
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.
ఇవీ లక్షణాలు
మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.
⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.
⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.
⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్‌ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.

ఎందుకిలా? ఎవరికి వస్తుంది?
ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.
ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment