సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో అవినీతిని నియంత్రించేందుకు ఠాణాల నిర్వహణ (మెయింటెనెన్స్) కోసం ప్రభుత్వమే నిధులిస్తుందని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పినా.. అమలులో మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల విడుదల కోసం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను 3 కేటగిరీలుగా విభజించినా.. అన్ని స్టేషన్లకూ ఒకే విధంగా నిధులు విడుదలవుతున్నాయి. రెండేళ్ల తర్వాత విష యం బయటకు పొక్కడంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖ తలపట్టుకుంది. 2015లో అమల్లోకి..: పోలీస్ స్టేషన్లకు నిర్వహణ నిధులిచ్చేందుకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూపకల్పన చేయగా.. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లు ఏ గ్రేడ్, జిల్లా హెడ్ క్వార్టర్లు, అర్బన్ స్టేషన్లు బీ గ్రేడ్.. రూరల్, మారుమూల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లు సీ గ్రేడ్‌గా విభజించారు. ఈ మేరకు ఏ గ్రేడ్ ఠాణాలకు రూ.75 వేలు, బీ గ్రేడ్‌కు రూ.50 వేలు, సీ గ్రేడ్‌కు రూ.25 వేలు ప్రతీ నెలా పోలీస్ శాఖ విడుదల చేయాల్సి ఉంది. కానీ 2015 నుంచి ఇప్పటివరకు అన్నీ స్టేషన్లకు ఒకేలా నిర్వహణ నిధులు విడుదల చేస్తోంది.
సీఎం చెప్పినట్లు కాకుండా..
పోలీస్ శాఖలో అవినీతి నియంత్రించేందుకు ఠాణాల ఖర్చులకు తామే డబ్బులిస్తామని, అందుకు గ్రేడ్‌ల వారీగా నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బడ్జెట్‌లోనూ ఆ అంశాలు ప్రతిపాదించారు. కానీ సీ గ్రేడ్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్లకు చెల్లించే రూ.25 వేలే అన్ని గ్రేడ్‌లకు ఇస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఏ, బీ, సీ గ్రేడ్‌ల స్టేషన్ల ఖర్చులు వేర్వేరు కదా అని వివరణ కోరగా.. ఆర్థిక శాఖ నుంచి రూ.25 వేలకే క్లియరెన్స్ వచ్చిందని, దీనిపై అనేక సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా బడ్జెట్ లేమి వల్ల ఇవ్వలేకపోతున్నట్లు సమాధానమిచ్చారని అధికారులు స్పష్టం చేశారు. మంజూరవుతున్న రూ.25 వేలనే అన్ని స్టేషన్లకు క్వార్టర్లీ వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
రూ.6 కోట్లకు గాను రూ.4.7 కోట్లే..
ఏ, బీ, సీ గ్రేడ్ పోలీస్ స్టేషన్లకు ప్రతీ క్వార్టర్ పీరియడ్‌కు (3 నెలలు) రూ.6 కోట్లు నిర్వహణ కోసం విడుదల చేయాల్సి ఉండగా, రూ.25 వేలు చెల్లించేందుకుగాను రూ.4.7 కోట్లే ఆర్థిక శాఖ నుంచి విడుదలవుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో మాత్రం ఈ ఏడాది నుంచి ఏ గ్రేడ్ చెల్లింపులు కమిషనర్ ఖాతా నుంచి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో సీ గ్రేడ్‌ల వారీగానే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
యూసీలు సమర్పిస్తేనే నిధులు: డీజీపీ కార్యాలయం
ఠాణాల నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని, నిధుల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఆర్థిక శాఖకు మరోసారి లేఖ రాస్తామని స్పష్టం చేశాయి. ఠాణాల నిర్వహణ నిధులను కూడా యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పిస్తేనే విడుదల చేస్తున్నామని.. ఈ విషయమై ఎస్పీలు, కమిషనర్లు మానిటరింగ్ చేసుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment