![Illegal activities in Beauty parlor Eluru](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/15_0.jpg.webp?itok=O0EUXnvJ)
ఏలూరు టౌన్: ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని బ్యూటీపార్లర్‌పై పోలీసులు మంగళవారం దాడులు చేశారు. బ్యూటీపార్లర్‌లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. గత కొంత కాలంగా ఎస్‌ఎస్ బ్యూటీ పార్లర్ పేరుతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నిర్వాహకుడు నాగార్జునతోపాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యూటీ పార్లర్ పేరుతో నిర్వహించే ఈ సెంటర్‌లో బాడీ మసాజ్ చేస్తున్నారని, ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను తీసుకువచ్చి ఇలాంటి పనులు చేయిస్తున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్నవారిలో విజయవాడకు చెందిన ఒక మహిళతోపాటు, యువతులు ఉన్నారు. దాడుల సమయంలో నిర్వాహకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ప్రతీ నెలా పోలీసులు దాడులు చేయకుండా ఒక వ్యక్తికి డబ్బులు చెల్లిస్తున్నానని, ఎందుకు దాడులు చేస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసులను మేనేజ్ చేసేందుకు రూ.30 వేలు నిర్వాహకుడి నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. గతంలోనూ అతనిపై ఏలూరు టూటౌన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ప్రతీ నెలా డబ్బులు ఇవ్వాలంటూ పేకాట శిబిరాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి నుంచి డబ్బులు వసూలు చేయటంలో అతను సిద్ధహస్తుడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలూరు త్రీటౌన్ పరిధిలోనూ కొంత కాలం క్రితం పేకాట శిబిరాన్ని నిర్వహించగా, పోలీసుల ఒత్తిడితో మానుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment