
పెదమానాపురం పోలీస్ స్టేషన్
దందాలు... ఇసుకదోపిడీలు... సెటిల్ మెంట్లు... ఇవీ ఇప్పటివరకూ చాలా వరకూ జిల్లాలోని పోలీసులపై ఉన్నఅపవాదు. కానీ రాత్రయితే చాలు స్టేషన్లలో గ్లాసుల గలగలలు... గాజుల మోతలు వినిపిస్తాయని తాజాగారుజువైంది. పోలీస్ శాఖలో ఉన్నకొద్దిమంది బాధ్యతారాహిత్యం ఏకంగాఆ శాఖకే మచ్చతెస్తోంది. క్రమశిక్షణకొరవడి... విచక్షణ కోల్పోయి...అవకాశంగా వచ్చిన ఉద్యోగానికే ఎసరుపెట్టుకుంటున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎవరైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు పనులు చేసి సర్వీసు కే మచ్చతెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే మందు కొట్టి చిందులేస్తున్నారు. దత్తిరాజేరు మండలం, పెదమానా పురం పోలీస్ స్టేషన్‌లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరువు మరో సారి రోడ్డున పడింది. గాడి తప్పిన ఏడుగురిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. చాలాచోట్ల పగలంతా సెటిల్‌మెంట్లు, మామూళ్లు అంటూ బిజీగా గడిపి, చీకటి పడగానే పోలీస్ స్టేషన్లనే బార్లుగా మార్చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ప్రియురాళ్లను తీసుకువచ్చి తమ సీటులోనే కూర్చోబెట్టుకుంటున్నారు.
అసలేం జరిగింది
ఈ నెల 9వ తేదీ రాత్రి పెదమానాపురం ఎస్‌ఐ నాయుడు విధులు ముగించుకుని రాత్రి డ్యూటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లగానే స్టేషన్‌లో ఉన్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోమ్‌గార్డులు కలిసి ఆ రాత్రి మద్యం తెచ్చుకుని పీకలదాకా తాగి, కడుపునిండా బిర్యానీ తిని అక్కడే ఒళ్లు మరిచి చిందులేశారు. ఇదంతా గమనించిన అజ్ఞాతవ్యక్తులు వారి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తీవ్రంగా పరిగణించిన ఎస్పీ
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పోలీసుల బాగోతం అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టి జిల్లా ఎస్పీ జి.పాలరాజు దృష్టికి వెళ్లింది. వెంటనే స్టేషన్‌లో జరిగిన దానిపై వాస్తవాలను తెలుసుకోవాలని విచారణ నిమిత్తం ఒక అధికారిని పంపించారు. ఆయన వెళ్లి వీడియో చూసిందంతా నిజమేనని తేల్చి నివేదిక ఇచ్చారు. వెంటనే ఆ ఏడుగుర్నీ ఏఆర్‌కి అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా వారిలో ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
ఇలాంటోళ్లు ఇంకా ఉన్నారు
జిల్లాలో పోలీసులు సేవలు, సందేశాలు అంటూ ఓ వైపు ప్రచారంలో నిలుస్తూనే తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎస్‌కోట పరిధిలో ఓ కుర్ర ఎస్‌ఐ అయితే ఏకంగా తన ప్రియురాలిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని తన సీటులోనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారనే ఆపోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అతని వద్ద ప్రస్తావిస్తే నా లవర్‌ని నా సీటులో కూర్చోబెట్టుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం పట్టణంలో అయితే ఓ అధికారి సిబ్బందికి నెల నెలా ఎంతివ్వాలో ఫిక్స్ చేసి మరీ వసూలు చేసుకుంటున్నారని డిపార్ట్‌మెంట్ కోడై కూస్తోంది. ఇటీవల అతని ఇంట్లో ఓ శుభకార్యం జరిగితే బలవంతంగా భారీ మొత్తంలో కానుకలు దండేశారంట.
ఆరుగంటలకే మొదలు
పోలీస్ స్టేషన్లలో మద్యం సేవించడం సర్వసాధారణమని ఓ పోలీస్ అంటున్నారు. పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఆయన ‘రాత్రి వరకూ అవసరం లేదు, సాయంత్రం ఆరుదాటాకే మా వాళ్లు స్టేషన్‌లో మందు తాగడం మొదలెట్టేస్తారు. ముద్దాయిలు ఉంటే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మెన్ ఉంటారు. వారు రాత్రి గడవడానికి ముద్దాయి డబ్బులతోనే మద్యం, విందు చేసుకుంటుంటారు. ఆదివారం అయితే చెప్పక్కర్లేదు. ఆ రోజు పండగే. ముఖ్యంగా ఏఆర్ గార్డులుగా పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఇలా చేస్తుంటారు. వారితో పాటు
కానిస్టేబుళ్లు జతకలుస్తుంటారు.’ అని చెప్పుకొచ్చారు.
తప్పు ఎవరు చేసినా తప్పే
పెదమానాపురం వ్యవహారం మా దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టాం. నిజమని తేలడంతో శాఖాపరంగా చర్యలు చేపట్టాం. ఇద్దరు హోమ్‌గార్డులను సర్వీస్ రిమూవ్ చేశాం. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హెచ్‌సీలపై సస్పెన్షన్ వేటు వేశాం. ఎక్కడైనా ఎటువంటివి జరుగుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. పోలీస్ సిబ్బంది ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే సహించేది లేదు.
– జి.పాలరాజు, జిల్లా ఎస్పీ, విజయనగరం.

Comments
Please login to add a commentAdd a comment