కొత్త ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసేయడం దారుణం
న్యాయం చేయకపోతే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటా
ఏలూరు జీజీహెచ్ వద్ద కుటుంబంతో అటెండర్ నిరసన
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని అటెండర్ దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కుటుంబంతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు తన భార్య, పిల్లలతో ఏలూరు సర్వజన ఆస్పత్రి వద్ద దుర్గారావు బుధవారం నిరసన తెలిపాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఉద్యోగాలు ఎలా తీసేస్తారంటూ అధికారులను నిలదీశాడు. తనతోపాటు మరికొందరిని కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో దుర్గారావు ఔట్‌సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి ఏలూరు జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే దుర్గారావును విధుల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాడు. ఐదు నెలలుగా జీతాలు సైతం ఇవ్వలేదని, అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు.
ఇప్పుడు తనకు ఉద్యోగం కూడా లేకుంటే అప్పుల వాళ్లు తనను బతకనివ్వరని వాపోయాడు. తనకు ఉద్యోగం కావాలని, జీతం కూడా వెంటనే ఇప్పించాలంటూ పురుగుల మందు, పెట్రోల్‌తో ఆందోళనకు దిగాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే తనకు సరైన సమాధానం చెప్పడం లేదన్నాడు. ఈ విషయమై ఏలూరు జీజీహెచ్ ఆర్‌ఎంవో ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా.. దుర్గారావుతో మాట్లాడి భరోసా ఇచ్చామన్నారు. రెండు, మూడు రోజుల్లోనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment