ఏలూరు జీజీహెచ్‌లో అరాచకాలు !
శానిటేషన్, సెక్యూరిటీ విభాగాలపై ఆరోపణలు
మహిళా సిబ్బందికి రక్షణ కరువు
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
కేసులు పెట్టేందుకు భయపడుతున్న బాధిత మహిళలు
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసుల్లో పురోగతి కరువు
ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్‌లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహస్య విచారణ చేయించాలి
ఏలూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్‌లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు.
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్‌లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్‌లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్‌కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment