
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.
కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.