రామాల్లో పర్యటించింది. నరసాపురం మండలం చినమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. చినమైనవానిలంకలో ఓ ప్రాంతాన్ని స్టేషన్ ఏర్పాటుకు అనువుగా గుర్తించారు. అయితే నరసాపురంతో పాటు ప్రతిపాదనలో ఉన్న మరోప్రదేశమైన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మాత్రం 2013లో మెరైన్‌పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేశారు. ఇక్కడ మాత్రం పెండింగ్ పెట్టారు. మన జిల్లాలోని నరసాపురంలో 19 కిలో మీటర్ల మేర తీరప్రాంత ఉంది. తరచూ ప్రకృతి విపత్తులు సంభవించడంతో ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ అవసరమని నిపుణులు గుర్తించారు. ఈ స్టేషన్ అందుబాటులో ఉంటే తీరప్రాంత భద్రత, రక్షణే కాకుండా ఇతర ఉపయోగాలుంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణహాని కలుగకుండా రక్షించడం మెరైన్ స్టేషన్ సిబ్బంది చేస్తుంటారు. బోట్లు, విపత్తు రక్షణ సామగ్రి వారివద్ద అందుబాటులో ఉంటుంది. మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఇటీవల పోలీస్‌శాఖ మరోసారి కేంద్రం దృష్టిలో పెట్టింది. ఇంతకుముందు ఎస్పీగా పని చేసిన భాస్కర్‌భూషణ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థల పరిశీలన కూడా చేశారు. ఇటీవల కదలికతో మెరైన్ స్టేషన్ సాకారమవుతుందోలేదో వేచిచూడాల్సి ఉంది. స్థలం సమస్యలేదు సుమిత్ కుమార్ గాంధీ, సబ్‌కలెక్టర్ తీరంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సమస్య లేదు. గతంలో గుర్తించాలమని చెపుతున్న చినమైనవానిలంకలో కూడా ప్రభుత్వ భూములున్నాయి. నేను బాధ్యతలు తీసుకున్న తరువాత మాత్రం ఈ అంశం నా దృష్టికి రాలేదు. -
షుమాకర్ సరసన హామిల్టన్
అత్యధిక ‘పోల్’ పొజిషన్స్ రికార్డు సమం స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో టైటిల్‌ను గెలిచేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆదివారం జరిగే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తొలి స్థానంతో ప్రారంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.553 సెకన్లలో ల్యాప్‌ను ముగించి ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 68 ‘పోల్స్’తో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక ‘పోల్ పొజిషన్స్’ ప్రపంచ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి, బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి, ఒకాన్ పదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
రూ.375 కోట్లతో నూతన పోలీస్ భవనాలు
116 చోట్ల కొత్త పోలీస్స్టేషన్లు, క్వార్టర్లు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్తో పాటు ఎక్సైజ్, జైళ్ల శాఖకు సంబంధించిన భవన నిర్మాణాలను నిబద్ధతతో చేపడుతున్నా మని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. నూతన జిల్లాల ఎస్పీ, కమిషనరేట్ల భవనాలు, పోలీస్ స్టేషన్ల ఆధునీ కరణ తదితర నిర్మాణాలను హౌజింగ్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోం దని ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాల యంలోని హౌజింగ్ కార్పొరేషన్లో ఆయన మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖలోని నిర్మాణాలతో పాటు జైళ్ల శాఖ, ఎక్సైజ్ శాఖకు సంబంధించి రూ.1100 కోట్ల విలు వైన నిర్మాణాలను తమ హౌజింగ్ బోర్డు నిర్మిస్తోం దన్నారు. తనకు ఈ పదవి ఇచ్చి తోడ్పాటు అందిం చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞ తలు తెలుపుతున్నాన న్నారు. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఎండీ మల్లారెడ్డితో కలసి మీడియాకు వెల్లడించారు. వివరాలు... ♦ రాష్ట్రంలో 116 చోట్ల పోలీస్ స్టేషన్ భవనా లు, క్వార్టర్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.93.07 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. 13 జిల్లా పోలీస్ కార్యాలయాలు, రెండు కమిషనరేట్ల నిర్మాణా నికి రూ. 375 కోట్లు మంజూరు చేయగా, ఈ పనులు టెండర్లు పిలిచే దశలో ఉన్నాయి. ♦ వివిధ జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేయగా, అందులో మూడు పనులు రూ. 10 కోట్ల ఖర్చుతో పురోగతిలో ఉన్నాయి. ఠి గ్రేహౌండ్స్ దళాలకు సంబంధించిన పనులకు గాను రూ. 68 కోట్లు మంజూరు చేయగా, వీటిలో తొమ్మిది పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పది పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ ఇక జైళ్ల శాఖకు సంబంధించిన 31 పనులకుగాను రూ. 4.44 కోట్లు మంజూరు చేయగా, 31 పనులు పురోగతిలో ఉన్నాయి. అగ్నిమాపక శాఖకు సంబంధించిన 137 పనులను రూ.23.15 కోట్లతో చేపడుతున్నారు. ♦ ఆబ్కారీ శాఖకి సంబంధించిన 9 స్టేషన్ బిల్డింగ్ పనులలో 8 పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. వీటి మొత్తం ఖర్చు రూ. 358.25 కోట్లు. ♦ రూ.100 కోట్లతో కరీంనగర్ నూతన కమిషనరేట్ భవనంతోపాటు బ్యారక్‌లు, క్వార్టర్లు, పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్, బెల్ ఆఫ్ ఆర్మ్స్ తదితర నిర్మాణాలను చేపడుతున్నారు. ♦ఇవి కాక కార్పొరేషన్ దగ్గరున్న రూ.30 కోట్లతో ఫ్రంట్ ఆఫీసుల నిర్మాణం, రూ.46.98 కోట్లతో పోలీస్ శిక్షణా సంస్థల స్థాయి పెంపు, రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ పోలీస్ అకాడమీ పనులు, రూ.30 కోట్లతో వరంగల్ కమిషనరేట్ పనులు జరుగుతున్నాయి. -
పీఎస్ టాయిలెట్లో వ్యక్తి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి టాయిలెట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధానిలో బుధవారం వెలుగుచూసింది. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురి పోలీస్‌స్టేషన్ మరుగుదొడ్లో రాజ్‌కుమార్(32) అనే వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ ఓ కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే ఏమైంతో తెలియదు, అనూహ్యంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. -
వెటెల్‌కు ‘పోల్’ నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
బుడాపెస్ట్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండోసారి పోల్ పొజిషన్‌ను సాధించాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అతను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.276 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీకే చెందిన కిమీ రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది. ఫలితంగా హంగేరి గ్రాండ్‌ప్రిలో 2004 తర్వాత మరోసారి తొలి రెండు స్థానాల నుంచి ఫెరారీ డ్రైవర్లు రేసును ఆరంభించనున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 12వ, పెరెజ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మా క్లాసేమేట్ పెళ్లిని అడ్డుకోవాలి..
♦ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్ఐకి విజ్ఞప్తి చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు కొమరోలు : ఇప్పటి వరకూ తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలి వివాహాన్ని అడ్డుకోవాలని తొమ్మిదో తరగతి విద్యార్థినులు మూకుమ్మడిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్ఐకి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మండల కేంద్రం కొమరోలులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికంగా నివాసం ఉండే 15 ఏళ్ల బాలిక మదర్సాలో 8వ తరగతి పూర్తి చేసుకుని ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.బాలికను తల్లిదండ్రులు ఒంగోలు తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారంటూ ఆమె క్లాస్‌మేట్స్‌కు సమాచారం అందింది. విద్యార్థినులంతా ఒక్కటై అందరూ కలిసి స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే సదరు బాలిక తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. బాలిక తండ్రి పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తెను ఒంగోలులోని మదర్సాలో చేర్పిస్తున్నానని, వివాహం చేయడం లేదని వివరణ ఇచ్చాడు. బాధిత విద్యార్థిని తనకు ఒంగోలు వెళ్లడం ఇష్టం లేదని చెప్పడంతో కొమరోలులోనే చదవించాలని తండ్రికి ఎస్ఐ సూచించారు. చిన్న వయసులో వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
‘దందా’ పోలీసు!
♦ పోలీసుస్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు ♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు ♦ ఆరోపణలొస్తున్నా బదిలీ లేకుండా తిష్ఠ ♦ స్టేషన్ల సుందరీకరణ ముసుగులో నొక్కుళ్లు ♦ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసుల్లో ఆవేదన ♦ కొత్త బాస్ త్రివిక్రమ వర్మ ఓ లుక్ వేయాల్సిందే! సీఎం త్రివిక్రమవర్మ... జిల్లా పోలీసు బాస్‌గా బ్రహ్మారెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరించి బుధవారానికి నెల పూర్తవుతోంది! తొలి రోజు నుంచే ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి! వాటిలో మిగతావాటి మాటెలా ఉన్నా సొంత శాఖనే ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది! అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇటీవలే వీఆర్‌కు పంపించిన ఆయన తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు! కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు పోలీసులపై కొరడా ఝుళిపించారు! వారే గాకుండా కొంతమంది స్టేషన్ అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసులే లోలోన ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు! అలాంటివారిని కొత్త బాస్ ఎలా దారిలో పెడతారో వేచి చూడాల్సిందే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా పోలీసు శాఖను సంస్కరించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్ని పోలీసుస్టేషన్లు ప్రైవేట్ సెటిల్మెంట్లకు వేదికగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులెవ్వరైనా స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు ఇస్తే చాలు... ఇరు పార్టీల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. కేసులు నీరుగార్చేస్తున్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతూ అడుగులకు మడుగులొత్తుతారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కూడా వారికి అండగా నిలబడుతున్నారు! ఎస్పీ బంగళా, జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ ముసుగులో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూలు చేసి దిగమింగిన పోలీసు అధికారులపై సైతం ఈగ కూడా వాలకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొంతమందికి నేరగాళ్లతో తెరవెనుక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. లీలల్లో మచ్చుకు కొన్ని.... జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇటీవలి వరకూ పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కుల నుంచి ఓ అధికారి బాగానే వసూలు చేశారట! తన జేసీబీని వమరవల్లికి చెందిన ఓ జేసీబీ యాజమానికి అప్పగించి అద్దె రూపేణా బాగానే ఆర్జించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసొచ్చింది. అలాగే మరో సర్కిల్ స్థాయి అధికారిది ముడుపుల వసూళ్లలో అందెవేసిన చేయి. ఇరు పార్టీల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా దీర్ఘకాలం నగరంలో తిష్ట వేయడం ఆయనకే చెల్లింది. అంతకాలం ఉన్నా పరిష్కారమైన, దర్యాప్తు పూర్తయిన కేసు ఒక్కటీ లేదంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం జిల్లా పోలీస్ కార్యాలయంలోనే ఇద్దరు గుమస్తాలు రూ.70 లక్షల వరకు స్వాహా చేసిన కేసు ఈయన హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల రిమ్స్‌లో సుమారు రూ.3 లక్షల విలువైన ఎండోస్కోపీలో ఒక ముఖ్య పరికరం మాయమైన కేసునూ నీరుగార్చేయడం ఆయనకే చెల్లింది. నగరంలోని ఓ హోటల్లో విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుమారుడి హత్యలో కూడా నిందితుల నుంచి భారీగా నొక్కేశాడనే విమర్శలూ ఆయనపై వచ్చాయి. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో పనిచేసిన ఓ ఎస్సైపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ ఐపీఎస్ అధికారితో విచారణకు డీఐజీ కార్యాలయం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచే గాకుండా పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి. ∙ రాజాం సర్కిల్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టినా, కేసు ఉపసంహరించుకోవాలనుకున్నా ఓ సర్కిల్ స్థాయికి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా కొంతమంది కానిస్టేబుళ్లు సాయంత్రం సమయాల్లో పట్టణానికి సమీపంలో వాహనాలను తనిఖీ సాకుతో ఆపి వసూళ్లకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో దాబాల వద్దకు చేరి నిర్వాహకుల నుంచి వసూళ్లు జరపడం షరా మామూలుగా మారింది. రూరల్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి కూడా మామూళ్లకు మారుపేరుగా మారారు. రోడ్డు ప్రమాదం జరిగితే చాలు ఇటు నిందితులు, అటు బాధితుల నుంచి ఎంతోకొంత నొక్కేయడంలో ఆయన సిద్ధహస్తుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ∙టెక్కలి సర్కిల్ స్టేషన్లో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఆయనకు అధికార పార్టీలో ఓ ముఖ్య నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వైన్స్, మైన్స్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు భారీగానే దండేస్తున్నా ఆయనను దండించేవారే కరువయ్యారనేది బాధితుల ఆవేదన. కాశీబుగ్గ డివిజనల్ సర్కిల్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు ఒక్కటై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూమి కబ్జాలు, స్థల వివాదాలు, అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణా... ఇలా ఏదైనా సరే సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిపప్పు రైలులో రవాణా చేయాలన్నా, పశువులను అక్రమంగా లారీలోకి ఎక్కించాలన్నా, గుట్కా గుట్టుగా సరిహద్దు దాటిపోవాలన్నా అక్రమార్కులు వారిని కలిస్తే సరిపోతుందట! కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు కార్పొరేట్ హంగుల పేరుతో ఓ అధికారి అన్ని రకాల వ్యాపారుల నుంచే గాకుండా చివరకు రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగానే వసూలు చేశారంట! వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్ పూర్తిగా అధికార పార్టీ కార్యాలయంగా మారిపోయందనే విమర్శలు మార్మోగుతున్నాయి. ఇక్కడి అధికారి ఒకరు ఏకంగా ఇసుక, మద్యం, గనుల వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల నుంచి, వారు ఫిర్యాదు ప్రకారం నిందితుల నుంచి ఇరువైపులా కేసు తీవ్రతను బట్టి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొనేందుకు ఏసీబీ ఇటీవల వలవేసినా చివరి నిమిషంలో తప్పించుకున్నారని తెలిసింది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో పాతపట్నం, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లలో కొంతమంది పోలీసులను మించినవారు లేరనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి, ఎర్ర చందనం అక్రమంగా సరిహద్దు దాటిపోతున్నా వీరిపై ఈగ కూడా వాలకపోవడానికి కారణం కూడా అదేనన్న ఆరోపణలు ఉన్నాయి. -
భూమాయ!
- పోలీసుస్టేషన్ భూమి ఇతరుల పేరు మీద మార్పిడి - కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు - ఆన్లైన్లో హైదరాబాదుకు చెందిన సంస్థ పేరు ఎక్కింపు - ఆలస్యంగా వెలుగుచూసిన అధికారుల భూమాయ! పైసామే పరమాత్మ అని మన పెద్దలు ఏ సందర్భంలో చెప్పారో ఏమో తెలియదు కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ప్రతి విషయంలో దాన్నే ఫాలో అవుతున్నారు. కాసులిస్తే చాలు కాదనుకున్న పని కూడా చేసి పెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే తిమ్మిని బమ్మిచేస్తారు..బమ్మిని తిమ్మి చేస్తారు. జూపాడుబంగ్లా పోలీస్‌స్టేషన్ స్థలాన్ని ఇతరుల పేరు మీద మార్చి వారికి డీ పట్టా పాసుపుసక్తం జారీ చేయడం వారి లీలలకు మచ్చుక. ఆలస్యంగా వెలుగుచూసిన భూమాయపై సాక్షి ప్రత్యేక కథనం. జూపాడుబంగ్లా: రెవెన్యూ అ«ధికారులు అడంగల్ ప్రకారం 105 సర్వేనెంబరులో 15.88 ఎకరాల భూమి ఉంది. ఆర్ఎస్ఆర్(రెవెన్యూ సర్వే రికార్డు) లో 105 సర్వేనెంబర్ అస్సలు లేదు. 105ఏ సర్వేనెంబరు ఉండగా అందులో 2.58 ఎకరాలు, 105బీలో 15.38 ఎకరాల స్థలం ఉంది. రెండు సర్వేనెంబర్లలో మొత్తం 17.96 ఎకరాలు ఉంది. అందులో వెంకటమ్మ పేరు మీద ఉన్న ఐదెకరాలను ఆమె సాగు చేసుకోవడం లేదనే కారణంతో 1993లో జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు. మార్పిడి జరిగిందిలా: పోలీసు స్టేషన్‌కు కేటాయించిన ఐదు ఎకరాల్లో స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి రెండు ఎకరాలు పోగా మూడు ఎకరాలు మిగిలింది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా వెంకటమ్మ.. వెంకటరెడ్డి అనే వ్యక్తికి విక్రయించింది. తర్వాత అతడు పోలీసుస్టేషన్‌కు కేటాయించిన భూమిగా గుర్తించి నెమ్మదిగా హైదరాబాదుకు చెందిన ఓ సంస్థకు విక్రయించాడు. వారికి అసలు విషయం తెలియడంతో ఆ భూమిని ఏడాది క్రితం హైదరాబాదుకు చెందిన కొత్తపల్లి మేరీగోమేధిక అనే సంస్థకు విక్రయించారు. వారు రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడంతో ఆ భూమిని ఆసంస్థ పేరుపై ట్రాన్స్ఫర్చేసి వారికి డిపట్టాపాసుపుస్తకాలు ఇచ్చారు. అంతేకాదు వారి పేరు మీదనే ఆన్లైన్లో ఎక్కించారు. వెలుగుచూసిందిలా: మండలానికి చెందిన సుంకులమ్మ అనే మహిళ పోలీసు స్టేషన్ నిర్మించిన స్థలం తనదేనంటూ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. కోర్టు నుంచి నోటీసులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ భూమి ఎంతవరకు ఉందో తెలియజేయాలంటూ రెవెన్యూ అధికారులను సంప్రదించారు. సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించి విషయం చెప్పారు. స్పందించిన ఆయన గతంలో స్టేషన్‌కు కేటాయించిన ఐదెకరాల స్థలం వారికి చూపించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దిక్కుతోచని ఆ శాఖ అధికారులు పోలీసుస్టేషన్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో కొలతలు వేశారు. ఆక్రమణకు గురైన స్థలం స్టేషన్దేనని తేలింది. అధికారులపై ఆరోపణల వెల్లువ: తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పోలీస్‌స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌కు సంబంధించి మూడెకరాల స్థలాన్ని కొందరు అక్రమంగా కొనుగోలు చేసి కంచెవేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఏదో మతలాబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించారు: అశోక్, ఎస్ఐ, జూపాడుబంగ్లా హైకోర్టులో ఓ మహిళ రిట్వేసేదాకా పోలీసుస్టేషన్‌కు స్థలం ఎంత ఉందనే విషయం పూర్తిగా తెలియదు. తర్వాత విచారించగా 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐ ల సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లం. పోలీసుస్టేషన్‌కు 5ఎకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అనుభవంలో లేకపోవడంతో కబ్జాచేశారు: జాకీర్‌హుసేన్, తహసీల్దారు జూపాడుబంగ్లా జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు 25 ఏళ్ల క్రితం 5 ఎకరాల స్థలాన్ని అప్పటి కలెక్టర్ కేటాయించారు. అయితే 2ఎకరాల్లో మాత్రమే స్టేషన్, భవనాలు నిర్మించుకున్నారు. మిగిలిన 3 ఎకరాల స్థలం ఖాళీగా ఉండటం..దాని చుట్టూ కంచెవేసుకోకపోవటంతో ఇతరులు కబ్జాచేసి విక్రయించుకున్నారు. ప్రస్తుతం దాన్ని రద్దుచేసి పోలీసుస్టేషన్‌కు అప్పగిస్తాం. -
పాఠశాల ఆవరణలోనే కాపురం
♦ కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్వాకం ♦ సర్వశిక్ష అభియాన్ అధికారుల తనిఖీలో బట్టబయలు ♦ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రాజుపాలెం(సత్తెనపల్లి): రాజుపాలెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురం ఉంటున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సర్వశిక్ష అభయాన్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు. తెలుగు ఉపాధ్యాయిని అమృతవాణి, ప్రస్తుత ఇన్చార్జి, లెక్కల ఉపాధ్యాయిని నాగరాజకుమారి, ఏఎన్ఎం సుమన్, డే వాచ్మెన్ నాగమణి కొంత కాలం నుంచి పాఠశాల ఆవరణలో కుటుంబాలతో కాపురముంటున్నారని ముందస్తు సమాచారం అందడంతో ఆయన, సిబ్బందితో కలసి బుధవారం పాఠశాలలో తనిఖీ నిర్వహించారు. ఎంఈవో మల్లికార్జునశర్మను ఫోన్ చేసి పాఠశాలకు రప్పించారు. ఆ నలుగురి కుటుంబాలు పాఠశాల ఆవరణలో కాపురముంటున్నట్టు నిర్థారణ కావడంతో ఆ నలుగురిపై ఎంఈవో సమక్షంలో ఎస్ఐ రమేష్‌కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. పరిశీలించి కేసు నమోదు చేస్తానని ఎస్ఐ తెలిపారు. నీళ్ల మజ్జిగ..నీళ్ల పప్పుచారు... సర్వశిక్ష అభయాన్ బృందం పాఠశాలలో భోజనాన్ని పరిశీలించింది. పప్పుచారు, మజ్జిగ నీళ్లలా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విచారణలో తేలడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రికార్డులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. -
ఎదురులేని హామిల్టన్
వరుసగా నాలుగోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్: క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన ఆధిపత్యం చలాయించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఐదోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన అతను బ్రిటిష్ గ్రాండ్‌ప్రిని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన జిమ్ క్లార్క్ (బ్రిటన్) రికార్డును సమం చేశాడు. ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ప్రారంభించిన హామిల్ట న్ నిర్ణీత 51 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 27.430 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన హామిల్టన్‌కు తన ప్రత్యర్థుల నుంచి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాలను దక్కించుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
పోలీసు స్టేషనా.. పార్టీ ఆఫీసా..!
► పాలక పార్టీ ఆఫీసులా మారిన పెదకాకాని పోలీస్‌స్టేషన్ ► ప్రతిపక్షానికి చెందిన కుటుంబాల్లో మైనర్లపై కూడా కేసులు ► అధికార పార్టీ అరాచకాలకు విస్తుపోతున్న ప్రజలు రాజధానిలో అధికార పార్టీ ఆగడాలకు ఇది పరాకాష్ట. పెద్దల మధ్య గొడవకు పార్టీ రంగు పులమడమే కాకుండా, ఆ వివాదంలో ప్రత్యర్థుల కుటుంబాలకు చెందిన మైనర్లపై కూడా కేసులు పెట్టించి స్టేషన్లో పెట్టించారు. ఓ కానిస్టేబుల్ అయితే మరీ అత్యుత్సాహం చూపించి ఓ బాలుడితో స్టేషన్లో మరుగుదొడ్డి కడిగించాడు. పెదకాకాని ఏకలవ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని (పొన్నూరు): ఈనెల 8వ తేదీన ఏకలవ్య కాలనీకి చెందిన తోకల శివయ్య, మేడా వెంకటేశ్వర్లు, మేడా శ్రీను రోడ్డుపై మాట్లాడుతుండగా ఉసర్తి సాంబయ్య వచ్చి వైఎస్సార్ సీపీ ప్లీనరీకి రమ్మని అడిగాడు. అందుకు రాదల్చుకోలేదని చెప్పగా, వారిని సాంబయ్య తిట్టాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మేడా శివయ్య, తన సోదరుడితో బజారు నుంచి వస్తుండగా ఉసర్తి శ్రీనివాస్, కార్తీక్ దారి ఇవ్వకుండా సైకిల్ అడ్డుపెట్టారు. అక్కడే ఉన్న ఉసర్తి సాంబయ్య మీటింగ్‌కు రానందుకు కర్రతో మేడా శివయ్యను తలపై కొట్టి గాయపరిచాడు. శివయ్యను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఉసర్తి సాంబయ్య, నాగేంద్రబాబు, సూరి, రాజేష్‌లతో పాటు మరో ఇద్దరు మైనర్ల పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు గురువారం స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ఆరుగురిలో ఇద్దరు బాలురు ఉండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా వారిలో ఒకరు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 10కి 10 జీపిఏ సాధించి ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. మరొక బాలుడు పెదకాకాని జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నలుగురు పెద్దలకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఇద్దరు బాలుర వ్యవహారం పెండింగ్‌లో పెట్టి ఇంటికి పంపించారు. దీనిపై బాధితులు గురువారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులును కలసి జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఈ కేసు వ్యవహారం తాను చూస్తానని, విచారించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. పెదకాకాని పోలీసుస్టేషనా పార్టీ ఆఫీసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ తనతో పోలీస్‌స్టేషన్‌లో మరుగుదొడ్డి కడిగించాడని ఇంటర్ విద్యార్థి వాపోయాడు. -
కనిపించని నాలుగో సింహం
♦ రాజధానిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం ♦ దుండగులు, ఉగ్రవాదులను అడ్డుకునే నైపుణ్యం కరువు ♦ కొరవడిన ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ దర్జాగా రావొచ్చు... ఆయుధాలతో విధ్వంసం సృష్టించొచ్చు... కావాల్సినంత దోచుకోవచ్చు... ఎంచక్కా నగరం నుంచి జారుకోవచ్చు... పోలీసులు అడ్డుకోలేరు... సమాచారం ఇచ్చినా పట్టకోలేరు. కళ్లముందే పారిపోతున్నా కట్డడి చేయనూలేరు. ఇదీ అమరావతిలో ఖాకీల దుస్థితి. బెజవాడలో బంగారు ఆభరణాల కార్ఖానాపై దాడి ఉదంతం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధానిలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా భారీ దోపిడీ జరిగితే వెంటనే స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా లేదు. ఇందుకు మంగళవారం రాత్రి విజయవాడ గోపాలరెడ్డి రోడ్డులో జరిగిన భారీ దోపిడీ నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. పోలీసులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా కనీసం నాకాబందీ కూడా నిర్వహించడంలేదు. దీంతో నేరస్తులు నిర్భయంగా తమ పని పూర్తి చేసుకుని సులభంగా నగరం దాటి వెళ్లిపోతున్నారు. నలువైపుల నుంచి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మార్గాలు ఉండటం, ఎక్కడా పెద్దగా నిఘా లేకపోవడం నేరస్తులకు కలిసివస్తోంది. మన పోలీసుల వైఫల్యం ఇలా... ♦ మంగళవారం రాత్రి 9.50గంటలు : అంతర్రాష్ట దొంగల ముఠా విజయవాడలో నగల కార్ఖానాపై దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకుంది. ♦ రాత్రి 10గంటలు : ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. ఆయన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కానీ, నగర సరిహద్దులను వెంటనే దిగ్బంధించలేకపోయారు. ♦ రాత్రి 10.10గంటలు : దోపిడీ ముఠా ఎంచక్కా వారధి దాటింది. అక్కడికి కొద్దిదూరంలోనే డీజీపీ కార్యాలయం, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కేంద్రంలో పోలీసు బలగాలు ఉన్నాయి. వారూ దోపిడీ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ♦ రాత్రి 10.24 గంటలు : దోపిడీ ముఠా జాతీయ రహదారి మీద ఉన్న కాజా టోల్‌గేట్‌ను దాటింది. అక్కడ కూడా ఆ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించనే లేదు. ♦ రాత్రి 10.40 గంటలు : దోపిడీ ముఠా గుంటూరు నగరంలోని కింగ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఎస్ఐ, నలుగురైదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. కానీ దోపిడీ దొంగలు తమ వాహనాన్ని ఆపకుండా అతి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు అడ్డుకోలేకపోయారు. ♦ రాత్రి 10.50గంటలు : గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఒక ఎస్ఐ, ఐదారుగురు పోలీసులు మాత్రమే కాపు కాశారు. ముఠా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు గుర్తించి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు. ♦ రాత్రి 11.10 గంటలు : చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్దకు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో చేరుకున్నారు. జాతీ య రహదారిని దిగ్బంధించి వాహనాలను తనిఖీ చేయసాగారు. ఇలా తప్పించుకున్నారు.. చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్ద ఎక్కడ రోడ్డు బ్లాక్ చేశారో పోలీసులు అంతా అక్కడే ఉండిపోయారు. దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నారని అక్కడికి అర కిలోమీటరు దూరం నుంచే దొంగలు గుర్తించారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి బంగారం, నగదు తీసుకుని పొలాల్లోకి పరుగుపెట్టారు. అదే పోలీసు అధికారులు కేవలం రోడ్డు బ్లాక్ చేసిన చోట మాత్రమే కాకుండా ఒక కిలో మీటరు ముందు వరకు కూడా సాయుధులైన పోలీసులను మోహరించి ఉంటే దొంగలకు ఆ అవకాశం ఉండేది కాదు. నిద్దరోతున్న భద్రతా వ్యవస్థ రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ–గుంటూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాత్రివేళల్లో గస్తీ అన్నదే లేకుండాపోయింది. అందుకు తగిన వాహనాలు కావాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు. నాకా బందీ సక్రమంగా చేయడం లేదు. నిఘా వ్యవస్థ లేకుండాపోయింది. ఇదీ పోలీసుల పరిస్థితి... రాజధాని అవసరాలకు 4వేల మంది పోలీసులు అవసరమని నిర్ధారించారు. ప్రస్తుతం 1,800మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా కేటాయించిన 800మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల భద్రతకే పరిమితమయ్యారు. ఏదైనా దాడి, విపత్తులు సంభవిస్తే రంగంలోకి దిగే మెరుపు బలగాలు లేనే లేవు. ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ ఎక్కడ ? ఏదైనా దోపిడీ, దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ని అమలు చేయాలి. అందుకు ముందుగానే ప్రత్యేక బలగాలను నియమించాలి. దాడి సమాచారం తెలిసిన వెంటనే నగరాన్ని శాస్త్రీయ పద్ధతులతో దిగ్బంధించాలి. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే సాయుధులైన పోలీసులు అడ్డుకోవాలి. అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. -
బైక్‌లపై వచ్చి ఠాణాపై బాంబులు విసిరి..
చెన్నై: చెన్నై కలకలం రేగింది. తేనాంపేట పోలీసు స్టేషన్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శక్తిమంతమైన పెట్రోలు బాంబును విసిరేశారు. దీంతో ఆ ప్రాంతంతో తీవ్ర సంచలనం కలిగించింది. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బందాలను ఏర్పాటుచేశారు. చెన్నై నగర అతి ముఖ్యమైన పోలీసు స్టేషన్లలో ఇది కూడా ఒకటి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్ గార్డెన్ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మౌంట్‌రోడ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నందనం సిగ్నల్ నుంచి మౌంట్‌రోడ్ వైపుగా రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్ రాగానే తమ చేతిలో ఉన్న రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్ వైపు విసిరారు. దీంతో పెద్ద శబ్దంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ పేలుడు శబ్దానికి మౌంట్‌రోడ్‌లో పోస్టర్లు అతికిస్తున్న ఓ వ్యక్తితోపాటు స్టేషన్‌లోపల ఉన్న ముగ్గురు పోలీసులు బయటికి వచ్చి చూశారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పెట్రోలు బాంబులు విసిరినట్లు ఆ పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. అక్కడి మంటలను పోలీసులు నీళ్లు చల్లి ఆర్పివేశారు. ప్రవేశ ద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్ సమీపాన అమెరికన్ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దృష్టితో ఇలా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
పోలీస్ స్టేషన్లా....టీడీపీ కార్యాలయాలా...!
♦ ఖాకీల తీరుపై వైఎస్సార్ సీపీ మండిపాటు ♦ శహపురం ఘటనపై కలెక్టరేట్ వద్ద ధర్నా ♦ ఎమ్మెల్యేపై కేసు, ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్ ♦ జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కాకినాడ: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్స్టేషన్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లా తయారయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని టీడీపీలో చేరాలని ఎద్దేవా చేశారు. పెదపూడి మండలం శహపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రాయుడు సత్యనారాయణ ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సై కిశోర్‌బాబులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు మంగళవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కో–ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు తొలుత ప్రభుత్వాస్ప్రతి మార్చురీకి చేరుకుని మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులంతా చర్చించారు. అనంతరం జీజీహెచ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను రౌడీలు, గూండాల్లా ముద్రవేసి అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో పోలీస్ స్టేషన్లు అధికార పార్టీ పరిపాలనా కేంద్రాలుగా మారాయంటూ విమర్శించారు. కొన్నిచోట్ల ఫిర్యాదుదారులు, ముద్దాయిలు ఎవరో కూడా తెలియకుండానే కేసులు కూడా నమోదవుతున్నాయని ఎద్దేవా చేశారు. రక్షక భటులా...రాక్షస భటులా... తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ తప్పుడు కేసులపై తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు దుర్యోధన, దుశ్శాసన పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సౌమ్యంగా ఉండే ఈ ప్రాంత ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. అనపర్తి కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గడచిన కొద్ది నెలలుగా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీ కేడర్‌కు ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కేసులతో తమను ఎవ్వరూ భయపెట్టలేరని, తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ రౌడీషీట్లు, తప్పుడు కేసులకు తమ పార్టీ ఏ మాత్రం బెదరదన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కనీసం మానవత్వం కూడా లేకుండా 64 ఏళ్ళ వృద్ధునిపై రౌడీషీట్ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాజకీయ కక్షలకు తెరలేపి ప్రశాంతంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాను సమస్యాత్మక ప్రాంతంగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు రక్షక భటుల్లా కాక, రాక్షస భటుల్లా తయారయ్యారన మండిపడ్డారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కార్తికేయమిశ్రాను కలిసి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెరిగిన దాడులు, అక్రమ కేసులపై వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ఎస్పీ విశాల్‌గున్నిని కూడా కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టిన కేసులపై పునఃసమీక్షించాలని కోరుతూ మరో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు వేగుళ్ళ లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు మిండకుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, మోతుకూరి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా మైనార్టీసెల్, పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, హరనా«థ్, జిల్లా అధికార ప్రతినిధి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, రాజమహేంద్రవరం మైనార్టీసెల్ అధ్యక్షుడు ఆరీఫ్, రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, ముమ్మిడివరం నగరపంచాయతీ ప్లోర్‌లీడర్ కాశిమునికుమారి, కాకినాడ నగర విద్యార్థి, మైనార్టీ విభాగాల కన్వీనర్లు రోకళ్ళ సత్యనారాయణ, అక్బర్ అజామ్ తదితరులు హాజరయ్యారు. -
పోలీసు స్టేషన్ ఎదుటే ఘర్షణ
– 14 మందిపై కేసు నమోదు ఓర్వకలు: ఓర్వకల్లు పోలీసు స్టేషన్ ఎదుట సోమవారం ఇరువర్గాల ఘర్షణ సినిమాను తలపించింది. వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బుడగ జంగాల ఈరన్న కుమార్తె శేషమ్మను నాలుగేళ్ల క్రితం గడివేములకు చెందిన మారెన్న కుమారుడు ఎల్లప్పతో వివాహం నిశ్చయమైంది. కట్నకానుకల కింద మారెన్నకు ముందుగానే ఈరన్న రూ.20 వేలు ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత బతుకుదెరువు కోసం కాల్వ గ్రామానికి వచ్చిన మారెన్న ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు. అయితే ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేక ఈరన్న తన కుమార్తెకు మరో సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే మారెన్న రూ. 20 వేలు తిరిగి ఇవ్వకపోవడంతో ఈరన్న ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు మారెన్నను స్టేషన్‌కు పిలిపించి ఇరువర్గాలతో చర్చించారు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకొని ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో సాక్ష్యాత్తు పోలీసుల ఎదుటే రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. ఈ ఘర్షణలో ఈరన్న వర్గానికి చెందిన అంజి, శేషమ్మ, మారెమ్మ, మాశన్న తీవ్ర రక్తగాయాలకు గురయ్యారు. సుమారు గంట సేపు జరిగిన ఘర్షణ వాతావరణం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ఈ లోగా ఎస్ఐ చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుని పోలీసుల సహయాంతో ఇరువర్గాలకు చెదరగొట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
మోడరన్ పోలీస్
► ఇక పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ ► సీఎం 54 వరాలు ► పళని వ్యాఖ్యలకు సభలో సెన్సార్ ► మోనో రైలుకు ఒకే ► ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన తమిళ పోలీసు యంత్రాంగాన్ని మోడరన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణ, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అయింది. ఇందుకు తగ్గట్టుగా పోలీసులకు అసెంబ్లీ వేదికగా సీఎం పళని స్వామి శనివారం 54 వరాలను కురిపించారు. ఇక, చెన్నైలో మోనో రైలు, ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలు సాగుతాయని రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా సీఎం పళని స్వామి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలకు స్పీకర్ సెన్సార్ కట్ అన్నట్టుగా సభా పద్దుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ముఖ్యమంత్రి పళని స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులతో పాటుగా సీఎం కూడా సమాధానాలు ఇచ్చారు. ఇందులో రాజీవ్ హత్య కేసు నిందితుడు పేరరివాలన్‌కు పరోల్ విషయంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ సంధించిన ప్రశ్నకు పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే, డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురై మురుగన్ విజ్ఞప్తి మేరకు వేలూరు జిల్లా పరిధిలో పోలీసు స్టేషన్ల పరిధి పెంపు, అనుసంధానం తదితర అంశాలకు అంగీకారం తెలియజేశారు. తదుపరి సీఎం పళని స్వామి తన పరిధిలోని హోం శాఖకు నిధుల కేటాయింపులపై సాగిన చర్చలో ప్రసంగాన్ని అందుకున్నారు. పోలీసుల వ్యవస్థ వల్లే రాష్ట్రం శాంతివనం రాష్ట్ర పోలీసుల పనితీరును గుర్తుచేస్తూ సీఎం ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని గొప్పలు చెప్పుకునే యత్నం చేశారు. రౌడీలు, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రం శాంతివనంగా ఉండబట్టే, దేశ విదేశాల నుంచి పెట్టుబడుల్ని ఇక్కడ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో సంస్థలు తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్నారని వివరిస్తూ, వారిని విమర్శించడం కొందరు పనిగా పెట్టుకుని ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మోడరన్‌గా తీర్చిదిద్దనున్నామని ప్రకటించారు. ఆ మేరకు ఆధునికీకరణ, అత్యాధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం లక్ష్యంగా సైబర్ వేదిక ఏర్పాటు కానుందని వివరించారు. అలాగే, పోలీసులకు 54 వరాలను ప్రకటించారు. ఆ మేరకు చెన్నైలో ట్రాఫిక్ జరిమానా మోత మోగించేందుకు ఎలక్ట్రానిక్ స్పాట్ ఫైన్ పరికరాలను కొనుగోలు చేయనున్నారు. విధుల్లో వీరత్వం, సాహసం ప్రదర్శించిన పోలీసులకు అందించే సీఎం పతకం భత్యం రూ.300 నుంచి రూ.900లకు, పోలీసు పతకానికి రూ.200 నుంచి రూ.300కు పెంచారు. పోలీసుల కోసం ప్రత్యేక స్టోర్స్, కోయంబత్తూరు, సేలం, ధర్మపురిలో కొత్త పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక సిబ్బందికి వైద్య ఖర్చుల పెంపు, ఖాళీల భర్తీలు, పదోన్నతులు తదితర అంశాలు ఆ వరాల్లో ఉన్నాయి. మోనో రైలు, బ్యాటరీ బస్సు సీఎం ప్రసంగానికి ముందుగా రవాణాశాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ఓ ప్రకటన చేశారు. ఆమేరకు చెన్నైలో మోనో రైలు సేవకు తగ్గ పనులు త్వరలో చేపట్టనున్నామని వివరించారు. రూ.6,402 కోట్లతో ఈ పనులు సాగనున్నాయని తెలిపారు. పూందమల్లి–కత్తి పార, మార్గం మధ్యలో పోరూర్ నుంచి వడపళని వరకు రూ.3,267 కోట్లతో 20 కి.మీ దూరం మార్గం, వండలూరు నుంచి వేళచ్చేరి వరకు రూ.2,135 కోట్లతో 22 కి.మీ దూరం మార్గం పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే, చెన్నైలో ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. సీఎం వ్యాఖ్యల తొలగింపు సభలో టాస్మాక్ ఆందోళన గురించి సీఎం పళని స్వామి ప్రసంగిస్తూ, ఆందోళనలు ఫ్యాషన్‌గా మారాయని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇందుకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆక్షేపణ వ్యక్తంచేశారు. ప్రజల పోరాటాలను ఫ్యాషన్‌గా సీఎం వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. దీంతో సీఎం వ్యాఖ్యలను సభ పద్దుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ఇక, అసెంబ్లీలో తన పరిధిలోని శాఖల నిధుల కేటాయింపుల చర్చ ముగియడంతో సీఎం పళని స్వామి నేరుగా మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత సీఎం, అమ్మ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. బొటాస్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 04.251 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. -
ఆత్మహత్యల ఠాణాకు వాస్తు దోషం?
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్టేషన్‌కు వాస్తు దోషం పట్టిందా?. అవుననే చెబుతున్నారు పోలీసులు. ఈ స్టేషన్లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్‌లు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషం పట్టినట్టు భావిస్తున్న పోలీసుల అధికారులు ఇప్పటికే గోడలు, ప్రహరీలు కూల్చి మార్పులు చేయిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఆవరణలోని 40 ఏళ్ల క్రితం నాటి మహా వృక్షాలను సోమవారం నరికి వేయించారు. -
ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్
బైక్‌పై వచ్చి.. పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ చందుర్తి(వేములవాడ): సమయం.. శనివారం ఉదయం 9.15 గంటలు.. రయ్‌మంటూ స్పోర్ట్స్ బైక్ ఒకటి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది.. హెల్మెట్.. స్పోర్ట్స్ జాకెట్ ధరించిన ఆ వ్యక్తి ఆ బైక్‌పై నుంచి కిందికి దిగారు. ఈ హఠాత్పరిణామానికి నోరెళ్ల బెట్టి చూస్తున్న పోలీసులు, అంతేవేగంతో అప్రమత్తమయ్యా రు.. శత్రువు ఎవరైనా వచ్చారా? అని ఆలోచిస్తూనే ఆయుధాలు ఎక్కుపెట్టారు.. కానీ, బైక్‌పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి గన్‌మన్ బైక్ దిగడంతో.. వచ్చింది పోలీసు ఉన్నతాధికారి అయి ఉంటారని ఆసక్తిగా చూశారు.. అంతలోనే ఎస్పీ విశ్వజిత్ తన తలపై హెల్మె ట్ను తొలగించారు.. ఆయనను గుర్తించిన పోలీసు సిబ్బంది.. ఎస్పీకి సెల్యూట్ చేశారు. ఇలా స్పోర్ట్స్ బైక్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి ఠాణాను శనివారం ఎస్పీ విశ్వజిత్ కంపాటి తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. -
పోలేకుర్రులో కుటుంబం వెలి
ఎవరూ మాట్లాడరు.. ఉపాధి పనులకూ పిలవరు ఎవరైనా మాట్లాడితే రూ.2 వేల జరిమానా స్థల వివాదం నేపథ్యంలో గ్రామ పెద్దల హుకుం సాంఘిక బహిష్కరణపై ఆర్ఐ విచారణ తాళ్లరేవు (ముమ్మిడివరం) : మండల పరిధిలోని పోలేకుర్రు పంచాయతీలో ఒక కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రెడ్డి గంగమ్మ అనే వృద్ధురాలు ఈ మేరకు కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గంగమ్మకు చెందిన ఖాళీ స్థలంలో గ్రామస్తులు గుడి నిర్మాణం ప్రారభించడంతో చెలరేగిన వివాదం వెలి (సాంఘిక బహిష్కరణ)కు దారితీసింది. ఈ నేపథ్యంలో గంగమ్మ కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు గ్రామానికి చెందిన పది మంది పెద్దలు స్థానికంగా ప్రచారం చేయడంతో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును నేరంగా పరిగణించి దీనిపై విచారణ చేయాలని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు కేసును బదలాయించారు. ఈ మేరకు తహసీల్దార్ లోడా జోసెఫ్ విచారణ చేయాల్సిందిగా ఆర్ఐ కాకర్లపూడి కేశవ వర్మను ఆదేశించారు. ఆర్ఐ స్థానిక వీఆర్వో పి.ప్రకాశరావుతో కలిసి శనివారం విచారణ నిర్వహించారు. తన భర్త 18 ఏళ్ల క్రితం మృతి చెందారని, తనకు ఐదుగురు కుమారులు కాగా ముగ్గురు మృతి చెందారని, మరొకరు వికలాంగుడని గంగమ్మ తెలిపింది. అప్పటినుంచి తన పుట్టింటివారు ఇచ్చిన 25 సెంట్ల భూమిలో తాను, తన కుమారులు నివసిస్తున్నట్టు చెప్పింది. తమ స్థలంలో కొంతమంది గ్రామస్తులు అక్రమంగా స్తంభాలు పాతడంతో అడిగినందుకుగానూ తమ కుటుంబాన్ని వెలివేసినట్టు తెలిపింది. తమతో గ్రామస్తులెవరూ మాట్లాడవద్దని, కాదని మాట్లాడితే రూ.2 వేల జరిమానా చెల్లించాలని పెద్దలు హుకుం జారీచేసినట్టు తెలిపింది. అంతేకాకుండా తాగునీరు పట్టుకోకుండా, కిరాణా సరుకులు ఇవ్వకుండా, కనీసం ఉపాధి హామీ పనులకు సైతం పిలవకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తునట్టు ఆర్ఐకి మొరపెట్టుకుంది. పెద్దలు అంగీకరిస్తేనే పనుల్లోకి రానిస్తామని ఉపాధి సిబ్బంది చెప్పినట్టు గంగమ్మ కోడలు శ్రీలక్ష్మి తెలిపింది. మార్చి నెల నుంచి పనులకు పిలవకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన కుమార్తెను చదువు మానిపించి యానాంలో ఒక దుకాణంలో పనిచేయిస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని శ్రీలక్ష్మి వాపోయింది. గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు సైతం తమను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం అధికారులను వేడుకుంటుంది. ఇలా ఉండగా తాము ఏ కుటుంబాన్ని వెలి వేయలేదని, వారి ఇంటిలో ఏ సమస్య వచ్చినా తామే వెళ్లి పరిష్కరిస్తామని పలువురు పెద్దలు చెప్పారు. -
అమ్మా వచ్చేస్తున్నా...
♦ కిడ్నాపైన బాలుని కథ సుఖాంతం పూసపాటిరేగ(నెల్లిమర్ల): పోరాం గ్రామంలో కిడ్నాపైన బాలుడు మాదేష్ విశాఖ జిల్లా నక్కపల్లిలో పోలీసులకు లభ్యమయ్యాడు. బాలుడు తండ్రి శేషపు సంతోష్‌కుమారే కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఎస్ఐ జి.కళాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు. బాలుడు తండ్రి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా నక్కపల్లిలో టవర్ లొకేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కిడ్నాప్ అయిన బాలుడు మాదేష్(3) ఒక ఇంట్లో వున్నట్లు ఆచూకీ లభ్యమైంది. బాలుడును పట్టుకొనేలోపు సమీపంలో వున్న తండ్రి శేషపు సంతోష్‌కుమార్ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకొన్నట్లు ఎస్ఐ కళాధర్ తెలిపారు. నక్కపల్లిలో తప్పించుకొన్న సంతోష్‌కుమార్ కో సం అక్కడ పోలీసులు సహకారంతో గాలి స్తున్నట్లు ఫోన్లో ఎస్ఐ సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా కొడుకు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తల్లి స్రవం తి, బంధువులు బాలుడు ఆచూకీ లభ్యమవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంకో పోలీసయితే కాల్చిపడేసేవారే..
థాయిలాండ్: ప్రతి వ్యక్తిలో మంచి మనిషి ఉంటాడని, అది గుర్తించగలిగితే ఆ వ్యక్తిలోని రాక్షసత్వాన్నైనా ఇట్టే తీసిపారేయొచ్చని నిరూపించాడు ఓ పోలీసు అధికారి. అత్యంత ప్రమాదకరంగా మారిన ఓ వ్యక్తిని తను ఓ అద్భుతం చేసి తిరిగి మనిషిగా మార్చాడు. ఆయుధాన్ని వదిలేసి తాను చేస్తున్న పనికి సిగ్గుపడేలా చేశాడు. పైగా తన బాధను అర్థం చేసుకున్న ఆ పోలీసును గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. ఈ దృశ్యం థాయిలాండ్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ప్రకారం ఓ వ్యక్తి పొడవాటి కత్తితో పోలీస్ స్టేషన్లోకి చొరబడి పలువురిని బెదిరించాడు. దీంతో వణికిపోయిన పోలీసుల్లో కొంతమంది అతడిని కాల్చే ప్రయత్నం చేయగా వారిని వద్దని ఆపేసి అనిరుత్ మాలీ అనే పోలీసు అధికారి అద్భుతం చేశాడు. అతడిని మాటలతోనే సముదాయించాడు. ఆ వ్యక్తి తనకు తెలుసని అదే వ్యక్తితో చెప్పి తాను ఏం చేయబోనని కత్తిపక్కకు పడేసి తన దగ్గరకు రావాలని కోరాడు. పోలీసు మాటలు నమ్మిన ఆ వ్యక్తి నిజంగానే కత్తిని ఆ పోలీసుకే ఇస్తుండగా శంకర్‌దాదా సినిమాలో బాధ ఉన్న వ్యక్తిని నటుడు చిరంజీవి ఎలా హగ్ చేసుకొని ఓదార్చుతాడో అచ్చం అలాగే ఓదార్చాడు. దీంతో అతడు కన్నీటి పర్యంతం అయ్యాడు. వాస్తవానికి అతడు ఓ సంగీతకారుడు. అయితే, అతడి గిటార్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో అతడికి వేరే మార్గం లేక మూడు రోజులుగా సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. అయితే, పనిచేయించుకున్న వ్యక్తి అతడికి డబ్బు చెల్లించకపోవడంతో ఆ మానసిక ఒత్తిడిలో కత్తిపట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే, ఆ వ్యక్తిని దయగల పోలీసు కాస్త మళ్లీ మాములు వ్యక్తిలా మార్చాడు. -
కొత్త ఠాణాలను వేధిస్తోన్న కొరత
► నాలుగు పీఎస్‌లల్లో సిబ్బంది అంతంతే ► నిర్వహణ ఖర్చులకు డబ్బులు కరువు ► నిధులు విడుదల చేయని ప్రభుత్వం ► సమస్యల వలయంలో స్టేషన్లు రామారెడ్డి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో గతేడాది అక్టోబర్ 11న కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. కామారెడ్డిని కొత్త జిల్లాగా, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్, బీబీపేటలను కొత్తగా ఐదు మండలాలుగా ఏర్పాటు చేసింది. అయితే వీటిల్లో తాత్కాలిక భవనాలల్లో రెవెన్యూ, పోలీసు స్టేషన్లను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు శాంతి భద్రతలను కోసం ఏర్పాటు చేసిన పోలీసుస్టేషన్ కనీస సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా విధులు నిర్వహించేందుకు పాత వాహనాలనే కేటయించారు. దీంతో అవి పదే పదే మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా ఎస్ఐలతో సహా సిబ్బంది రాత్రి గస్తీకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 323 గ్రామ పంచాయతీలు, 9లక్షల72వేల 625 జనాభాతో కామారెడ్డిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఎఫ్ కేటగిరిలో స్టేషన్ల ఏర్పాటు.. పోలీసుశాఖ పరంగా గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్లు ఎఫ్ కేటగిరిలోకి వస్తాయి. జిల్లాలోని రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ పోలీసు స్టేషన్లకు 1 ఎస్ఐ, 2 ఏఎస్ఐలు, 3 హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. అయితే రామారెడ్డి పోలీసు స్టేషన్లో 1ఎస్ఐ 2హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మిగితా మూడు స్టేషన్లలో ఏఎస్ఐ ఉన్నా పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించలేదు. దీంతో వీఐపీల పర్యటనలకు బందోబస్తు కల్పించడం, నేరాల నియంత్రణకు రా త్రి గస్తీ నిర్వహించడం, స్టేషన్లో ఫిర్యాదులను స్వీకరించి విచారణకు తీసుకురావడం వంటి పనులు ఉన్న సిబ్బందికి కత్తి మీద సాములా తయ్యారైంది. నిర్వహణ భారంతో ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ పోలీసుస్టేషన్ల నిర్వహణ కోసం వివిధ కేటగిరీల ఆధారంగా రూ.25వేల నుంచి రూ.75 వేల వరకు నిర్వహణ కోసం ప్రతి నెలా డబ్బులను పోలీసు స్టేషన్లకు కేటాయిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటైన నాలుగు స్టేషన్లకు 8నెలలు గడుస్తున్నా డబ్బులను మంజూరు చేయలేదు. కొత్త స్టేషన్లలో ఎస్ఐలు నిర్వహణ భారంతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. మెరాయిస్తున్న పాత వాహనాలు.. రాత్రిపూట జిల్లాలోని 323 జీపీల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించడం గ్రామాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే అక్కడికి చేరుకొని పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోడం కోసం వేగంగా ఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొత్త పోలీసుస్టేషన్లకు రెండు నెలల క్రిత్రం పాత వాహనాలనే కేటాయించారు. అయితే ఈ వాహనాలు పదే పదే మెరాయిస్తున్నాయి. దీంతో బైకులపై పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వాహనాలతో ఇబ్బంది, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహించడం ప్రతి జీపీకి పోలీసు అధికారిని నియమించడం సాధ్యం కావడం లేదు. ప్రజలకు చేరువయ్యేదెలా..? పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కొత్తగా ఏర్పాటైన మండల కార్యాలయాలకు పోలీసు స్టేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా, మండలాలు ఏర్పాడి 8 నెలలు పూర్తి అయినా ప్రభుత్వం కనీసం పోలీసు స్టేషన్‌కు కొత్త వాహనం, సిబ్బందిని కేటాయించకపోతే ఎలా విధులు నిర్వహిస్తారని ప్రజలు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. -
భూవివాదంలో ఎస్ఐపై కేసు నమోదు
డోన్ టౌన్ : మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన భూ వివాదం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. గ్రామానికి చెందిన రాఘవయ్య ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని బుక్కరాయపట్నం ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయనకు.. వరదరాజులు, షేకన్న అనే తన సొంత అన్నదమ్ములతో భూవివాదం ఉంది. ఈవిషయంలో శనివారం ఒకరినొకరు అసభ్యంగా దూషించుకున్నారు. రాఘవయ్య ఫిర్యాదు మేరకు అతని సోదరులతో పాటు వదిన లక్ష్మీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరదరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుక్కరాయపట్నం ఎస్ఐ రాఘవయ్య పై కూడా కేసు నమోదు చేశామని డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య తెలిపారు.