టీడీపీకి చెందిన 54 మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 37 మందిపై కేసు
ఉరవకొండ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని జడ్జి ఆదేశం
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు.
గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్‌సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్‌డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment